టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండడంతో కొంతమందికి ఉపాధి లభిస్తుంటే, ఇంకొందరు తమ కొలువులు కోల్పోయేందుకు కారణం అవుతుంది. కృత్రిమ మేధ(AI) వేగంగా వృద్ధి చెందుతున్న ప్రస్తుత కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థలోని ఉద్యోగ మార్కెట్(Job Market)పై దీని ప్రభావం తీవ్రంగానే ఉంది. గతంలో వివిధ రంగాల్లో భిన్న విభాగాల్లో పని చేసేందుకు మానవవనరుల అవసరం ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితులు మారిపోయాయి. రానున్న పదేళ్లలో ఇప్పుడు చేస్తున్న చాలా ఉద్యోగాలు కనుమరుగవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందులో ప్రధానంగా కింది విభాగాలకు ముప్పు వాటిల్లబోతున్నట్లు చెబుతున్నారు.
క్యాషియర్లు: సెల్ఫ్ చెక్ అవుట్ కియోస్క్‌లు, ఆన్‌లైన్ షాపింగ్(Online Shopping) వల్ల క్యాషియర్ల అవసరం తగ్గిపోతోంది.
ట్రావెల్ ఏజెంట్లు: ఎక్స్ పీడియా వంటి ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లు, యూట్యూబ్(YouTube), వెబ్ కంటెట్.. వంటి విభిన్న మార్గాలు ఉండడంతో ట్రావెల్ ఏజెంట్ల అవసరం తగ్గిపోతోంది.
లైబ్రరీ క్లర్కులు: డిజిటల్ వనరులు, ఈ-బుక్స్(E-Books) అధికమవుతున్నాయి. దాంతో ఫిజికల్ లైబ్రరీ మేనేజ్‌మెంట్ అవసరం తక్కువగా ఉంది.
పోస్టల్ సర్వీస్ వర్కర్స్: ఈ-మెయిల్, డిజిటల్ కమ్యూనికేషన్(Digital Communication) కారణంగా ఫిజికల్ మెయిల్ తగ్గడం పోస్టల్ వర్కర్ల అవసరాన్ని తగ్గిస్తోంది.
డేటా ఎంట్రీ క్లర్క్‌లు: మాన్యువల్‌గా డేటా ఎంట్రీ చేసే క్లర్క్‌ల స్థానంలో ఏఐ, ఆటోమేషన్ డేటా ప్రాసెసింగ్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. దాంతో భవిష్యత్తులో వీరి అవసరం ఉండకపోవచ్చు.
ఫ్యాక్టరీ వర్కర్స్: తయారీ రంగంలో ఇప్పటికే చాలా కంపెనీలు ఆటోమేషన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. కొత్త మోడళ్లను రూపొందించడానికి వీలుగా రోబోటిక్స్‌ను వాడుతున్నారు. గతంలో ఈ పనంతా ఫిజికల్‌గా ఉద్యోగులు చేసేవారు.
బ్యాంక్ టెల్లర్స్: గతంలో బ్యాంకింగ్ సమస్యలకు సంబంధించి ఏదైనా ఇబ్బందులుంటే వెంటనే కాల్ సెంటర్‌కు కాల్ చేసిన కనుక్కునేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. బ్యాంకింగ్ సిస్టమ్‌లో వచ్చిన మార్పులు, చాట్‌బాట్‌లు, మొబైల్ యాప్స్ వల్ల సంప్రదాయ బ్యాంకు టెల్లర్ల అవసరం తగ్గిపోతోంది.
ట్యాక్సీ డ్రైవర్లు: సంప్రదాయ ట్యాక్సీ డ్రైవర్లు ఇప్పటికే భారీగా తగ్గిపోయారు. ఉబెర్, ఓలా, ర్యాపిడో.. వంటి రైడ్ హెయిలింగ్ సర్వీసులు ట్యాక్సీ(Taxi) సేవలను అందిస్తున్నాయి. దాంతో సంప్రదాయ డ్రైవర్లకు ఉపాధి కరవైంది.
ఫాస్ట్ ఫుడ్ కుక్స్: ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో ఆటోమేషన్ పెరుగుతోంది. మాన్యువల్‌గా కాకుండా రోబోటిక్ టెక్నాలజీ ద్వారా అవసరమైన పదార్థాలతో రుచికరంగా ఫాస్ట్‌ఫుడ్ తయారు చేసే సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు.
మెషిన్‌కు అలసట, సెలవులు ఉండవు!
మానవుల కంటే వేగంగా, మరింత కచ్చితత్వంతో ఏఐ ఆధారిత రోబోట్స్, చాట్‌బాట్స్.. పనులను నిర్వహించగలవు. ఫిజికల్‌గా ఉద్యోగులు షిఫ్ట్‌ల వారీగా పని చేస్తుంటారు. మెషిన్‌కు అలాంటివి ఉండవు. ఉద్యోగులకు అలవెన్స్‌లు, జీతాలు, సెలవులు, వీక్‌ఆఫ్‌లు.. వంటివి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రోబోట్స్‌కు అలాంటి ఇబ్బంది ఉండదు. దాంతో ఉత్పాదకత పెరుగుతుందనే వాదనలున్నాయి. ఇది డేటా ఎంట్రీ, బేసిక్ కస్టమర్ సర్వీస్ వంటి రంగాల్లో గణనీయంగా ఉద్యోగాల కోతకు కారణమవుతుంది.
అసలు ఏఐ వల్ల కొలువులే దొరకవా..?
ఏఐ డెవలప్‌మెంట్, డేటా అనాలిసిస్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఎథిక్స్ వంటి రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త ఉద్యోగావకాశాలను సృష్టిస్తోంది. ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్‌లో అడ్వాన్స్‌డ్ స్కిల్స్ అవసరమయ్యే ఉద్యోగాలు పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగా నైపుణ్యాలు పెంచుకోవాలి. ఒకవేళ చేస్తున్న ఉద్యోగం కోల్పోవాల్సిన పరిస్థితులు ఎదురైతే తిరిగి అంతకంటే ఉన్నతమైన కొలువులు ఎలా సాధించవచ్చో దృష్టి కేంద్రీకరించి స్కిల్స్ పెంచుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఇదీ చదవండి: స్వరంతో సంపద సృష్టించిన గాయనీమణులు
ఇప్పుడేం చేయాలి..
కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా నిర్వహించడానికి శ్రామిక శక్తికి తగినంత శిక్షణ ఇవ్వకపోతే అసమానతలు పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కృత్రిమ మేధ ఆధారిత పాత్రలకు కార్మికులను సిద్ధం చేయడానికి శిక్షణ, అప్ స్కిల్ కార్యక్రమాల అవసరం ఉందని సూచిస్తున్నారు. ఆర్థిక, ఆర్థికేతర మార్గాల ద్వారా ఈ కార్యక్రమాలకు ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment