ఊరు, ఇల్లు వదిలి.. అక్క‌డ‌ అంద‌రిదీ ఇదే పరిస్థితి! | Shivannaguda Balancing Reservoir Victims left Narsi Reddy Gudem | Sakshi
Sakshi News home page

శివన్నగూడ రిజర్వాయర్‌ ముంపు గ్రామం నర్సిరెడ్డిగూడెం ఖాళీ 

Published Fri, Feb 28 2025 5:44 PM | Last Updated on Fri, Feb 28 2025 5:51 PM

Shivannaguda Balancing Reservoir Victims left Narsi Reddy Gudem

గ్రామస్తులను బలవంతంగా పంపించేస్తున్న అధికారులు 

అందరికీ పరిహారం ఇవ్వలేదని బాధితుల ఆవేదన 

ప్లాట్లు కేటాయించినా.. పట్టాలు ఇవ్వలేదని మండిపాటు  

ఈ చిత్రంలోని దంపతులు కీలుకత్తుల యాదయ్య, మంగమ్మ.. నర్సిరెడ్డిగూడెంలో వ్యవసాయం చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. శివన్నగూడ రిజర్వాయర్‌ కట్ట నిర్మాణంతో నర్సిరెడ్డిగూడెం గ్రామానికి రాకపోకలు నిలిచిపోనున్నాయి. అధికారులు బలవంతంగా ఊరిని ఖాళీ చేయిస్తుండటంతో ఉన్న ఊరిని.. ఇన్నాళ్లూ తలదాచుకున్న ఇంటిని ఖాళీ చేసి, శివన్నగూడలో అద్దెకు తీసుకున్న ఇంటికి వెళ్లిపోయారు. ఇప్పుడీ ఊళ్లో చాలామందిది ఇదే పరిస్థితి.

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: పుట్టి పెరిగిన ఊరు కన్నతల్లిలాంటిది అంటారు. ఏ కారణం చేతనైనా ఉన్న ఊరిని వదిలిపెట్టి వెళ్లాల్సి వస్తే.. ఆ బాధ వర్ణనాతీతం. అందునా బలవంతంగా ఊరి నుంచి పంపించే పరిస్థితి వస్తే కలిగే వేదన చెప్పనలవికాదు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం నర్సిరెడ్డిగూడెం గ్రామస్తులు ఇప్పుడదే బాధను అనుభవిస్తున్నారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా మర్రిగూడ మండలంలో శివన్నగూడ రిజర్వాయర్‌ (Shivannaguda Reservoir) నిర్మిస్తున్నారు. ఈ రిజర్వాయర్‌ కట్ట నిర్మాణంతో నర్సిరెడ్డిగూడెం గ్రామానికి వచ్చే రోడ్డు పూర్తిగా పోతోంది. 

కట్ట నిర్మాణం పూర్తయితే గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. ఈ నేపథ్యంలో అధికారులు గ్రామాన్ని ఖాళీ చేయిస్తున్నారు. అయితే, పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించకుండానే ఉన్న ఊరి నుంచి తమను తరిమేస్తున్నారని నర్సిరెడ్డిగూడెం (Narsi Reddy Gudem) వాసులు ఆరోపిస్తున్నారు. వీరికి అధికారికంగా ఇళ్ల స్థలాలను కూడా అప్పగించలేదు. చాలామంది గ్రామస్తులు వేరేచోట ఇళ్లు కట్టుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాము ఎక్కడికి వెళ్లాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పరిహారం 
శివన్నగూడ ప్రాజెక్టు పనులకు మాజీ సీఎం కేసీఆర్‌ (KCR) 2015, జూన్‌ 12వ తేదీన శంకుస్థాపన చేశారు. 14.5 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ను నిర్మించాలని అనుకున్నా పలు కారణాలతో 11.5 టీఎంసీలకు కుదించారు. రిజర్వాయర్‌ నిర్మాణం కోసం 3,465 ఎకరాల భూసేకరణ చేపట్టారు. అందులో పట్టా భూములు 2,900 ఎకరాలు ఉండగా, మిగతావి ప్రభుత్వ భూములు. పట్టా భూములకు మొదట్లో ఎకరానికి రూ.4.15 లక్షలు, ఆ తరువాత ఎకరానికి రూ.5.15 లక్షల చొప్పున చెల్లించారు. 

చ‌ద‌వండి: ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులో 'మరో సొరంగం'! 

ప్రస్తుతం ఎకరానికి రూ.8 లక్షలకు పైగా చెల్లిస్తున్నారు. ఈ రిజర్వాయర్‌ కింద నర్సిరెడ్డిగూడెం, చర్లగూడెం, వెంకేపల్లి, వెంకేపల్లి తండాలు ముంపునకు గురవుతున్నాయి. రాంరెడ్డిపల్లి, శివన్నగూడ, ఖుదాబాక్షపల్లి గ్రామాల రైతుల భూములు కూడా సేకరించారు. అయితే, భూములకు పరిహారం ఒక్కొక్కరికి ఒక్కోరకంగా ఇవ్వడంపై గ్రామస్తులు నిరసన వ్యక్తంచేస్తున్నారు. అందరికీ పెంచిన పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.

ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, ఇళ్ల స్థలాలు 
ఈ నాలుగు ముంపు గ్రామాల్లోని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కింద రూ.7.61 లక్షలు ఇచ్చారు. అయితే, సర్వే సమయంలో అందుబాటులో లేని కొంతమందికి అదీ అందలేదు. వీరికి చింతపల్లి మండల కేంద్రంలో ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. నర్సిరెడ్డిగూడెంలోని 289 కుటుంబాలకుగాను 257 కుటుంబాలకే ఇచ్చారు. ఇంకా 32 కుటుంబాలకు అధికారికంగా ప్లాట్లను కేటాయిస్తూ పత్రాలు అందజేయలేదు. ఇప్పుడు కట్ట నిర్మాణం పేరుతో గ్రామాన్ని ఖాళీ చేయిస్తుండటంతో చేసేదేం లేక ఆ కుటుంబాలు వేరే ప్రాంతాల్లో అద్దె ఇళ్లకు మారిపోతున్నారు.  

నా కుమారుడికి ప్లాట్‌ ఇస్తలేరు 
నాకు ఇద్దరు కొడుకులు, ఒక కుమారుడికి ప్లాట్‌ ఇస్తామని హామీ ఇవ్వకపోవటంతో నర్సిరెడ్డిగూడెంలో మా ఇంటి దగ్గరే ఉంటున్నా. అధికారులు వెళ్లమంటున్నారు. నా కొడుక్కి ఇంటి స్థలం ఇస్తామని చెప్పే వరకు వెళ్లను. మాకు ఆరు ఎకరాల భూమి ఉండగా, ఒక్కో ఎకరానికి రూ.5.15 లక్షలే ఇచ్చారు. 
– కీలుకత్తుల సోమమ్మ

పట్టాలు ఇవ్వలేదు 
ఊరి నుంచి పంపిస్తే శివన్నగూడలో ఇల్లు కిరాయికి తీసుకొని ఉంటున్నాం. చింతపల్లి మండలంలో ఇండ్లను కేటాయించారు.. కానీ ఇంటి పట్టాలు ఇవ్వలేదు. ఈలోగానే ఊరు ఖాళీ చేయాలని చెప్పి పంపించేశారు. ఇంటి స్థలాలకు పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. 
– బల్లెం పద్మమ్మ 

కిరాయి ఇంట్లో ఉంటున్నాం 
మా ఊరి జ్ఞాపకాలను మరువలేకపోతున్నాం. ఇప్పుడు సొంత ఇల్లు లేకుండా పోయింది. శివన్నగూడలో ఇల్లు కిరాయికి తీసుకొని ఉంటున్నాను. కిరాయి చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. ఉన్న ఆరెకరాలు ప్రాజెక్టులో పోయింది. మొదటగా ఎకరానికి రూ.4.15 లక్షలు, తరువాత రూ.5.15 లక్షల చొప్పున మాత్రమే ఇచ్చారు. 
– సుంకరి జంగయ్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement