‘నార్లాపూర్‌’ అంచనాలు పైపైకి! | Water transfer from Eedula to Dindi lift irrigation | Sakshi
Sakshi News home page

‘నార్లాపూర్‌’ అంచనాలు పైపైకి!

Published Sun, Jan 5 2025 3:30 AM | Last Updated on Sun, Jan 5 2025 3:30 AM

Water transfer from Eedula to Dindi lift irrigation

రూ. 1,400 కోట్ల నుంచి రూ. 1,748 కోట్లకు పెంచుతూ మంత్రివర్గ ఆమోదం!

ఏదుల నుంచి డిండి ఎత్తిపోతలకు నీటి తరలింపు

సాక్షి, హైదరాబాద్‌: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన నార్లాపూర్‌ రిజర్వాయర్‌ సవరణ అంచనాలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్యాకేజీ–2 కింద రూ. 800 కోట్ల అంచనా వ్యయంతో రిజర్వాయర్‌ నిర్మాణాన్ని ప్రారంభించగా గతంలో రూ. 1,448 కోట్లకు అంచనాలు పెంచారు. తాజాగా రూ. 1,784 కోట్లకు అంచనాలను సవరించాలనే ప్రతిపాదనలను కేబినెట్‌ ఆమోదించినట్లు తెలియవచ్చింది. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌–కేఎన్‌ఆర్‌ జాయింట్‌ వెంచర్‌ ఈ రిజర్వాయర్‌ను నిర్మిస్తోంది. 

ఏదుల–డిండి అలైన్‌మెంట్‌ పనులకు పచ్చజెండా
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఏదుల (వీరాంజనేయ) రిజర్వాయర్‌ నుంచి డిండి ఎత్తిపోతల పథకానికి నీళ్లను తరలించడానికి రూ. 1,788.89 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన అలైన్‌మెంట్‌ పనులకు మంత్రివర్గం ఆమోదించింది. ఏదుల రిజర్వాయర్‌ నుంచి పోతిరెడ్డిపల్లి చెక్‌డ్యామ్‌కు గ్రావిటీ ద్వారా నీటిని తరలించేందుకు 800 మీటర్ల అప్రోచ్‌ కాల్వను.. ఆ తర్వాత వరుసగా 2.525 కి.మీ.ల ఓపెన్‌ కెనాల్, 16 కి.మీ.ల సొరంగం, 3.05 కి.మీ.ల ఓపెన్‌ కెనాల్, 6.325 కి.మీ.ల వాగు నిర్మాణం కలిపి మొత్తం 27.9 కి.మీ.ల పొడవున కాల్వలు, సొరంగం పనులు చేపట్టనున్నారు.

 పోతిరెడ్డిపల్లి చెక్‌డ్యామ్‌ వద్ద రబ్బర్‌ డ్యామ్‌ను సైతం నిర్మించనున్నారు. వనపర్తి జిల్లాలోని ఏదుల రిజర్వాయర్‌ నుంచి పోతిరెడ్డిపల్లి చెక్‌డ్యామ్‌కు.. అక్కడి నుంచి ఉల్పర బరాజ్, డిండి, సింగరాజుపల్లి, ఎర్రపల్లి–గోకవరం, ఇర్వేన్, గొట్టిముక్కల, చింతపల్లి, కిస్టరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్లకు నీటిని తరలిస్తారు. 
నార్లాపూర్‌ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు నీటి తరలింపు ప్యాకేజీ–3 అంచనా వ్యయాన్ని రూ. 416 కోట్ల నుంచి రూ. 780 కోట్లకు పెంచాలన్న ప్రతిపాదనలను మంత్రివర్గం తిరస్కరించినట్లు తెలిసింది. సరైన రీతిలో ప్రతిపాదనలను తమ ముందుంచాలని ఉంచాలని సూచించినట్లు సమాచారం.  

‘పీఆర్‌’లో 588 కారుణ్య నియామకాలకు ఓకే 
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కారుణ్యనియామకాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. మొత్తం 588 కారుణ్య నియామకాలపై ఆర్థిక శాఖ, సీఎంను ఒప్పించి కారుణ్య నియామకాలకు మంత్రి సీతక్క అడ్డంకులు లేకుండా చేశారు. ఈ సందర్భంగా కారుణ్య నియామకాల్లో చేరబోతున్న అభ్యర్థులు మంత్రిని కలసి కృతజ్ఞతలు తెలిపారు. 201 కొత్త గ్రామ పంచాయితీలు, 11 కొత్త మండలాలు, మరో 11 కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement