సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు రెండో దశకు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేసేందుకు కేంద్ర పర్యవరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ(ఎంఓఈఎఫ్) నిరాకరించింది. పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ) నోటిఫికేషన్–2006 నిబంధనలను ప్రాజెక్టు ఉల్లంఘించిందని నిర్ధారించింది. ఈ నేపథ్యంలో 2021 జూలైలో జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్‌ఓపీ) ఆధారంగా పర్యావరణ ఉల్లంఘనలతో జరిగిన నష్టంపై అధ్యయనం జరిపించాలని నిర్ణయించింది. పర్యావరణ శాఖ ఉల్లంఘనల కమిటీ మాజీ సభ్యుడు కె.గౌరప్పన్‌కు అధ్యయనం జరిపి నివేదిక సమర్పించే బాధ్యతలు అప్పగించింది. కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) ఇటీవల సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
చదవండి: వైద్య నోటిఫికేషన్లు వాయిదా!.. ఆలస్యానికి కారణం ఇదే
బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలి..
పర్యావరణ అనుమతుల జారీకి ముందు రాష్ట్ర ప్రభుత్వం.. నష్ట నివారణ ప్రణాళిక, ప్రకృతి, ప్రాంతీయ వనరుల వృద్ధి ప్రణాళికల అమలుకు అవసరమైన నిధులకు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుందని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఎంత మొత్తానికి గ్యారెంటీ ఇవ్వాలో తామే సిఫారసు చేస్తామని, రెగ్యూలేటరీ ఆథారిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. ఈ ప్రణాళికలను అమలు చేశాకే బ్యాంకు గ్యారెంటీలను విడుదల చేయాల్సి ఉంటుందని సూచించింది. గాలి, నీరు, భూమి, ఇతర పర్యావరణ అంశాలకు ప్రాజెక్టు వల్ల జరిగిన నష్టంపై అధ్యయనం జరిపించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పర్యావరణ చట్టం కింద నోటిఫై చేసిన పర్యావరణ ల్యాబ్/సీఎస్‌ఐఆర్ గుర్తింపుగల ల్యాబ్ ఆధ్వర్యంలో ఈ అధ్యయనం జరగాలని సూచించింది. అంతర్రాష్ట వివాదాల విషయంలో సంబంధిత శాఖ నుంచి అనుమతులు పొందాలని పేర్కొంది. ఫ్లోరైడ్ జోన్‌లో ప్రాజెక్టును నిర్మిస్తునందున జలాశయాల్లోని నీటితో భూగర్భ జలాల రిచార్జికి సదుపాయం ఉండాలని, దీనివల్ల ఫ్లోరైడ్ తీవ్రత తగ్గుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల జారీ తీవ్ర జాప్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment