Central Environment Department
-
‘పాలమూరు–2’ అనుమతులకు నో
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు రెండో దశకు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేసేందుకు కేంద్ర పర్యవరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ(ఎంఓఈఎఫ్) నిరాకరించింది. పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ) నోటిఫికేషన్–2006 నిబంధనలను ప్రాజెక్టు ఉల్లంఘించిందని నిర్ధారించింది. ఈ నేపథ్యంలో 2021 జూలైలో జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్ఓపీ) ఆధారంగా పర్యావరణ ఉల్లంఘనలతో జరిగిన నష్టంపై అధ్యయనం జరిపించాలని నిర్ణయించింది. పర్యావరణ శాఖ ఉల్లంఘనల కమిటీ మాజీ సభ్యుడు కె.గౌరప్పన్కు అధ్యయనం జరిపి నివేదిక సమర్పించే బాధ్యతలు అప్పగించింది. కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) ఇటీవల సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. చదవండి: వైద్య నోటిఫికేషన్లు వాయిదా!.. ఆలస్యానికి కారణం ఇదే బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలి.. పర్యావరణ అనుమతుల జారీకి ముందు రాష్ట్ర ప్రభుత్వం.. నష్ట నివారణ ప్రణాళిక, ప్రకృతి, ప్రాంతీయ వనరుల వృద్ధి ప్రణాళికల అమలుకు అవసరమైన నిధులకు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుందని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఎంత మొత్తానికి గ్యారెంటీ ఇవ్వాలో తామే సిఫారసు చేస్తామని, రెగ్యూలేటరీ ఆథారిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. ఈ ప్రణాళికలను అమలు చేశాకే బ్యాంకు గ్యారెంటీలను విడుదల చేయాల్సి ఉంటుందని సూచించింది. గాలి, నీరు, భూమి, ఇతర పర్యావరణ అంశాలకు ప్రాజెక్టు వల్ల జరిగిన నష్టంపై అధ్యయనం జరిపించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పర్యావరణ చట్టం కింద నోటిఫై చేసిన పర్యావరణ ల్యాబ్/సీఎస్ఐఆర్ గుర్తింపుగల ల్యాబ్ ఆధ్వర్యంలో ఈ అధ్యయనం జరగాలని సూచించింది. అంతర్రాష్ట వివాదాల విషయంలో సంబంధిత శాఖ నుంచి అనుమతులు పొందాలని పేర్కొంది. ఫ్లోరైడ్ జోన్లో ప్రాజెక్టును నిర్మిస్తునందున జలాశయాల్లోని నీటితో భూగర్భ జలాల రిచార్జికి సదుపాయం ఉండాలని, దీనివల్ల ఫ్లోరైడ్ తీవ్రత తగ్గుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల జారీ తీవ్ర జాప్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. -
పుడమికి ప్రాణాంతకంగా ప్లాస్టిక్
సాక్షి, అమరావతి: నేలను, నీటిని, గాలిని కలుషితం చేస్తూ అత్యంత ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ ప్రపంచాన్ని వదలనంటోంది. మన దేశంలో ఒక వ్యక్తి ఏడాదికి సగటున నాలుగు కిలోల ప్లాస్టిక్‌ను వాడి పారేస్తున్నాడు. ఈ ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి 1000 సంవత్సరాలు పడుతుందని అంచనా. ప్లాస్టిక్ బాటిళ్లకు 450 ఏళ్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంచులు కుళ్లిపోవడానికి 30 ఏళ్లకు పైగా పడుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. కానీ అది మట్టిలో కలిసే లోపు అపార నష్టాన్ని కలిగిస్తుంది. ఇలా వాడి పారేసే ప్లాస్టిక్ ఇంటింటా, వీధుల్లో, రోడ్లపైన, చెత్తకుప్పల్లో, కాలువల్లో, చెరువుల్లో, నదుల్లో, చివరికి సముద్ర తీరాల్లో కూడా పేరుకుపోతోంది. సమస్త జీవరాశికి ప్రాణాంతకంగా పరిణమించింది. ప్లాస్టిక్ వాడకంపై నిషేధం ఉన్నప్పటికీ, అమలు, ఆచరణలో వైఫల్యం వల్ల రోజురోజుకు దీని బెడద పెరిగిపోతోంది. గతేడాది దేశంలో 35 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు వెలువడినట్టు కేంద్ర ప్రభుత్వం లెక్క తేల్చింది. గత ఐదేళ్లలో వీటి ఉత్పత్తి రెట్టింపయిందని, సగటు వార్షిక పెరుగుదల 21.8 శాతంగా ఉందని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. 2015–16లో 15.89 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తయితే, 2018–19లో 30.59 లక్షల టన్నులు, 2019–20లో 35 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి అయ్యాయని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి ఇటీవల పార్లమెంట్లో చెప్పారు. ప్రపంచంలో ఉత్తమ నియంత్రణ దేశాలు ప్రపంచంలో ప్లాస్టిక్ బ్యాగులు, సీసాలు, కట్లర్స్, స్ట్రాలు, కాఫీ స్టిరర్స్ వంటి వాటిని నిషేధించిన మొట్టమొదటి దేశం కోస్టారికా. ఇది యూఎన్వో అందించే అత్యున్నత పర్యావరణ పురస్కారం ‘ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’ను 2019లో అందుకుంది. ఈ దేశంలో 2021 నుంచి 80 శాతం ప్రకృతికి హాని చేయనివి, పునర్ వినియోగించదగ్గ వస్తువులను మాత్రమే వినియోగిస్తున్నట్టు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ► జమైకా 2019 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దిగుమతిని నిషేధించింది. ఈ దేశంలో పర్యావరణ అనుకూలం వస్తువులనే తయారు చేస్తున్నారు. ► ఆఫ్రికాలోని దాదాపు 34 దేశాలు ప్లాస్టిక్ బ్యాగులను నిషేధించాయి. రువాండా పదేళ్ల క్రితమే ప్లాస్టిక్ సంచులను నిషేధించింది. ► ఇండోనేసియా 2018 నుంచి ప్లాస్టిక్ బ్యాగ్‌లు, స్ట్రాలను నిషేధించింది. 2025 నాటికి ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం 70 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ► న్యూజిలాండ్ దేశం 2019లోనే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులను పూర్తిగా నిషేధించింది. లోరల్, కోకొకోలా, నెస్లే వంటి 12 అంతర్జాతీయ కంపెనీలు 2025 నాటికి 100 శాతం కంపోస్ట్ చేయదగిన ప్యాకేజింగ్‌ను అమలు చేస్తామని ఆ ప్రభుత్వానికి హామీనిచ్చాయి. ► జర్మనీ 56.1 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తూ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 53.8 శాతం, దక్షిణ కొరియా 53.7 శాతం, వేల్స్ 52.2 శాతం, స్విట్జర్లాండ్ 49.7 శాతం రీసైక్లింగ్ చేస్తున్నాయి. ఢిల్లీదే అగ్రస్థానం ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో ఢిల్లీ మహానగరం మొదటి స్థానంలోఉంది. ఇక్కడ ఏటా 2,51,850 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. 1,56,767 టన్నులతో కోల్‌కతా రెండో స్థానంలో ఉంది. చెన్నై 1,56,731 టన్నులతో తర్వాతి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 2020–21 నాటికి ప్లాస్టిక్ వ్యర్థాలు 70 వేల టన్నులుగా గుర్తించారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వద్ద 124 ప్లాస్టిక్ తయారీ యూనిట్లు, ఆరు రీసైక్లింగ్ పరిశ్రమలు నమోదు చేసుకున్నాయి. కానీ అనధి కారిక తయారీ సంస్థలు 400 వరకు ఉంటాయని అంచనా. పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతు న్న సరుకుపై లెక్కలు లేవు. అనధికారిక ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలు బీహార్‌లో అత్యధికంగా 43 శాతం, తమిళనాడులో 26 శాతం, మహరాష్ట్రలో 13 శాతం ఉన్నాయి. ఇవి విచ్చలవిడిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. 