ఏదుల నుంచి డిండి ఎత్తిపోతలకు నీరు తీసుకునేలా నిర్ణయం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3.61 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3.61 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే డిండి ఎత్తిపోతల పథకం పనులకు చకాచకా అడుగులు పడుతున్నాయి. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి ఎత్తిపోతల పథకానికి నీరు తీసుకోవాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత నియోజకవర్గాలైన మునుగోడు, దేవరకొండకు నీరందించే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను చేపట్టేందుకు ఆమోదముద్ర వేసింది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తీసుకోవడం, రిజర్వాయర్ల భూసేకరణ, పరిహారం పూర్తి చేస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లా సస్యశ్యామలం అవుతుంది. ఇందుకోసం ఏదుల నుంచి రోజుకు అర టీఎంసీ చొప్పున 60 రోజుల్లో 30 టీఎంసీల నీటిని తీసుకుంటారు.
త్వరలోనే గ్లోబల్ టెండర్లు
డిండి ఎత్తిపోతల పథకానికి ఏదుల నుంచి నీటిని తీసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం.. అక్కడి నుంచి ఉల్పర వరకు నీటిని తరలించే పనులను రూ.1,800 కోట్లతో చేపట్టాలని నిర్ణయించింది. వాటికి సంబంధించి త్వరలోనే గ్లోబల్ టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతోంది.
ఏదుల రిజర్వాయర్ నుంచి 800 మీటర్ల అప్రోచ్‌చానల్, అక్కడి నుంచి 2.525 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ తవ్వి, తొమ్మిది మీటర్ల డయాతో 16 కిలోమీటర్ల టన్నెల్, ఆ తర్వాత 3.050 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ తవ్వుతారు. మొత్తంగా ఏదుల నుంచి 21.575 కిలోమీటర్ల తర్వాత నీరు దుందుభి నదిలోకి చేరి, అక్కడి నుంచి 6.325 కిలోమీటర్ల తర్వాత ఉన్న పోతిరెడ్డిపల్లి చెక్‌డ్యామ్‌కు చేరుతుంది.
అయితే అక్కడ చెక్‌డ్యాం స్థానæంలో రబ్బర్ డ్యాం , దానికి 1.5 కిలోమీటర్ల దిగువన ఉల్పర వద్ద బరాజ్‌ను నిర్మిస్తారు. వీటికి సంబంధించిన డిజైన్లపై సాగునీటిపారుదల శాఖ కసరత్తు చేస్తోంది. త్వరలోనే వాటిని ఖరారు చేసి, గ్లోబల్ టెండర్లు పిలవనున్నట్టు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.
పర్యావరణ అనుమతులు పెండింగ్
పర్యావరణ అనుమతులు లేకుండానే చేపట్టిన డిండి పనులను ఆపేయాలని 2022 డిసెంబర్‌లో జాతీయ గ్రీన్‌ట్రిబ్యునల్ ఆదేశించింది. అంతేకాదు రూ.92.85 కోట్ల జరిమానా కూడా విధించింది. దీంతో ప్రభుత్వం పర్యావరణ అనుమతులు సాధించే బాధ్యతను ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు (ఈపీటీఆర్‌ఐ) అప్పగించింది. ఇంతవరకు అనుమతుల వ్యవహారం కొలిక్కి రాలేదు.
భూసేకరణ, నిర్వాసితుల సమస్య
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ పథకానికి డిటైయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు చేయాలని 2007లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఏర్పడే వరకు కూడా డీపీఆర్‌లు ప్రభుత్వానికి అందలేదు. చివరకు 2015లో జూన్ 11వ తేదీన బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ పథకానికి ఉత్తర్వులు (జీఓ 107) జారీ చేసింది. మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లోని 3.61 లక్షల ఎకరాల్లో ఆయకట్టుకు నీరందించేందుకు రూ.6,194 కోట్లతో ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించింది.
అయితే పాలమూరు–రంగారెడ్డి డీపీఆర్‌ను ఆమోదించి, నిధులు కేటాయించి పనులను వేగంగా చేయించిన నాటి ప్రభుత్వం డిండి డీపీఆర్‌ను ఆమోదించలేదు. అయినా కొంత డబ్బు కేటాయించి 2015లో శివన్నగూడెంలో రిజర్వాయర్ల పనులను శంకుస్థాపన చేసి చేపట్టింది. ఉల్పరకు దిగువ నుంచి ప్రారంభమయ్యే ప్రధాన కాలువ, డిండి ప్రాజెక్టు ఎత్తు పెంపు, అప్రోచ్ చానల్స్, సింగరాజుపల్లి, ఎర్రవల్లి–గోకారం, ఇర్విన్, గొట్టిముక్కల, చింతపల్లి, కిష్టరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ల నిర్మాణాలకు సుమారు 16,030 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా, ఇప్పటివరకు 12,052 ఎకరాల భూమినే సేకరించారు.
భూసేకరణతో నిర్వాసితులు అయ్యే దాదాపు 1,899 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. ఇప్పటివరకు ప్యాకేజీలు కుదరకపోవడంతో నిర్వాసితుల ఆందోళన చేస్తున్నారు. పర్యావరణ అనుమతులు సాధిస్తే అన్ని పనులు వేగిరం అవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment