
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఉద్యోగాల తీరుతెన్నులు మారుతున్నాయి. సాంకేతికత, సస్టెయినబిలిటీ, ఆటోమేషన్‌తో పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన మానవ వనరులకు భవిష్యత్తులో ఎక్కువ డిమాండ్ ఉంటుందని నివేదికలు తెలియజేస్తున్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సిద్ధం చేసిన ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2025’లో 2030 నాటికి అత్యంత వేగంగా అభివృద్ధి చెందే కొన్ని ఉద్యోగాల జాబితాను విడుదల చేసింది.
బిగ్ డేటా స్పెషలిస్టులు
ప్రస్తుత కాలంలో డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం ప్రామాణికంగా మారింది. భవిష్యత్తులోనూ ఈ విభాగంలో ఉద్యోగులకు డిమాండ్ నెలకొంటుంది. ముఖ్యంగా డేటా అనాలిసిస్, డేటా మేనేజ్‌మెంట్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ నిపుణులకు కొలువులు ఎక్కువగా ఉంటాయి.
ఫిన్ టెక్ ఇంజినీర్లు
డిజిటల్ ఫైనాన్స్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, ఏఐ ఆధారిత ఫైనాన్షియల్ టూల్స్ వినియోగం పెరిగింది. దాంతో ఆయా విభాగాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలు, ఇతర లావాదేవీలను మెరుగ్గా నిర్వహించేందుకు ఫైనాన్షియల్ టెక్నాలజీ నిపుణులు అవసరం.
ఏఐ, మెషిన్ లెర్నింగ్ స్పెషలిస్టులు
ఆటోమేషన్, డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్‌వర్క్‌లు అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ఇవి రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఏఐ డెవలప్‌మెంట్, అల్గారిథమ్ ఆప్టిమైజేషన్‌లో నిపుణులు ఈ పరిశ్రమలో కీలక పాత్ర పోషిస్తారు.
సాఫ్ట్‌వేర్, అప్లికేషన్స్ డెవలపర్లు
కస్టమైజ్డ్ డిజిటల్ సొల్యూషన్స్, ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్లు, క్లౌడ్-ఆధారిత ప్లాట్‌ఫామ్‌లకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఇది సాఫ్ట్‌వేర్ విభాగంలో మరింత మందికి ఉపాధిని కల్పిస్తుంది.
సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ ఎక్స్‌పర్ట్‌లు
డేటా ప్రొటెక్షన్, సైబర్ సెక్యూరిటీ, సైబర్ థ్రెట్ మిటిగేషన్, ఏఐ ఆధారిత సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ప్రస్తుత టెక్ వ్యాపారాలకు ఎంతో కీలకం. ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. దీన్ని సమర్థవంతంగా అదుపు చేస్తున్నప్పటికీ మరిన్ని ఆవిష్కరణలు రావాల్సి ఉందనే అభిప్రాయాలున్నాయి. భవిష్యత్తులో ఈ రంగం అధికంగా ఉద్యోగాలకు నెలవుగా మారుతుంది.
డేటా వేర్‌హౌసింగ్ నిపుణులు
టెక్ కంపెనీలు భారీ డేటాసెట్లను నిర్వహిస్తున్నాయి. డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, క్లౌడ్ స్టోరేజ్, డేటా వేర్‌హౌసింగ్ సొల్యూషన్లలో నిపుణులకు విలువ పెరుగుతోంది.
ఎలక్ట్రిక్ వెహికల్ స్పెషలిస్టులు
ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలోని కాలుష్య కారకాలను తగ్గించాలనే లక్ష్యంతో దాదాపు చాలా ఆటోమొబైల్ కంపెనీ సుస్థిర రవాణా వైపు అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. ఈవీ టెక్నాలజీ, బ్యాటరీ ఆవిష్కరణలు, సెల్ఫ్ డ్రైవింగ్ వ్యవస్థల్లో నైపుణ్యం కలిగిన ఇంజినీర్లకు గిరాకీ ఏర్పడుతుంది.
యూజర్ ఇంటర్‌ఫేజ్ డిజైనర్లు
టెక్ కంపెనీల్లో పోటీ తీవ్రతరం అవుతుండడంతో యూజర్ సెంట్రిక్ ప్రొడక్ట్ డిజైన్, హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్, మొబైల్ ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌లో రాణించే డిజైనర్లకు బాగా డిమాండ్ ఉంటుంది.
ఇదీ చదవండి: చైనా నడ్డి విరిచేలా అమెరికా కొత్త సుంకాలు
అభివృద్ధి చెందుతున్న జాబ్ మార్కెట్‌లో ముందుండాలంటే ఉద్యోగార్థులు తమ నైపుణ్యాలు పెంచుకోవడం, క్రాస్ డిసిప్లినరీ లెర్నింగ్, టెక్ పోకడలపై దృష్టి సారించాలి. ఆటోమేషన్, కృత్రిమ మేధ రంగాలు వృద్ధి పథంలో దూసుకుపోతున్న క్రమంలో మానవ నైపుణ్యం అనివార్యంగా అవసరం అవుతుంది. భవిష్యత్తు సృజనాత్మకతతోనే ముడిపడి ఉందనే విషయాన్ని నిత్యం గుర్తు చేసుకోవాలి.