Dindi Lift Irrigation Scheme
-
డిండికి నీటిని తరలించొద్దు
నాగర్‌కర్నూల్: పాలమూరు పథకంలో ఎత్తిపోసే నీటిని నల్గొండ జిల్లా పరిధిలోని డిండికి నీటిని తరలించే ప్రయత్న చేస్తున్నారని, ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనేక ఉద్యమాల ద్వారా 2013లో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి 72 జీఓ సాధించుకున్నామని గుర్తు చేశారు. ఈ విషయంలో తెలంగాణ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేందుకే కాంగ్రెస్ వాళ్లు తొందరపడి జీఓ ఇచ్చారని మంత్రి నిరంజన్‌రెడ్డి వాఖ్యానించడం చూస్తే ఈ జీఓ రావడం ఇష్టం లేనట్లుందన్నారు. అయితే ముందుగా అనుకున్న విధంగా ఎగువ ప్రాంతమైన జూరాల నుంచి కాకుండా దిగువ ప్రాంతమైన శ్రీశైలం నుంచి ఈ పథకాన్ని ప్రారంభించారన్నారు. ఒకప్పుడు జూరాల నుంచి పాకాలకు నీరు తరలిద్దామని మాట్లాడిన సీఎం కేసీఆర్ పాలమూరు పథకానికి జూరాలలో నీరుదొరకదని మాట్లాడడం కేవల వివక్ష మాత్రమే అన్నారు. దీనివల్ల నార్లాపూర్, ఏదుల, వట్టెం, రిజర్వయర్లలో భూములు, ఇళ్లు మునిగిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఎదుల నుంచి డిండికి నీటిని తరలించేందుకు పాలమూరు–డిండి పథకాన్ని ప్రారంభించారని దీని వల్ల ఉల్పర, సింగరాజు పల్లి, ఎర్రవల్లి, ఇర్విన్ రిజర్వాయర్లకు వేలాది ఎకరాల కల్వకుర్తి ఆయకట్టు మునిగిపోయే పరిస్థితి ఉందన్నారు. ఏదుల రిజర్వాయర్ నుంచి నల్గొండ జిల్లా శివన్నగూడెం ప్రాంతానికి నీరు తలించే ప్రక్రియను కృష్ణ నీటితో కాకుండా కాళేశ్వరం నీటితో చేయాలన్నారు. శివన్న గూడెం 385 మీటర్ల ఎత్తులో ఉండగా కాళేశ్వరం పథకం పరిధిలోని బస్వాపూర్ రిజర్వాయర్ 490 మీటర్ల ఎత్తులో ఉన్నందున గ్రావిటీ ద్వారా నీటిని తరలించడం సులభమవుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు నుంచి డిండికి నీళ్లు తీసుకెళ్లం అని ప్రకటించినా పనులు మాత్రం వేగవంతంగా జరగుతున్నాయని అన్నారు. గోదావరి నీటిని ఖమ్మం, నల్గొండ జిల్లాలతోపాటు రంగారెడ్డి జిల్లాదాకా తెచ్చే ప్రణాళికలను రూపొందించాలన్నారు. అదే విధంగా పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలన్నారు. మల్లన్న సాగర్‌లో ఇచ్చిన పరిహారం ఇక్కడ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. యురేనియం విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాలన్నారు. అమెరికా లాంటి దేశాలే యురేనియం పై నిషేదం విధించాయన్నారు. వచ్చే నెల 2,3 తేదీల్లో ప్రొఫెసర్ హరగోపాల్‌తో కలిసి నల్లమలలో తిరుగుతున్నామని, యురేనియం వల్ల ఏం నష్టం జరగబోతుందో ప్రజలకు వివరిస్తామన్నారు. సమావేశంలో పాలమూరు అధ్యయన వేదిక సభ్యులు శంకర్, అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
‘డిండి ఎత్తిపోతల’ను వ్యతిరేకిద్దాం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించతలపెట్టిన డిండి ఎత్తిపోతలను వ్యతిరేకిద్దామని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక టీఎన్జీఓ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ప్రజలకు భవిష్యత్తులో కృష్ణానదీ నీళ్లు తప్ప మరో అవకాశం లేదన్నారు. రైతాంగానికి సాగునీరు, యువతకు ఉపాధి కోసమే జిల్లా ప్రజలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, డిండి ఎత్తిపోతలతో జిల్లాకు నష్టం జరిగితే తిరగబడతారన్నారు. ఈ విషయంపై ఈనెల 23వ తేదీన టీఎన్జీఓ భవన్లో వివిధ సంఘాలతో రౌండ్ టేబుల్‌సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో రాఘవాచారి, రామకృష్ణరావు, బాల్కిషన్ తదితరుల పాల్గొన్నారు. -
డిండి ఎత్తిపోతలపై ప్రజా ఉద్యమం