12 శాతమే రీసైక్లింగ్ ప్లాస్టిక్ వ్యర్థాలలో 12 శాతం మాత్రమే రీసైక్లింగ్ చేస్తున్నారని, 20 శాతం బహిరంగ ప్రదేశాల్లో తగులబెడుతున్నట్టు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) నివేదిక తెలిపింది. మిగిలిన 68 శాతం భూమిలో, నీటిలో కలుస్తున్నట్టు తేల్చింది. చట్ట ప్రకారం ప్లాస్టిక్ తయారీ సంస్థలు అవి ఉత్పత్తి చేస్తున్న వాటిలో 70 శాతం వ్యర్థాలను రీసైక్లింగ్ చేయాలి. కానీ ఈ నిబంధన సరిగా అమలు కావడంలేదు. దేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం ఉన్నప్పటికీ, దాని వాడకంపై నియంత్రణ లేదు. దీంతో జూలై 1వ తేదీ నుంచి 75 మైక్రాన్లు, ఆపై మందం గల ప్లాసిక్ సంచులు, బయో డిగ్రేడబుల్ కవర్లను మాత్రమే ఉత్పత్తి చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ ఏడాది డిసెంబర్ 31 నుంచి 120 మైక్రాన్లు, ఆపై మందం గలవాటినే ఉత్పత్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టిక్‌తో కొన్ని నష్టాలివీ.. ► భూసారం పెరగకుండా అడ్డుపడుతుంది ► క్లోరినేటెడ్ ప్లాస్టిక్‌తో మట్టిలో విష రసాయనాలు చేరుతున్నాయి. అ వి భూగర్భ జలాల్లో కలిసి మానవాళి, ప్రాణికోటికి హానిచేస్తున్నాయి. ► ఏటా పక్షులు, చేపలు, జంతువులు ప్లాస్టిక్ వల్ల చనిపోతున్నాయి. అంతరించిపోతున్న ప్రాణుల్లో దాదాపు 700 జాతులు ప్లాస్టిక్ వల్ల ప్రభావితమైనట్లు గుర్తించారు. ► మనం తినే జలచరాల్లో మైక్రో ప్లాస్టిక్, నానో ఫైబర్ వ్యర్థాలను కూడా కనుగొన్నారు. ► బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను మండించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 మిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉత్పత్తి అవుతోంది. ఇది 60 లక్షల మంది మరణాలకు కారణమ వుతున్నట్టు అంచనా. బహిరంగ ప్రదేశాల్లో కాల్చడం వల్ల శ్వాసకోశ రుగ్మతలు వస్తున్నాయి. ప్లాస్టిక్ పాలిమర్ అవశేషాలతో క్యాన్సర్, ఎండోక్రైన్ గ్రంధి దెబ్బతినడం, చర్మవ్యాధులు సోకుతున్నాయి. ► ప్లాస్టిక్‌లో బిస్ఫినాల్–ఏ, థాలేట్స్, డయాక్సిన్స్, పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్ (పీఏహెచ్), పాలీక్లోరినేటెడ్ బైఫినైల్స్ (పీసీబీస్), స్టైరిన్ మోనోమర్, నానిల్ఫెనాల్ వంటి విష పదార్థాలు ఉంటాయి. ఇవి మానవుల్లో ఈస్ట్రోజన్ ఉత్పత్తిని నిరోధిస్తాయి. పునరుత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. దేశానికి సిక్కిం ఆదర్శం ప్లాస్టిక్ నిషేధంలో సిక్కిం రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది. దేశంలోనే మొదటిసారిగా సిక్కిం రాష్ట్రం 1998లోనే ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ను నిషేధించింది. ప్లాస్టిక్ బాటిళ్లను నిషేధించిన మొదటి రాష్ట్రం కూడా ఇదే. 2016లో ప్రభుత్వ కార్యాలయాలు, కార్యక్రమాలలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ వాడకాన్ని నిషేధించింది. దీంతో ఈ రాష్ట్రంలో ప్యాస్టిక్ వ్యర్థాలు 5.99 టన్నులకు తగ్గిపోయింది. దీని తర్వాత మిజోరాం(13.30 టన్నులు), త్రిపుర 26.2 టన్నులు), మేఘాలయ (1,263 టన్నులు) ఉన్నాయి. -
థర్మల్.. డేంజర్ బెల్!
సాక్షి, అమరావతి: థర్మల్ విద్యుత్ కేంద్రాలు వెదజల్లే విషవాయువులు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతు న్నాయని కేంద్ర పర్యావరణ శాఖ మరోసారి రాష్ట్రాలను హెచ్చరించింది. కాలుష్య నియంత్రణ దిశగా ఆంధ్రప్రదేశ్‌లో ఏమాత్రం చర్యలు చేపట్టకపోవడాన్ని ప్రశ్నించింది. పర్యావరణ శాఖ తాజాగా పంపిన నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది. రాజధాని నగరం అమరావతికి అతి సమీపంలోని నార్లతాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎన్టీటీపీ)లో దశాబ్దాల క్రితం థర్మల్ యూనిట్లు ఏర్పాటు చేశారు. అప్పట్లో ఇవి జనావాసాలకు దూరంగా ఉన్నాయి. ఇప్పుడు అతి సమీపంలోనే రాజధానితో పాటు పెద్ద ఎత్తున కాలనీలు వెలిశాయి. దీంతో ప్రజలు అతి భయంకరమైన విషవాయువుల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అదీగాక నైట్రోజన్, సల్ఫ్యూరిక్ యాసిడ్స్ వల్ల భయంకరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తేల్చి చెప్పింది. కడపలోని ఆర్టీపీపీ, నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంతో పాటు పలు ప్రైవేటు విద్యుత్ కేంద్రాలకు సమీపంలోనూ ఇలాంటి ప్రమాదకర పరిస్థితి ఉన్నట్టు తెలిపింది. 10 కిమీ వరకూ డేంజరే థర్మల్ విద్యుత్ కేంద్రాలకు 10 కిలోమీటర్ల పరిధిలో భయంకరమైన పరిస్థితులున్నాయని పర్యావరణ శాఖ అధ్యయనంలో వెల్లడైంది. థర్మల్ కేంద్రాల్లో కాల్చే బొగ్గు నుంచి వెలువడే కాలుష్యం గుండె జబ్బులు, దీర్ఘకాలిక శ్వాసకోస వ్యాధులు, ఆస్తమా తదితర రుగ్మతలకు కారణమవుతుందని తెలిపింది. గడచిన ఐదేళ్లుగా రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద దాదాపు 90 వేల మంది ఆస్తమాకు గురైనట్టు తేలింది. ప్రాణాంతక వ్యాధుల వల్ల మృత్యువాత పడే ఐదేళ్లలోపు పిల్లల సంఖ్య గడచిన నాలుగేళ్లుగా ఎక్కువగా ఉందని పేర్కొంది. కాలుష్యం బారిన పడి ఆనారోగ్యానికి గురవుతున్న వారిలో పేదలు, మైనార్టీలు, వృద్ధులు, చిన్నారులు ఎక్కవగా ఉన్నారు. వీరు ఆరోగ్యం కోసం చేసే వ్యయం కోట్లలో ఉంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ బొగ్గు వినియోగం వల్ల పార్టిక్యులేట్ మ్యాటర్ – 2.5 (పిఎం 51,500 టన్నులు), పిఎం 10 (1,07,500 టన్నులు), సల్ఫర్‌డై ఆక్సైడ్ 1,99,500 టన్నులు), నైట్రిక్ ఆక్సైడ్ (1,87,500 టన్నులు), కార్బన్‌మోనాక్సైడ్(1,04,000 టన్నులు) వెలువడినట్టు నివేదిక వెల్లడించింది. గాలిలో కలిసిన ధూళికణాలు 2.5 మైక్రాన్స్ (మనిషి వెంట్రుక మందంలో 30వ వంతు కన్నా చిన్నవి), పరిమాణంలో ఉంటే, నేరుగా ఊపిరితిత్తులోకి వెళ్ళి ఆ తర్వాత రక్తంలో కలుస్తాయి. అనారోగ్యానికి కారణమవుతాయి. సముద్ర జీవులకూ ముప్పే రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతాల్లో ఏర్పాటైన థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే విష రసాయనాలను సముద్రంలోకే విడుస్తున్నారు. దీని వల్ల మత్స్య తదితర జీవులకూ తీవ్ర నష్టం వాటిల్లుతోంది. థర్మల్ విద్యుత్ కేంద్రాల పరిధిలో అసాధారణంగా 40–50 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. దీని వల్ల ఆ పరిసరాల్లోని వరి, మామిడి, జీడిమామిడి, కొబ్బరి తోటలు అంతరించిపోతున్నాయి. చిమ్నీ పొగ ద్వారా వెలువడిన వాయువులతో ఆమ్ల వర్షాలు వస్తున్నాయి. ఇవి పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పర్యావరణ శాఖ పేర్కొంది. ప్లాంట్ నుంచి వచ్చే బూడిదను 30 ఏళ్ల వరకూ నిల్వ చేయడం వల్ల మత్స్య సంపద, సహజ నీటి వనరులకు నష్టం వస్తోంది. ఈ నేపథ్యంలో అత్యధికంగా కాలుష్యం వెదజల్లే థర్మల్ ప్లాంట్లలో ఉత్పత్తి ఆపివేయాలని సూచించింది. వీలుకాని పక్షంలో సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. దీనికి వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని, ఇంత మొత్తం ఏపీ జెన్కో సమకూర్చుకునే స్థితిలో లేదని అధికారులు అంటున్నారు. ఏదేమైనప్పటికీ కాలుష్య నియంత్రణ దిశగా తీసుకునే చర్యలపై నివేదిక ఇవ్వాలని కేంద్ర పర్యావరణ శాఖ రాష్ట్ర విద్యుత్ సంస్థలను కోరింది. -
‘పురుషోత్తమపట్నం’ పై ఎన్జీటీలో పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును సవాల్ చేస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో పిటిషన్ దాఖలైంది. పర్యావరణ అనుమతులు లేకుండా ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును నిర్మిస్తున్నారని పిటిషనర్లు పేర్కొన్నారు. పిటిషన్ స్వీకరించిన ఎన్జీటీ కేంద్ర పర్యావరణ శాఖ, పోలవరం అథారిటీ, జలవనరుల శాఖ, ఏపీ, తెలంగాణ, ఓడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. జూలై మూడో వారానికల్లా సమాధానం చెప్పాలని ఎన్జీటీ ఆదేశించింది. గోదావరి జలాలను ఏలేరులో అనుసంధానం చేసే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నంలో చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టును నిర్మించి పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఏలేరు రిజర్వాయరులోకి 3,500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసి సాగు, విశాఖకు తాగు, పారిశ్రామిక జల అవసరాలు తీర్చాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. -
ఫార్మాసిటీకి లభించని అనుమతి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల జారీపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వాయిదా వేసింది. గత నెల 24న ఢిల్లీలో సమావేశమైన కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావ రణ మార్పుల మంత్రిత్వశాఖ (ఎంఓఈఎఫ్) నేతృత్వంలోని ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) ఈ నిర్ణయం తీసుకుంది. ఫార్మాసిటీ ద్వారా పర్యావరణం, పరిసరాలు కలుషితం కాకుండా తీసుకునే చర్యలపై సమగ్ర ప్రణాళికలతో మరింత సమాచారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమాచారాన్ని కేంద్రానికి సమర్పిస్తే ఆ తదనంతరం జరిగే సమావేశంలో ప్రాజెక్టుకు అనుమతుల జారీపై ఈఏసీ నిర్ణయం తీసుకోనుంది. ఈ ప్రాజెక్టును నిర్మిస్తే రూ. 64 వేల కోట్ల పెట్టుబ డులు వస్తాయని, ఏటా రూ. 1.4 లక్షల కోట్ల టర్నో వర్ నమోదవుతుందని, విదేశాలకు రూ. 58 వేల కోట్ల విలువగల ఔషధాలు ఎగుమతి అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాల పరిధి లోని 19,333.20 ఎకరాల విస్తీర్ణంలో రూ. 16,784 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఫార్మాసిటీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 5.56 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెబుతోంది. కమిటీ కోరిన వివరాలు ఏమిటంటే... - బల్క్ డ్రగ్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్స్ ఇంగ్రిడియెంట్స్ ఉత్పత్తి పరిశ్రమలు విడుదల చేసే రసాయన వ్యర్థాల శుద్ధి, నిర్వహణ కోసం తీసుకోబోయే చర్యలు - రసాయన వ్యర్థాలతో భూగర్భ జలాలు, భూ ఉపరితల జలాలు కలుషితం కాకుండా కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు - ఫార్మాసిటీ పరిసరాల్లో ఇప్పటికే ఉన్న కుంటలు, చెరువులు, వాగులు కలుషితం కాకుండా తీసుకునే చర్యలు - ప్రమాదకర వ్యర్థాలన్నింటినీ ఫార్మాసిటీలోనే డిస్పోజ్ చేసేందుకు తీసుకోబోయే చర్యలు - ప్రాజెక్టు పరిసరాల్లోని గొనుగుమర్ల తండా, మర్రిపల్లి గ్రామాల ప్రజలు కాలుష్యం బారిన పడకుండా తీసుకునే జాగ్రత్తలు - రసాయన ప్లాంట్ల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు, వాటిని ఎదుర్కొనేందుకు ఉన్న సన్నద్ధత వివరాలు. -
ఇద్దరు భారతీయులకు ఓజోన్ అవార్డు
న్యూఢిల్లీ: కేంద్ర పర్యావరణశాఖ మాజీ మంత్రి అనిల్ దవే, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎస్ఈ) డిప్యూటీ డైరెక్టర్ చంద్ర భూషణ్‌లు ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమంలో భాగంగా అందించే ఓజోన్ అవార్డులు అందుకున్నారు. రువాండాలో గత ఏడాది కిగాలీ ఒప్పందం కుదరడంలో దవే చొరవకు గుర్తింపుగా ఆయనకు మరణానంతరం ‘రాజకీయ నాయకత్వ అవార్డు’ను ప్రకటించారు. దవే తరఫున భారత పర్యావరణ, అటవీ శాఖ కార్యదర్శి అవార్డు స్వీకరించారు. కిగాలీ ఒప్పందంలో కీలకంగా వ్యవహరించినందుకు చంద్రభూషణ్‌కు భాగస్వామ్య అవార్డు లభించింది. -
రాజధాని మాస్టర్ ప్లాన్‌లో మార్పు
సాక్షి, అమరావతి: భూ వినియోగానికి సంబంధించి రాజధాని మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేయనున్నారు. 630 ఎకరాల అటవీ భూమిని నివాస, వాణిజ్య నిర్మాణాల జోన్ నుంచి ప్రభుత్వ జోన్లోకి మార్చాలని ఇటీవల జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయించారు. దీంతో పీ3 (రక్షిత ప్రాంతం), ఆర్1 (విలేజ్ ప్లానింగ్ జోన్), ఆర్3 (మీడియం, హై డెన్సిటీ జోన్), సీ3 (నైబర్‌హుడ్ జోన్)లో ఉన్న 630 ఎకరాల అటవీ భూమి ఇక ప్రభుత్వ జోన్లోకి వెళ్లనుంది. వివరాలు.. పెనుమాక, నవులూరు, తాడేపల్లి, ఉండవల్లి గ్రామాల పరిధిలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఈ భూమిని రాజధాని అవసరాలకు వినియోగించుకునేందుకు అనుమతివ్వాలంటూ కేంద్ర పర్యావరణ శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని అటవీ సలహా కమిటీ ఇటీవల ఈ భూ వినియోగ మార్పిడికి సూ త్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అయితే కొన్ని షరతులు విధించింది. ఈ భూమిలో 60 శాతాన్ని గ్రీన్ జోన్‌గా ఉంచాలని స్పష్టం చేసింది. అలాగే ఈ భూమిని వాణిజ్య, నివాస భవనాలు, షాపింగ్ మాల్స్, హోటళ్లు, లాడ్జిలు వంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని తేల్చిచెప్పింది. కేవలం ప్రభుత్వానికి సంబంధించిన మౌలిక వసతుల కల్పనకు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది. దీంతో ఈ భూమిని వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ భూమి మొత్తం మాస్టర్ ప్లాన్‌లో నివాస, వాణిజ్య నిర్మాణాల జోన్లో ఉండటమే ఇందుకు కారణం. దీంతో ఈ భూమిని ప్రభుత్వ జోన్లోకి మార్చుకోవడం ద్వారా వినియోగించుకోవాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీర్మానం చేశారు. అయితే మాస్టర్ ప్లాన్‌లో మార్పు చేసినా.. 630 ఎకరాల్లోని అత్యధిక భూమి పర్యావరణ సున్నిత జోన్లోనే ఉంది. -
‘కాళేశ్వరానికి’ కొండ పోచమ్మ బ్రేకులు
సామర్థ్యం పెంచితే సమస్యలని తేల్చిచెప్పిన ఇంజనీర్లు.. - ప్రాజెక్టు డీపీఆర్ పూర్తయ్యాక ఇప్పుడు మార్పులు ఎలా? - కేంద్ర పర్యావరణ, జల వనరుల శాఖలకు, సీడబ్ల్యూసీ, బోర్డుకు ఏం చెబుదాం - సీఎం ఆదేశాల నేపథ్యంలో నీటిపారుదల శాఖ తర్జనభర్జన సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై మళ్లీ తర్జనభర్జన మొద లైంది. విస్తృత చర్చలు, ఎన్నో మార్పులు చేర్పులు చేసి కొలిక్కి తెచ్చిన ఈ ప్రాజెక్టులో మార్పులతో అంతా మళ్లీ మొదటికి వస్తోంది. ప్రతిపాదిత కొండ పోచమ్మ రిజర్వాయర్ సామర్థ్యం పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పటికే సిద్ధమైన ప్రాజెక్టు సమగ్ర నివేదిక(డీపీఆర్)లో మార్పులు అనివార్యం కాను న్నాయి. వ్యయ అంచనాలు పెరగడం, మరింత భూసేకరణ చేయాల్సి రావడం, కొత్త కాల్వల నిర్మా ణంతో ప్రాజెక్టు డీపీఆర్ పూర్తిగా మారిపోనుంది. దీంతో ఇప్పటికే కేంద్ర పర్యావరణ శాఖ నుంచి పొందిన అనుమతులు, సీడబ్ల్యూసీ ముందు చేసిన వాదనలు, గోదావరి బోర్డుకు సమర్పిం చిన లెక్కలన్నీ మళ్లీ మొదటికి వచ్చే అవకాశం కనిపిస్తుండటంతో.. దీనిపై నీటి పారుదల శాఖ మల్లగుల్లాలు పడుతోంది. మూడేళ్ల కసరత్తు వృథా..! కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మూడేళ్లుగా అనేక మార్పులు, చేర్పులు జరిగిన అనంతరం ప్రాజెక్టు స్వరూపం ఓ కొలిక్కి వచ్చింది. ముఖ్యమంత్రి స్థాయి లో చర్చలు, వ్యాప్కోస్ సర్వేలు, అధికారుల అంచనా లు, పొరుగు రాష్ట్రాల అభ్యంతరాల పరిశీలన అనం తరం.. ప్రాజెక్టు కింద కొత్తగా సాగులోకి వచ్చే ఆయ కట్టు, పాత ప్రాజెక్టుల కింద స్థిరీకరణ, రిజర్వాయర్ల సామర్థ్యం, ప్రాజెక్టు వ్యయం తదితరాలపై ప్రభుత్వం సమగ్ర నివేదిక రూపొందిం చింది. ప్రాజెక్టుకు మొత్తంగా రూ.80,499.71 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. గోదావరి నుంచి 180 టీఎంసీలను మళ్లించి.. 18,25,700 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరివ్వడంతోపాటు మరో 18,82,970 ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరిం చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తంగా 150 టీఎంసీలు నిల్వ చేసుకునేలా 26 రిజర్వాయర్లను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా పాత ప్రాణహిత–చేవెళ్ల నమూనాలో ప్రతిపాదించిన 11.43 టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యాన్ని 144 టీఎంసీలకు పెంచారు. భారీగా భూసేకరణ ఈ ప్రాజెక్టుకు 80 వేల ఎకరాల భూసేకరణ అవస రమని, అందులో 2,866 హెక్టార్లు (13,706 ఎకరా ల) అటవీ భూమి అవసరమని ప్రభుత్వం తేల్చింది. ఈ వివరాలనే కేంద్ర పర్యావరణ శాఖకు, జల సంఘానికి సమర్పించింది. అయితే ఈ వివరాలపై కేంద్రం తొలుత విభేదించినా.. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిళ్ల తో పర్యావరణ మదింపు చేసేందుకు అనుమతిచ్చిం ది. సీడబ్ల్యూసీ కూడా కొన్ని సందేహాలు లేవనెత్తినా చివరికి సానుకూలత తెలిపింది. మరోవైపు ఈ ప్రాజె క్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే గోదావరి బోర్డు, కేంద్ర జల సంఘానికి ఫిర్యాదులు చేసింది. దాంతో కేంద్రం, బోర్డులు రాష్ట్ర ప్రభుత్వ వివరణ కూడా కోరాయి. ప్రభుత్వం ఇంకా వివరణ చెప్పాల్సి ఉంది. ఇలాంటి సమయంలో కొండపోచమ్మ రిజర్వాయర్ సామర్థ్యం పెంచాలని నిర్ణయించడం నీటిపారుదల శాఖకు తలనొప్పి వ్యవహారంగా మారింది. భారీగా పెరగనున్న వ్యయం కొండపోచమ్మ రిజర్వాయర్‌ను 7 టీఎంసీల సామర్థ్యంతో రూ.519.70 కోట్లతో నిర్మించేందుకు కేబినెట్ అనుమతి తీసుకుని.. పరిపాలనా అనుమతులిచ్చి, డీపీఆర్‌లు కూడా సమర్పించారు. కానీ ఇప్పుడు దాని సామర్థ్యాన్ని 21 టీఎంసీలకు పెంచడమంటే మొత్తం వ్యవహారమంతా మొదటికి వస్తుందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ప్రాజెక్టు వ్యయం మరో రూ.2,300 కోట్ల మేర పెరుగుతుందని, అదనంగా మరో 3 నుంచి 4 వేల ఎకరాల భూసేకరణ అవసరమవుతుందని, ముంపు గ్రామాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. ఈ మార్పులతో కొత్తగా డీపీఆర్ తయారు చేయాలంటే చాలా సమయం పడుతుందని అంటున్నాయి. ఒకవేళ కొత్త డీపీఆర్ చేయకుండా పాత డీపీఆర్‌తో ముందుకెళితే ఆంధ్రప్రదేశ్ మళ్లీ గోదావరి బోర్డు, కేంద్రం ముందు పంచాయితీ పెట్టే అవకాశాలున్నా యని చెబుతున్నాయి. అంతేగాకుండా కొత్త డీపీఆర్‌కు మళ్లీ కేంద్ర సంస్థల అనుమతి పొందాలంటే అనేక వివరణలు ఇచ్చుకోవాల్సి ఉంటుందని నీటి పారుదల వర్గాలు పేర్కొంటు న్నాయి. ఈ నేపథ్యంలో ఎలా ముందుకు సాగాలో తెలియక తర్జనభర్జన పడుతున్నాయి. డీపీఆర్ కోరిన బోర్డు ఇక మరోవైపు గోదావరి బోర్డు కాళేశ్వరం ప్రాజెక్టుపై మళ్లీ తెలంగాణ వివరణ కోరింది. ప్రాజెక్టు డీపీఆర్‌ను త్వరగా సమర్పించాలని సూచిస్తూ బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ బుధవారం లేఖ రాశారు. ఎంత ఆయకట్టు, ఎంత నీటి వినియోగం, ఎంత ఖర్చవుతుందనే వివరాలు తెలపాలని అందులో సూచించారు. -
యాదాద్రి ప్లాంట్‌కు ఓకే
-
యాదాద్రి ప్లాంట్‌కు ఓకే
- షరతులతో కూడిన పర్యావరణ అనుమతులు - కేంద్రానికి నిపుణుల కమిటీ సిఫార్సు - రూ.25 వేల కోట్లు... 4,000 ఉద్యోగావకాశాలు సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) నిర్మించ తలపెట్టిన 4,000 మెగావాట్ల (5’800) యాదాద్రి సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్కేంద్రానికి షరతులతో కూడిన పర్యావరణ అనుమతులివ్వాలని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) సిఫార్సు చేసింది. ఏప్రిల్ 26న జరిగిన ఈఏసీ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్ర పర్యావరణ శాఖ తాజాగా బయట పెట్టింది. దీంతో ప్లాంట్ నిర్మాణానికి ప్రధాన అడ్డంకి తొలగినట్టయింది. రూ.25,099.42 కోట్ల అంచనా వ్యయంతో జెన్కో నిర్మిస్తున్న ఈ విద్యుత్కేంద్రం నిర్మాణంలో ప్రత్యక్షంగా 150 మందికి, పరోక్షంగా 5,000 మందికి ఉపాధి, ఉగ్యోగావకాశాలు లభించనున్నాయి. నిర్మాణం పూర్తయ్యాక ప్రత్యక్షంగా 2,000, పరోక్షంగా మరో 2,000 మందికి ఉపాధి లభిస్తుంది. ప్లాంట్‌కు పర్యావరణ అనుమతుల విషయంలో ఈఏసీ పలు షరతులు విధించింది. అలాగే ‘బూడిద శాతం 30కి మించకుండా, రైల్వే లైన్ ద్వారానే సింగరేణి సంస్థ బొగ్గును సరఫరా చేయాలి. రైల్వే లైన్‌కు భూ సేకరణ కోసం ఎవరినీ నిర్వాసితులను చేయొద్దు. ప్రాజెక్టు నిర్మాణానికి భూగర్భ జలాలను వినియోగించరాదు.’ అన్న అంశాలపై జెన్కో నుంచి రాతపూర్వక హామీ కోరింది. ఈఏసీ విధించిన ఇతర షరతులు... ► వీర్లపాలెంలోని మాడచెలు ప్రాంతం నుంచి కృష్ణా నదిలోకి సహజ నీటి ప్రవాహ వ్యవస్థను సంరక్షిస్తామంటూ జెన్కో రాతపూర్వక హామీ ఇవ్వాలి ► 50కి.మీ. దూరంలో ఎక్కడైనా మురుగు నీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్టీపీ) ఉంటే ప్లాంట్ అవసరాలకు ఆ నీటినే వాడాలి ► ప్లాంట్ మధ్యలో నుంచి వెళ్తున్న వాగుకు రెండు వైపులా 100 మీటర్ల స్థలాన్ని చెట్ల పెంపకానికి కేటాయించాలి. హెక్టారుకు 2,500 మొక్కలు పెంచాలి ► ప్రాజెక్టు కింద స్థలాలు కోల్పోయే ప్రజల నైపుణ్యాలను గుర్తించి వారికి జీవనోపాధి కల్పించేందుకు దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలి. దీనిపై అనుమతులు జారీ తర్వాత మూడు నెలల్లో ప్రణాళికను జెన్కో సమర్పించాలి ► ప్రాజెక్టు పరిసరాల్లో ఆధునిక సూక్ష్మ, సేంద్రియ సాగు, సేంద్రియ ఎరువుల ప్రోత్సాహానికి చర్యలు తీసుకోవాలి ► కార్పొరేట్ సామాజిక బాధ్యత అమలులో మహిళా సాధికారతను దృష్టిలో పెట్టుకోవాలి. వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఏర్పాటు చేయాలి ► యువతకు కంప్యూటర్ శిక్షణ అందించేందుకు పాఠశాలలో కంప్యూటర్లు, కంప్యూటర్ శిక్షకుడి ఏర్పాట్లు చేయాలి ► స్వచ్ఛ భారత్ అభియాన్ కింద అన్ని బయో టాయిలెట్లకు నీటి సదుపాయం కల్పించాలి. -
పోలవరం డంప్‌పై తనిఖీ ప్రారంభించండి
కేంద్ర పర్యావరణ శాఖకు ఎన్జీటీ ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు వ్యర్థాలను అక్రమంగా మూల లంక వద్ద డంప్ చేస్తున్నారని సామాజిక వేత్త డాక్టర్ పెంటపాటి పుల్లారావు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జాతీయ హరిత ట్రిబ్యునల్ దీనిపై ఈ సోమవారం నుంచి తనిఖీ ప్రారంభించాలని కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించింది. మార్చి 21న హరిత ట్రిబ్యునల్ ఇవే ఆదేశాలను ఇస్తూ రెండు వారాల్లోగా తనిఖీ నివేదికను సమర్పించాలని పేర్కొంది. అయితే ఇప్పటివరకు తనిఖీ చేపట్టకపోవడంతో వచ్చే సోమవారం ఉదయం నుంచి ఈ తనిఖీ ప్రారంభించాలని ఆదేశించింది.