సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదిస్తున్న ప్రతిభ ఆధారిత హెచ్1బీ వీసాల విధానం అమల్లోకి వస్తే భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ఐటీ కంపెనీలకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఏటా అమెరికా బాట పడుతున్న భారతీయ నిపుణులు స్థాయిని బట్టి 65 వేల డాలర్ల వార్షిక వేతనానికి ఉద్యోగాల్లో చేరుతున్నారు. ఏటా లక్ష డాలర్లు అంతకంటే తక్కువ మొత్తంలో వేతనాలు ఆర్జిస్తున్న భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు 2 లక్షల మంది దాకా ఉన్నారు. వీరికి కొత్త విధానం గడ్డుకాలమే. మరో 50 వేల మంది వార్షిక వేతనం లక్ష డాలర్లు అంతకంటే ఎక్కువ మొత్తంలో ఆర్జిస్తున్నారు. (అన్నంత పని చేసిన డొనాల్డ్ ట్రంప్)
లాటరీ స్థానంలో ప్రతిభ ఆధారిత వీసా...
అమెరికా ఫస్ట్ నినాదంతో అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ ప్రతిభ ఆధారిత వీసా విధానాన్ని అమలు చేస్తానని పలు సందర్భాల్లో ప్రకటించారు. అమెరికా అగ్రశ్రేణి కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించడం, అమెరికాలోని భారత ఐటీ కంపెనీలు సైతం అక్కడి కాంగ్రెస్ సభ్యులతో లాబీయింగ్ చేయడంతో ట్రంప్ పాలనలోనూ లాటరీ విధానం ద్వారానే హెచ్1బీ వీసాల ఎంపిక జరిగింది. హెచ్1బీ వీసాల మంజూరులో హోంల్యాండ్ డిపార్టుమెంట్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయడం మొదలుపెట్టింది. ఈ కారణంగా అమెరికాలో భారతీయ ఐటీ కంపెనీలకు హెచ్1బీ వీసాలతోపాటు ఎల్–1 వీసాల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో ఈ కంపెనీలు అమెరికాలోని వర్సిటీల్లో ప్లేస్‌మెంట్లు నిర్వహించి అమెరికన్ పౌరులను నియమించుకున్నా నైపుణ్యం లేకపోవడంతో కాలానుగుణంగా వారిని వదిలించుకున్నాయి. (‘తల్లిని కోల్పోయా.. ఇప్పుడు పిల్లలకు దూరంగా..’)
వార్షిక వేతనం ఎంత ఉండొచ్చు?
ట్రంప్ ప్రతిపాదిస్తున్న ప్రతిభ ఆధారిత వీసా విధానం అమల్లోకి వస్తే కనిష్ట వార్షిక వేతనం ఎంత నిర్ణయించవచ్చన్న దానిపైనే ఇప్పుడు ఐటీ రంగంలో చర్చ మొదలైంది. కనిష్ట వార్షిక వేతనం లక్ష డాలర్లుగా నిర్ణయిస్తే పరవాలేదని, అంతకంటే ఎక్కువగా ఉంటే కంపెనీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని వర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా కంప్యూటర్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ అలెగ్జాండర్ బయాన్ పేర్కొన్నారు. లాటరీ ద్వారా ఈ ఏడాది 70 వేల మంది భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు హెచ్1బీ వీసాకు ఎంపికయ్యారు. వారిలో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కింద వర్క్ పర్మిట్ పొందిన 25 వేల మంది గడువు డిసెంబర్‌తో ముగియనుంది. కొత్త విధానం అమల్లోకి వచ్చి వార్షిక వేతనం లక్ష డాలర్లు అంతకంటే ఎక్కువగా నిర్ణయిస్తే మరో 50 వేల మంది భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు తిరుగుముఖం పట్టాల్చి రావచ్చు. నూతన విధానం అమల్లోకొస్తే హెచ్1బీ రెన్యూవల్‌కు వచ్చే వీసాదారుల పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంటుంది.
కాగా వర్క్ వీసాల జారీపై తాత్కాలిక రద్దు విషయంలో ముఖ్యమంత్రి వైస్ జగన్‌మోహన్‌రెడ్డి కల్పించుకోవాలని నార్త్ అమెరికా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ లేఖ రాశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈ అంశంపై సీఎం జగన్ చర్చించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని రత్నాకర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment