దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న వీసా తిరస్కరణల సంఖ్య
ఇందులో తెలుగు రాష్ట్రాల బాధితులూ ఎక్కువ సంఖ్యలోనే కరోనా తర్వాత కఠినంగా మారిన నిబంధనలు
వీసా తిరస్కరణలతో గత ఏడాది రూ.664 కోట్ల నష్టం
32.5% భారతీయ దరఖాస్తులకు నో చెప్పిన న్యూజిలాండ్ అదే క్రమంలో ఆస్ట్రేలియా, యూకే.. అమెరికా కాస్త నయం!
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యార్జన, ఉజ్వల భవిష్యత్తు కోసం, ఇతర కారణాలతో విదేశాలకు వెళ్లేవారు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోగా.. మరోవైపు వీసా తిరస్కరణ బాధితుల సంఖ్యా ఎక్కువగానే పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి వీసాలూ అధిక సంఖ్యలోనే తిరస్కరణకు గురవుతున్నాయి. దేశవ్యాప్తంగా వీసాల తిరస్కరణ కారణంగా గత ఏడాదిలో నష్టపోయిన మొత్తం రూ.660 కోట్ల పైమాటేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. పర్యాటకులను స్వాగతించే దేశంగా పేరున్న యూఏఈ వీసాలు పొందడంలో సైతం ఎదుర్కొన్న ఇబ్బందులను చాలామంది గత ఏడాది చివరిలో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
జనవరి నుంచి అక్టోబర్ 2024 మధ్యకాలంలో 24.8% మంది భారతీయలు యూఏఈని సందర్శించారు. భారతీయ పర్యాటకులకు అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానాలలో ఒకటిగా యూఏఈ ఉంది. అయితే కొంతకాలం క్రితం దుబాయ్ ఇమ్మిగేషన్ విభాగం ప్రవేశపెట్టిన కఠినమైన నిబంధనల కారణంగా భారీ స్థాయిలో వీసాలు తిరస్కరణలకు గురయ్యాయి. కోవిడ్ అనంతరం ఇతర అనేక దేశాలు కూడా తమ వీసా నిబంధనలను సవరించాయి. ఈ నేపథ్యంలో వీసాల తిరస్కరణ కారణంగా గత ఏడాది భారతీయులు రూ.664 కోట్లను నష్టపోయారని గణాంకాలు చెబుతున్నాయి.
తిలా పాపం తలా పిడికెడు
వీసా నిబంధనలు కఠినతరం చేసిన దేశాలలో యూఏఈతో పాటు ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, యూకే ప్రధానంగా ఉన్నాయి. గత ఏడాది న్యూజిలాండ్ 32.5 శాతం భారతీయ వీసా దరఖాస్తులను తిరస్కరించింది, ఆ్రస్టేలియా 29.3 శాతం, యూకే 17 శాతం మందిని తిరస్కరించాయి. స్కెంజెన్ ఏరియా (యూరప్) 15.7 శాతం వీసాల్ని తిరస్కరించింది. యూఏఈ భారతీయ వీసాల తిరస్కరణ రేటు గత ఏడాది 6 శాతానికి చేరుకుంది. అయితే 2019లో వీసా ఆమోదం రేట్లతో పోల్చనప్పుడు. 2024లో భారతీయుల కోసం అధిక శాతం వీసాలను ఆమోదించిన దేశంగా అమెరికా నిలిచింది. 2019లో 28 శాతం భారతీయ వీసా దరఖాస్తులను యూఎస్ తిరస్కరించగా, 2024లోకి వచ్చేసరికి ఇది 16 శాతానికి తగ్గింది. అయితే అమెరికా వెళ్లేందుకు మనవారి వీసా దరఖాస్తుల సంఖ్య పరంగా చూస్తే ఈ 16 శాతం కూడా ఎక్కువేనని నిపుణులు చెబుతున్నారు.
కోవిడ్ తర్వాత కఠినంగా..
ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, యూకే, యూఏఈ వంటి దేశాలు వీసా నిబంధనలను కఠినతరం చేయడం అనేది..కరోనా మహమ్మారి అనంతరం ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన వీసా దరఖాస్తుల సూక్ష్మస్థాయి పరిశీలన, ఎంపిక ధోరణిని ప్రతిబింబిస్తోంది. వీసాల తిరస్కరణ రేటు పెరుగుదల భారతీయ ప్రయాణీకులను ఆందోళనకు గురిచేస్తోంది. దరఖాస్తుదారులు.. తమకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు సరిగ్గానే ఉన్నాయని, తమ దరఖాస్తులు పూర్తి దోష రహితంగా ఉన్నాయని నిర్ధారించుకోవాల్సిన ఆవశ్యకతను ఈ పరిస్థితి స్పష్టం చేస్తోంది.
సర్వ సాధారణంగా మారిన తిరస్కరణలు
‘ఎంఫార్మ్ కోసం అమెరికా వీసాకు దరఖాస్తు చేస్తే రెండుసార్లు తిరస్కరణకు గురైంది. మరోసారి అప్లయ్ చేయబోతున్నా. ఇప్పటివరకు రూ.42 వేలు ఖర్చయ్యింది. నా స్నేహితుడు ఒకరికి 10 సార్లు వీసా నిరాకరించారు..’అని పంజాగుట్ట నివాసి ప్రవీణ్ చెప్పాడు. ఇక రెండుసార్లు, మూడుసార్లు వీసా తిరస్కరణలకు గురి కావడమనేది సర్వసాధారణంగా మారుతోంది. యూకేకి రూ.12 వేలు మొదలుకుని రూ.లక్ష పైగా వీసా దరఖాస్తు ఫీజులు ఉన్నాయి. అలాగే ఆ్రస్టేలియాకు రూ.4 వేల నుంచి రూ.60 వేలు వరకూ, న్యూజిలాండ్‌కు రూ.11 వేల నుంచి రూ.1.15లక్షల వరకూ, యూఏఈకి రూ.8 వేల నుంచి రూ.35 వేలు ఆపైన ఉన్నాయి.
అమెరికాకు రూ.20 వేల వరకూ వీసా ఫీజులు ఉన్నాయి. అయితే వెళ్లే కారణాన్ని బట్టి, వీసా పొందడానికి ఎంచుకున్న విధానాన్ని బట్టి ఈ ఫీజులు ఇంతకంటే పెరగవచ్చు కూడా. ‘మా అబ్బాయి అమెరికా వీసాకి మొదటిసారి రూ.70 వేల దాకా పెట్టిన ఖర్చు వృథా అయ్యింది. రెండవసారి దాదాపు అంతే ఖర్చు పెట్టి వీసా తెచ్చుకున్నాం..’అని మల్కాజిగిరికి చెందిన లక్ష్మి చెప్పారు. మొత్తంగా చూస్తే వీసా తిరస్కరణల కారణంగా పెద్ద మొత్తంలోనే నష్టం జరుగుతోందనేది నిర్వివాదాంశం. ఈ నేపథ్యంలో వీసా నిబంధనలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని, డాక్యుమెంట్లన్నీ పూర్తి కచ్చితత్వంతో ఉండేలా చూసుకున్న తర్వాతే దరఖాస్తు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment