
వర్క్ పర్మిట్ ఉన్నవారి కుటుంబీకులు ఉద్యోగం చేయొచ్చు
టొరంటో: కెనడాలో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ వృత్తినిపుణుల కుటుంబసభ్యులకు తీపి కబురు! ఓపెన్ వర్క్ పర్మిట్ (ఓడబ్ల్యూపీ) కింద అక్కడ పనిచేస్తున్న భారతీయుల కుటుంబసభ్యులు కూడా ఇకపై తాత్కాలిక వర్క్ పర్మిట్లతో పనిచేసుకోవచ్చు. వలసలు, శరణార్థులు, పౌరసత్వ వ్యవహారాల మంత్రి సీన్ ఫ్రాసర్ శుక్రవారం ఈ మేరకు ప్రకటించారు. వర్క్ పర్మిట్లున్న వారి జీవిత భాగస్వామి, పిల్లలు వచ్చే ఏడాది నుంచి ఉద్యోగాలు చేసుకోవచ్చంటూ ట్వీట్ చేశారు.
‘‘దేశంలో సమస్యగా మారిన ఉద్యోగుల కొరతకు పరిష్కారంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. దీంతో 2,00,000 మందికిపైగా ఉన్న విదేశీ ఉద్యోగులకు తోడు వారి కుటుంబసభ్యులకు కెనడాలో కొలువుకు అవకాశం దక్కుతుంది. గతంలో ఓపెన్ వర్క్ పర్మిట్ ఉన్న ఉద్యోగి హై–స్కిల్డ్ ఉద్యోగం చేస్తేనే జీవితభా గస్వామికి వర్క్ పర్మిషన్ ఇచ్చేవాళ్లం. నిబంధనలను సడలించడంతో వర్క్ పర్మిట్ ఉద్యోగు లు కుటుంబంతో కలిసుంటారు. వారి శారీరక ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది’ అని ఫ్రాసర్ అభిప్రాయపడ్డారు. దీన్ని మూడు దశల్లో అమలు చేస్తారు.