rejection
-
వీసా కష్టం.. పైసా నష్టం..
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యార్జన, ఉజ్వల భవిష్యత్తు కోసం, ఇతర కారణాలతో విదేశాలకు వెళ్లేవారు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోగా.. మరోవైపు వీసా తిరస్కరణ (Visa Reject) బాధితుల సంఖ్యా ఎక్కువగానే పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి వీసాలూ అధిక సంఖ్యలోనే తిరస్కరణకు గురవుతున్నాయి. దేశవ్యాప్తంగా వీసాల తిరస్కరణ కారణంగా గత ఏడాదిలో నష్టపోయిన మొత్తం రూ.660 కోట్ల పైమాటేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. పర్యాటకులను స్వాగతించే దేశంగా పేరున్న యూఏఈ వీసాలు పొందడంలో సైతం ఎదుర్కొన్న ఇబ్బందులను చాలామంది గత ఏడాది చివరిలో సోషల్ మీడియా (Social Media) వేదికగా పంచుకున్నారు.జనవరి నుంచి అక్టోబర్ 2024 మధ్యకాలంలో 24.8% మంది భారతీయలు (Indians) యూఏఈని సందర్శించారు. భారతీయ పర్యాటకులకు అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానాలలో ఒకటిగా యూఏఈ (UAE) ఉంది. అయితే కొంతకాలం క్రితం దుబాయ్ ఇమ్మిగేషన్ విభాగం ప్రవేశపెట్టిన కఠినమైన నిబంధనల కారణంగా భారీ స్థాయిలో వీసాలు తిరస్కరణలకు గురయ్యాయి. కోవిడ్ అనంతరం ఇతర అనేక దేశాలు కూడా తమ వీసా నిబంధనలను సవరించాయి. ఈ నేపథ్యంలో వీసాల తిరస్కరణ కారణంగా గత ఏడాది భారతీయులు రూ.664 కోట్లను నష్టపోయారని గణాంకాలు చెబుతున్నాయి. తిలా పాపం తలా పిడికెడువీసా నిబంధనలు కఠినతరం చేసిన దేశాలలో యూఏఈతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే ప్రధానంగా ఉన్నాయి. గత ఏడాది న్యూజిలాండ్ 32.5 శాతం భారతీయ వీసా (Indian Visa) దరఖాస్తులను తిరస్కరించింది, ఆస్ట్రేలియా 29.3 శాతం, యూకే 17 శాతం మందిని తిరస్కరించాయి. స్కెంజెన్ ఏరియా (యూరప్) 15.7 శాతం వీసాల్ని తిరస్కరించింది. యూఏఈ భారతీయ వీసాల తిరస్కరణ రేటు గత ఏడాది 6 శాతానికి చేరుకుంది. అయితే 2019లో వీసా ఆమోదం రేట్లతో పోల్చనప్పుడు. 2024లో భారతీయుల కోసం అధిక శాతం వీసాలను ఆమోదించిన దేశంగా అమెరికా నిలిచింది. 2019లో 28 శాతం భారతీయ వీసా దరఖాస్తులను యూఎస్ తిరస్కరించగా, 2024లోకి వచ్చేసరికి ఇది 16 శాతానికి తగ్గింది. అయితే అమెరికా వెళ్లేందుకు మనవారి వీసా దరఖాస్తుల సంఖ్య పరంగా చూస్తే ఈ 16 శాతం కూడా ఎక్కువేనని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ తర్వాత కఠినంగా..ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, యూఏఈ వంటి దేశాలు వీసా నిబంధనలను కఠినతరం చేయడం అనేది..కరోనా మహమ్మారి అనంతరం ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన వీసా దరఖాస్తుల సూక్ష్మస్థాయి పరిశీలన, ఎంపిక ధోరణిని ప్రతిబింబిస్తోంది. వీసాల తిరస్కరణ రేటు పెరుగుదల భారతీయ ప్రయాణీకులను ఆందోళనకు గురిచేస్తోంది. దరఖాస్తుదారులు.. తమకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు సరిగ్గానే ఉన్నాయని, తమ దరఖాస్తులు పూర్తి దోష రహితంగా ఉన్నాయని నిర్ధారించుకోవాల్సిన ఆవశ్యకతను ఈ పరిస్థితి స్పష్టం చేస్తోంది.సర్వ సాధారణంగా మారిన తిరస్కరణలు‘ఎంఫార్మ్ కోసం అమెరికా వీసాకు దరఖాస్తు చేస్తే రెండుసార్లు తిరస్కరణకు గురైంది. మరోసారి అప్లయ్ చేయబోతున్నా. ఇప్పటివరకు రూ.42 వేలు ఖర్చయ్యింది. నా స్నేహితుడు ఒకరికి 10 సార్లు వీసా నిరాకరించారు..’అని పంజాగుట్ట నివాసి ప్రవీణ్ చెప్పాడు. ఇక రెండుసార్లు, మూడుసార్లు వీసా తిరస్కరణలకు గురి కావడమనేది సర్వసాధారణంగా మారుతోంది. యూకేకి రూ.12 వేలు మొదలుకుని రూ.లక్ష పైగా వీసా దరఖాస్తు ఫీజులు ఉన్నాయి. అలాగే ఆ్రస్టేలియాకు రూ.4 వేల నుంచి రూ.60 వేలు వరకూ, న్యూజిలాండ్‌కు రూ.11 వేల నుంచి రూ.1.15లక్షల వరకూ, యూఏఈకి రూ.8 వేల నుంచి రూ.35 వేలు ఆపైన ఉన్నాయి.చదవండి: ఆర్జీకర్ ఘటన అందుకే ‘అరుదైన కేసు’ కాలేకపోయింది!అమెరికాకు రూ.20 వేల వరకూ వీసా ఫీజులు ఉన్నాయి. అయితే వెళ్లే కారణాన్ని బట్టి, వీసా పొందడానికి ఎంచుకున్న విధానాన్ని బట్టి ఈ ఫీజులు ఇంతకంటే పెరగవచ్చు కూడా. ‘మా అబ్బాయి అమెరికా వీసాకి మొదటిసారి రూ.70 వేల దాకా పెట్టిన ఖర్చు వృథా అయ్యింది. రెండవసారి దాదాపు అంతే ఖర్చు పెట్టి వీసా తెచ్చుకున్నాం..’ అని మల్కాజిగిరికి చెందిన లక్ష్మి చెప్పారు. మొత్తంగా చూస్తే వీసా తిరస్కరణల కారణంగా పెద్ద మొత్తంలోనే నష్టం జరుగుతోందనేది నిర్వివాదాంశం. ఈ నేపథ్యంలో వీసా నిబంధనలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని, డాక్యుమెంట్లన్నీ పూర్తి కచ్చితత్వంతో ఉండేలా చూసుకున్న తర్వాతే దరఖాస్తు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. -
తమిళనాడులో దారుణం.. పెళ్లికి ఒప్పుకోలేదని..
చెన్నై: తమిళనాడులో దారుణం వెలుగుచూసింది. తంజావూర్ జిల్లాలో ప్రభుత్వ టీచర్‌పై ఓ ప్రేమోన్మాదా దాడికి తెగబడ్డాడు.తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో క్లాస్‌రూమ్‌లో ఆమెను కత్తితో పొడిచి చంపాడు. దీంతో యువతి అక్కడికక్కడే మృతిచెందింది.వివరాలు..మల్లిపట్టణం ప్రభుత్వ పాఠశాలలో రమణి అనే యువతి(26) టీచర్‌గా చేస్తోంది. కొంతకాలంగా మధన్ అనే వ్యక్తి రమణిని ప్రేమిస్తున్నానంటూ వెంటబడుతున్నాడు. ఇటీవల రమణి, మధన్ కుటుంబాలు వారి వివాహం గురించి చర్చలు జరిపారు. కానీ రమణి ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో మనస్తాపం చెందిన మధన్.. యువతి పనిచేస్తున్నపాఠశాలకు వెళ్లిన పదునైన ఆయుధంతో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన యువతిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మదన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వ్యక్తిగత కక్షతోనే హత్యకు పాల్పడిట్లు పోలీసులు పేర్కొన్నారు. -
‘ఈ– పంట’ సాగేదెలా?
