Green Tribunal
-
సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణ పనులపై అభ్యంతరాలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణ పనుల పరిశీలనకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నియమించిన ద్విసభ్య కమిటీ నేడు జిల్లాలో పర్యటించనుంది. ఈ మేరకు కమిటీ పర్యటనలకు అనుగుణంగా సీతమ్మ సాగర్ బ్యారేజీ ప్రభావిత ప్రాంతాల్లో ఇంజనీరింగ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 3,600 ఎకరాలు అవసరం.. రాష్ట్ర ప్రభుత్వం బహుళార్థ సాధక ప్రాజెక్టుగా ‘సీతారామ’ను చేపడుతోంది. దీని ద్వారా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే వీలుంది. దీంతో పాటు 320 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సీతారామ ప్రాజెక్టులో కీలకమైన సీతమ్మ సాగర్ బ్యారేజీని అశ్వాపురం – దుమ్ముగూడెం మండలాల మధ్య గోదావరి నదిపై నిర్మిస్తున్నారు. బ్యారేజీ నిర్మాణం, బ్యాక్ వాటర్ ముంపు, నదికి ఇరువైపులా కరకట్టలు తదితర అవసరాల కోసం చర్ల, దుమ్మగూడెం, మణుగూరు, అశ్వాపురం మండలాల పరిధిలో 3,600 ఎకరాల స్థలం అవసరమవుతోంది. ఇందులో ఇప్పటికే 3,100 ఎకరాలు సేకరించగా ఇంకా 500 ఎకరాలు సేకరించాల్సి ఉంది. భూ సేకరణ సందర్భంగా ప్రభుత్వం అందించే నష్టపరిహారంపై నిర్వాసిత రైతుల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది. మరోవైపు భూసేకరణ పూర్తి స్థాయిలో జరగకపోయినా బ్యారేజీ నిర్మాణ పనులు మాత్రం చకచకా సాగుతున్నాయి. గ్రీన్ ట్రిబ్యునల్ ఎంట్రీ.. తమకు తగినంత నష్టపరిహారం చెల్లించడం లేదంటూ సీతమ్మసాగర్ నిర్వాసిత రైతులు నిరసన కార్యక్రమాలకు దిగుతున్నారు. మరోవైపు బ్యారేజీ నిర్మాణం కారణంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలు, పొలాలు, అడవులు మునిగిపోతాయనే ఆందోళనలు పెరిగాయి. సరైన అనుమతులు తీసుకోకుండా బ్యారేజీ నిర్మాణ పనులు సాగతున్నాయంటూ ప్రాజెక్టు బాధితుల్లో కొందరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీంతో అన్ని అనుమతులు వచ్చే వరకు బ్యారేజీ నిర్మాణ పనులు నిలిపివేయాలంటూ గ్రీన్ ట్రిబ్యునల్ గత ఏప్రిల్ 26న ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ పనులు కొనసాగుతుండడంతో బాధితులు మే నెలలో మరోసారి గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలన సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణ పనులపై వస్తున్న అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని గ్రీన్ ట్రిబ్యునల్ మే 29న నియమించింది. ఇందులో తరుణ్ (రీజనల్ డైరెక్టర్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, హైదరాబాద్), ప్రసాద్ (సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్, గోదావరి నదీ జలాల నిర్వహణ బోర్డు) సభ్యులుగా ఉన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు వారు బుధవారం అశ్వాపురం, దుమ్ముగూడెం, మణుగూరు, చర్ల మండలాల పరిధిలో పర్యటించనున్నారు. ముఖ్యంగా గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు క్షేత్రస్థాయిలో ఏ మేరకు అమలవుతున్నాయి, నిర్వాసితులకు సరైన పరిహారం అందుతోందా, పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న జాగ్రత్తలు తదితర అంశాలను పరిశీలించనున్నారు. ఈ క్రమంలో సంబంఽధిత ఇంజనీరింగ్ అధికారులు, నిర్మాణ పనులు చేపడుతున్న కంపెనీ ప్రతినిధులు, ప్రాజెక్టు నిర్వాసితులు, ప్రభావిత ప్రాంతాల ప్రజలను కలిసి నేరుగా వివరాలు సేకరించనున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో సేకరించిన అంశాలను క్రోడీకరించి జూలై 12లోగా ద్విసభ్య కమిటీ తన నివేదికను అందించాల్సి ఉంటుంది. పరిహారంపై పేచీ.. సీతమ్మ సాగర్ బ్యారేజీ ప్రభావిత ప్రాంత ప్రజలు, రైతులతో ప్రజాభిప్రాయ సేకరణను జూన్ 14న చేపట్టారు. ఈ సమావేశంలో సీతారామ ప్రాజెక్టును ప్రభావిత ప్రాంత రైతులు స్వాగతించినప్పటికీ.. నష్ట పరిహారం విషయంలో మాత్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎకరానికి రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు నష్టపరిహారం చెల్లిస్తుండగా, రైతులు రూ.30 లక్షలు ఇవ్వాలని కోరుతున్నారు. ఇక బ్యారేజీ నిర్మాణ పనులు జరుగుతున్న అమ్మగారిపల్లి, కుమ్మరిగూడెం గ్రామాల్లోని రైతులు దాదాపుగా సర్వం కోల్పోయిన పరిస్థితి నెలకొంది. దీంతో జల విద్యుత్ కేంద్రంలో ఈ గ్రామాలకు చెందిన వారికి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఆగిన ‘సీతమ్మ సాగర్’ పనులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోదావరిపై చేపట్టిన సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణ పనులకు బ్రేక్ పడింది. సీతమ్మ సాగర్ నిర్మాణ పనులకు సంబంధించి అభ్యంతరాలను లేవనెత్తుతూ కొందరు వేసిన పిటిషన్‌పై గ్రీన్ ట్రిబ్యునల్ ద్విసభ్య కమిటీని నియమించింది. గతంలో గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఏమైనా పనులు జరుగుతున్నాయా? లేదా ? అనే అంశాలను ద్విసభ్య కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది. దీంతో బ్యారేజీ నిర్మాణ పనులు నిలిపివేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే పని ప్రదేశం నుంచి కొంత మిషనరీ, కార్మికులను వెనక్కి రప్పించింది. ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో పనులు నిలిపివేయనుంది. బాధితుల ఫిర్యాదుతో.. గ్రీన్ ట్రిబ్యునల్ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు సీడబ్ల్యూసీ నుంచి పూర్తి స్థాయిలో అనుమతి పొందేందుకు తుది డీపీఆర్‌ను సిద్ధం చేశారు. అదే సమయంలో ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూలమైన వేసవికాలం వృధా కాకూడదనే ఉద్దేశంతో బ్యారేజీ అనుబం«ధ పనులు కొనసాగిస్తూ వచ్చారు. దీంతో బాధితులు మరోసారి గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. పనులకు సంబంధించి కొన్ని ఫొటోలను సైతం సమర్పించారు. ఈ నేపథ్యంలోనే ట్రిబ్యునల్ ద్విసభ్య కమిటీని నియమించింది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ రీజనల్ డైరెక్టర్ (హైదరాబాద్), గోదావరి బోర్డులో ఎస్ఈ ర్యాంక్‌కు తక్కువ కాని వారు సభ్యులుగా ఉండాలని ఆదేశించింది. సభ్యుల ఎంపిక పూర్తయిన తర్వాత కమిటీ జూన్‌లో క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టనుంది. జూలై 12లోగా ఈ కమిటీ తమ నివేదికను అందించాల్సి ఉంటుంది. ఆ ముద్ర పడకూడదని.. తెలంగాణాలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడంలో కేంద్రం తాత్సారం చేస్తోందనే ఆరోపణలు మొదట్నుంచీ ఉన్నాయి. ముఖ్యంగా ‘సీతారామ’డిజైన్ల విషయంలో కోర్రీల మీద కొర్రీలు వేస్తూ వస్తోంది. ఈ సమయంలో గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారనే ముద్ర పడటం మంచిది కాదనే అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు సమాచారం. ఈ కారణంగానే బ్యారేజీ, కరకట్టల దగ్గర జరుగుతున్న పనులు ఆపేయాలంటూ నిర్మాణ సంస్థలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై వివరణ కోసం సీతారామ ఇంజనీర్లను సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ఏప్రిల్‌లో స్టే.. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు, 320 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా బహుళార్థ సాధక ప్రాజెక్టుగా సీతారామ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం – దుమ్ముగూడెం మండలాల మధ్య గోదావరి నదిపై బ్యారేజీ నిర్మిస్తోంది. అయితే బ్యారేజీ నిర్మాణం కారణంగా గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాలు, పొలాలు, అడవులు మునిగిపోతాయనే ఆందోళన నెలకొంది. మరోవైపు నష్టపరిహారం సైతం తగు మొత్తం చెల్లించడం లేదంటూ రైతులు నిరసనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టు బాధితుల్లో కొందరు సరైన అనుమతులు తీసుకోకుండా బ్యారేజీ నిర్మాణ పనులు చేస్తున్నారంటూ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 26న గ్రీన్ ట్రిబ్యునల్ పనులపై స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. -
ఇసుక దోపిడీపై స్పందించిన గ్రీన్ ట్రిబ్యునల్
-
గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు విత్‌డ్రా చేసుకోండి
పరిగి: కాంగ్రెస్ పార్టీ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు విత్‌డ్రా చేసుకుంటే 15 రోజుల్లో పరిగిలో పాలమూరు ఎత్తిపోతల పనులకు టెంకాయ కొడతామని భారీ నీటిపారుదల మంత్రి టి. హరీశ్‌రావు స్పష్టం చేశారు. శనివారం మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, విద్యా మౌలిక వన రుల అభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మన్ నాగేందర్‌గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్ కొప్పుల మహేశ్‌రెడ్డితో కలసి పరిగిలో పర్యటించారు. బీఎంఆర్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న పోటీ పరీక్షల శిక్షణ కార్యక్రమంలో మెటీరియల్ పంపి ణీ చేశారు. అనంతరం మండల పరిధిలోని లఖ్నాపూర్ ప్రాజెక్టును రూ.8.15 కోట్లతో మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చే పనులకు హరీశ్‌రావు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పరిగి ఎమ్మెల్యే ఓ టైపు మనిషి ఆయా కార్యక్రమాల్లో హరీశ్‌రావు మాట్లాడుతూ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అంతా ఓ టైపు మనిషి.. వాళ్ల పార్టీ తప్పు చేస్తే దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తారని విమర్శించారు. మీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి చెప్పి కేసు విత్‌డ్రా చేయించమనండి.. లేదంటే హర్షవర్ధన్‌రెడ్డితో తమకు సంబంధం లేదని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా మంత్రి సవాల్ విసిరారు. త్వరలో 9,600 పంచాయతీ కార్యదర్శులను కొత్త జిల్లాల వారీగా చేపడతామని తెలిపారు. రాష్ట్రంలో ఏర్పడిన కొత్త జిల్లాలకు సంబంధించిన సవరణ ఆమోదం కోసం సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారని చెప్పారు. ఉద్యోగాల కల్పనలో తెలంగాణ రాష్ట్రం టాప్‌లో ఉందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. 16 వేల కానిస్టేబుల్, రెండు వేల ఎస్ఐ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని తెలిపారు. రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రూ.480 కోట్లతో 1,450 చెరువుల్లో మిషన్ భగీరథ పనులు చేపట్టామన్నారు. -
నిరసన హక్కుకు ఊపిరి
జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) నుంచి ఊహించని రీతిలో భావ ప్రకటనా స్వేచ్ఛకు వచ్చి పడిన ముప్పు తప్పింది. ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సభలూ, సమావేశాలూ జరపడాన్ని నిలిపేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యను సుప్రీంకోర్టు తోసి పుచ్చింది. తరచు జరిగే సభలూ, సమావేశాల వల్ల ఆ ప్రాంతం కాలుష్యమయం అయిందని, అక్కడ ఆందోళనలకు తావు లేకుండా చర్యలు తీసుకోవటం తక్షణావసరమని నిరుడు అక్టోబర్‌లో ట్రిబ్యునల్ ఉత్తర్వులిచ్చింది. సాధారణంగా ట్రిబ్యునల్ ఇచ్చే ఉత్తర్వుల అమలులో అలసత్వాన్ని ప్రదర్శించే ప్రభుత్వ యంత్రాంగం హుటాహుటీన వాటిని అమలు చేసి ఆ ప్రాంతంలో నిరసన స్వరం వినబడకుండా జాగ్రత్తపడింది. అయితే సభలూ, సమావేశాల వల్ల సమస్యలుంటే వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించాలి తప్ప అసలు నిరసనలకే చోటీయరాదనుకోవటం అప్రజాస్వా మికమవుతుందని సర్వోన్నత న్యాయస్థానం తాజా తీర్పులో స్పష్టం చేసింది. ఏడాది పొడవునా ఎడతెగకుండా సాగే నిరసనల వల్ల జంతర్‌మంతర్ వాసులకు ఇబ్బందులు కలుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదుల్లో అవాస్తవం లేకపోవచ్చు. వివిధ సంస్థలు, పార్టీలు ఏదో ఒక సమస్యపై అక్కడ సభలూ, సమావేశాలూ నిర్వహిస్తాయి. వాటిల్లో పాలుపంచుకోవటానికి వేర్వేరు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ప్రజానీకం అక్కడికొస్తుంది. అంతమంది జనం ఒకచోట గుమిగూడి నప్పుడు ట్రాఫిక్ సమస్య మొదలుకొని ఎన్నో సమస్యలు వస్తాయి. పారిశుద్ధ్యం కూడా అందులో ఒకటి. నిరసన తెలపడానికి వచ్చిన వారిని అందుకు నిందించి ప్రయోజనం లేదు. భారీ సంఖ్యలో పౌరులు వచ్చినప్పుడు వారికి అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడటం, తగినన్ని మరుగుదొడ్లు ఉండేలా చూడటం, నిర్ణీత సమయం తర్వాత మైకులు ఉపయోగించరాదని నిబంధనలు విధించటం వంటివి అమలు చేయటం ద్వారా స్థానికులు ఎదుర్కొంటున్నామని చెబుతున్న ఇబ్బందులను తొల గించడానికి వీలుంది. హరిత ట్రిబ్యునల్ ఈ కోణంలో ప్రభుత్వానికి తగిన మార్గదర్శకాలిచ్చినా... కనీసం ప్రభుత్వం తనకు తాను ఈ మాదిరి చర్యలు తీసుకున్నా బాగుండేది. కానీ ట్రిబ్యునల్ ఆదే శాలివ్వటమే తరవాయి అన్నట్టు జంతర్‌మంతర్‌లో నిరసనలను నిషేధించింది. ట్రిబ్యునల్ ఆ ఉత్తర్వులిచ్చే సమయానికి ‘ఒకే ర్యాంకు–ఒకే పెన్షన్’ కోరుతూ మాజీ సైనికులు జంతర్‌మంతర్‌లో నిరసన ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. పోలీసులు ఆ మాజీ సైనికులు వేసుకున్న టెంట్లు కూలగొట్టి, అక్కడినుంచి వెళ్లగొట్టారు. వీరంతా సైన్యంలో ఉన్నతస్థాయి అధికారులుగా, సాధారణ జవాన్లుగా పనిచేసి రిటైరైనవారు. రణరంగంలో శత్రువుతో తలపడి దేశ రక్షణకు నిలబడిన యోధుల గోడు పట్టించుకోకపోవడమే అన్యాయమనుకుంటే...దాన్ని బలంగా వినిపించటం కోసం నిరసన ప్రదర్శ నలు నిర్వహిస్తుంటే అందుకు సైతం అవకాశమీయలేదు. అదేమంటే ట్రిబ్యునల్ ఆదేశాలు పాటిస్తు న్నామని జవాబు! అసలు ట్రిబ్యునల్ ప్రధాన వ్యాపకం పర్యావరణ పరిరక్షణ. గాలి, నీరు కాలుష్య మయం చేసే చర్యలను అరికట్టడం, అడవులు అంతరించిపోకుండా, ఎడాపెడా మైనింగ్ కార్యకలా పాలు సాగకుండా చూడటం దాని బాధ్యతలు. నిరసనలవల్ల కాలుష్యం ఏర్పడుతుందని, దాన్ని నియంత్రించడం కూడా తన కర్తవ్యమేనని ట్రిబ్యునల్‌కు ఎందుకు అనిపించిందో! తాము వేయికళ్లతో సుభిక్షంగా పాలిస్తున్నామని, సమాజంలో ఏ వర్గానికీ అన్యాయం జరిగే అవకాశం లేదని పాలకులు తమకు తాముగా నిర్ణయించుకుంటే చెల్లదు. అసహాయులను గొంతె త్తనీయాలి. జరుగుతున్న అన్యాయాలేమిటో చాటడానికి అవకాశమీయాలి. అప్పుడే పొరపాట్లు సరిదిద్దుకోవటానికి అవకాశముంటుంది. అదే ప్రజాస్వామ్యమనిపించుకుంటుంది. ఏం జరిగినా తమకు విన్నపాలు చేసుకుని నోర్మూసుకోవాలని, వినతిపత్రాలిచ్చి సరిపెట్టుకోవాలని భావిస్తే కుదరదు. ఢిల్లీ వీధుల్లో కదులుతున్న బస్సులో ఆరేళ్లక్రితం ఒక యువతిపై అత్యాచారం జరిపి, ఆమెనూ, ఆమెతో ఉన్న మరో యువకుణ్ణి చావుబతుకుల మధ్య నడిరోడ్డుపై విసిరేసినప్పుడు జంత ర్మంతర్లో జనాగ్రహం కట్టలు తెంచుకుంది. ఎన్నివిధాలుగా ఉద్యమాన్ని అణచాలనుకున్నా అది ఉవ్వెత్తున ఎగసింది. ఫలితంగా అత్యాచారాలను అరికట్టడానికి నిర్భయ చట్టం అమల్లోకొచ్చింది. ఆ చట్టం ఆచరణలో ఎలా విఫలమవుతున్నదన్న అంశం పక్కనబెడితే సమస్య తీవ్రత అర్ధం కావ టానికి, అది తక్షణం పరిష్కరించాల్సి ఉన్నదని సర్కారు గ్రహించటానికి జంతర్‌మంతర్ నిరసన ఎంతగానో తోడ్పడింది. సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ పథకం, భూసేకరణ చట్టం, అట్టడుగు వర్గాలవారికి అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు గాల్లోంచి ఊడిపడలేదు. పాలకులకు ఏ బోధివృక్షం నీడనో జ్ఞానోదయం కావడం వల్ల రూపొందలేదు. ధర్నాలు, నిరసనలు, ఉద్యమాలు పోటెత్తడం వల్లే... తమకు కావాల్సిందేమిటో ప్రజలు ఎలుగెత్తి చాటడం వల్లే ప్రభుత్వాల్లో కదలిక వచ్చింది. నల్లజెండాలు కనబడకపోతే, నినాదాలు వినబడకపోతే, మా డిమాండ్ల సంగతేమిటని ఎవరూ నిలదీయకపోతే పాలకులకు బాగానే ఉంటుంది. అలాగే ఎటు చూసినా భజన బృందాల సందడి కనిపిస్తే సంతోషంగానే అనిపిస్తుంది. కానీ అది గల్ఫ్ దేశాల్లోనో, ఉత్తరకొరియాలోనో, చైనాలోనో సాధ్యం కావచ్చుగానీ ఇక్కడ కుదరదు. దురదృష్టకరమైన సంగతేమంటే... ఈమధ్యకాలంలో అన్ని ప్రభుత్వాలూ నిరసనల విషయంలో ఒకేలా ప్రవర్తిస్తున్నాయి. హైదరాబాద్‌లో ధర్నా చౌక్ ఉండొద్దని తెలంగాణ సర్కారు, అమరావతిలో ప్రశ్నిస్తే పాపమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ నిరసనల నోరు నొక్కుతున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు జంతర్‌మంతర్ నిరసనల విషయంలో వెలువరించిన తీర్పు వెనకున్న స్ఫూర్తిని గ్రహించి అయినా అన్ని ప్రభుత్వాలూ నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. ప్రజాస్వామిక హక్కులను గౌరవించాలి. -
