Indian software engineers
-
భారతీయ టెక్కీలకు మోదీ సరికొత్త చాలెంజ్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ స్థాయిలో ‘మేడ్ ఇన్ ఇండియా’ యాప్‌లను రూపొందించేందుకు దేశ నలుమూలల ఉన్న సాఫ్ట్వేర్ టెక్కీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ‘ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ చాలెంజ్’ను ప్రకటించారు. ఇందులో పాల్గొనాలని దేశీయ టెక్ కంపెనీలు, స్టార్టప్‌లను ప్రధాని మోదీ కోరారు. మెయిటీ (MeitY), అటల్ ఇన్నొవేషన్ మిషన్, నీతి ఆయోగ్‌ల సంయుక్తంగా ఈ యాప్ ఇన్నొవేషన్ చాలెంజ్ నిర్వహించనున్నాయి. (చదవండి : భారత్‌కు పెరుగుతున్న మద్దతు!) ‘ప్రస్తుతం యాప్స్ తయారు చేసే ఔత్సాహికులు చాలా మంది ఉన్నారు. టెక్, స్టార్టప్స్‌లో వరల్డ్ క్లాస్ మేడిన్ ఇండియా యాప్స్ తయారు చేయగల సత్తా ఉంది. వారి ఐడియాలు, ఉత్పత్తులకు ప్రోతాహం కల్పించేందుకు ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నొవేషన్ ఛాలెంజ్ నిర్వహిస్తోంది. యాప్స్ విభాగంలో మీకు అనుభవం, టాలెంట్, ఆసక్తి, కొత్త ఐడియాలు సృష్టించగల ఉత్సాహం, ప్లాన్ ఉన్నవారు ఇందులో పాల్గొనవచ్చు’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక టెక్కీలు, స్టార్టప్‌లు మేడిన్ ఇండియా యాప్‌లను డెవలప్ చేసేందుకు ఈ చాలెంజ్ ఉపయోగపడుతుంది. ఇందులో గెలిచిన వారికి బహుమతులతోపాటు పేరు ప్రఖ్యాతులు కూడా దక్కనున్నాయి. ఆయా విభాగాల్లో డెవలప్ చేసే అత్యుత్తమ యాప్‌లకు రూ.2 లక్షల నుంచి రూ.20 లక్షల భారీ నగదు బహుమతులను ఔత్సాహికులు పొందవచ్చు. యాప్‌లు సులభంగా వాడుకునే విధంగా, పూర్తిగా సురక్షితమైన ఫీచర్లు కలిగి ఉండాలి. ఈ చాలెంజ్ వల్ల దేశంలో ఉన్న ఔత్సాహిక యాప్ డెవలపర్లు, స్టార్టప్‌ల నుంచి ప్రతిభను వెలికి తీసేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈ చాలెంజ్‌కు చెందిన పూర్తి వివరాల కోసం innovate.mygov.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఈ చాలెంజ్‌లో పాల్గొనాలనుకునే వారు తమ అప్లికేషన్లను జూలై 18, 2020లోపు సమర్పించాలి. -
హెచ్ 1బీ: భవిష్యత్తుపై మనోళ్ల బెంగ!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదిస్తున్న ప్రతిభ ఆధారిత హెచ్1బీ వీసాల విధానం అమల్లోకి వస్తే భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఐటీ కంపెనీలకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఏటా అమెరికా బాట పడుతున్న భారతీయ నిపుణులు స్థాయిని బట్టి 65 వేల డాలర్ల వార్షిక వేతనానికి ఉద్యోగాల్లో చేరుతున్నారు. ఏటా లక్ష డాలర్లు అంతకంటే తక్కువ మొత్తంలో వేతనాలు ఆర్జిస్తున్న భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 2 లక్షల మంది దాకా ఉన్నారు. వీరికి కొత్త విధానం గడ్డుకాలమే. మరో 50 వేల మంది వార్షిక వేతనం లక్ష డాలర్లు అంతకంటే ఎక్కువ మొత్తంలో ఆర్జిస్తున్నారు. (అన్నంత పని చేసిన డొనాల్డ్ ట్రంప్) లాటరీ స్థానంలో ప్రతిభ ఆధారిత వీసా... అమెరికా ఫస్ట్ నినాదంతో అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ ప్రతిభ ఆధారిత వీసా విధానాన్ని అమలు చేస్తానని పలు సందర్భాల్లో ప్రకటించారు. అమెరికా అగ్రశ్రేణి కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించడం, అమెరికాలోని భారత ఐటీ కంపెనీలు సైతం అక్కడి కాంగ్రెస్ సభ్యులతో లాబీయింగ్ చేయడంతో ట్రంప్ పాలనలోనూ లాటరీ విధానం ద్వారానే హెచ్1బీ వీసాల ఎంపిక జరిగింది. హెచ్1బీ వీసాల మంజూరులో హోంల్యాండ్ డిపార్టుమెంట్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయడం మొదలుపెట్టింది. ఈ కారణంగా అమెరికాలో భారతీయ ఐటీ కంపెనీలకు హెచ్1బీ వీసాలతోపాటు ఎల్–1 వీసాల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో ఈ కంపెనీలు అమెరికాలోని వర్సిటీల్లో ప్లేస్మెంట్లు నిర్వహించి అమెరికన్ పౌరులను నియమించుకున్నా నైపుణ్యం లేకపోవడంతో కాలానుగుణంగా వారిని వదిలించుకున్నాయి. (‘తల్లిని కోల్పోయా.. ఇప్పుడు పిల్లలకు దూరంగా..’) వార్షిక వేతనం ఎంత ఉండొచ్చు? ట్రంప్ ప్రతిపాదిస్తున్న ప్రతిభ ఆధారిత వీసా విధానం అమల్లోకి వస్తే కనిష్ట వార్షిక వేతనం ఎంత నిర్ణయించవచ్చన్న దానిపైనే ఇప్పుడు ఐటీ రంగంలో చర్చ మొదలైంది. కనిష్ట వార్షిక వేతనం లక్ష డాలర్లుగా నిర్ణయిస్తే పరవాలేదని, అంతకంటే ఎక్కువగా ఉంటే కంపెనీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని వర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా కంప్యూటర్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ అలెగ్జాండర్ బయాన్ పేర్కొన్నారు. లాటరీ ద్వారా ఈ ఏడాది 70 వేల మంది భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హెచ్1బీ వీసాకు ఎంపికయ్యారు. వారిలో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కింద వర్క్ పర్మిట్ పొందిన 25 వేల మంది గడువు డిసెంబర్‌తో ముగియనుంది. కొత్త విధానం అమల్లోకి వచ్చి వార్షిక వేతనం లక్ష డాలర్లు అంతకంటే ఎక్కువగా నిర్ణయిస్తే మరో 50 వేల మంది భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తిరుగుముఖం పట్టాల్చి రావచ్చు. నూతన విధానం అమల్లోకొస్తే హెచ్1బీ రెన్యూవల్‌కు వచ్చే వీసాదారుల పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంటుంది. కాగా వర్క్ వీసాల జారీపై తాత్కాలిక రద్దు విషయంలో ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్రెడ్డి కల్పించుకోవాలని నార్త్ అమెరికా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ లేఖ రాశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈ అంశంపై సీఎం జగన్ చర్చించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని రత్నాకర్ తెలిపారు. -
మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు షాకిచ్చిన యూకే!
-
మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు షాకిచ్చిన యూకే!
