రూ.1,788.89 కోట్లతో ఏదుల–డిండి అలైన్‌మెంట్ అంచనాలు సిద్ధం
4న రాష్ట్ర మంత్రివర్గం భేటీ ముందుకు ప్రతిపాదనలు
కేబినెట్ ఆమోదం తర్వాత పరిపాలనా అనుమతులు, టెండర్లు
ఇప్పటివరకు 55 శాతం పూర్తయిన డిండి ఎత్తిపోతల పనులు
భూసేకరణ, పర్యావరణ చిక్కులతో ముందుకు సాగని ప్రాజెక్టు
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఏదుల (వీరాంజనేయ) రిజర్వాయర్ నుంచి డిండి ఎత్తిపోతల పథకానికి నీళ్లను తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏదుల రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపల్లి చెక్‌డ్యామ్‌కు నీళ్లను తరలించే అలైన్‌మెంట్ పనులకు రూ.1,788.89 కోట్ల అంచనా వ్యయంతో నీటిపారుదల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ఈ నెల 4న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముందుకు ఈ ప్రతిపాదనలు రానున్నాయి. మంత్రివర్గం ఆమోదించిన వెంటనే పనులకు పరిపాలనా అనుమతులు జారీచేసి, ఆ వెంటనే టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
27 కి.మీ.ల అనుసంధానం
ఏదుల రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపల్లి చెక్‌డ్యామ్ కు గ్రావిటీ ద్వారా నీళ్లను తరలించేందుకు 800 మీటర్ల అప్రోచ్ కాల్వను.. ఆ తర్వాత వరుసగా 2.525 కి.మీ.ల ఓపెన్ కెనాల్, 16 కి.మీ.ల సొరంగం, 3.05 కి.మీల ఓపెన్ కెనాల్, 6.325 కి.మీల వాగు నిర్మాణం కలిపి మొత్తం 27.9 కి.మీ.ల పొడవున కాల్వలు, సొరంగం పనులు చేపడతారు.
వనపర్తి జిల్లాలోని ఏదుల రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపల్లి చెక్‌డ్యామ్‌కు.. అక్కడి నుంచి ఉల్పర బరాజ్, డిండి, సింగరాజుపల్లి, ఎర్రపల్లి–గోకవరం, ఇర్వేన్, గొట్టిముక్కల, చింతపల్లి, కిస్టరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్లకు నీళ్లను తరలిస్తారు.
55 శాతం పనులు పూర్తి
శ్రీశైలం జలాశయం ఫోర్‌షోర్ నుంచి రోజుకు 0.5 టీఎంసీ చొప్పున 60 రోజులపాటు మొత్తం 30 టీఎంసీల నీటిని తరలించి ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని దేవరకొండ, మునుగోడు, నాగార్జునసాగర్, నకిరేకల్, నల్లగొండ, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లో 3.61 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు డిండి ఎత్తిపోతల పథకాన్ని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టింది.
రూ.6,190 కోట్ల అంచనాలతో 2015 జూన్ 11న ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు జారీ అయ్యాయి. ప్రాజెక్టు మొత్తంలో ఇప్పటివరకు రూ.3,441.89 కోట్ల విలువైన పనులు పూర్తి కాగా, మరో రూ.2,748.11 కోట్ల విలువైన పనులు చేపట్టాల్సి ఉంది. ఈ లెక్కన ఇప్పటివరకు 55 శాతం పనులు పూర్తయినట్టే. గతంలో రూ.3,929.66 కోట్లతో 7 ప్యాకేజీల పనులకు టెండర్లు ఆహ్వానించి కాంట్రాక్టర్లతో ఒప్పందం చేసుకున్నారు.
మిగిలినపనులకు ఇంకా టెండర్లు నిర్వహించలేదు. ఇప్పటివరకు 12,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుబాటులోకి రాగా, ఇంకా 3,49,000 ఎకరాల ఆయకట్టుకు రావాల్సి ఉంది. మిగిలిన 45 శాతం పనులు పూర్తయితే మొత్తం ఆయకట్టుకు సాగునీరు అందుతుంది.
రిజర్వాయర్లకు భూసేకరణ సమస్య
ఈ ప్రాజెక్టులో భూసేకరణ సమస్యలతో రిజర్వాయర్ల పనులు ముందుకు సాగడం లేదు. సింగరాజుపల్లి (85 శాతం), గొట్టిముక్కల (98 శాతం) రిజ ర్వాయర్ల పనులు దాదాపుగా చివరి దశలో ఉన్నాయి. కిస్టరాంపల్లి (70 శాతం), శివన్నగూడెం (70 శాతం) రిజర్వాయర్ల పనులు పురోగతిలో ఉన్నాయి.
భూసే కరణ సమస్యలతో చింతపల్లి (0 శాతం), ఎర్రపల్లి–గోకవరం (26 శాతం) రిజర్వాయర్ల పనులు ప్రారంభ దశలోనే నిలిచిపోయాయి. ఇదే సమస్యతో ఇర్వేన్ రిజర్వాయర్ పనులు మొదలే కాలేదు. ప్రాజెక్టు అవసరాలకు 16,030 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు 12,052 ఎకరాలు సేకరించగా, మిగిలిన 3,977 ఎకరాలు సేకరించాల్సి ఉంది.
వీడని పర్యావరణ చిక్కులు
పర్యావరణ అనుమతులు లేకుండానే డిండి ప్రాజెక్టు పనులను చేపట్టినందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) 2022 డిసెంబర్ 12న రాష్ట్ర ప్రభుత్వానికి రూ.92.85 కోట్ల జరిమానా విధించడంతో పాటు పనులపై స్టే విధించింది. ఎన్జీటీ స్టే ఎత్తేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉంది.
మరోవైపు పర్యావరణ అనుమతులు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. పర్యావరణ అనుమతులు సాధించే పనులను రూ.87.75 లక్షలతో ఎని్వరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఈపీటీఆర్‌ఐ)కు 2022 ఫిబ్రవరిలో ప్రభుత్వం అప్పగించినా, ఆశించిన ఫలితం కనిపించలేదు.
Comments
Please login to add a commentAdd a comment