కాళేశ్వరంపై ఎన్జీటీ విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ఎత్తిపోత పథకానికి సంబంధించి పర్యావరణ అనుమతులపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో దాఖలైన పిటిషన్‌పై విచారణ ఫిబ్రవరి 16వ తేదీకి వాయిదా పడింది. బుధవారం ఈ కేసును జస్టిస్ యూడీ సాల్వీ బెంచ్ విచారించింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ప్రకాష్‌రెడ్డి వాదిస్తూ.. ఈ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని, ప్రాజెక్టుకు సంబంధించి అన్నిరకాల అనుమతులు వచ్చాయని తెలిపారు. పర్యావరణ అనుమతులు లభించనప్పుడు ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిస్తూ పనులు చేపట్టిందని, దీనిపై విచారణ జరిపేందుకు కమిషన్ ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయిలో అధ్యయనం జరిపించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది సంజయ్ ఉపాధ్యాయ కోరారు. అనుమతులు లభించనప్పుడు ప్రభుత్వం కేవలం తాగునీటి అవసరాల కోసమే పనులు చేపట్టిందని, తాగునీటి అవసరాల కోసం చేపట్టే పనులకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని స్పష్టం చేశారు. ట్రిబ్యునల్ కల్పించుకుని అసలు పిటిషనర్లు దాఖలు చేసిన అప్లికేషన్ విచారణ చేయదగిందా? లేదా? అన్నది ముందు తేల్చుతామని అనంతరం విచారణ పరిధిపై నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. -
కాలుష్యానికి కేరాఫ్ ఊరు.. తాండూరు!
సాక్షి, వికారాబాద్/తాండూరు: కాలుష్యం.. ఢిల్లీలో పరిస్థితిని అందరూ చూశాం.. క్రికెట్ మ్యాచ్‌ల్లో సైతం మాస్కులేసుకోవాల్సిన పరిస్థితి.. అంతకు మించిన దుస్థితి వికారాబాద్ జిల్లా తాండూరులో నెలకొని ఉంది. గతేడాది కాలుష్య నియంత్రణ బోర్డు(పీసీబీ) జరిపిన పరీక్షల్లో కాలుష్యం విషయంలో తాండూరు దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు గుర్తించారు. గాలిలో పీఎం 10 సూక్ష్మధూళి కణాలు క్యూబిక్ మీటర్‌కు 60 మైక్రోగ్రాములు ఉండాల్సి ఉండగా.. తాండూరులో 622 (ప్రస్తుతం 520) ఉన్నట్లు తేలింది. ఈ విషయం నిర్ధారించి ఏడాదవుతున్నా.. కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. దీంతో తాండూరు, పరిసర ప్రాంతాలలో వాయు కాలుష్యం పెరిగి ప్రజలు అవస్థలు పడుతున్నారు. గాలిలో అతి సూక్ష్మ ధూళికణాలు పీఎం 2.5, సూక్ష్మ ధూళి కణాలు పీఎం10 పరిమితికి మించి ఉండటం అత్యంత ప్రమాదకరమైనవని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. సిమెంట్, నాపరాతి పరిశ్రమల వల్లనే.. జిల్లాలో తాండూరుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఓ వైపు సిమెంట్ కర్మాగారాలు, మరో వైపు నాపరాతి పరిశ్రమలతో దేశంలోనే గుర్తింపు పొందింది. తాండూరు ప్రాంతంలో ఐదు భారీ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అంతేకాకుండా వందలాది నాపరాతి పరిశ్రమలు, పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి. వీటితో పాటుగా సిమెంట్, నాపరాతి రవాణాకు నిత్యం వందలాది భారీ లోడ్ వాహనాలు తిరుగుతుంటాయి. వాహనాల సంఖ్య గణనీయంగా పెరగడం, ఇందుకు అనుగుణంగా రహదారులను విస్తరించకపోవడం, పరిశ్రమల నుంచి కాలుష్య ఉద్గారాల విడుదల ఇవన్నీ వాయి, నీటి కాలుష్యానికి కారణాలుగా నిలుస్తున్నాయి. నాపరాతి పాలిషింగ్ యూనిట్లు, సుద్ద కంపెనీల నుంచి దుమ్ము ధూళితోపాటు విష రసాయనాలు గాలిలో కలుస్తున్నాయి. పాలిషింగ్ యూనిట్ల నుంచి వచ్చిన వ్యర్థాలను రోడ్డు పక్కన డంప్ చేస్తున్నారు. నాపరాతి నిక్షేపాలు, ఎర్రమట్టి, సుద్ద ఖనిజాలుండటంతో ప్రతిరోజూ 5 వేలకు పైగా లారీలు, ట్రక్కులు తాండూరు నుంచి రాకపోకలు సాగిస్తుంటాయి. అటు సిమెంట్ కర్మాగారాల నుంచి వస్తున్న కాలుష్యాన్ని అరికట్టే విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దేశంలోనే ఢిల్లీ కాలుష్య నగరంగా రికార్డుకెక్కింది. ప్రస్తుతం ఇక్కడ సూక్ష్మధూళి కణాలు క్యూబిక్ మీటర్‌కు 359గా ఉంది. అదే తాండూరులో 520గా ఉండటం గమనార్హం. గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు.. తాండూరు కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడడమే కాకుండా ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ గతేడాది జూలైలో తాండూరుకు చెందిన రాజ్‌గోపాల్ సార్డా అనే వ్యక్తి స్థానిక అధికారులకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో చెన్నైలోని గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాడు. దీనిపై త్వరలోనే తీర్పు వెలువడనుందని రాజ్‌గోపాల్ సార్డా తెలిపారు. -
నిస్సహాయ ‘గంగ’
