Indian IT professionals
-
మార్చి 1 నుంచి హెచ్1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ
వాషింగ్టన్: భారతీయ ఐటీ నిపుణులకు శుభవార్త. 2023–24 సంవత్సరానికి గాను మార్చి ఒకటో తేదీ నుంచి హెచ్1బీ వీసాలకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అమెరికా ఇమిగ్రేషన్ విభాగం ఆదివారం తెలిపింది. మార్చి 17వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం ఉంటుందని, మార్చి 31కల్లా వీసా హోల్డర్ల పేర్లను ప్రకటిస్తామని పేర్కొంది. అమెరికా కంపెనీల్లో పనిచేసే విదేశీ సాంకేతిక నిపుణులకు ఇచ్చే నాన్–ఇమిగ్రాంట్ వీసా హెచ్1బీ. ఏడాదికి 85 వేల వరకు హెచ్1బీ వీసాలను మంజూరు చేస్తుంటారు. ఇందులో అత్యధికంగా లాభపడేది భారత్, చైనా దేశస్తులే. టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి రంగాలకు చెందిన ఈ వీసా దారులు ఆరేళ్ల వరకు అమెరికాలో ఉండి పని చేసుకునేందుకు వీలుంటుంది. ఆరేళ్ల తర్వాత శాశ్వత నివాసం లేదా గ్రీన్‌కార్డుకు అర్హులవుతారు. -
భారతీయులకు కెనడా శుభవార్త
టొరంటో: కెనడాలో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ వృత్తినిపుణుల కుటుంబసభ్యులకు తీపి కబురు! ఓపెన్ వర్క్ పర్మిట్ (ఓడబ్ల్యూపీ) కింద అక్కడ పనిచేస్తున్న భారతీయుల కుటుంబసభ్యులు కూడా ఇకపై తాత్కాలిక వర్క్ పర్మిట్లతో పనిచేసుకోవచ్చు. వలసలు, శరణార్థులు, పౌరసత్వ వ్యవహారాల మంత్రి సీన్ ఫ్రాసర్ శుక్రవారం ఈ మేరకు ప్రకటించారు. వర్క్ పర్మిట్లున్న వారి జీవిత భాగస్వామి, పిల్లలు వచ్చే ఏడాది నుంచి ఉద్యోగాలు చేసుకోవచ్చంటూ ట్వీట్ చేశారు. ‘‘దేశంలో సమస్యగా మారిన ఉద్యోగుల కొరతకు పరిష్కారంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. దీంతో 2,00,000 మందికిపైగా ఉన్న విదేశీ ఉద్యోగులకు తోడు వారి కుటుంబసభ్యులకు కెనడాలో కొలువుకు అవకాశం దక్కుతుంది. గతంలో ఓపెన్ వర్క్ పర్మిట్ ఉన్న ఉద్యోగి హై–స్కిల్డ్ ఉద్యోగం చేస్తేనే జీవితభా గస్వామికి వర్క్ పర్మిషన్ ఇచ్చేవాళ్లం. నిబంధనలను సడలించడంతో వర్క్ పర్మిట్ ఉద్యోగు లు కుటుంబంతో కలిసుంటారు. వారి శారీరక ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది’ అని ఫ్రాసర్ అభిప్రాయపడ్డారు. దీన్ని మూడు దశల్లో అమలు చేస్తారు. -
లక్ష గ్రీన్‌కార్డులు వృథా అయ్యే ప్రమాదం!
వాషింగ్టన్: దాదాపు లక్షకు పైగా గ్రీన్‌కార్డులు ఈ సంవత్సరం వృథా అయ్యే ప్రమాదం ఉందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇదే నిజమైతే అమెరికాలో శాశ్వత నివాసం ఉండాలనుకునే భారతీయ ఐటీ నిపుణుల్లో చాలామంది ఆశలపై నీళ్లు జల్లినట్లు కానుంది. ఈ ఏడాది ఎంప్లాయ్మెంట్ ఆధారిత గ్రీన్ కార్డుల కోటా గతేడాదితో పోలిస్తే లక్షకు పైగా పెరిగి 2,61,500కు చేరిందని భారత్‌కు చెందిన సందీప్ పవార్ చెప్పారు. అయితే చట్టం ప్రకారం సెప్టెంబర్ 30లోపు అవసరమైన వీసాలు జారీ కాకుంటే అధికంగా పెరిగిన కోటాలోని లక్ష కార్డులు వృ«థా అవుతాయన్నారు. ఈ విషయమై బైడెన్ ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయమై ఇంకా ప్రభుత్వ వర్గాలు స్పందించలేదు. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) చేస్తున్న జాప్యమే గ్రీన్‌కార్డుల వృ«థాకు కారణమవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. మరోవైపు భారత్, చైనాకు చెందిన 125 మంది ఈ వృ«థా నివారించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఒకపక్క దశాబ్దాలుగా గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూసేవారుండగా, మరోపక్క ఇలా కార్డులు వృ«థా కావడం సబబుకాదని వీరు కోర్టుకు విన్నవించారు. యూఎస్సీఐఎస్ అనుసరిస్తున్న అసంబద్ధ విధానాల వల్ల పలువురు భారతీయుల భాగస్వాములు, పిల్లలు, తల్లిదండ్రులకు గ్రీన్కార్డులందడంలేదని భారతీయ హక్కుల పోరాట కార్యకర్త పవార్ చెప్పారు. డ్రీమర్ల హక్కులకు రక్షణ కల్పించాలని, గ్రీన్ కార్డులపై పరిమితి ఎత్తివేయాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
హెచ్–1బీ వీసాల జారీకి రెండోసారి లాటరీ
వాషింగ్టన్: హెచ్–1బీ వర్క్ వీసా కోసం ఎదురు చూస్తున్న భారత ఐటీ నిపుణులకు శుభవార్త. ఈ వీసాల జారీకి రెండోసారి లాటరీ నిర్వహించాలని యూఎస్ సిటిజెన్షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) నిర్ణయించింది. మొదటి దశలో వీసాలు పొందలేని వారికి ఈ విధంగా మరో అవకాశం లభించనట్లే. హెచ్–1బీ వీసాల జారీకి ఈ ఏడాది ప్రారంభంలో కంప్యూటరైజ్డ్ డ్రా నిర్వహించారు. అయితే, అర్హులైన వారు చాలామంది వీసాలు పొందలేకపోయారు. అందుకే రెండోసారి లాటరీ నిర్వహించాలని నిర్ణయించినట్లు యూఎస్సీఐఎస్ గురువారం ప్రకటించింది. ఏటా కేవలం 65వేల హెచ్–1బీ వీసాలు జారీ చేయాలంటూ కాంగ్రెస్ పరిమితి విధించిన సంగతి తెలిసిందే. హెచ్–1బీ అనేది నాన్–ఇమ్మిగ్రెంట్ వీసా. దీనితో అమెరికా కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను స్వదేశంలో ఉద్యోగాల్లో నియమించుకోవచ్చు. రెండోసారి లాటరీ విషయంలో పిటిషన్ ఫైలింగ్ ఆగస్టు 2 నుంచి నవంబర్ 3 వరకు ఉంటుందని యూఎస్సీఐఎస్ వెల్లడించింది. -
హెచ్-1బీ వీసా తిరస్కరణ : అమెరికాపై దావా