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తెచి్చన మంచి కార్యక్రమాలన్నింటినీ చీల్చి ఛిద్రం చేయడమే లక్ష్యంగా పెట్టుకొన్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలి్పంచే ‘ఈ–క్రాప్’ కార్యక్రమాన్ని కూడా చిన్నాభిన్నం చేసేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం 2019లో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఐదేళ్లూ నిరాఘాటంగా సాగి, అన్నదాతలకు అండగా నిలిచింది.రెండు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు దీని పేరును ‘ఈ–పంట’ అని మార్చి, దాని నమోదులోనూ మార్పులు తెచ్చింది. ఇప్పుడు ఈ మార్పులే రైతులపాలిట శాపంగా మారాయి. కొత్త ప్రభుత్వం ఫొన్ యాప్ ద్వారా పంటల వివరాల నమోదుకు అంగీకరించడంలేదు. అప్డేట్ చేసిన ఈ–పంట వెబ్సైట్ సాంకేతిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. దీనికి తోడు రైతు సేవా కేంద్రం (ఆర్బీకే)లోని సిస్టమ్ ద్వారా మాత్రమే పంట వివరాలు నమోదు చేయాలన్న నిబంధన మరిన్ని సమస్యలు సృష్టిస్తోంది. వెబ్సైట్ ఓపెన్ కాక ఇబ్బందులు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి జాతీయ స్థాయిలో కేంద్రం శ్రీకారం చుట్టిన డిజిటల్ క్రాప్ సర్వేకు అనుసంధానం చేసి ఈ పంట నమోదు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 31న మార్గదర్శకాలు జారీ చేసి, ఈ నెల 5 నుంచి పంటల నమోదు చేపట్టింది. ఈ పంట వెబ్సైట్ పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు. యాప్‌లో కొత్త ఫీచర్స్పై క్షేత్ర స్థాయి సిబ్బందికి శిక్షణా ఇవ్వలేదు. గతంలో ఫోన్లోనే ఈ–క్రాప్ యాప్ ద్వారా పంట వివరాలు నమోదు చేసేవారు. ఆ తర్వాత క్షేత్ర స్థాయి పరిశీలనలో ఫోటోలు అప్లోడ్ చేసేవారు. దీని వల్ల సమయం ఆదా అయ్యేది.ప్రస్తుతం ఈ పంట వివరాలు ఫోన్లో నమోదు చేయడానికి ప్రభుత్వం అంగీకరించడంలేదు. కార్యాలయం కంప్యూటర్లోని వెబ్సైట్ ద్వారా మాత్రమే వివరాలు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ వివరాలను కంప్యూటర్ నుంచి ఫోన్లోని యాప్‌లో డౌన్లోడ్ చేసుకొని క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాలి. రైతు సేవా కేంద్రాల్లో ఇంటర్నెట్, విద్యుత్ సరఫరా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అసలు కంప్యూటర్లో ఈ పంట వెబ్సైట్ ఓపెన్ అవడమే చాలా కష్టం. అది ఓపెన్ అయిన తర్వాత పంట వివరాలు నమోదు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఒక్కో రైతు పంట వివరాల నమోదుకు చాలా సమయం పడుతోంది. పైగా పంట వివరాల నమోదుకే రోజంతా కార్యాలయంలోనే ఉండాల్సి వస్తోందని, క్షేత్ర స్థాయి పరిశీలన ఎప్పుడు పూర్తి చేస్తామని సిబ్బంది వాపోతున్నారు. కంప్యూటర్లో నుంచి మళ్లీ ఎలాగూ ఫోన్లోకి తీసుకోవాలని, అప్పుడు నేరుగా ఫోన్లోనే వివరాలు నమోదు చేసుకోవచ్చు కదా అన్న సూచనలూ వస్తున్నాయి. మరోపక్క కౌలుదారుల పంట వివరాల నమోదులోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సీసీఆర్సీ లేదా భూ యజమాని అంగీకారంతోనే నమోదుకు అవకాశం ఉంది. కానీ ఉన్నతాధికారులు వాస్తవ సాగు దారుల వివరాలు నమోదు చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. అలా చేస్తే భూ యజమానుల నుంచి ఇబ్బందులు తలెత్తుతున్నాయని కౌలుదారులు వాపోతున్నారు. మరొక వైపు సిబ్బందికి ఇచి్చన ట్యాబ్‌లు కూడా సరిగా పనిచేయడంలేదు. దీంతో క్షేత్ర స్థాయి పరిశీలనలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గడువులోగా పూర్తయ్యేనా? రైతుల నుంచి పంట వివరాలు సేకరించాక పొలం వద్దకు వెళ్లి జియోఫెన్సింగ్‌తో సహా పంట ఫోటోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేయాలి. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో జియో కోఆర్డినేట్స్‌తో సహా ఎల్పీ నంబరు వివరాలు నమోదు చేయాలి. ఆర్బీకే సిబ్బంది, వీఆర్వోల ధ్రువీకరణ పూర్తి కాగానే రైతుల ఈ కేవైసీ నమోదు చేసి రైతులకు డిజిటల్, ఫిజికల్ రసీదులు ఇవ్వాలి. గతేడాది మాదిరిగానే సెపె్టంబర్ 15వ తేదీలోగా ఈ పంట నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. 19 నుంచి 24వ తేదీ వరకు సోషల్ ఆడిట్ కింద ఆర్ఎస్కేలలో ప్రదర్శిస్తారు.రైతుల నుంచి వచ్చే అభ్యంతరాలను 25 నుంచి 28వ తేదీ వరకు పరిష్కరిస్తారు. తుది జాబితాలను 30వ తేదీన ఆర్ఎస్కేలలో ప్రదర్శించాలని నిర్ణయించారు. అయితే, ఈ పంట నమోదులో ఉన్న గందరగోళ పరిస్థితుల మధ్య గడువులోగా పంటల నమోదు పూర్తవుతుందా! అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ జగన్ హయాంలో పక్కా ప్రణాళికతో ఈ–పంట నమోదు వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 2019 రబీ నుంచి ఈ–క్రాప్ నమోదుకు శ్రీకారం చుట్టింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సౌజన్యంతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాప్‌లో వెబ్‌ల్యాండ్, సీసీఆర్సీ (పంట సాగు హక్కుపత్రం) డేటా ఆధారంగా జాయింట్ అజమాయిషీ కింద పంట వివరాలు నమోదు చేసేవారు. ఏటా ఖరీఫ్‌లో జూలై మొదటి వారంలో మొదలు పెట్టి సెప్టెంబర్ నెలాఖరుకల్లా పూర్తిచేసేవారు.సోషల్ ఆడిట్ అనంతరం అక్టోబర్ రెండో వారంలోగా తుది జాబితాలు ప్రదర్శించేవారు. రబీ సీజన్లో నవంబర్ మొదటి వారంలో శ్రీకారం చుట్టి జనవరి నెలాఖరులోగా పూర్తి చేసేవారు. ఫిబ్రవరి రెండో వారంలోగా తుది జాబితాలు ప్రదర్శించేవారు. కానీ ఈసారి ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు పూర్తయినా, 40 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నా ఇప్పటివరకు కనీసం 10 శాతం పంటలు కూడా నమోదు కాని దుస్థితి. ఆలస్యమైతే జరిగే నష్టమిది..ఈ క్రాప్ నమోదు ఆలస్యమైతే రైతులకు అన్ని విధాలుగా నష్టం జరుగుతుంది. ప్రధానంగా పంట కొనుగోలులో తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. పంట కోనుగోలు పూర్తిగా ఈ–పంట నమోదు ఆధారంగానే జరుగుతుంది. దీంతో రైతులు దళారుల ద్వారా పంటలను అమ్ముకోవల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఉచిత పంటల బీమాకు అర్హత కోల్పోతారు. తుపానులు, భారీ వర్షాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంట రైతులు ఈ–క్రాప్‌లో నమోదు కాకపోతే ఇన్పుట్ సబ్సిడీ పొందే అర్హత కోల్పోతారు. సున్నా వడ్డీ రాయితీకి అర్హత కోల్పోతారు. ఈ –క్రాప్‌తో ఐదేళ్లలో రైతులకు జరిగిన మేలు.. గడిచిన ఐదేళ్లలో 8.24 కోట్ల ఎకరాల్లో సాగైన పంటల వివరాలు నమోదు కాగా, ఈ–క్రాప్ ప్రామాణికంగా వివిధ రకాల సంక్షేమ ఫలాలు అందించారు. 75.82 లక్షల మందికి రూ.1,373 కోట్ల సబ్సిడీతో కూడిన 45.16 లక్షల టన్నుల విత్తనాలు, 15 లక్షల మందికి రూ.14 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగుల మందులు, 176.36 లక్షల టన్నుల ఎరువులు అందాయి. 5.13 కోట్ల మంది రైతులకు రూ.8.37 లక్షల కోట్ల పంట రుణాలు లభించాయి. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా 3 విడతల్లో రూ.13,500 చొప్పున 53.58 లక్షల మందికి రూ.34,288 కోట్ల పెట్టుబడి సాయం అందింది. 54.58 లక్షల మందికి రూ.7,802.05 కోట్ల పంటల బీమా పరిహారం, 30.85 లక్షల మందికి రూ.3,411 కోట్ల పెట్టుబడి రాయితీ, 84.67 లక్షల మందికి రూ.2051 కోట్ల సున్నా వడ్డీ రాయితీలు అందాయి. రైతులు పండించిన పంటల విక్రయం సాఫీగా సాగి, ప్రతి పంటకీ మద్దతు ధర లభించింది. -
NEET-UG 2024: నీట్ కౌన్సెలింగ్ వాయిదాకు సుప్రీం నో
సాక్షి, న్యూఢిల్లీ: జూలై 6 నుంచి జరగాల్సిన నీట్ యూజీ కౌన్సెలింగ్‌ను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నీట్ పరీక్షలో అక్రమాలపై దర్యాప్తు కోరుతూ దాఖలైన ప్రధాన పిటిషన్లపై విచారణను కోర్టు ఇప్పటికే జూలై 8కి వాయిదా వేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్‌ను కూడా ఆ తేదీ దాకా వాయిదా వేయాలని పిటిషనర్లు కోరారు. జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీతో కూడిన వెకేషన్ బెంచ్ శుక్రవారం అందుకు నిరాకరించింది. విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేసింది. -
హిందుస్తాన్ జింక్ విభజనకు కేంద్రం నో...
న్యూఢిల్లీ: ప్రమోటర్ గ్రూప్.. వేదాంతా ప్రతిపాదిత హిందుస్తాన్ జింక్ కంపెనీ విభజనకు గనుల శాఖ నో చెప్పింది. హిందుస్తాన్ జింక్‌ను రెండు విభిన్న సంస్థలుగా విడదీసేందుకు వేదాంతా గ్రూప్ చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు మైన్స్ సెక్రటరీ వీఎల్ కాంతారావు తాజాగా వెల్లడించారు. వాటాదారుగా కంపెనీ ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యంగా లేదని తెలియజేశారు. వెరసి విభజన ప్రతిపాదనను అంగీకరించలేదని స్పష్టం చేశారు. కంపెనీలో ప్రభుత్వం 29.54 శాతం వాటాతో అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)ను పెంచుకునే బాటలో జింక్, సిల్వర్‌సహా బిజినెస్‌లను రెండు ప్రత్యేక కంపెనీలుగా ఏర్పాటు చేసేందుకు హిందుస్తాన్ జింక్ ఇంతక్రితం ప్రతిపాదించింది. కాగా.. బిజినెస్‌ల విభజనకు సలహాదారు సంస్థను నియమించుకునే యోచనలో ఉన్నట్లు గతంలో హిందుస్తాన్ జింక్ ప్రకటించింది. కంపెనీ విలువను మెరుగుపరచేందుకు కార్పొరేట్ నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో సమీక్షించేందుకు బోర్డు నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. జింక్, లెడ్, సిల్వర్, రీసైక్లింగ్ బిజినెస్‌లను రెండు చట్టబద్ధ కంపెనీలుగా ఏర్పాటు చేయనున్నట్లు ఇంతక్రితం నియంత్రణ సంస్థలకు తెలియజేసింది. -
