మన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు షాకిచ్చిన యూకే!
మన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు షాకిచ్చిన యూకే!
Published Fri, Nov 4 2016 1:26 PM | Last Updated on Tue, Aug 7 2018 4:24 PM
యూరోపియన్ యూనియన్‌కు చెందని దేశాల నుంచి వచ్చే వృత్తి నిపుణుల వీసా విషయంలో ఇంగ్లండ్ ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది. దాంతో ముఖ్యంగా భారతదేశం నుంచి అక్కడకు వెళ్లే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లపై పెను ప్రభావం పడబోతోంది. టైర్ 2 ఇంట్రా కంపెనీ ట్రాన్స్‌ఫర్ (ఐసీటీ) విభాగంలో వీసా కోసం దరఖాస్తు చేసుకునేవాళ్లకు వేతనం దాదాపు రూ. 25 లక్షలు ఉండాలని చెప్పింది. ఇది ఇంతకుముందు రూ. 17.30 లక్షలుగా ఉండేది. ఇంట్రా కంపెనీ ట్రాన్స్‌ఫర్.. అంటే కంపెనీ తరఫున విదేశాల్లో పనిచేయడానికి వెళ్లేవారు. ఈ మార్గాన్ని భారతీయ ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉపయోగించుకుంటాయి. ఈ మార్గంలో వచ్చేవాళ్లలో దాదాపు 90 శాతం మంది భారతీయ ఐటీ కంపెనీల ఉద్యోగులే ఉంటున్నట్లు యూకే మైగ్రేషన్ అడ్వైజరీ కమిటీ (మ్యాక్) గుర్తించింది.
మూడు రోజుల పర్యటన కోసం బ్రిటిష్ ప్రధాని థెరెసా మే భారతదేశానికి రావడానికి సరిగ్గా మూడు రోజుల ముందే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది మన ఐటీ ఇంజనీర్లకు శరాఘాతంగా పరిణమిస్తుందని చెబుతున్నారు. వేతన పరిమితిని కేవలం టైర్ 2 ఐసీటీ విభాగానికే కాక ఇతర విభాగాలలో కూడా పెంచారు. టైర్ 2 (సాధారణ) ఉద్యోగులకు రూ. 20.80 లక్షల వేతనం ఉండాలని చెబుతూ, కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ట్రైనీలుగా వచ్చే టైర్ 2 (ఐసీటీ) గ్రాడ్యుయేట్ ట్రైనీల వేతన పరిమితి 19.14 లక్షలుగా నిర్ణయించారు. దాంతోపాటు ఒక్కో కంపెనీ ఏడాదికి కేవలం 20 మందిని మాత్రమే ఇలా తీసుకురావాలని నిబంధన విధించారు
భారతీయులు యూకే ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి, వారి నైపుణ్యాలను మెరుగుపరచాలని అనుకోవడం లేదని.. భారతదేశంలో నిపుణులైన ఐటీ ఉద్యోగులు సిద్ధంగా ఉండటమే ఇందుకు నిదర్శనమని మ్యాక్ నివేదిక తెలిపింది. పలు బహుళ జాతీయ కంపెనీలు భారతదేశంలో ఉన్నాయని.. యూకేలో ఉన్న వాటి శాఖల కంటే భారతదేశంలో ఉన్న శాఖల ద్వారా ఐటీ సేవలు అందించడంలో వాటికి పోటీలో సానుకూలత ఎక్కువగా ఉందని పేర్కొంది. వాళ్లు ఒక డెలివరీ మోడల్‌ను అభివృద్ధి చేసుకున్నారని, దాని ద్వారా భారతదేశంలోనే పనిచేస్తూ ప్రాజెక్టులు డెలివరీ చేస్తున్నారని తెలిపింది. ఒకే స్థాయి ఉద్యోగులు యూకేలో ఉన్నప్పటి కంటే భారతదేశంలో ఉంటే వాళ్ల జీతాలు తక్కువ కావడమే అందుకు కారణమని వివరించింది. భారతీయ ఐటీ కంపెనీలలో ఉద్యోగులకు శిక్షణ ఇవ్వగల సామర్థ్యం బాగుందని, వాళ్లు తమ సొంత దేశం వారి నైపుణ్యాలను బాగా పెంచుతున్నారని కూడా పేర్కొంది.
ఇదంతా చూస్తుంటే.. ఇంగ్లిష్ వారి కంటే భారతీయ ఐటీ నిపుణులకు సామర్థ్యం ఎక్కువని, ఇక్కడ శిక్షణ సదుపాయాలు బాగుండటం, జీతాలు కూడా తక్కువగా ఉండటంతో భారత్ నుంచి పనిచేస్తే వాళ్లకు ఖర్చులు తక్కువవుతున్నాయని.. అందువల్ల కంపెనీ మీద ఆర్థిక భారం తగ్గి లాభాలు ఎక్కువవుతున్నాయని ఇంగ్లండ్ భావిస్తున్నట్లుంది.
Advertisement
Advertisement