పోలవరం డంప్‌పై తనిఖీ ప్రారంభించండి
కేంద్ర పర్యావరణ శాఖకు ఎన్జీటీ ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు వ్యర్థాలను అక్రమంగా మూల లంక వద్ద డంప్ చేస్తున్నారని సామాజిక వేత్త డాక్టర్ పెంటపాటి పుల్లారావు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జాతీయ హరిత ట్రిబ్యునల్ దీనిపై ఈ సోమవారం నుంచి తనిఖీ ప్రారంభించాలని కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించింది.
మార్చి 21న హరిత ట్రిబ్యునల్ ఇవే ఆదేశాలను ఇస్తూ రెండు వారాల్లోగా తనిఖీ నివేదికను సమర్పించాలని పేర్కొంది. అయితే ఇప్పటివరకు తనిఖీ చేపట్టకపోవడంతో వచ్చే సోమవారం ఉదయం నుంచి ఈ తనిఖీ ప్రారంభించాలని ఆదేశించింది.