జానారెడ్డి సహా పలువురి నామినేషన్ల తిరస్కరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. నల్లగొండ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కాగా.. వాటిలో చాలావరకు నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు తెలుస్తోంది. నాగార్జున సాగర్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ నేత జానారెడ్డి తనయుడు జైవీర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే జానారెడ్డి నామమాత్రంగా నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ తెలంగాణలో ఎన్నికల నామినేషన్ల పరిశీలన జరగ్గా.. జానారెడ్డి దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీనితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడలో 2 నామినేషన్ల తిరస్కరణకు గురయ్యాయి. అటు కరీంనగర్ మానకొండూరులోనూ ఏడుగురి నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి 21మంది అభ్యర్థులు నామినేషన్ లు దాఖలు చేయగా.. 18మంది అభ్యర్థుల నామినేషన్ లు ఆమోదం పొందాయి. సరైన పత్రాలు లేకపోవడంతో ముగ్గురి నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి 22 నామినేషన్లు దాఖలు కాగా 7 నామినేషన్లు తిరస్కరణ బరిలో 15 మంది అభ్యర్థులు కామారెడ్డి జిల్లా మొత్తం 19 మందికి గాను పరిశీలనలో 2 పోగా 17 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. జుక్కల్ ఎన్నికల బరిలో 23 మంది అభ్యర్థులు. పరిశీలనలో 5 గురు అభ్యర్థుల నామినేషన్ రిజెక్ట్ చేసిన అధికారులు. 28 నామినేషన్లకు గాను 23 మంది నామినేషన్లు ఆమోదించిన రిటర్నింగ్ అధికారి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఇల్లందులలో 34 మంది అభ్యర్థుల నామినేషన్లు దాఖలు పరిశీలనలో నలుగురు అభ్యర్థుల తొలగింపు ఖమ్మం జిల్లా: పాలేరు నియోజకవర్గం నుంచి దాఖలైన నామినేషన్ లు 58 రిజెక్ట్ చేసినవి ఐదు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు 53 మంది అభ్యర్థులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో మొత్తం దాఖలైన 25 మంది అభ్యర్థులు నామినేష్లను ముగ్గురు అభ్యర్థుల నామినేష్లను తిరస్కరించిన అధికారులు బరిలో 23మంది అభ్యర్థులు ఖమ్మం జిల్లా: సత్తుపల్లి నియోజకవర్గంలో మొత్తం 41నామినేషన్లు దాఖలు తిరస్కరణకు గురైన 6 నామినేషన్లు పోటీలో 25 మంది అభ్యర్థులు సూర్యాపేట జిల్లా : సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గానికి 42 మంది అభ్యర్థులు 81 నామినేషన్లు దాఖలు నామినేషన్ల పరిశీలనలో భాగంగా 10 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ జోగులాంబ గద్వాల జిల్లా: గద్వాల అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా దరఖాస్తు చేసిన నామినేషన్లలో 20 దరఖాస్తులకు ఆమోదం, 5 నామినేషన్ లు సరైన డాక్యుమెంట్ లేని కారణంగా తిరస్కరించిన జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి నిర్మల్ నియోజకవర్గం: మూడు నామినేషన్లు తిరస్కరించిన రిటర్నింగ్ అధికారి ఎన్నికల బరిలో పదేహేను మంది అభ్యర్థులు నారాయణపేట జిల్లా మక్తల్ లో మొత్తం 15 నామినేషన్లలో మూడు నామినేషన్లు తిరస్కరణ. నామినేషన్ల పరిశీలనలో BSP అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ రాష్ట్ర వ్యాప్తంగా 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో BSP అభ్యర్థుల తిరస్కరణ స్టేషన్ ఘనపూర్, ఆలేరు, పాలకుర్తి, మధిర, భువనగిరి, బహదూర్ పుర, జనగామ సెగ్మెంట్ల అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరించిన RO లు ఆదిజలాబాద్ జిల్లా: ఖానాపూర్ నియోజకవర్గంలో నామినేషన్లు దాఖలు చేసిన 17 మంది వివిధ కారణాలతో 4 గురు రిజెక్ట్ బరిలో మొత్తం 13 మంది అభ్యర్థులు కరీంనగర్ జిల్లా: చొప్పదండి నియోజకవర్గంలో 18మంది అభ్యర్థుల నామినేషన్లు దాఖలు.. లింగాల లచ్చయ్య అనే స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ తిరస్కరించిన ఎన్నికల అధికారులు. పెద్దపల్లి జిల్లా: మంథని అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్లు దాఖలు చేసిన 28 మంది అభ్యర్థులు.. నలుగురి నామినేషన్ల తిరస్కరణ. కరీంనగర్ జిల్లా: కరీంనగర్ అసెంబ్లీలో ఏడుగురి నామినేషన్ల తిరస్కరణ.. 31 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం. హుజూరాబాద్ అసెంబ్లీలో ఏడుగురి నామినేషన్ల తిరస్కరణ.. 13 మంది అభ్యర్థుల నామినేషన్ల ఆమోదం. పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో పూర్తయిన నామినేషన్ల పరిశీలన ప్రక్రయ. మొత్తం దాఖలైన నామినేషన్లు 30. తిరస్కరణకు గురైన నామినేషన్లు 5. పోటీలో నిలిచిన అభ్యర్థులు 25 మంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి 16 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా ఇద్దరి నామినేషన్లను తిరస్కరించిన ఎన్నికల అధికారులు కామారెడ్డి జిల్లా: కామారెడ్డి నియోజక వర్గంలో ఎన్నికల బరిలో 58 మంది అభ్యర్థులు. 6 గురు అభ్యర్థుల నామినేషన్ రిజెక్ట్ చేసిన అధికారులు. 64 నామినేషన్లకు గాను 58 మంది నామినేషన్లు ఆమోదించిన రిటర్నింగ్ అధికారి. వరంగల్: వర్ధననపేట నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి 26 మంది 40సేట్ల నామినేషన్ దాఖలు 6 నామినేషన్ల తిరస్కరణ.. 20 మంది నామినేషన్లు అమోదం తెలిపిన ఎన్నికల ఆధికారి... వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 38 మంది అభ్యర్థులు 51 సెట్లు నామినేషన్ దాఖలు 31 నామినేషన్లను ఆమోదించగా.. ఆరు నామినేషన్లు తిరస్కరణ జనగామ జిల్లా: జనగామ అసెంబ్లీ నియోజకవర్గానికి 32 నామినేషన్లు దాఖలు 5 నామినేషన్ల తిరస్కరణ బరిలో 27 మంది అభ్యర్థులు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో మొత్తం 28 మంది అభ్యర్థులలో 5 మంది అభ్యర్థుల నామినేషన్ తిరస్కరించిన ఎన్నికల అధికారి స్టేషన్ ఘనపూర్ లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా జానకిపురం సర్పంచ్ నవ్య నామినేషన్ ఆమోదించిన ఎన్నికల అధికారి. ములుగు జిల్లా ములుగు నియోజకవర్గంలో మొత్తం 18 మంది 28 సెట్లను నామినేషన్ దాఖలు చేయగా ఇద్దరు అభ్యర్థుల నామినేషన్ తిరస్కరించిన ఎన్నికల అధికారి వరంగల్ జిల్లా: ముగిసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ. ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం. వరంగల్ తూర్పులో 31 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం. పరకాలలో 36 మంది నామినేషన్లకు ఆమోదం. వర్ధన్నపేటలో 20 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం. నర్సంపేటలో 19 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం. జనగామలో 27 మంది అభ్యర్థులకు ఆమోదం. పాలకుర్తిలో 22 మంది నామినేషన్లకు ఆమోదం. స్టేషన్ ఘనపూర్ లో 23 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం. ములుగులో 16 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం. భూపాలపల్లిలో 25 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం. మహబూబాబాద్ లో 15 మంది నామినేషన్లకు ఆమోదం. డోర్నకల్ నుండి 17 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం. వరంగల్ పశ్చిమలో 20మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం. ఇదీ చదవండి: రేవంత్‌పై తెలంగాణ సీఈవోకు ఫిర్యాదు.. బీఆర్ఎస్ వ్యతిరేక యాడ్స్‌పై కాంగ్రెస్ రియాక్షన్ ఇది -
ఉద్యోగానికి అప్లయ్ చేస్తే.. ఇదేందయ్యా ఇది, ఎక్కడా సూడ్లా!
ఏదైనా ఉద్యోగానికి అప్లయ్ చేసుకోవడం, సంబంధిత సంస్థల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం కామన్. మన ప్రొఫైల్ నచ్చకపోయినా, వారి రిక్వైర్‌మెంట్‌కు తగినట్టుగా లేకపోయినా జాబ్ రాదు. అయితే చాలావరకు ఐటీ కంపెనీలు మిమ్మల్ని సెలెక్ట్ చేయలేదు సారీ అనే మెయిల్స్ కూడా చూశాం. తాజాగా సిలికాన్ వ్యాలీకంపెనీ చేసిన పని ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. రెడ్డిట్ యూజర్ షేర్ చేసిన కథనం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. సిలికాన్ వ్యాలీ-ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ సీక్రెట్ సుషీ ఉద్యోగం అప్లయ్ చేసిన వారిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇటీవల ఒక మహిళా ఉద్యోగ అభ్యర్థికి తిరస్కరణ లేఖతో పాటు అమెజాన్ గిఫ్ట్ కార్డ్‌ను పంపింది. దీంతో ఎంత దయగల కంపెనీ అనే ప్రశంసలు దక్కించుకుంది. మేల్విచ్ స్క్వేర్ అనే Reddit వినియోగదారు 'రిక్రూటింగ్హెల్' సబ్‌రెడిట్‌లో తన అనుభవాన్ని పంచుకున్నారు. మేనేజర్ జాబ్‌కోసం ఆమె దరఖాస్తు చేశారు. ఇంటర్వ్యూలు ఫేస్ చేశారు. ఆ తరువాత ప్రతి రోజు, ఆమె తన ఇన్‌బాక్స్‌ను ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే అనుకోకుండా సీక్రెట్ సుషీ నుండి అందుకున్న దరఖాస్తుదారునికి ధన్యవాదాలు తెలుపుతూ, సెలెక్ట్ చేయలేదని చెప్తూనే,గిఫ్ట్ వోచర్ సెండ్చేసింది. ఈ తిరస్కరణ ఇమెయిల్ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేసింది. దీంతోపాటు తనకొచ్చిన 7 డాలర్లు గిఫ్ట్ వోచర్ ను కూడా షేర్ చేస్తూ.. " మర్చిపోలేని అత్యుత్తమ తిరస్కరణ" అంటూ పోస్ట్‌పెట్టారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. -
టీడీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్ల తిరస్కరణ
మదనపల్లె: ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లు, పుంగనూరులలో ఆగస్టు 4న చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన అల్లర్ల ఘటనలో నమోదైన కేసులకు సంబంధించి పరారీలో ఉన్న 13 మంది టీడీపీ నేతలు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తూ రెండో ఏడీజే కోర్టు న్యాయమూర్తి అబ్రహాం గురువారం తీర్పునిచ్చారు. అంగళ్లు, పుంగనూరు ఘటనలకు సంబంధించి నమోదైన కేసుల్లో 106 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి బెయిల్ పిటిషన్లను ఇదివరకే కోర్టు తిరస్కరించింది. కాగా, అరెస్ట్ కాకుండా అజ్ఞాతంలో ఉన్న 13 మంది ముందస్తు బెయిల్‌కు సంబంధించి ఆగస్టు 29న రెండో ఏడీజే కోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును 31వ తేదీకి వాయిదా వేశారు. చదవండి: బాబు ష్యూరిటీనా.. నమ్మేదెలా? -
వార్షిక కౌలుపై పిటిషన్ తిరస్కరణ
సాక్షి, అమరావతి: వార్షిక కౌలు చెల్లింపు వ్యవహారంపై అత్యవసర విచారణ జరపాలన్న రాజధాని రైతుల అభ్యర్థనను హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి ధర్మాసనం ముందు రైతుల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు బుధవారం ఈ అభ్యర్థన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వార్షిక కౌలు చెల్లించడంలేదని, దీనిపై తాము సింగిల్ జడ్జి ముందు పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. సింగిల్ జడ్జి ప్రభుత్వానికి, సీఆర్డీఏకు నోటీసులు మాత్రమే జారీ చేశారని చెప్పారు. ఈ నేపథ్యంలో తాము అప్పీల్ దాఖలు చేయాలని అనుకుంటున్నామని, దీనిపై అత్యవసర విచారణ జరపాలని అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈ వ్యవహారాన్ని సింగిల్ జడ్జి ముందే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి నోటీసులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేసింది. సింగిల్ జడ్జి ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయనప్పుడు దేనిపై అప్పీల్ దాఖలు చేస్తారని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో తాము ఏ విధంగానూ జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. -
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. అరెస్ట్‌ను ఏబీసీ కోర్టు రిజక్ట్ చేయడంపై సైబరాబాద్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. మేజిస్ట్రేట్ తప్పుడు ప్రొసీజర్‌ను అనుసరించారని అభియోగం. ఇవాళ మధ్యాహ్నం హౌస్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది. చదవండి: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు.. జాతీయ మీడియా ముందుకు ఆధారాలు! కాగా, ‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర’ వ్యవహారంలో రెడ్ హ్యాండెడ్‌గా నగదు పట్టుబడనందున ఈ కేసు అవినీతి నిరోధక చట్టం కిందకు రాదని హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్‌కు పంపాలంటూ పోలీసులు దాఖలు చేసిన రిపోర్టును తిరస్కరించారు. నిందితులను విడుదల చేయాలని.. వారికి సీఆర్పీసీ సెక్షన్ 41 ప్రకారం నోటీసులు జారీ చేసి విచారించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో నిందితులు కొనుగోలు సంప్రదింపులు జరిపిన ఆడియో, వీడియో ఫుటేజీలు ఉన్నాయని పోలీసులు విన్నవించినా దీనిని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదని తెలిసింది. -
‘పాలమూరు–2’ అనుమతులకు నో
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు రెండో దశకు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేసేందుకు కేంద్ర పర్యవరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ(ఎంఓఈఎఫ్) నిరాకరించింది. పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ) నోటిఫికేషన్–2006 నిబంధనలను ప్రాజెక్టు ఉల్లంఘించిందని నిర్ధారించింది. ఈ నేపథ్యంలో 2021 జూలైలో జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్ఓపీ) ఆధారంగా పర్యావరణ ఉల్లంఘనలతో జరిగిన నష్టంపై అధ్యయనం జరిపించాలని నిర్ణయించింది. పర్యావరణ శాఖ ఉల్లంఘనల కమిటీ మాజీ సభ్యుడు కె.గౌరప్పన్కు అధ్యయనం జరిపి నివేదిక సమర్పించే బాధ్యతలు అప్పగించింది. కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) ఇటీవల సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. చదవండి: వైద్య నోటిఫికేషన్లు వాయిదా!.. ఆలస్యానికి కారణం ఇదే బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలి.. పర్యావరణ అనుమతుల జారీకి ముందు రాష్ట్ర ప్రభుత్వం.. నష్ట నివారణ ప్రణాళిక, ప్రకృతి, ప్రాంతీయ వనరుల వృద్ధి ప్రణాళికల అమలుకు అవసరమైన నిధులకు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుందని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఎంత మొత్తానికి గ్యారెంటీ ఇవ్వాలో తామే సిఫారసు చేస్తామని, రెగ్యూలేటరీ ఆథారిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. ఈ ప్రణాళికలను అమలు చేశాకే బ్యాంకు గ్యారెంటీలను విడుదల చేయాల్సి ఉంటుందని సూచించింది. గాలి, నీరు, భూమి, ఇతర పర్యావరణ అంశాలకు ప్రాజెక్టు వల్ల జరిగిన నష్టంపై అధ్యయనం జరిపించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పర్యావరణ చట్టం కింద నోటిఫై చేసిన పర్యావరణ ల్యాబ్/సీఎస్ఐఆర్ గుర్తింపుగల ల్యాబ్ ఆధ్వర్యంలో ఈ అధ్యయనం జరగాలని సూచించింది. అంతర్రాష్ట వివాదాల విషయంలో సంబంధిత శాఖ నుంచి అనుమతులు పొందాలని పేర్కొంది. ఫ్లోరైడ్ జోన్లో ప్రాజెక్టును నిర్మిస్తునందున జలాశయాల్లోని నీటితో భూగర్భ జలాల రిచార్జికి సదుపాయం ఉండాలని, దీనివల్ల ఫ్లోరైడ్ తీవ్రత తగ్గుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల జారీ తీవ్ర జాప్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. -
ఉపరాష్ట్రపతి భవన నిర్మాణ స్థలంపై పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ల్యూటెన్స్ ప్రాంతంలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఉపరాష్ట్రపతి భవన నిర్మాణానికి సంబంధించిన స్థలంపై అభ్యంతరాలను లేవనెత్తుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. రాష్ట్రపతి భవన్ నుంచి ఇందిరాగేట్కు మధ్య మూడు కిలోమీటర్ల పొడవునా కేంద్ర ప్రభుత్వం రూ. 20 వేల కోట్ల పైచిలుకు వ్యయంతో సెంట్రల్ విస్టా పునర్వ్యవస్టీకరణ ప్రాజెక్టును చేపట్టడం తెల్సిందే. ఇందులో భాగంగా కొత్త పార్లమెంట్, ఉపరాష్ట్రపతి నివాసం, పీఎంఓ, ఇతర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను నిర్మిస్తారు. రిక్రియేషనల్ కార్యాకలాపాలకు, పచ్చదనానికి ఉపయోగించాల్సిన ప్లాట్‌ను ఉపరాష్ట్రపతి నివాస భవన నిర్మాణానికి ప్రతిపాదించారని, భూవినియోగమార్పిడి నిబంధనలకు ఇది విరుద్ధమని పిటిషనర్లు వాదించారు. విమర్శించడం తేలికని, కానీ విమర్శ నిర్మాణాత్మకంగా ఉండాలని, సంబంధితవర్గాలు ఉపరాష్ట్రపతి భవన నిర్మాణ ప్రతిపాదిత స్థలంపై సరైన వివరణ ఇచ్చాయని... ఇక ఇందులో కల్పించుకోవడానికి ఏమీ లేదంటూ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. రూ. 206 కోట్లతో నిర్మాణం ఉప రాష్ట్రపతి కొత్త నివాస భవనం, అధికారిక కార్యాలయ సముదాయ నిర్మాణానికి రూ. 206 కోట్ల వ్యయం కానుంది. జార్ఖండ్‌లోని బొకారో కేంద్రంగా పనిచేస్తున్న కమలాదిత్య కన్స్ట్రక్షన్ సంస్థ ఈ నిర్మాణ ప్రాజెక్టును దక్కించుకుంది. కేంద్ర ప్రజాపనుల విభాగం రూ. 214 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలవగా... మొత్తం ఐదు సంస్థలు పోటీపడ్డాయి. వీటిలో కమాలాదిత్య కంపెనీ 3.52 లెస్తో కోట్ చేసి నిర్మాణ కాంట్రాక్టును చేజిక్కించుకుంది. పనులు వచ్చేనెలలో ప్రారంభమై 10 నెలల్లో పూర్తికానున్నాయి. -
సుప్రీంకోర్టులో రెంట్ పిటిషన్ తిరస్కరణ
న్యూఢిల్లీ: ఇంటి యజమానులు వారి ఇళ్లలో అద్దెకు ఉంటున్న విద్యార్థులు లేదా కూలీ పని వారు రెంట్ కట్టక పోతే ఖాళీ చేయించకుండా కేంద్రం సూచించేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ విచారణను జస్టిస్ అశోక్ భూషణ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారించింది. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కోర్టు అమలు చేయలేదని వ్యాఖ్యానించింది. పిటిషన్‌ను లాయర్ పవన్ ప్రకాశ్, ఏకే పాండే దాఖలు చేశారు. లాక్డౌన్ పిటిషన్ తిరస్కరణ లాక్డౌన్లో ప్రభుత్వాధికారి ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడం వంటి కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్లు ఐపీసీ సెక్షన్ కింద నమోదై ఉంటే వాటిని కొట్టేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు కోర్టు తిరస్కరించింది. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 188 ప్రకారం ఏదైనా చర్య మానవ జీవితానికి హని కలిగిస్తే అతనికి రూ. 1000 జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష పడేఅవకాశం ఉంది. దీన్ని జస్టిస్ అశోక్ భూషణ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారించింది. అసలు ఎఫ్ఐఆర్ ఉండకూడదని కోరుకుంటున్నారా అని సీనియర్ లాయర్ గోపాల్ శంకరనారాయన్ను కోర్టు ప్రశ్నించింది. ఉత్తర ప్రదేశ్ మాజీ డీజీపీ విక్రమ్ సింగ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. -
గీత దాటితే వేటు ఎప్పుడు?
న్యూఢిల్లీ: మహారాష్ట్ర హైడ్రామాలో గీత దాటిన ఎన్సీపీ ఎమ్మెల్యేలకు ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తింపుపై న్యాయనిపుణులు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసిన అనంతరమే ఆ చట్టం వర్తిస్తుందని కొందరు.. ప్రమాణస్వీకారంతో సంబంధం లేకుండా జంపింగ్‌లపై చర్యలు తీసుకోవచ్చని మరికొందరు పేర్కొంటున్నారు. సీనియర్ న్యాయవాది, రాజ్యాంగ న్యాయ కోవిదుడు రాకేష్ ద్వివేది మాట్లాడుతూ.. ‘కొత్త ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఈ చట్టం వర్తించదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు చట్టసభల్లో ప్రమాణస్వీకారం చేయకముందే ప్రభుత్వాలు ఏర్పడతాయి. ప్రమాణస్వీకారం అనంతరం పార్టీ ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని కోరతూ స్పీకర్‌కు ఫిర్యాదు చేయవచ్చు’ అని చెప్పారు. మరో సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ స్పందిస్తూ.. ‘ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారా? లేదా? అన్నది సమస్య కాదు. పార్టీ గీత దాటినవారికి ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుంది’ అని అన్నారు. అజిత్‌ను సమర్థిస్తున్న ఎన్సీపీ ఎమ్మెల్యేల సంఖ్య మూడింట రెండొంతులుంటే అనర్హత సమస్యే ఉత్పన్నం కాదని మరో లాయర్ చెప్పారు. -
నిర్మలతో భేటీకి బ్రిటన్ మంత్రి నిరాకరణ
లండన్: రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీకి నిరాకరించిన బ్రిటన్ రక్షణ మంత్రి విలియమ్సన్‌పై ఆయన మంత్రివర్గ సహచరులే తీవ్ర విమర్శలు చేస్తున్నారని ఆ దేశ మీడియా పేర్కొంది. రక్షణ రంగంలో భాగస్వామ్యం, కొనుగోళ్లపై రెండు దేశాల మధ్య జూన్ 20–22 తేదీల్లో లండన్‌లో ద్వైపాక్షిక సమావేశం జరగ్గా.. నిర్మలా సీతారామన్‌తో భేటీకి రక్షణ మంత్రి గవిన్ విలియమ్సన్‌ను భారత అధికారులు అపాయింట్మెంట్ అడిగారు. అందుకు విలియమ్సన్ సుముఖత వ్యక్తం చేయలేదని అక్కడి మీడియా ఆదివారం వెల్లడించింది. ఫలితంగా సీతారామన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారని సండే టైమ్స్ పత్రిక పేర్కొంది. అయితే ఈ కథనాలను నిర్మలా సీతారామన్ ఖండించారు. -
హెరాల్డ్ కేసులో స్వామి అభ్యర్థన తిరస్కృతి
న్యూఢిల్లీ: సంచలనం రేపిన నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చెందిన కొన్ని డాక్యుమెంట్లు కావాలంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి చేసిన అభ్యర్థనను ఢిల్లీలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ లవ్లీన్ తిరస్కరించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ తదితరులతో పాటు నేషనల్ హెరాల్డ్ పత్రిక యాజమాన్యమైన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) రూ.90.25 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారంటూ సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ వేశారు. ఈ కేసులో ఏజేఎల్‌కు కాంగ్రెస్ ఇచ్చిన రుణానికి సంబంధించిన డాక్యుమెంట్లు తనకు ఇవ్వాలంటూ స్వామి చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. -
టాప్ ఐఐటీల్లో 10 శాతం అదనపు సీట్లకు నో!