గంగా నదిపై సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) తరచు ఇస్తున్న ఆదేశాలు మన ప్రభుత్వాల తీరుతెన్నుల్ని ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. ఏళ్లు గడుస్తున్నా నదుల విషయంలో ఇంకా చెప్పించుకునే స్థితిలోనే తప్ప... ప్రశంసించదగ్గ రీతిలో ప్రభుత్వాలు చేసింది ఒక్కటి కూడా లేదని ఈ ఆదేశాల పరంపర చూస్తే అర్ధ మవుతుంది. అయిదు రాష్ట్రాల్లో 2,525 కిలోమీటర్ల నిడివిలో ప్రవహించే గంగా నది కొన్ని దశాబ్దాలుగా కాలుష్యం బారిన పడుతోంది. ఆ నీరు తాగడం మనుషులకు, జంతువులకు హానికరమయ్యే దుస్థితి ఏర్పడింది. హరిద్వార్, కనౌజ్లాంటి ఘాట్ లలో నీటిని పరీక్షించి చూస్తే స్నానానికి అది పనికిరాదని తేలిందని ఇటీవలే కేంద్ర మంత్రి విజయ్ గోయెల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతక్రితం యూపీఏ ప్రభుత్వ హయాంలో, ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక గంగ ప్రక్షాళన కోసం భారీ యెత్తున నిధులు కేటాయించారు. ఆ నిధుల్లో సింహభాగం ఖర్చు కాకపోవడం ఒకటైతే... వ్యయం చేసిన నిధుల వరకైనా పనికొచ్చిన వైనం కనబడకపోవడం మరో విషాదం. గత మూడేళ్ల లెక్కలు తీసుకున్నా ఈ సంగతే వెల్లడవుతుంది. 2014–15లో రూ. 2,053 కోట్లు కేటాయిస్తే కేవలం 170 కోట్లు ఖర్చుచేశారు. 2015–16లో రూ. 1,650 కోట్లు కేటాయిస్తే రూ. 602.60 కోట్లు వినియోగించారు. నిరుడు కేటాయించిన రూ. 1675 కోట్ల నిధుల్లో రూ. 756.01 కోట్లు ఖర్చయ్యాయి. యూపీఏ హయాంతో మొదలుపెడితే మొన్న మార్చి వరకూ మొత్తంగా గంగా నది ప్రక్షాళన కోసం రూ. 7,304.64 కోట్లు వ్యయం చేశారని గణాంకాలు చెబుతు న్నాయి. కానీ జరిగిందేమిటి? మూడేళ్లక్రితం గంగాహారతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ 2019లో జరగబోయే మహాత్మాగాంధీ 150వ జయంతినాటికల్లా గంగానదిని ప్రక్షాళన చేసి ఆ మహనీయుడి స్మృతికి ఘనంగా నివాళి అర్పిద్దామని పిలు పునిచ్చారు. అందుకోసం రూ. 20,000 కోట్లు వ్యయం కాగల ‘నమామి గంగ’ ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. కానీ నిధుల కేటాయింపు, వ్యయం చేస్తున్న తీరు గమనిస్తే ఆ లక్ష్యం నెరవేరుతుందన్న ఆశ ఎవరికీ కలగదు. వచ్చే రెండేళ్లలో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ వరకూ గల 543 కిలోమీటర్ల మేర పురపాలక సంస్థల నుంచి మురుగునీరు, పరిశ్రమల వ్యర్థాలు, చర్మశుద్ధి కేంద్రాల వ్యర్థాలు నదిలో చేరకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి ఎన్జీటీ తాజాగా ఆదేశాలిచ్చింది. వ్యర్థాలు నదిలో విడిచిపెట్టేవారికి రూ. 50,000 మేర జరిమానా విధించాలని సూచించింది. ఈ ఆదేశాలు ఈ ప్రాంతంలోని గంగానదికి మాత్రమే కాదు... దాని ఉప నదులకు కూడా వర్తిస్తాయి. తమ ఆదేశాలను సక్రమంగా అమలు చేస్తే 27 శాతం మేర కాలుష్యం తగ్గుతుందని ఎన్జీటీ లెక్కేసింది. హరిద్వార్–ఉన్నావ్‌ల మధ్య జనా వాసాల నుంచి 86 మురుగు కాల్వలు ఈ నదిలో కలుస్తున్నాయి. వందవరకూ పరిశ్రమలున్నాయి. ఈ నది ప్రవహించే అయిదు రాష్ట్రాల్లో 1,000 పరిశ్రమలుంటే అవి రోజుకు 50 కోట్ల లీటర్ల వ్యర్థాలను నదిలో విడుస్తున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ వాటి కట్టడిలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. నదీ జలాల్లో క్రోమియం, కాడ్మియం, సీసం, కోబాల్ట్ వంటివి వచ్చి చేరుతున్నాయి. సమస్య గంగానదికి మాత్రమే పరిమితమై లేదు. భూగర్భ జలాలకు సైతం ఈ కాలుష్యం అంటుతోంది. చివరకు తినే తిండి కూడా కలుషితమవుతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు 285 పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టినప్పుడు అందులో 85 సంస్థలు వ్యర్థాల శుద్ధికి సంబంధించిన ఏ ప్రమాణాలనూ పాటించడం లేదని తేలింది. పరిశ్రమల ఏర్పాటుకు అనుమతించినప్పుడే అందులోని వ్యర్థాలను ఏం చేస్తారన్న అంచనాలు అధికారులకు ఉంటాయి. అయినా అనుమతులు మంజూరవుతాయి. తమను అడిగేదెవరన్న అహంభావమే దీనంతకూ మూలం. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే గంగానది ప్రక్షాళన, పునరుజ్జీవం కోసమని ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. దాన్ని కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉంచింది. కానీ ఏం లాభం? ఇంతవరకూ జరిగిందేమీ లేదని ఎన్జీటీ ఆదేశాలే చెబుతున్నాయి. గంగా నది కాలుష్యాన్ని అరికట్టడానికి కేవలం దానిపై భక్తివిశ్వాసాలుంటే సరిపోదు. అందుకు దృఢమైన రాజకీయ సంకల్పం అవసరం. గంగా జలాల కాలుష్యం కారణంగా పౌరులు ప్రమాదకరమైన వ్యాధుల బారినపడుతున్నారు. తాగే నీరు, పీల్చేగాలి విషతుల్యమై వారి ఆయుఃప్రమాణం తగ్గుతోంది. నదిలో ఉండే చేపలు, ఆ నది పరిసరాల్లో ఉండే పశుపక్ష్యాదులు కూడా అంతుచిక్కని వ్యాధులతో మృత్యువాత పడుతున్నాయి. యమునా నదీ జలాలు పరీక్షిస్తే అవి దాదాపు మురుగునీరు మాదిరిగా ఉన్నట్టు తేలిందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆమధ్య ప్రకటించింది. నాలుగు నెలలక్రితం ఉత్తరాఖండ్ హైకోర్టు గంగ, యమున నదుల్ని సజీవ వ్యక్తులుగా గుర్తిస్తూ ఆదేశాలివ్వడం, ఈమధ్యే సుప్రీం కోర్టు ఆ ఉత్తర్వులపై స్టే విధించడం అందరికీ తెలుసు. నదిని అమ్మగా, దేవతగా ఆరాధించే సంప్రదాయం మన దేశంలో ఉంది. కానీ దాన్ని కలుషితం చేయడానికి ఇలాంటి విశ్వాసాలు, సంప్రదాయాలు అడ్డురావడం లేదు. ఇవి సాధించలేని ప్రయోజనాన్ని వ్యక్తి హోదా సాధిస్తుందని ఎవరనుకోగలరు? కేవలం వందల కోట్లు ఖర్చు పెడితే సరిపోదు. ఆ నదీ పరీవాహ ప్రాంత ప్రజలందరినీ అందులో భాగ స్వాములుగా మార్చాలి. తమ మనుగడ ఆ నదితో ముడిపడి ఉందన్న అవగాహన కల్పించాలి. వారి నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణ స్పందన ఉండాలి. ఇవన్నీ చేసినప్పుడే అనుకున్న ఫలితం వస్తుంది. లక్ష్యం నెరవేరుతుంది. ప్రచారార్భాటం లేకుండా గ్రామ, పట్టణ ప్రాంత పౌరులందరినీ ఈ కార్యక్రమంలో భాగస్తుల్ని చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి. మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్ రెండేళ్లక్రితం రాజస్థాన్‌లో ఆ సంగతి రుజువు చేశారు. -
రూ.7 వేల కోట్లు ఖర్చు పెట్టినా ఫలితమేదీ!
గంగా నది ప్రక్షాళనపై ప్రభుత్వాన్ని ఆక్షేపించిన గ్రీన్ ట్రిబ్యునల్ న్యూఢిల్లీ: కలుషితమవుతున్న గంగా నది ప్రక్షాళనకు రెండేళ్లలో రూ.7 వేల కోట్లు ఖర్చు పెట్టినా పర్యావరణ సమస్య నేటికీ తీవ్రంగానే ఉందని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రభుత్వాన్ని ఆక్షేపించింది. నదిని పరిరక్షించేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. హరిద్వార్– ఉన్నావోల మధ్య గంగా నది తీరం నుంచి 100మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలూ చేపట్టరాదంది. ఈ ప్రాంతాన్ని ‘అభివృద్ధి రహిత ప్రాంతం’(నో డెవలప్మెంట్ జోన్)గా ప్రకటించింది. నదికి 500 మీటర్ల పరిధిలో వ్యర్థాలను డంప్ చేయరాదని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా నదిలో చెత్త డంప్ చేసినవారు పర్యావరణ పరిహారం కింద రూ.50 వేల జరిమానా కట్టాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ ఎన్జీటీ చైర్మన్ జస్టిస్ స్వతంతర్‌కుమార్ నేతృత్వం లోని ప్రత్యేక బెంచ్ ఉత్తర్వులిచ్చింది. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్ఎం జీసీ) కింద చేపట్టిన ప్రక్షాళన పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని సూచించింది. ఈ మేరకు 543 పేజీల ఉత్తర్వుల్లో మార్గదర్శకాలను ఎన్జీటీ సూచించింది. -
పోలవరం డంప్‌పై తనిఖీ ప్రారంభించండి
కేంద్ర పర్యావరణ శాఖకు ఎన్జీటీ ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు వ్యర్థాలను అక్రమంగా మూల లంక వద్ద డంప్ చేస్తున్నారని సామాజిక వేత్త డాక్టర్ పెంటపాటి పుల్లారావు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జాతీయ హరిత ట్రిబ్యునల్ దీనిపై ఈ సోమవారం నుంచి తనిఖీ ప్రారంభించాలని కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించింది. మార్చి 21న హరిత ట్రిబ్యునల్ ఇవే ఆదేశాలను ఇస్తూ రెండు వారాల్లోగా తనిఖీ నివేదికను సమర్పించాలని పేర్కొంది. అయితే ఇప్పటివరకు తనిఖీ చేపట్టకపోవడంతో వచ్చే సోమవారం ఉదయం నుంచి ఈ తనిఖీ ప్రారంభించాలని ఆదేశించింది. -
‘పాలమూరు’పై నేడు గ్రీన్ ట్రిబ్యునల్ ముందు విచారణ
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బుధవారం చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ ముందు మరోమారు విచారణ జరుగనుంది. ఎంకే నంబియార్‌తో కూడిన ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వం, పిటిషన ర్లు తుది వాదనలు వినిపించనున్నారు. దీనికోసం నీటి పారుదల శాఖ స్పెషల్ సీఎస్ ఎస్కే జోషి, ప్రాజెక్టు సీఈ లింగరాజు తదిత రులు మంగళవారం సాయంత్రమే చెన్నై వెళ్లారు. అటవీ చట్ట నిబం ధనలకు విరుద్ధంగా ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టు పనులను చేపట్టిందని, ఈ వ్యవ హారంలో జోక్యం చేసుకోవాలంటూ దాఖలైన పిటిష న్పై ఇప్పటికే ట్రిబ్యునల్ పలు మార్లు విచారణ జరిపింది. గత విచారణ సందర్భంగా.. పూర్తిగా తాగునీటికి ప్రాధా న్యమిస్తూ ప్రాజెక్టును చేపట్టామని, ఆ దిశగానే పనులు కొనసాగిస్తున్నామని ప్రభు త్వం తెలిపింది. ప్రాజెక్టు మొదటి దశలో తాగునీటిని, రెండో దశలో సాగునీటిని అందిస్తామని వివరిం చింది. సాగునీటి సరఫరా జరిపే నాటికి పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి పొందుతామని, ఈ విషయంలో స్పష్టమైన హామీ ఇస్తున్నామని ధర్మాసనానికి నివేదిం చింది. దీనికి అంగీకరించిన ట్రిబ్యునల్, పనులను తాగునీటి అవసరాలకే పరిమితం చేయాలని, సాగునీటి ప్రాజెక్టుకు అనుమతు లు పొందే వరకు సంబంధిత పనులు చేపట్టరాదని చెప్పింది. అయితే ఈ విష యంలో ప్రభుత్వం రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోందని, తాగునీటి పనుల పేరుతో సాగు కాల్వలు, రిజర్వాయర్లు నిర్మాణం చేపడుతోందని పిటిషనర్లు వాది స్తున్నారు. పూర్తిగా తాగునీటి పనులే చేపడుతున్నా మంటూ అందుకు సంబంధించిన డ్రాయిం గ్లను ప్రభుత్వం సమర్పించనుంది. -
అక్రమ డంప్‌కు అండ