శాన్ఫ్రాన్సిస్కో : సిలికాన్ వ్యాలీ ఆధారిత ఐటీ సంస్థ అమెరికా ప్రభుత్వంపై లా సూట్ ఫైల్ చేసింది. భారతీయ ఐటీ ప్రొఫెషనల్‌కు హెచ్-బీ వీసా జారీ నిరాకరణపై నిరసన వ్యక్తం చేస్తూ ఈ దావా దాఖలు చేసింది. అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేసిన తమ ఉద్యోగికి వీసా నిరాకరణ ఏకపక్షమైనందనీ విచక్షణ పూరితమైందని వ్యాఖ్యానించింది. తమ సంస్థలో బిజినెస్ సిస్టం ఎనలిస్టు ప్రహర్ష్ చంద్ర సాయి వెంకట అనిశెట్టి( 28) కి హెచ్-1బీ వీసాను యుఎస్ సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ నిరాకరించిందని ఎక్స్ టెర్రా సొల్యూషన్స్ అనే ఐటీ సంస్థ ఆరోపించింది. ఫిబ్రవరి 19, 2019 ఇమ్మిగ్రేషన్ విభాగం విచక్షణా రహితంగా, చట్ట విరుద్ధంగా అనిశెట్టి వీసాను తీరస్కరించిదని పేర్కొంటూ దావా వేసింది. అన్ని అర్హతలున్నప్పటికీ ఏకపక్షంగా వ్యవహరించిందని కంపెనీ ఆరోపించింది. అనిశెట్టి బీటెక్(ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) డిగ్రీతోపాటు డాలస్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ లో మాస్ట్ర్స్ డిగ్రీ చేశారని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం అనిశెట్టి (భార్య ద్వారా) హెచ్-4 డిపెండెంట్ వీసాతో ఉన్నారని తెలిపింది. మరోవైపు దీనిపై స్పందించేందుకు ఇమ్మిగ్రేషన్ విభాగం తిరస్కరించింది. కాగా మొత్తం 65,000 మందికి హెచ్1 బీ వీసా ఇవ్వాలని ట్రంప్ సర్కారు నిర్ణయించింది. వీరితోపాటు లబ్ధిదారుల తరపున వచ్చిన మొదటి 20వేల మంది విదేశీయులకు అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి ఈ లిమిట్నుంచి మినహాయింపునిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
హెచ్1–బీ దరఖాస్తులను తిప్పి పంపాం
వాషింగ్టన్: హెచ్1–బీ హోదా కోసం అందిన దరఖాస్తుల్లో ఎంపిక కాని వాటిని తిరిగి అభ్యర్థులకే పంపించి వేసినట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల (యూఎస్సీఐఎస్) విభాగం తెలిపింది. 2019వ సంవత్సరానికి హెచ్1–బీ దరఖాస్తుల స్వీకరణ ప్రకటన వెలువడిన వారం రోజుల్లోనే జనరల్ కేటగిరీలో 94,213 దరఖాస్తులు, అడ్వాన్స్డ్ డిగ్రీ కేటగిరీలో 95,885 దరఖాస్తులు అందినట్లు యూఎస్ఐఎస్ తెలిపింది. హెచ్1–బీ వీసా జనరల్ కేటగిరీకి 65వేలు, అడ్వాన్స్డ్ డిగ్రీ కేటగిరీకి 20వేల పరిమితి ఉండగా ఈ ఏప్రిల్‌లో నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత లాటరీలో ఎంపిక కాని వాటిని తిప్పి పంపామని తెలిపింది. ప్రస్తుతం 2019 ఆర్థిక సంవత్సరంతో సంబంధం లేని హెచ్1–బీ దరఖాస్తులను మాత్రమే పరిశీలనకు స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేసింది. హెచ్1–బీ వీసా కోసం భారత్, చైనా దేశాలకు చెందిన సాంకేతిక నిపుణులు ఎక్కువమంది దరఖాస్తు చేసుకుంటుంటారు. ఈ వీసా మంజూరైతే మూడేళ్ల పాటు, గరిష్టంగా ఆరేళ్ల వరకు అక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకునే వీలుంటుంది. కొన్ని షరతులకు లోబడి ఈ కాల పరిమితిని పొడిగించే అవకాశాలూ ఉన్నాయి. హెచ్1–బీ వీసా కోసం 2007–17 మధ్య కాలంలో 22 లక్షల మంది భారతీయ నిపుణులు దరఖాస్తు చేసుకోగా తర్వాతి స్థానంలో 3 లక్షల మందితో చైనీయులు ఉన్నారని యూఎస్సీఐఎస్ వెల్లడించింది. -
వీసాల్లో మార్పులు మన టెక్కీలకే లాభమట!
వాషింగ్టన్ : అమెరికా హెచ్-1బీ వీసా నిబంధనలు కఠినతరం చేయగానే.. దేశీయ ఐటీకి తీవ్రదెబ్బ అని, మన టెక్ ప్రొఫిషినల్స్ ఉద్యోగాలు ఊడతాయని తెగ ప్రచారం జరిగింది. దీంతో ఐటీ నిపుణుల్లో కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే హెచ్-1బీ వీసా నిబంధనల్లో ఇటీవల తీసుకొచ్చిన మార్పులు భారత ఐటీ ప్రొఫిషినల్స్ కు ఎంతో సాయపడనున్నాయని అమెరికా నిపుణులు చెబుతున్నారు. భారత ఐటీ ప్రొఫిషినల్స్ కు ఈ నిబంధనల కఠినతరంతో ఎక్కువ వేతనాలు లభిస్తాయని వారు పేర్కొన్నారు. అమెరికాలోని టెక్నాలజీ కంపెనీలు, అవుట్ సోర్సింగ్ కంపెనీల్లో లేబర్ కాస్ట్ లు పెరుగుతాయని బన్యాన్ ట్రీ క్యాపిటల్ మేనేజ్ మెంట్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ పార్టనర్ ఇగ్నేషియస్ చితెలెన్ వార్టన్ వెబ్ సైట్ ఓపెడ్ లో చెప్పారు. వీసా హోల్డర్స్ కు వార్షిక వేతనం కింద లక్ష డాలర్లను చెల్లిస్తారని వివరించారు. దీంతో అదనపు ఖర్చులు ఏడాదికి 2.6 బిలియన్ డాలర్లుంటాయని పేర్కొన్నారు. కొత్త వీసా పాలసీ నవంబర్ లో ప్రకటిస్తారని, వచ్చే ఏడాది నుంచి అప్లికెంట్ల వేతనాలు పెరుగుతాయని తెలిపారు. భారత ఐటీ ప్రొఫిషినల్స్ కూ లబ్ది చేకూరుతుందని చెప్పారు. అమెరికాలో అడ్వాన్స్ డిగ్రీలు పొందిన భారత గ్రాడ్యుయేట్లు, హెచ్-1బీ జాబ్స్ కు అప్లయ్ చేసే భారతీయులు ఎక్కువ వేతనం, మంచి పని ప్రదేశాల్లో ఉద్యోగాలు పొందవచ్చని పేర్కొన్నారు. అయితే హైర్ అమెరికన్ల పేరుతో హెచ్-41బీ వీసాల జారీ తగ్గుతుందని చెప్పారు. ప్రస్తుత హెచ్-1బీ వీసా ప్రొగ్రామ్ ఉద్దేశ్యం అమెరికా ఫస్ట్ అనేది కాదని, సిస్టమ్ లో ఉన్న దుర్వినియోగాన్ని అరికడుతుందని రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు దేవ్ బ్రాట్ తెలిపారు. కంపెనీలు హెచ్-1బీ వీసా ప్రొగ్రామ్ లో లొసుగులను అడ్డం పెట్టుకుని, అత్యంత నిపుణులైన అమెరికా వర్కర్లను చీఫ్ లేబర్ తో రిప్లేస్ చేస్తున్నారని బ్రాట్ మరోసారి ఉద్ఘాటించారు. హెచ్-1బీ వీసా ప్రొగ్రామ్ లో మార్పులను ప్రతిపాదించిన వారిలో ఈయన ఒకరు. -
అమెరికా బాటలో సింగపూర్: ఇండియన్స్ కు షాక్
-
అమెరికా బాటలో సింగపూర్: ఇండియన్స్ కు షాక్
న్యూఢిల్లీ : వీసాల జారీల్లో ఇండియన్స్ కు విదేశాలు ఝలకిస్తున్నాయి. వీసా జారీల్లో కఠినతరమైన నిబంధనలు తీసుకొస్తూ భారతీయులకు కంటిమీదు కునుకు లేకుండా చేస్తున్న అమెరికా బాటలోనే సింగపూర్ నడుస్తోంది. దేశీయ ఐటీ నిపుణులకు ఇచ్చే వీసాలను సింగపూర్ బ్లాక్ చేస్తోంది. సింగపూర్ లో వర్క్ చేసేందుకు ఐటీ నిపుణులు పొందే వీసాలను సింగపూర్ లో భారీగా తగ్గిస్తున్నట్టు తెలిసింది. వాణిజ్యపరమైన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సమగ్ర ఆర్థిక సహకార ఒప్పంద(సీఈసీఏ) సమీక్షను పక్కనపెడుతోంది. ప్రతిభావంతులైన స్థానికులను భారత కంపెనీలు నియమించుకోవాలంటూ అమెరికా మాదిరి ఆదేశాలు జారీచేస్తోంది. దీంతో సింగపూర్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు ఇతర దేశాలకు తమ ఆపరేషన్స్ ను తరలించాలని యోచిస్తున్నాయి. హెచ్‌సీఎల్ నుంచి టీసీఎస్ వరకు అన్ని కంపెనీలు సింగపూర్ కు తరలివెళ్లిన సంగతి తెలిసిందే. ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ లు అక్కడ కార్యకలాపాలు ప్రారంభించేశాయి. కానీ ఆ కంపెనీలకు ఈ ఏడాది ప్రారంభం నుంచి వీసా సమస్యలు ప్రారంభమయ్యాయి. వీసా జారీలు పడిపోతున్నాయి. స్థానికులను నియమించుకోవాంటూ దేశీయ కంపెనీలకు ఆదేశాలు వస్తున్నాయని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖరన్ చెప్పారు. ప్రాక్టికల్ గా మన ఐటీ నిపుణులకు వీసాలను కూడా ఆపివేస్తున్నట్టు మరో ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్ కూడా పేర్కొన్నారు. నిర్ధిష్ట ఆర్థిక ప్రమాణాలుండాలంటూ ''ఎకనామిక్ నీడ్స్ టెస్ట్'' పేరుతో దేశీయ నిపుణులకు యాక్సస్ కల్పించకుండా సింగపూర్ అథారిటీలు అడ్డుకుంటున్నారని సంబంధిత వర్గాలు చెప్పాయి. సర్వీసు ట్రేడ్ నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు తలెత్తుతున్నాయని, స్థానికులకు తొలి ఛాన్స్ ఇవ్వాలంటూ కఠినతరమైన నిబంధనలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ద్వీపకల్ప దేశంలో విదేశీ నిపుణులకు అనుమతి కల్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దేశం సింగపూరే. ఈ నేపథ్యంలో దిగుమతి డ్యూటీలను కట్ చేస్తూ ఉత్పత్తులను అనుమతించే విషయంపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని దేశీయ ప్రభుత్వం కూడా నిర్ణయించింది. -
3 నుంచి హెచ్1బీ దరఖాస్తుల స్వీకరణ
వాషింగ్టన్: భారత ఐటీ నిపుణులు, కంపెనీలు ఎదురుచూసే హెచ్1బీ వర్క్ వీసా దరఖాస్తులను ఏప్రిల్ 3 నుంచి స్వీకరించనున్నట్లు అమెరికా పౌరసత్వ, ఇమిగ్రేషన్ సర్వీసుల సంస్థ(యూఎస్సీఐఎస్) తెలిపింది. అయితే దరఖాస్తులను ఎప్పటివరకు స్వీకరిస్తారో చెప్పలేదు. గత సంవత్సరాల్లో యూఎస్సీఐఎస్ ఈ గడువును పేర్కొనేది. సాధారణంగా దరఖాస్తుల స్వీకరణ మొదలైన తేదీ నుంచి ఐదు పనిదినాల వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. 2017 ఆక్టోబర్ 1తో మొదలయ్యే 2018 ఆర్థిక సంవత్సరానికి దరఖాస్తులను ఆహ్వానించారు. అమెరికా కాంగ్రెస్ విధించిన 85 వేల హెచ్1బీ వీసాల మంజూరుకు తగినన్ని దరఖాస్తులు గత సంవత్సరాల్లో వచ్చాయి. 85 వేల వీసాల్లో 65 వేలు జనరల్ కేటగిరీ వారికి, 20 వేలు అమెరికా విద్యాసంస్థల్లో పీజీ లేదా ఉన్నత విద్య చదివిన విదేశీయులకు ఇవ్వాలనేది నిబంధన. పరిశోధన కోసం అమెరికాకు వచ్చేవారికి ఇచ్చే వీసాలు ఈ పరిమితిలోకి రావు. అయితే త్వరగా వీసా ఇచ్చేందుకు సంబంధించిన ప్రీమియం వీసా ప్రక్రియను ఆరు నెలలు రద్దు చేయడంతో వీరి వీసా ప్రక్రియకు విఘాతం కలిగింది. దరఖాస్తు(ఫామ్ ఐ–129) ఫీజును కూడా 460 డాలర్లకు పెంచారు.