హెచ్ఆర్డీకి తేల్చి చెప్పిన ఐఐటీల డెరైక్టర్లు సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఐఐటీల్లో 10% సీట్లు అదనంగా పెంచాలన్న ఐఐటీల కౌన్సిల్ నిర్ణయాన్ని 7 టాప్ ఐఐటీలు తిరస్కరించాయి. విదేశీ విద్యార్థుల కోసం తాము అదనపు సీట్లు పెంచబోమని స్పష్టం చేశాయి. సీట్ల పెంపుపై ఆగస్టులో ఐఐటీల కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై అభిప్రాయాలను తెలియజేయాలని కేంద్ర మానవ వనరుల మం త్రిత్వ శాఖ ఐఐటీల డెరైక్టర్లను కోరింది. దీనిపై బుధవారం 7 ఐఐటీల డెరైక్టర్లు తమ అభిప్రాయాలను తెలియజేశారు. సీట్ల పెంపునకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించలేని పరిస్థితి నెలకొందని, ఫ్యాకల్టీ కొరత ఉన్న నేపథ్యం లో సీట్లను పెంచబోమని వారు స్పష్టం చేశారు. నాలుగేళ్ల బీటెక్ కోర్సులో సీట్ల పెంపును ఐఐటీ బాంబే, ఢిల్లీ, గువాహటి, ఖరగ్‌పూర్, ఖాన్పూర్, మద్రాసు, రూర్కీ ఐఐటీలు వచ్చే విద్యా సంవత్సరంలో అమలు చేయబోమని స్ప ష్టం చేశాయి. ఐఐటీ హైదరాబాద్, మండి, పాట్నా, రో పర్, జమ్ము ఐఐటీలు మా త్రం సీట్లు పెం చేందుకు అంగీకరించాయి. ఐఐటీ హైదరాబాద్‌లో 40 సీట్లు, మండిలో 50, పాట్నా లో 25, రోపర్‌లో 105, జమ్ము ఐఐటీలో 30 సీట్లు పెంచుతామని తెలియజేశాయి. -
ఇళయరాజాపై సోదరుడి ఫైర్
ఇళయరాజాపై ఆయన సోదరుడు, సంగీత దర్శకుడు గంగైఅమరన్ ఫైర్ అయ్యారు. జాతీయ అవార్డును తిరస్కరించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇటీవల పలువురు విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఆయన చర్యను చాలా మంది గర్హిస్తున్నారు. ఇళయరాజా 1000వ చిత్రం తారైతప్పటై చిత్ర నేపథ్య సంగీతానికిగాను ఆయనకు జాతీయ అవార్డు వరించింది. అయితే దాన్ని ఆయన తన సంగీతానికి సరైన గుర్తింపు లభించలేదంటూ తిరస్కరించారు. ఈ విషయంలో ఇళయరాజా నిర్ణయాన్ని ఆయన సోదరుడు, జాతీయ అవార్డుల జ్యూరీ సభ్యుల్లో ఒకరైన గంగైఅమరన్ తీవ్రంగా ఖండించారు. ఇళయరాజా చర్యను తప్పు పట్టారు. ఈ విషయంపై గంగైఅమరన్ స్పందిస్తూ ఇళయరాజా గొప్ప సంగీత దర్శకుడే. అలాగని జాతీయ అవార్డును తిరస్కరంచడం సరైన చర్య కాదు.సంగీతంలో ఇద్దరికి అవార్డును అందించడంలో తప్పేమిటి? సంగీతానికి, పాటలకు ఒకరికే అవార్డు ప్రకటించాలనడంలో అర్థం లేదు. ఆస్కార్ అవార్డుల్లో ఇలాంటి విధానం లేదు. అయినా ఇప్పుడు ఒక్క ఇళయరాజా మినహా పాటలకు, నేపథ్యసంగీతానికి ఏ సంగీత దర్శకుడు అందిస్తున్నారు. ఒక్కో పాటకు ఒకరు సంగీతాన్ని అందిస్తున్న రోజులివి. అదే విధంగా పాత చింతకాయ పచ్చడిలా ఎప్పుడూ ఒకే తరహా సంగీతాన్ని అందిస్తే ఎలా? కొత్త కొత్త సంగీత దర్శకులు వస్తున్నారు. మన కాలం ముగిసిందన్న ఆలోచనకు రావాలి. ఇప్పుటికీ తాను యువకుడినే అనే ఆలోచనా ధోరణిని మార్చుకోవాలి. ఇళయరాజా గొప్ప సంగీత దర్శకుడే.అలాంటి వ్యక్తి భారతదేశంలో అత్యున్నతమైన జాతీయ అవార్డును తిరస్కరించడం ఆయన అభిమానులైన తనలాంటి వారికి అసంతృప్తిని కలిగించే విషయం. ఒక వేళ ఆయనకు అవార్డు అందుకోవడం ఇష్టం లేకపోతే ఆ విషయాన్ని ముందే తెలిపితే ఆయన చిత్రాలు పరిశీలించేటప్పుడు ఇళయరాజా అవార్డును స్వీకరించరు అని ఆ చిత్రాలను పక్కన పెడతాం. విచారణై చిత్రానికి జీవీ మంచి సంగీతాన్నే అందించారు.ఆయనకు జాతీయ అవార్డును ప్రకటించి యువ సంగీతదర్శకులను ప్రోత్సహించే వారమని గంగైఅమరన్ తన సోదరుడు ఇళయరాజాపై విరుచుకుపడ్డారంటూ మీడియాలో ప్రచారం హల్చల్ చేస్తోంది. -
కొత్త డిస్టిలరీలకు అనుమతి వద్దు
కొత్త దరఖాస్తులు తిరస్కరించాలని ప్రభుత్వం నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం ఉత్ప త్తికి కొత్త డిస్టిలరీలకు అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలే కొత్తగా మూడింటికి అనుమతులివ్వడంతో పాటు కొన్నింటి సామర్థ్యం పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిస్టిలరీలు పూర్తిస్థాయి మద్యం ఉత్పత్తి చేస్తే పదేళ్ల వరకు ప్రజల అవసరాలకు సరిపోతుంది. ఈ క్రమంలో కొత్త అనుమతులు అవసరం లేదని ఆబ్కా రీ శాఖ కమిషనర్ చంద్రవదన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణ యించినట్టు సమాచారం. 30 కోట్ల లీటర్లకు చేరిన ఉత్పత్తి... రాష్ట్రంలో ప్రస్తుతం 17 డిస్టిలరీలు ఉండగా వాటి ఉత్పత్తి సామర్థ్యం 17.55 కోట్ల లీటర్లు. 6నెలల కిందట ఎక్సైజ్ శాఖ ఇచ్చిన కొత్త డిస్టిలరీల నోటిఫికేషన్‌తో మద్యం ఉత్పత్తికి పలు కంపెనీలు ముందుకు రాగా, వాటిలో మూడింటికి ప్రభుత్వం నుంచి అనుమతి లభిం చింది. ఎంఎస్ ఇం డస్ట్రీస్ 1.50 కోట్ల లీటర్ల మద్యం ఉత్పత్తికి, ఆఫీసర్స్ చాయిస్ బ్రాండ్‌కు చెందిన అలకైట్ బ్లెండర్స్ 6.49 కోట్ల లీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో డిస్టిలరీల ఏర్పాటుకు చేసుకున్న దరఖాస్తులకు అనుమతులు మంజూరయ్యాయి. కేడియా డిస్టిలరీస్ కంపెనీ కోటి లీటర్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయతలబెట్టిన డిస్టిలరీకి కూడా ఇటీవలే సర్కారు అనుమతిచ్చినట్లు సమాచారం. ఇవి కాకుండా ఇప్పటికే మద్యం ఉత్పత్తి చేస్తున్న ఆర్.కె. డిస్టిలరీస్, రిజోమ్ డిస్టిలరీస్, ఏపీ మెట్ ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీలు అదనంగా మరో 3.96 కోట్ల లీటర్ల మద్యం ఉత్పత్తికి అనుమతివ్వాలని చేసుకున్న దరఖాస్తుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో మద్యం ఉత్పత్తి చేసే డిస్టిలరీల సంఖ్య 20కి చేరగా, ఏటా సుమారు 30 కోట్ల లీటర్ల మద్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఏర్పడింది. -
వరంగల్ లో 56 నామినేషన్ల తిరస్కరణ
వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగర పాలక సంస్థలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. 58 డివిజన్ల నుంచి ఆయా పార్టీల అభ్యర్థులు 1,350 నామినేషన్ పత్రాలను దాఖలు చేయగా.. రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు నామినేషన్ పత్రాలను గురువారం పరిశీలించారు. వేర్వేరు కారణాలతో 56 నామినేషన్లను తిరస్కరించారు. 1,294 నామినేషన్లు సరైనవిగా గుర్తించారు. శుక్రవారం చేపట్టనున్న ఉపసంహరణల ప్రక్రియ పూర్తయ్యాక బరిలో ఉండే అభ్యర్థులు వివరాలు వెల్లడికానున్నాయి. తిరస్కరణకు గురైన నామినేషన్లలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన 30 సెట్లు ఉండటం గమనార్హం. 14, 16 డివిజన్లకు చెందిన టీఆర్ఎస్ అభ్యర్థులు అఫిడవిట్‌పై సంతకం చేయడం మరిచిపోయారు. దీనిపై ప్రత్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అధికారులు వారి నామినేషన్లను తిరస్కరించారు. -
ఆస్తి పన్ను బకాయితో నామినేషన్ తిరస్కరణ
♦ రిటర్నింగ్ అధికారిపై కోర్టుకెక్కిన అభ్యర్థి ♦ జోక్యానికి హైకోర్టు నిరాకరణ ♦ సివిల్ కోర్టుకెళ్లాలని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: ఆస్తి పన్ను రూ. 536 బకాయి ఉన్న కారణంగా ఓ అభ్యర్థి సమర్పించిన నామినేషన్‌ను తిరస్కరిస్తూ రిటర్నింగ్ అధికారి జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. రిటర్నింగ్ అధికారి ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే సివిల్ కోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవాలే తప్ప, రాజ్యాంగంలోని అధికరణ 226 కింద హైకోర్టును ఆశ్రయించడం సరికాదని తేల్చి చెప్పింది. ఆ అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కార్వాన్ నియోజకవర్గానికి చెందిన జె.రవీందర్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్వాన్, వార్డ్ నెంబర్ 65 నుంచి పోటీ చేసేందుకు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. వాటిని పరిశీలించిన రిటర్నింగ్ అధికారి రూ. 536 ఆస్తి పన్ను బకాయి ఉందని, అలాగే ఎన్నికల అఫిడవిట్లో 3, 5 కాలమ్‌లను పూరించలేదంటూ అభ్యంతరం లేవనెత్తారు. అంతేకాకుండా రవీందర్ నామినేషన్‌ను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ రవీందర్ బుధవారం మధ్యాహ్నం అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. దీనిని న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి లంచ్‌మోషన్ రూపంలో విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎం.వి.ప్రతాప్‌కుమార్ వాదనలు వినిపిస్తూ, రవీందర్ ఈ నెల 18నే ఆస్తి పన్ను చెల్లించేశారని, అందుకు సంబంధించిన రసీదును కూడా చూపినా కూడా రిటర్నింగ్ అధికారి సంతృప్తి చెందలేదని కోర్టుకు నివేదించారు. ఇక అఫిడవిట్లో 3, 5 కాలమ్‌లను పూరించాలన్న విషయం తెలియక ఖాళీగా వదిలేశారని తెలిపారు. వీటన్నింటినీ వివరిస్తూ రిటర్నింగ్ అధికారికి పిటిషనర్ వినతిపత్రం సమర్పించారని, దానిని పరిగణనలోకి తీసుకోకుండానే నామినేషన్‌ను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని ప్రతాప్ కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ నాగార్జునరెడ్డి రిటర్నింగ్ అధికారి ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించారు. -
నామినేషన్ రిజెక్టెడ్
‘గ్రేటర్’లో భారీగా తిరస్కరణలు సాక్షి, హైదరాబాద్: నిన్నటిదాకా టికెట్ల కోసం ఉరుకులు పరుగులు.. చేయని ప్రయత్నం లేదు.. వేడుకోని నాయకుడు లేడు.. ఇలా.. ఎన్నో కష్టనష్టాలకోర్చి నానాఅగచాట్లుపడి ఆయా పార్టీల నుంచి టికెట్లు పొందినప్పటికీ, స్క్రూటినీలో పలువురి నామినేషన్లను రిటర్నిం గ్ అధికారులు తిరస్కరించారు. ఇండిపెండెంట్లు, చిన్నాచితకా పార్టీల సంగతి అటుంచితే అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీలకు చెందిన అభ్యర్థుల నామినేషన్లు సైతం తిరస్కరణకు గురయ్యాయి. వీరిలో కొందరికి ఓటరు జాబితాలో పేరే లేకపోగా, మరికొందరికి ఇద్దరికంటే ఎక్కువ సంతానం కారణంగా ఆయా నామినేషన్లను తిరస్కరించారు. ఇంకొందరిని ప్రతిపాదించిన వారు స్థానికేతరులు కావడంతో తిరస్కరించారు. కడపటి సమాచారం మేరకు 127 వార్డులకు చెందిన 3,138 నామినేషన్లలో 114 తిరస్కరణకు గురయ్యాయి. ఇందులో ఇండిపెండెంట్లతో పాటు వివిధ పార్టీల వారు ఉన్నాయి. దీంతో ప్రధాన పార్టీల నాయకులు తమ పార్టీ తరఫున కొత్త అభ్యర్థి కోసం వేటలో పడ్డారు. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో అర్హత పొందిన వారు ఎక్కడెక్కడున్నారో వెతికి తమ పార్టీ బీఫారం ఇవ్వాలని యోచిస్తున్నారు. తిరస్కరణల్లో కొన్ని.. ⇒ జగద్గిరిగుట్ట డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి శేఖర్ యాదవ్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి బొజ్జ జయరాజ్ తిరస్కరించారు. ఆయనకు ముగ్గురు సంతానం ఉన్నట్లు మాజీ కార్పొరేటర్ కె.జగన్ ఫిర్యాదు మేరకు, న్యాయనిపుణుల సలహాతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించినట్లు తెలిపారు. ⇒ ముగ్గురు సంతానం ఫిర్యాదుతోనే కవాడిగూడ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి సంపూర్ణ నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి అరుణ తిరస్కరించారు. ప్రతిపక్షాల ఫిర్యాదు మేరకు రిటర్నింగ్ అధికారి పిల్లల జననాలకు సంబంధించి అఫిడవిట్ అందజేయాల్సిందిగా సంపూర్ణకు సూచించారు. ⇒ ఒక కాన్పులో కవలలు, మరో కాన్పులో మరొకరు జన్మించినట్లు అఫిడవిట్ అందజేయడంతో ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు. ⇒ వివేకానందనగర్ కాలనీ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం స్వాతి పేరు జీహెచ్ఎంసీ ఎన్నికల ఓటర్ల జాబితాలో లేకపోవడంతో తిరస్కరించారు. ⇒ ఇద్దరికి మించి సంతానం ఉన్న కారణంగా తలాబ్‌చంచలం డివిజన్ ఎంబీటీ అభ్యర్థి ఖదీర్ ఉన్నీసా బేగం నామినేషన్‌ను తిరస్కరించారు. ఇదే డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి రేణుకేశ్వణి నామినేషన్ పత్రాలు అసంపూర్తిగా ఉండటం, ప్రతిపాదించినవారు లేకపోవడంతో తిరస్కరించారు. ⇒ రామ్నాస్పురా డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి హర్షద్‌పాషా, టీడీపీ తరఫున నామినేషన్లు దాఖలు చేసిన ఫారూఖ్‌అలీ, మహ్మద్‌హజీలను ప్రతిపాదించిన వారు స్థానిక వార్డులో ఓటర్లు కాకపోవడంతో తిరస్కరించారు. ఇదే కారణంతో కిషన్‌బాగ్ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆశ్వాక్ అహ్మద్ దరఖాస్తును తిరస్కరించారు. ⇒ ఉప్పుగూడ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి రియాజ్ పేరు జీహెచ్ఎంసీ ఓటరు జాబితాలో లేకపోవడంతో తిరస్కరించారు. -
అర్ధరాత్రి తెరుచుకున్న ‘సుప్రీం’ తలుపులు
-
అర్ధరాత్రి తెరుచుకున్న ‘సుప్రీం’ తలుపులు
న్యూఢిల్లీ: దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనట్లుగా సుప్రీంకోర్టు తలుపులు అర్ధరాత్రి తెరుచుకున్నాయి. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు కోర్టు తలుపులు తీశారు. ఉరిశిక్షను వాయిదా వేయాలంటూ యాకూబ్ మెమన్ తరఫు న్యాయవాదులు చిట్టచివరి నిమిషంలో దాఖలు చేసిన పిటషన్ ను విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు అంగీకరించడంతో సుప్రీంకోర్టు చరిత్రలోనే ఎన్నడూ లేనట్లుగా అర్ధరాత్రి 4వ నెంబరు కోర్టులో వాదనలు కొనసాగాయి. అంతకుముందు బుధవారం సాయంత్రం మెమన్ పిటిషన్ ను కొట్టేసిన త్రిసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులనే ఈ పిటిషన్ విచారణకు కూడా చీఫ్ జస్టిస్ నియమించారు. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సీ పంత్, జస్టిస్ అమితవ్ రాయ్ లతో కూడిన ధర్మాసనం వద్ద రెండు గంటల పాటు వాదనలు కొనసాగాయి. క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించిన 14 రోజుల వరకు ఉరి తీయకూడదని మరో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మెమన్ తరఫు న్యాయవాదులు ప్రస్తావించారు. మహారాష్ట్ర మాన్యువల్ ప్రకారం చూసినా కూడా క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణకు, ఉరితీతకు మధ్య 7 రోజుల వ్యవధి ఉండాలని చెప్పారు. అయితే, ఈ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ధర్మాసనం తన తుది తీర్పు వెలువరించింది. షెడ్యూలు ప్రకారమే గురువారం నాడు మెమన్ ను ఉరి తీయాలని స్పష్టం చేసింది. దీంతో యాకుబ్ మెమన్‌కు ఉరికి ఖరారైంది. -
కొలువుల భర్తీకి సీఎం తిరస్కరణ
హైదరాబాద్: బాబొస్తే... జాబొస్తుంది... అంటూ తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఊదరగొట్టారు. అంతేకాదు.. ఉద్యోగాలివ్వకపోతే నిరుద్యోగులందరికీ నెలకు రూ.2000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని సైతం హామీ ఇచ్చారు. అధికారం చేపట్టాక ఆ ఊసే మరిచారు. కొత్త రాజధానిలో భూముల సర్వేకోసం సర్వేయర్లు, ఉప సర్వేయర్ల పోస్టులు భర్తీ చేయాలంటూ రెవెన్యూశాఖ చేసిన ప్రతిపాదనలను సైతం సీఎం తిరస్కరించడం ఇందుకు నిదర్శనం. ఈ పోస్టుల భర్తీకి బదులుగా రాజధానిలో సర్వేను కూడా ప్రైవేట్‌పరం చేయాలని ఆయన సూచించడం గమనార్హం. భర్తీ కుదరదు.. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం 4 వేల సర్వే పోస్టుల భర్తీకి అనుమతివ్వాలని రెవెన్యూశాఖ తొలుత ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపింది. ఆర్థికశాఖ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సమీక్ష సందర్భంగా సర్వేయర్ల కొరతపైన, ప్రస్తుతమున్న పని ఒత్తిడి తదితర అంశాలపైన రెవెన్యూ(సర్వే విభాగం)శాఖ ప్రజెంటేషన్ ఇచ్చింది. ప్రస్తుతం నిధుల కొరత ఉన్నందున పోస్టుల భర్తీ సాధ్యం కాదని, ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకోవాలని సీఎం సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 720 మంది సర్వేయర్లే పనిచేస్తున్నారని, 6 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని రెవెన్యూ అధికారులు వివరించినప్పటికీ ఆయన పట్టించుకోలేదు. రిటైరైన వారికి శిక్షణనిచ్చి తీసుకోవాలని, లేదంటే ప్రైవేటు ఏజెన్సీలద్వారా సర్వే చేయించుకోవాలని సూచించారు. ప్రైవేట్ వ్యక్తులకు శిక్షణనిచ్చి లెసైన్స్ సర్వేయర్లను నియమించుకోవాలన్నా ఒక్కొక్కరికీ శిక్షణకు రూ.40 వేలు అవుతుందని రెవెన్యూశాఖ తెలిపింది. ఆ మేరకైనా నిధుల మంజూరుకు సీఎం ససేమిరా అన్నారు. అంతేగాక రాజధానిలో సర్వే పనిని ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించాలని ఆదేశాలిచ్చారు. దీనిపై అధికారులు మండి పడుతున్నారు. ఇది సరైన విధానం కాదని అభిప్రాయపడుతున్నారు. పాతబాటలోనే బాబు సర్వేయర్, ఉప సర్వేయర్ జిల్లాస్థాయి పోస్టులే. రాష్ట్ర విభజన, రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులతో వీటికి సంబంధం లేదు. అయినా కొత్త పోస్టుల మంజూరు కన్నా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకే సీఎం చంద్రబాబు తిరస్కరించడం చూస్తుంటే.. సర్కారు పోస్టుల భర్తీకి భవిష్యత్‌లోనూ ఆయన ఇష్టపడరనే వాదన అధికార వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో అధికారంలో ఉండగా చంద్రబాబు నాల్గోతరగతి పోస్టుల భర్తీపై నిషేధం విధించిన విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు. కేడర్ గ్రేడ్ ఖాళీలు సంఖ్య జోనల్ గెజిటెడ్ 11,105 ఎన్జీవో 11,353 నాల్గోతరగతి 4 జిల్లా గ్రూప్-1 2 గెజిడెట్ 863 ఎన్జీవో 82,760 నాల్గోతరగతి 22,519 ఎయిడెడ్ 9,857 మొత్తం పోస్టులు ఖాళీ 1,38,463 -
ఒబామా వీటో ప్రయోగం
వాషింగ్టన్: కెనడా నుంచి అమెరికాలోని గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరం వరకు 1900 కిలోమీటర్ల మేర నిర్మించదలచిన కీస్టోన్ ఎక్సెల్ ముడి చమురు పైపులైన్ నిర్మాణాన్ని అమెరికా అధ్యక్షుడు ఒబామా తన వీటో అధికారం ఉపయోగించి తిరస్కరించారు. దీంతో రిపబ్లికన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యక్షునిగా ఆరేళ్లకు పైగా పాలనలో ఒబామా ఈ అధికారాన్ని ఉపయోగించడం ఇది మూడోసారి. -
తిరస్కరిస్తే.. మళ్లీ దరఖాస్తు చేసుకోండి
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు: మంత్రి హరీశ్‌రావు దుబ్బాక: సంక్షేమ పథకాలు పొందేందుకు అర్హులైనప్పటికీ తిరస్కరణకు గురైతే తహశీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. ఆదివారం ఆయన మెదక్ జిల్లా దుబ్బాక, చిన్నకోడూరుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడుతూ, తమ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. అందువల్లే లబ్ధిదారుల సంఖ్యకు పరిమితి విధించలేదన్నారు. అర్హులు ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని చెప్పారు. అర్హులైన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని, గడువంటూ ఏమీ లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమగ్ర సర్వేలో 2.50 లక్షల మంది వికలాంగులు, వృద్ధులు, వితంతువులు పింఛన్లకు అర్హులుగా గురించామన్నారు. ఈ నెల 10 నుంచి 15వ తేదీలోగా పెంచిన పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. ఇక వసతి గృహాల్లో మెరుగైన వసతులు కల్పించి విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించేందుకు టీఆర్ఎస్ సర్కార్ ప్రయత్నిస్తోందన్నారు. అందులో భాగంగానే త్వరలోనే అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు వసతి గృహాల్లో రాత్రిబస చేయనున్నట్లు తెలిపారు. -
తిరస్కరణకు గురయ్యారు..!
‘కరేజ్ డజ్ నాట్ ఆల్వేస్ రోర్..’ అనేది ఇంగ్లిష్‌లోని ఒక నానుడి. వ్యక్తిలోని ప్రతిభను ఒక్కోసారి అవతలి వారు అర్థం చేసుకోలేకపోవచ్చు. ఒక రంగంలో అద్భుతాలు సాధించగల వారు కూడా ఒక్కోసారి అదే రంగంలో అనామకులనిపించవచ్చు. అందుకు ఉదాహరణ వీళ్లు. అపారమైన ప్రతిభను కలిగి ఉండి.. ఒకే లక్ష్యంతో పాటుపడుతున్న సమయంలో వీరికి తిరస్కారాలుఎదురయ్యాయి. అయితేనేం.. అలాంటి తిరస్కారాలను వైఫల్యాలుగా భావించకుండా, తిరిగి కృషి చేసి అద్భుతాలు సాధించిన స్ఫూర్తిమంతులు వీళ్లు. జేకే రౌలింగ్ ఒకరు కాదు ఇద్దరు కాదు... పన్నెండు మంది పబ్లిషర్స్ రౌలింగ్ రచనని తిరస్కరించారు. ఆమె అక్షరాల ద్వారా సృష్టించిన ‘హారీపొటర్’ ప్రపంచం వారిని ఆకట్టుకోలేకపోయింది. ప్రచురణకు ఎవరూ ముందుకు రాలేదు. అయితేనేం... రౌలింగ్ ప్రతిభకు ప్రచురణకర్తల తిరస్కరణ అడ్డు కాలేకపోయింది. ఆ తర్వాత దక్కిన చిన్న అవకాశంతో రౌలింగ్ తన సత్తాచాటారు. ఎమినిమ్ ఈ పేరు వింటే పాప్ ప్రపంచం ఊగిపోతుంది. సంగీత ప్రపంచంలో అతడొక తరంగమని కీర్తిస్తుంది. ఈ ప్రశంసలూ, పేరు ప్రఖ్యాతులన్నీ ఎమినిమ్ గ్రామీ అవార్డులను అందుకోవడం మొదలైన తర్వాత మొదలైనవి. డజను సార్లకుపైగా ఆ అవార్డును అందుకున్నాక పతాక స్థాయికి చేరినవి. అయితే సంగీతకారుడిగా పేరు తెచ్చుకోకమునుపు ఎమినిమ్ను ఆదరించిన వారు లేరు. తన ప్రతిభను గుర్తించకపోగా తన పేదరికాన్ని చూసి అనేకమంది అసహ్యించుకొన్నారని ఈ పాప్‌స్టార్ అనేక సార్లు తన గతం గురించి ప్రస్తావించాడు. మైఖేల్ జోర్డాన్ ‘గ్రేటెస్ట్ బాస్కెట్‌బాల్ ప్లేయర్ ఆఫ్ ఆల్‌టైమ్’ ఆట నుంచి రిటైర్ అయిన సమయానికి ఈ అమెరికన్ ప్లేయర్ పేరు ముందు చేరిన బిరుదు ఇది. ‘నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్’ లీగ్‌లో అద్భుతమైన ప్రదర్శన ద్వారా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సాధించిన మైఖేల్ జోర్డాన్ ఆట విషయంలో అనేక సార్లు నిరాదరణకు గురయ్యాడు. స్కూల్ టీమ్, టీనేజ్‌లలో సెలెక్టర్లు జోర్డాన్‌ను పట్టించుకునే వారు కాదట. అలాంటి సందర్భాల్లో ఒక్కడే రూమ్‌లో కూర్చొని ఏడ్చేసేవాడినని జోర్డాన్ చెబుతారు. అయితే నిరాదరణకు గురైన జోర్డాన్ ప్రతిభ అసలైన సమయంలో మాత్రం వికసించింది. స్టీవెన్ స్పీల్బర్గ్ యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా ఫిల్మ్ స్కూల్లో చేరాలని తీవ్రంగా ప్రయత్నించాడు స్పీల్బర్గ్. అయితే వర్సిటీ వాళ్లు స్టీవెన్‌కు అంత టాలెంట్ లేదని తేల్చేశారు. సినిమాల్లోకి రాకముందు రెండు సార్లు స్పీల్బర్గ్ దరఖాస్తును వారు తిరస్కరించారట. అలా ఫిల్మ్‌స్కూల్ లో స్థానం సంపాదించలేకపోయినా స్పీల్బర్గ్ హాలీవుడ్ ఆవిష్కరించిన అద్భుతాల గురించి ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు! లియోనల్ మెస్సీ ఇప్పుడంటే మెస్సీకి ప్రపంచమంతా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సాకర్ ప్లేయర్ ఆట తీరుకు ముగ్ధులవుతున్నారు. అయితే టీనేజ్‌లో మెస్సీని ఫుట్‌బాల్ ప్లేయర్‌గా గుర్తించిన వారెవరూ లేరు. ఆటపై అమితమైన ప్రేమ, ప్రావీణ్యత కలిగి ఉన్నా.. మెస్సీ టీమ్‌లలో చోటు సంపాదించలేకపోయాడు. అప్పటికి బక్కగా, రివటలా ఉన్న మెస్సీని గేలి చేస్తూ అతడిది సాకర్‌కు పనికొచ్చే పర్సనాలిటీ కాదని అందరూ తేల్చేశారట. అయితేనేం ఆ తర్వాత మెస్సీ అంతర్జాతీయ స్థాయిలో అద్భుత మైన ప్లేయర్ అనే పేరే తెచ్చుకున్నాడు. -
గోరింటాకు తంటా..!
మెహందీ పెట్టుకోలేదని పెళ్లికి నిరాకరణ పోలీసుల అదుపులో వరుడు పంజగుట్ట: వధువు గోరింటాకు పెట్టుకోలేదన్న కోపంతో వరుడు పెళ్లికి నిరాకరించాడు. ఈనెల 8న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంజగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. కంచన్‌బాగ్ ఉమర్ కాలనీలో నివాసముంటున్న మీర్ మసూద్ అలీ(32) దుబాయ్‌లో పనిచేస్తున్నాడు. ఇతనికి గతంలో వివాహమైంది. భార్యతో గొడవలు రావడంతో విడాకులు తీసుకున్నాడు. ఎంఎస్ మక్తాకు చెందిన ఎండీ గౌస్ పాషా కుమార్తె(23)తో రెండో వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు . ఈనెల 8న వివాహం చేసేందుకు ఇరు కుటుంబాలు సిద్ధమయ్యాయి. పెళ్లి సమయంలో వరుడికి ఇవ్వాల్సిన సామగ్రి మొత్తం ముందుగానే ఇచ్చేశారు. 7వ తేదీ రాత్రి మసూద్ అలీ బంధువులు వధువును పెళ్లి కూతురును చేసేందుకు గౌస్ పాషా ఇంటికి వచ్చారు. అప్పటికి ఆమె మెహందీ పెట్టుకోకపోవడాన్ని గమనించిన వారు ఆగ్రహం వ్యక్తం చేసి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని వరుడికి చెప్పారు. తాను పెళ్లి చేసుకోవడంలేదని గౌస్‌కు ఫోన్ చేశాడు అలీ. తెల్లవారితే జరగాల్సిన పెళ్లి ఆగిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. బంధువులందరికీ పెళ్లి కార్డులు పంచామని, ఈ సమయంలో వివాహం రద్దు చేసుకోవద్దని ప్రాధేయపడ్డా వరుడు వినిపించుకోలేదు. బాధితులు చేసేది లేక ఖైరతాబాద్ కార్పొరేటర్ మహ్మద్ షరీఫ్ సహాయంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సోమవారం వరుడు మసూద్ అలీని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. -
34 పోస్టల్ బ్యాలెట్ల తిరస్కరణ
గుర్ల,న్యూస్‌లైన్: స్థానిక ఎన్నికల్లో భాగంగా జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ముగిసింది. ఇందులో భాగంగా ముందుగా ఆర్వో సమ క్షంలో పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపు చేపట్టారు. గుర్ల మండలం మొత్తం మీద 34 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవగా వాటిలో ఒక్క ఓటును కూడా పరిగణనలోకి తీసు కోలేదు. ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకున్న ఉద్యోగులు సక్రమమైన పద్ధతిలో ఓట్లు వేయకపోవడంతో వాటిని తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు. సాధారణంగా పోస్టల్ బ్యాలెట్ ఉన్న కవరులో ఓటు వేసే వ్యక్తి డిక్లరేషన్‌తో పాటు ఓటు వేసిన కవరు పెట్టాలి. అయితే ఒక్క ఓటరు కూడా డిక్లరేషన్ ఫారం జత చేయలేదు. ఎన్నికల కమిషన్ నియమాను సారం డిక్లరేషన్ లేని పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్లు తిరస్కరణకు గురవడంతో ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు నిరాశ చెందారు. -
లెసైన్సు రాకున్నా బ్యాంకుల్లో వాటాలు కొనొచ్చు
ముంబై: బ్యాంకింగ్ లెసైన్సు దక్కని సంస్థలు..ఇతర బ్యాంకుల్లో వాటాలు కొనేందుకు చేస్తున్న ప్రయత్నాలపై రిజర్వ్ బ్యాంక్ స్పందించింది. లెసైన్సు దరఖాస్తు తిరస్కరణకు గురైనంత మాత్రాన ఆయా కంపెనీలు.. వేరే బ్యాంకుల్లో వాటాలు కొనుగోలు చేయరాదంటూ ఏమీ లేదని కొత్తగా నియమితులైన ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ తెలిపారు. లెసైన్సు దరఖాస్తు తిరస్కరణకు గురైనప్పటికీ.. బ్యాంకులో సదరు సంస్థ వాటాదారుగా చేరాలనుకుంటే, ఆ ప్రతిపాదనను పరిశీలిస్తామనిఆయన వివరించారు. ప్రైవేట్ రంగ బ్యాంక్ యస్ బ్యాంక్‌లో ఎల్అండ్టీ ఫైనాన్స్ గణనీయంగా వాటాలు పెంచుకోవాలని యోచిస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఏదైనా బ్యాంకులో ఏదైనా కంపెనీ 5 శాతం పైగా వాటాలను కొనాలనుకుంటే ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని గాంధీ చెప్పారు. అన్ని విషయాలను కూలంకషంగా పరిశీలించి తాము నిర్ణయం తీసుకుంటామని, ఏ ఒక్క కంపెనీకో అనుకూలంగానో లేదా వ్యతిరేకంగానో వ్యవహరించమని ఆయన తెలిపారు. కొత్త బ్యాంకింగ్ లెసైన్సును దక్కించుకోవడంలో విఫలమైన ఎల్అండ్టీ ఫైనాన్స్.. యస్‌బ్యాంకులో వాటాలు కొనాలని యోచిస్తోంది. ఇది దొడ్డిదారిన బ్యాంకింగ్‌లోకి ప్రవేశించడమే అవుతుందని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. -
లోక్‌సభ 4, అసెంబ్లీ 16 నామినేషన్ల తిరస్కరణ
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : శ్రీకాకుళం లోక్‌సభ, జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన సోమవారం ముగిసింది. లోక్‌సభ నియోజకవర్గానికి 15 మంది నామినేషన్లు వేయగా నలుగురి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ తిరస్కరించారు. అంతకుముందు తన సమావేశ మందిరంలో అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో నామినేషన్ పత్రాలను పరిశీలించారు. మిగతా 11 మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలు సక్రమంగా ఉన్నట్టు నిర్ధారించారు. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం వరకు గడువు ఉంది. తిరస్కరించినవి ఇవీ.. శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి తెలుగుదేశం పార్టీ ప్రధాన అభ్యర్థి కింజరాపు రామ్మోహన్నాయుడు నామినేషన్ ఆమోదం పొందటంతో డమ్మీ అభ్యర్థి కింజరాపు విజయకుమారి నామినేషన్‌ను తిరస్కరించారు. కాంగ్రెస్ ప్రధాన అభ్యర్థి కిల్లి కృపారాణి నామినేషన్ సక్రమంగా ఉండటంతో డమ్మీ కిల్లి విక్రాంత్ నామినేషన్‌ను తిరస్కరించారు. జై సమైక్యాంధ్ర పార్టీ ప్రధాన అభ్యర్థి పైడి రాజారావు నామినేషన్ ఆమోదం పొందటంతో డమ్మీ అభ్యర్థి పైడి శ్రీలక్ష్మి నామినేషను తిరస్కరించారు. నామినేషన్ పత్రాలు పూర్తిగా పూరించకపోవటం, అఫిడవిట్లో కొన్నిచోట్ల నోటరీ సంతకాలు లేకపోవటంతో స్వతంత్ర అభ్యర్థి నాయుడుగారి రాజశేఖర్ నామినేషన్‌ను తిరస్క రించారు. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గానికి దాఖలైన నామినేషన్లలో టీడీపీ డమ్మీ అభ్యర్థి గుండ విశ్వనాథ్ నామినేషన్‌ను తిరస్కరిం చారు. నామినేషన్ పత్రంతోపాటు తగు ధ్రువీకరణ పత్రాలు జతచేయకపోవడమే దీనికి కారణం. ఎచ్చెర్ల నియోజకవర్గానికి దాఖలైన నామినేషన్లలో మూడింటిని తిరస్కరించారు. టీడీపీ తరఫున కిమిడి వెంకట రామమల్లిక్ వేసిన రెండు సెట్లు, కాంగ్రెస్ పార్టీ తరఫున కిలారి వెంకట నారాయణమ్మ వేసిన నామినేషన్ తిరస్కరించారు. సకాలంలో బీ-ఫారాలు అందజేయకపోవటంతో వీరి నామినేషన్లను తిరస్కరించారు. ఆమదాలవలస నియోజకవర్గానికి దాఖలైన 36 నామినేషన్లలో రెండింటిని తిరస్కరించారు. టీడీపీ తరఫున నామినేషన్ వేసిన కూన ప్రమీల బి-ఫారం సమర్పించనందున, స్వతంత్ర అభ్యర్థి గెడ్డాపు రమణ నామినేషన్ పత్రంలో 10 మంది ప్రతిపాదకులు లేకపోవటంతో వాటిని తిరస్కరించారు. రాజాం అసెంబ్లీ నియోజకవర్గానికి దాఖలైన 12 నామినేషన్లలో ఒకదానిని తిరస్కరించారు. టీడీపీ తరఫున ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మా ప్రసాద్ వేసిన నామినేషన్లో 10 మంది ప్రతిపాదకులు లేకపోవడంతో తిరస్కరించామని రిటర్నింగ్ అధికారి తెలిపారు. నరసన్నపేట నియోజకవర్గానికి 10 నామినేషన్లు దాఖలు కాగా ఒకరి నామినేషన్‌ను తిరస్కరించారు. టీడీపీ డమ్మీ అభ్యర్థి బగ్గు సుగుణమ్మ నామినేషన్ పత్రాలు సంపూర్ణంగా లేని కారణంగా తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. టెక్కలి నియోజవర్గానికి పది మంది నామినేషన్లు వేయగా ఇద్దరి నామినేషన్లను తిరస్కరించారు. టీడీపీ డమ్మీ అభ్యర్థి కింజరాపు విజయమాధవి, కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థి కిల్లి మల్లన్న నామినేషన్లు వీటిలో ఉన్నాయి. పలాస నియోజకవర్గంలో 15 మంది నామినేషన్లు వేయగా ఇద్దరి నామినేషన్లను తిరస్కరించారు. ఎ, బి ఫారాలు, ప్రతిపాదకుల సంతకాలు లేని కారణంగా గౌతు విజయలక్ష్మి, వంక సుధల నామినేషన్ పత్రాలను తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి చెప్పారు. పాలకొండ నియోజకవర్గంలో మూడు నామినేషన్లు తిరస్కరించారు. అవసరమైన ధ్రువపత్రాలు, పేర్కొనాల్సిన సమాచారం లేకపోవడంతో నిమ్మక భాగ్యలక్ష్మి(కాంగ్రెస్), నిమ్మక పాండురంగ(టీడీపీ), పాలక సాంబయ్య(సీపీఎం)ల నామినేషన్లను తిరస్కరించారు. ఇచ్ఛాపురం నియోజకవర్గానికి 18 నామినేషన్లు దాఖలు కాగా ఒక నామినేషన్‌ను తిరస్కరించారు. బి-ఫారం సమర్పించకపోవటం, పది మంది ప్రతిపాదకులు లేకపోవటంతో టీడీపీ తరఫున బెందాళం నీలోత్పల వేసిన నామినేషన్‌ను తిరస్కరించారు. పాతపట్నం నియోజకవర్గానికి దాఖలైన నామినేషన్లన్నీ సక్రమంగా ఉన్నాయి. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
అర్హత సాధించింది 279 మంది.. తిరస్కరణ 75 రేపటితో ముగియనున్న ఉపసంహరణ గడువు సాక్షి, నల్లగొండ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన గురువారం ముగిసింది. ఇందులో వివిధ కారణాల వల్ల 75మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ప్రధానంగా ప్రతిపాదకుల పేర్లు చేర్చకపోవడం, అభ్యర్థుల సంతకాలు లేకపోవడంతో పాటు కొందరిపై కేసులు ఉండడంతో తిరస్కరణకు గురయ్యాయి. ఈ నెల 2 నుంచి 9వ తేదీ వరకు 354మంది అభ్యర్థులు 617 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అందులో ఎన్నికల కమిషన్ నియమావళికి విరుద్ధంగా ఉన్న 75మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. తద్వారా 279మంది ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో రెండు లోక్‌సభ స్థానాలకు 23మంది, 12 అసెంబ్లీ స్థానాలకు 256మంది అభ్యర్థులు ఉన్నారు. శుక్రవారం అభ్యర్థుల నుంచి అధికారులు అప్పీలు స్వీకరిస్తారు. ఈ నెల 12వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు మిగిలింది. ఉపసంహరణ రోజే బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను అధికారులు వెల్లడిస్తారు.