⇒ ఇసుక తీసుకెళ్తున్న కూలీలను అడ్డుకున్న పోలీసులు ⇒ ఆ ఇసుక ఇరిగేషన్ శాఖదట ⇒ ‘ముఖ్య’ నేత రంగంలోకి దిగటంతో కూలీలకు గండి ⇒ కూలీల ఇసుక ట్రాక్టర్లపై కేసుల నమోదుకు రంగం సిద్ధం సాక్షి, అమరావతి బ్యూరో/ తుళ్లూరు రూరల్ : కృష్ణానదిలోని ఇసుక చుట్టూ రాజకీయం నడుస్తోంది. అధికార పార్టీ నేతలు కొందరు సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి కృష్ణా నదిలో భారీగా డంప్ చేశారు. వారిపై కన్నెత్తి చూడని పోలీసులు.. ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో ఉచిత ఇసుకను తరలిస్తూ ఉపాధి పొందుతున్న కూలీలను సోమవారం అడ్డుకున్నారు. డంప్ చేసిన ఇసుక ఇరిగేషన్ శాఖదని ప్రకటించారు. ఇసుక తరలింపుపై ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేసినందున కూలీలను అడ్డుకున్నామని గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ తెలిపారు. డంప్ చేసిన ఇసుకను తరలించడానికి వీల్లేదని కూలీలను వెళ్లగొట్టిన పోలీసులు కొందరు కూలీలు సహా ట్రాక్టర్లపై కేసుల నమోదుకు రంగం సిద్ధం చేశారని తెలుస్తోంది. డ్రెడ్జర్లతో తవ్వకాలు... రాజధాని ప్రాంతంలోని లింగాయపాలెం, రాయపూడి సమీపంలోని కృష్ణా నదిలో కొద్దిరోజుల కిందట గుర్తు తెలియని వ్యక్తులు డ్రెడ్జర్లతో భారీ ఎత్తున ఇసుకను తవ్వుతున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలపై ‘సాక్షి’ పలుమార్లు కథనాలు ప్రచురిం చింది. సుప్రీం కోర్టు హెచ్చరించినా అక్రమార్కులు భారీ యంత్రాలతో ఇసుకను తవ్వుతూనే ఉండటం గమనార్హం. సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో 20 అడుగుల ఎత్తున ఇసుకను డంప్ చేశారు. ఈ విషయమై డ్రెడ్జర్లతో తవ్వుతున్న వారిని అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించినా, వారి నుంచి సమాధానం లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ప్రచురించిన వరుస కథనాలతో కొద్దికాలంగా ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. ఇసుక ద్వారా ఉపాధి పొందుతున్న కూలీలు రాజధాని కోసం భూములు త్యాగం చేసి పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్న కూలీలు ఇసుక ద్వారా ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వం ఇసుక ఉచితమేనని ప్రకటించిన నేపథ్యంలో నదిలోని ఇసుకను తరలిస్తూ ఉపాధి పొందుతున్నారు. వారం రోజులుగా కొందరు కూలీలు ఇసుకను గృహావసరాల కోసం తీసుకెళ్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాఫియా నేతల అనుచరులు ఆ ప్రాంతానికి వచ్చి పలుమార్లు కూలీలను హెచ్చరిం చారు. అయితే కూలీలు ప్రభుత్వం ఇసుకను ఉచితమని చెప్పిందనే విషయాన్ని గుర్తు చేశారు. భారీగా డంప్ చేసిన ఇసుక ఎవరిదని పలుమార్లు అడిగినా వారి నుంచి సరైన సమాధానం లేదు. భారీ యంత్రాలతో ఇసుకను డంప్ చేయటానికి ఎవరు అనుమతి ఇచ్చారని ప్రశ్నించినా నోరెత్తలేదు. పోలీసులు కూడా వచ్చి కూలీలను ఆరా తీశారు. ఇసుక ఉచితమే కదా? అని చెప్పటంతో పోలీసులు అడ్డుచెప్పలేదు. ‘ముఖ్య’ నేత ఆదేశాల మేరకు టీడీపీకి చెందిన ఓ ‘ముఖ్య’ నేత ఆదేశాల మేరకు సోమవారం పోలీసులు రంగంలోకి దిగినట్లు కూలీలు చెబుతున్నారు. బలవంతంగా తమను తోసివేసినట్లు కూలీలు కన్నీరుపెట్టుకున్నారు. ఉపాధి లేక తీవ్ర ఇబ్బం దులు పడుతున్న సమయంలో ఇసుకను తరలించి ఉపశమనం పొందుతుంటే పోలీసులు అడ్డుకోవడం న్యాయమేనా? అని ప్రశ్నించారు. అత్యున్నత న్యాయస్థానం నదుల్లో ఉన్న ఇసుకను యంత్రాలతో తవ్వకూడదని స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జాతీయ ఎస్సీ కమిషన్ కూడా ఇసుక అక్రమతవ్వకాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా అధికార పార్టీ నేతలు పోలీసుల అండదండలతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డులేకుండా చేసుకుం టున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారీ ఇసుక డంప్ వెనుక అధికార పార్టీ నేతలు కృష్ణా నది ఒడ్డున భారీగా డంప్ చేసిన ఇసుక వెనుక ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే, తుళ్లూరు మండల పరిధిలోని ఇద్దరు టీడీపీ నాయకులు ఉన్నారని విశ్వసనీయ సమాచారం. 10 ఎకరాల విస్తీర్ణంలో డంప్ చేసిన ఇసుకలో సగభాగం ఓ ప్రైవేటు కాంట్రాక్టర్‌కు రూ.15 కోట్లకు విక్రయించినట్లు తెలిసింది. మరో సగ భాగం ఇసుకను రూ.25 కోట్లకు విక్రయించేందుకు రంగం సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కూలీలు ఇసుకను తీసుకెళ్తే తమ పరిస్థితేమిటని ఇసుక కాంట్రక్టర్లు అధికార పార్టీ ‘ముఖ్య’ నేత వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు అధికారి ఒకరు వెల్లడించారు. అధికారుల వత్తాసూ వారికే ... నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా కుటుంబ సభ్యులు, నేను ఇసుక పని చేసుకుంటూనే జీవనం సాగించాం. రెండేళ్లుగా పరిస్థితి తారుమారైంది. రాజధాని ప్రకటనతో రాజకీయ రాబందులు మా నోటి దగ్గర కూడు లాగేసుకుంటున్నాయి. ఆఖరికి న్యాయం చేయాల్సిన అధికారులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారు. బడుగు వర్గాల్లో పుట్టడమే పాపమా? – జొన్నకూటి రాజేష్, కూలీ మాట్లాడే హక్కు లేదా? ఈ రెండేళ్లలో పనులు లేక పస్తులు ఉంటున్నాం. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో ఇసుక ద్వారా ఉపాధి కలిగింది. అయితే పోలీసులు మా కడుపు కొడుతున్నారు. ట్రిబ్యునల్ ఎక్కడైనా ఇసుక తవ్వుకోవచ్చని, యంత్రాలు వాడొద్దని సూచించింది. అయితే జిల్లా స్థాయి పోలీసు అధికారి ఇసుక తవ్వకూడదు, అరెస్టు చేస్తాం అంటే ఎలా? మాకు మాట్లాడే హక్కు లేదా? – యడ్ల రాఘవులు, కూలీ -
