
హెచ్1–బీ వీసా జనరల్ కేటగిరీకి 65వేలు, అడ్వాన్స్‌డ్ డిగ్రీ కేటగిరీకి 20వేల పరిమితి ఉండగా..
వాషింగ్టన్: హెచ్1–బీ హోదా కోసం అందిన దరఖాస్తుల్లో ఎంపిక కాని వాటిని తిరిగి అభ్యర్థులకే పంపించి వేసినట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల (యూఎస్‌సీఐఎస్) విభాగం తెలిపింది. 2019వ సంవత్సరానికి హెచ్1–బీ దరఖాస్తుల స్వీకరణ ప్రకటన వెలువడిన వారం రోజుల్లోనే జనరల్ కేటగిరీలో 94,213 దరఖాస్తులు, అడ్వాన్స్‌డ్ డిగ్రీ కేటగిరీలో 95,885 దరఖాస్తులు అందినట్లు యూఎస్‌ఐఎస్ తెలిపింది. హెచ్1–బీ వీసా జనరల్ కేటగిరీకి 65వేలు, అడ్వాన్స్‌డ్ డిగ్రీ కేటగిరీకి 20వేల పరిమితి ఉండగా ఈ ఏప్రిల్‌లో నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత లాటరీలో ఎంపిక కాని వాటిని తిప్పి పంపామని తెలిపింది. ప్రస్తుతం 2019 ఆర్థిక సంవత్సరంతో సంబంధం లేని హెచ్1–బీ దరఖాస్తులను మాత్రమే పరిశీలనకు స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేసింది.
హెచ్1–బీ వీసా కోసం భారత్, చైనా దేశాలకు చెందిన సాంకేతిక నిపుణులు ఎక్కువమంది దరఖాస్తు చేసుకుంటుంటారు. ఈ వీసా మంజూరైతే మూడేళ్ల పాటు, గరిష్టంగా ఆరేళ్ల వరకు అక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకునే వీలుంటుంది. కొన్ని షరతులకు లోబడి ఈ కాల పరిమితిని పొడిగించే అవకాశాలూ ఉన్నాయి. హెచ్1–బీ వీసా కోసం 2007–17 మధ్య కాలంలో 22 లక్షల మంది భారతీయ నిపుణులు దరఖాస్తు చేసుకోగా తర్వాతి స్థానంలో 3 లక్షల మందితో చైనీయులు ఉన్నారని యూఎస్‌సీఐఎస్ వెల్లడించింది.