డిండి ఎత్తిపోతలపై ప్రజా ఉద్యమం
కార్యాచరణ సిద్ధం చేసిన కాంగ్రెస్
జెడ్పీ చైర్మన్, ఎంపీ నేతృత్వంలో మండలాల వారీగా నిరసనలు
నక్కలగండిని ‘‘డిండి ఎత్తిపోతల పథకం’’గా వర్ణించాలని పిలుపు
దేవరకొండ : డిండి ఎత్తిపోతల పథకం (నక్కలగండి ప్రాజెక్టు) సాధనకు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతోంది. మండలాల వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి కార్యాచరణ రూపొందించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో రూపుది ద్దుకుని రూ.3కోట్లతో సర్వే కూడా పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టుకు.. ప్రభుత్వ ఆమోదముద్ర పడే సమయంలో బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంనుంచి దీనిపై క్లారిటీ తీసుకునేందుకు కాంగ్రెస్ ప్ర ణాళిక రూపొందిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం జూరాల-పాకాల ప్రాజెక్టును తెరపైకి తెచ్చి ఈ ప్రాజెక్టు చేపట్టడంపై సంకోచిస్తు న్న తరుణంలో జిల్లా కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జెడ్పీచైర్మన్ నేనావత్ బాలునాయక్‌ల నేతృత్వంలో మండలాల వారీగా కార్యక్రమాలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. డిండి ఎత్తిపోతల పథకాన్ని టీఆర్‌ఎస్ పనికిమాలిన ప్రాజెక్టు అని వర్ణించిన నాటినుంచి ప్రారంభమైన మాటల సెగ ఇంకా చల్లారడం లేదు. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని భావించిన జిల్లా కాంగ్రెస్ నేతలు దీనికి ప్రభుత్వ ఆమోద ముద్ర పడేంత వరకు ఉద్యమించాలని భావిస్తున్నారు.
ఇటీవల జిల్లాపరిషత్‌లో జరిగిన వివాదంతో ఈ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయన్న కాంగ్రెస్ నేతల అనుమానం తారాస్థాయికి చేరుకుంది. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్, డిండి ఎత్తిపోతల పథకం ఈ రెండు ప్రాజెక్టులపై ప్రభుత్వం స్పష్టతను కోరుతూ జిల్లాలోని అన్ని మండలాల వారీగా ఉద్యమాలు చేసేందుకు కార్యచరణ సిద్ధం చేసినట్లు జిల్లా పరిషత్ చైర్మన్ ప్రకటించారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి నేతృత్వంలో ఉద్యమం ముందుకు సాగుతుందని తెలిపారు. అయితే తెలంగాణ ప్రభుత్వం, అధికార పార్టీ ప్రతినిధులు చాకచక్యంగా నక్కలగండి ప్రాజెక్టుపై చిత్తశుద్ధి ఉందని, నిధులు విడుదల చేస్తామని పేర్కొంటున్నప్పటికీ.. ప్రస్తుతం తాము అడిగేది డిండి ఎత్తిపోతల పథకం అని పేర్కొన్నారు. నక్కలగండి అంటే ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌గా భావిస్తూ దానికి నిధులు అందజేస్తామని పేర్కొంటున్నారని, ఈ విషయంపై ప్రజలకు స్పష్టత రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్న జెడ్పీ చైర్మన్ బాలునాయక్ నక్కలగండి నుంచి మిడ్ డిండి ద్వారా డిండికి నీటిని అందించే ప్రాజెక్టు (డిండి ఎత్తిపోతల పథకం) అని క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టును నక్కలగండి ప్రాజెక్టుగా వర్ణించకుడా ఁ్ఙడిండి ఎత్తిపోతల పథకం**గా అభివర్ణించాలని నేతలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం కొండమల్లేపల్లిలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించిన బాలునాయక్ కాంగ్రెస్ చేపట్టబోయే ప్రజా ఉద్యమం గురించి వివరించారు. మరో వారం, పది రోజుల్లో మండలాల వారీగా ప్రణాళికను రూపొందించి ప్రజలు, రైతుల మద్దతుతో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చేపడతామని తెలిపారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్, డిండి ఎత్తిపోతల పథ కం.. ఈ రెండు ప్రాజెక్టులపై ప్రభుత్వంనుంచి స్పష్టతను కోరుతూ జిల్లాలోని అన్ని మండలాల వారీగా ప్రజా ఉద్యమాలు చేపడతాం. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి నేతృత్వంలో ఉద్యమాలను ఉధృతం చేస్తాం.
- నేనావత్ బాలునాయక్, జెడ్పీచైర్మన్