యూరోపియన్ యూనియన్‌కు చెందని దేశాల నుంచి వచ్చే వృత్తి నిపుణుల వీసా విషయంలో ఇంగ్లండ్ ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది. దాంతో ముఖ్యంగా భారతదేశం నుంచి అక్కడకు వెళ్లే సాఫ్ట్వేర్ ఇంజనీర్లపై పెను ప్రభావం పడబోతోంది. టైర్ 2 ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ (ఐసీటీ) విభాగంలో వీసా కోసం దరఖాస్తు చేసుకునేవాళ్లకు వేతనం దాదాపు రూ. 25 లక్షలు ఉండాలని చెప్పింది. ఇది ఇంతకుముందు రూ. 17.30 లక్షలుగా ఉండేది. ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్.. అంటే కంపెనీ తరఫున విదేశాల్లో పనిచేయడానికి వెళ్లేవారు. ఈ మార్గాన్ని భారతీయ ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉపయోగించుకుంటాయి. ఈ మార్గంలో వచ్చేవాళ్లలో దాదాపు 90 శాతం మంది భారతీయ ఐటీ కంపెనీల ఉద్యోగులే ఉంటున్నట్లు యూకే మైగ్రేషన్ అడ్వైజరీ కమిటీ (మ్యాక్) గుర్తించింది. మూడు రోజుల పర్యటన కోసం బ్రిటిష్ ప్రధాని థెరెసా మే భారతదేశానికి రావడానికి సరిగ్గా మూడు రోజుల ముందే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది మన ఐటీ ఇంజనీర్లకు శరాఘాతంగా పరిణమిస్తుందని చెబుతున్నారు. వేతన పరిమితిని కేవలం టైర్ 2 ఐసీటీ విభాగానికే కాక ఇతర విభాగాలలో కూడా పెంచారు. టైర్ 2 (సాధారణ) ఉద్యోగులకు రూ. 20.80 లక్షల వేతనం ఉండాలని చెబుతూ, కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ట్రైనీలుగా వచ్చే టైర్ 2 (ఐసీటీ) గ్రాడ్యుయేట్ ట్రైనీల వేతన పరిమితి 19.14 లక్షలుగా నిర్ణయించారు. దాంతోపాటు ఒక్కో కంపెనీ ఏడాదికి కేవలం 20 మందిని మాత్రమే ఇలా తీసుకురావాలని నిబంధన విధించారు భారతీయులు యూకే ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి, వారి నైపుణ్యాలను మెరుగుపరచాలని అనుకోవడం లేదని.. భారతదేశంలో నిపుణులైన ఐటీ ఉద్యోగులు సిద్ధంగా ఉండటమే ఇందుకు నిదర్శనమని మ్యాక్ నివేదిక తెలిపింది. పలు బహుళ జాతీయ కంపెనీలు భారతదేశంలో ఉన్నాయని.. యూకేలో ఉన్న వాటి శాఖల కంటే భారతదేశంలో ఉన్న శాఖల ద్వారా ఐటీ సేవలు అందించడంలో వాటికి పోటీలో సానుకూలత ఎక్కువగా ఉందని పేర్కొంది. వాళ్లు ఒక డెలివరీ మోడల్‌ను అభివృద్ధి చేసుకున్నారని, దాని ద్వారా భారతదేశంలోనే పనిచేస్తూ ప్రాజెక్టులు డెలివరీ చేస్తున్నారని తెలిపింది. ఒకే స్థాయి ఉద్యోగులు యూకేలో ఉన్నప్పటి కంటే భారతదేశంలో ఉంటే వాళ్ల జీతాలు తక్కువ కావడమే అందుకు కారణమని వివరించింది. భారతీయ ఐటీ కంపెనీలలో ఉద్యోగులకు శిక్షణ ఇవ్వగల సామర్థ్యం బాగుందని, వాళ్లు తమ సొంత దేశం వారి నైపుణ్యాలను బాగా పెంచుతున్నారని కూడా పేర్కొంది. ఇదంతా చూస్తుంటే.. ఇంగ్లిష్ వారి కంటే భారతీయ ఐటీ నిపుణులకు సామర్థ్యం ఎక్కువని, ఇక్కడ శిక్షణ సదుపాయాలు బాగుండటం, జీతాలు కూడా తక్కువగా ఉండటంతో భారత్ నుంచి పనిచేస్తే వాళ్లకు ఖర్చులు తక్కువవుతున్నాయని.. అందువల్ల కంపెనీ మీద ఆర్థిక భారం తగ్గి లాభాలు ఎక్కువవుతున్నాయని ఇంగ్లండ్ భావిస్తున్నట్లుంది.