
పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు బీమా చెల్లింపులు సులభతరం చేసేందుకు దేశంలోని అతిపెద్ద జీవిత బీమా సంస్థల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ముందుకు వచ్చింది. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పాలసీదారుల కుటుంబ సభ్యులు / నామినీల క్లెయిమ్ సమర్పణ కోసం సరళీకృత ప్రక్రియను ప్రకటించింది.
ఈ ఉగ్రదాడిలో చనిపోయినవారికి హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో బీమా పాలసీ ఉన్నట్లయితే వారి నామినీ / చట్టపరమైన వారసులు డెత్ క్లెయిమ్ సమర్పించవచ్చు. ఇందుకోసం ఉగ్రవాద దాడి కారణంగా సంభవించిన పాలసీదారు మరణానికి రుజువును స్థానిక ప్రభుత్వం, పోలీసు, ఆసుపత్రి లేదా సంబంధిత అధికారుల నుండి సమర్పించాలి.
డెత్ క్లెయిమ్ కోసం నామినీలు కాల్ సెంటర్ నంబర్ 022-68446530, service@hdfclife.com అనే ఈమెయిల్ ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ను సంప్రదించవచ్చు. లేదా ఏదైనా బ్రాంచ్ కార్యాలయాలను సందర్శించవచ్చు. బాధిత కుటుంబాలకు క్షేత్రస్థాయిలో సహాయ, సహకారాలు అందించడానికి అన్ని ప్రదేశాలలోనూ కంపెనీ స్థానిక బ్రాంచ్ సిబ్బంది అందుబాటులో ఉంటారని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ తెలిపింది.
ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సమీర్ యోగీశ్వర్ తెలిపారు. బాధితులకు జరిగిన నష్టాన్ని ఏదీ భర్తీ చేయలేనప్పటికీ, ఈ సరళీకృత ప్రక్రియ ద్వారా క్లెయిమ్ సమర్పణకు ప్రయాసలను మాత్రం తగ్గించగలమని ఆయన పేర్కొన్నారు.