డిండి ఎత్తిపోతలకు విద్యాసాగర్ పేరు!
జలసౌధలో కాంస్య విగ్రహం... ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఇటీవల అనారోగ్యంతో మరణించిన రాష్ట్ర ప్రభుత్వ సాగునీటి సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు సేవలకు గుర్తింపుగా నల్లగొండ జిల్లాలో చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకానికి ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో పాటే ఆయన కాంస్య విగ్రహాన్ని జలసౌధలో ఏర్పాటు చేయాలని నిశ్చయించింది. దీనిపై త్వరలోనే ప్రభుత్వం తరఫున ప్రకటన వెలువడనుందని నీటి పారుదల శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత నీటి పారుదల ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్, కొత్త ప్రాజెక్టుల రూపకల్పనతో విద్యాసాగర్‌రావు విశేష సేవలందించారు.
ఇందులో భాగంగానే పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకా లను చేపట్టడంలో ఆయన విశేష కృషి చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే గత నెల 29న విద్యాసాగర్‌రావు మరణం తర్వాత రాష్ట్రంలోని ఒక ప్రాజెక్టుకు ఆయన పేరు పెడతామని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆయన పుట్టిన నల్లగొండ జిల్లాలోని డిండి ఎత్తిపోతల పథకానికి విద్యాసాగర్‌రావు పేరు పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలిసింది. దీనిపై శనివారం జరగనున్న ఆయన సంస్మరణ సభలో ప్రభుత్వం ఓ ప్రకటన చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక ఆయన కాంస్య విగ్రహాన్ని జలసౌధలో అలీ నవాబ్ జంగ్ బహదూర్ పక్కన ఏర్పాటు చేయాలని సైతం నిర్ణయించినట్లుగా సమాచారం.