కార్యాచరణ సిద్ధం చేసిన కాంగ్రెస్ జెడ్పీ చైర్మన్, ఎంపీ నేతృత్వంలో మండలాల వారీగా నిరసనలు నక్కలగండిని ‘‘డిండి ఎత్తిపోతల పథకం’’గా వర్ణించాలని పిలుపు దేవరకొండ : డిండి ఎత్తిపోతల పథకం (నక్కలగండి ప్రాజెక్టు) సాధనకు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతోంది. మండలాల వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి కార్యాచరణ రూపొందించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో రూపుది ద్దుకుని రూ.3కోట్లతో సర్వే కూడా పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టుకు.. ప్రభుత్వ ఆమోదముద్ర పడే సమయంలో బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంనుంచి దీనిపై క్లారిటీ తీసుకునేందుకు కాంగ్రెస్ ప్ర ణాళిక రూపొందిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం జూరాల-పాకాల ప్రాజెక్టును తెరపైకి తెచ్చి ఈ ప్రాజెక్టు చేపట్టడంపై సంకోచిస్తు న్న తరుణంలో జిల్లా కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జెడ్పీచైర్మన్ నేనావత్ బాలునాయక్‌ల నేతృత్వంలో మండలాల వారీగా కార్యక్రమాలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. డిండి ఎత్తిపోతల పథకాన్ని టీఆర్ఎస్ పనికిమాలిన ప్రాజెక్టు అని వర్ణించిన నాటినుంచి ప్రారంభమైన మాటల సెగ ఇంకా చల్లారడం లేదు. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని భావించిన జిల్లా కాంగ్రెస్ నేతలు దీనికి ప్రభుత్వ ఆమోద ముద్ర పడేంత వరకు ఉద్యమించాలని భావిస్తున్నారు. ఇటీవల జిల్లాపరిషత్‌లో జరిగిన వివాదంతో ఈ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయన్న కాంగ్రెస్ నేతల అనుమానం తారాస్థాయికి చేరుకుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్, డిండి ఎత్తిపోతల పథకం ఈ రెండు ప్రాజెక్టులపై ప్రభుత్వం స్పష్టతను కోరుతూ జిల్లాలోని అన్ని మండలాల వారీగా ఉద్యమాలు చేసేందుకు కార్యచరణ సిద్ధం చేసినట్లు జిల్లా పరిషత్ చైర్మన్ ప్రకటించారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి నేతృత్వంలో ఉద్యమం ముందుకు సాగుతుందని తెలిపారు. అయితే తెలంగాణ ప్రభుత్వం, అధికార పార్టీ ప్రతినిధులు చాకచక్యంగా నక్కలగండి ప్రాజెక్టుపై చిత్తశుద్ధి ఉందని, నిధులు విడుదల చేస్తామని పేర్కొంటున్నప్పటికీ.. ప్రస్తుతం తాము అడిగేది డిండి ఎత్తిపోతల పథకం అని పేర్కొన్నారు. నక్కలగండి అంటే ప్రభుత్వం ఎస్ఎల్బీసీ టన్నెల్‌గా భావిస్తూ దానికి నిధులు అందజేస్తామని పేర్కొంటున్నారని, ఈ విషయంపై ప్రజలకు స్పష్టత రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్న జెడ్పీ చైర్మన్ బాలునాయక్ నక్కలగండి నుంచి మిడ్ డిండి ద్వారా డిండికి నీటిని అందించే ప్రాజెక్టు (డిండి ఎత్తిపోతల పథకం) అని క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టును నక్కలగండి ప్రాజెక్టుగా వర్ణించకుడా ఁ్ఙడిండి ఎత్తిపోతల పథకం**గా అభివర్ణించాలని నేతలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం కొండమల్లేపల్లిలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించిన బాలునాయక్ కాంగ్రెస్ చేపట్టబోయే ప్రజా ఉద్యమం గురించి వివరించారు. మరో వారం, పది రోజుల్లో మండలాల వారీగా ప్రణాళికను రూపొందించి ప్రజలు, రైతుల మద్దతుతో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చేపడతామని తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్, డిండి ఎత్తిపోతల పథ కం.. ఈ రెండు ప్రాజెక్టులపై ప్రభుత్వంనుంచి స్పష్టతను కోరుతూ జిల్లాలోని అన్ని మండలాల వారీగా ప్రజా ఉద్యమాలు చేపడతాం. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి నేతృత్వంలో ఉద్యమాలను ఉధృతం చేస్తాం. - నేనావత్ బాలునాయక్, జెడ్పీచైర్మన్