తప్పులు.. తలనొప్పులు
సాక్షి, అమరావతి బ్యూరో : రాజధాని నిర్మాణం పేరుతో ప్రభుత్వం చేస్తున్న అధికార దుర్వినియోగంపై ఇప్పటికే రైతుల తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) న్యాయపోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అండతో ల్యాండ్‌పూలింగ్‌కు భూములు ఇవ్వటానికి ఇష్టపడని 4,800 ఎకరాలకు చెందిన రైతులు కోర్టు ద్వారా అనుమతులు తెచ్చుకుని స్వేచ్ఛగా సాగు చేసుకుంటున్నారు. తాజాగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన వై. వెంకాయమ్మ, మరికొందరు రైతులు తమ భూముల తారుమారుపై హై కోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం సీఆర్డీఏ, రెవెన్యూ అధికారులకు నోటీసులు జారీ చేసింది. అలాగే కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన మరికొందరు రైతులు జరీబు భూములను మెట్టగా మార్చిన వైనంపై కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ప్రభుత్వం జరీబు నుంచి మెట్టగా మార్చే దిశగా చేస్తున్న ప్రయత్నాలు సీఆర్డీఏ యూనిట్ కాంపిటెంట్ అథారిటీ అధికారులకు తలనొప్పులను తెచ్చిపెడుతోంది. గ్రీన్ ట్రిబ్యునల్‌లో పంతం నెగ్గించుకునేందుకు ప్రభుత్వం బహుళ పంటలు పండే భూములన్నింటినీ రికార్డుల్లో మెట్టగా మారుస్తోంది. ఇప్పటికే పెనుమాక, ఉండవల్లి, బోరుపాలెం, అబ్బురాజుపాలెం, రాయపూడి గ్రామాల్లోని జరీబు భూములను మెట్టగా మార్చారు. మిగిలిన ప్రాంతాల్లోని జరీబు భూములనూ మెట్టగా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా భూ సేకరణలో కీలకపాత్ర పోషిస్తున్న ముఖ్య అధికారి నుంచి కింది స్థాయి అధికారులందరికీ మౌఖిక ఆదేశాలు అందినట్లు విశ్వసనీయ సమాచారం. అడుగడుగునా తప్పులే ... రాజధాని నిర్మాణానికి 2015లో ప్రభుత్వం భూ సమీకరణకు నోటిఫికేషన్లు ఇచ్చింది. అందులో జనవరి 11న ఉండవల్లికి, ఫిబ్రవరి 12న పెనుమాకకు 9.1 కింద షెడ్యూల్ 2 ప్రకారం నోటిఫికేషన్లు ఇచ్చింది. అందులో రెండు గ్రామాల్లోని భూములను జరీబుగానే పేర్కొంది. ఈపీటీఆర్ఐ (ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) వారు ప్రభుత్వానికి 2016 డిసెంబర్లో సమర్పించిన ముసాయిదా సామాజిక ప్రభావ అంచనా నివేదికలో పట్టిక ‘ఇ1ఎ’ నోటిఫికేషన్లో సైతం ఉండవల్లిలోని భూములు మొత్తం జరీబుగానే చూపింది. అయితే అందులో ఉద్దేశపూర్వకంగా భూముల సర్వే నంబర్లు, విస్తీర్ణం, రైతుల పేర్లు నమోదు చేయలేదు. దీంతో 2016 డిసెంబర్ 16న ఉండవల్లిలో జరిగిన గ్రామసభలో స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతుల తిరుగుబాటును గ్రహించిన సీఆర్డీఏ ఆ క్షణం తప్పించుకునేందుకు ప్రయత్నించింది. సామాజిక ప్రభావ అంచనా సర్వే తిరిగి జరిపించటంతో పాటు రైతుల పేర్లు సైతం నోటిఫికేషన్ పట్టికలో చేరుస్తామని హామీ ఇచ్చారు. ఆ వివరాలను మినిట్స్ పుస్తకంలో నమోదు చేయించి రైతులు గ్రామ సభను బహిష్కరించారు. అయితే తిరిగి సర్వే జరపకుండానే , కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన తుది సామాజిక ప్రభావ అంచనా నివేదికలో మాత్రం మొత్తం జరీబు భూములను మెట్టగా మార్చారు. అదే విధంగా పెనుమాక గ్రామానికి సంబంధించి గత ఏడాది డిసెంబర్ 13న జరిగిన గ్రామ సభలోనే భూముల వర్గీకరణను మెట్టగా చూపటంతో రైతులు అధికారులపై ఆగ్రహంతో ముసాయిదా పత్రాలను దహనం చేసి సభను బహిష్కరించారు. ఆ తరువాత విడుదల చేసిన తుది నివేదికలో జరీబును మెట్టగానే చూపటం గమనార్హం. అధికారాలు ఉన్న వారే బాధ్యులు... సీఆర్డీఏ విడుదల చేసిన జీఓ ఎంఎస్ నంబరు 304లో పేర్కొన్న విధంగా ల్యాండ్‌పూలింగ్, భూ సేకరణ బాధ్యతలను ఆయా యూనిట్లలోని స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లే నిర్వర్తిస్తారని చెప్పింది. అయితే ఇటీవల ప్రభుత్వం రాజధానిలో 13 గ్రామాలకు భూ సేకరణ నోటిఫికేషన్‌ను జిల్లా కలెక్టర్‌చే ఇప్పించింది. ఆ జీఓను గుర్తుచేస్తూ రైతులు అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. సర్వే నివేదికల్లో జరీబుగా పేర్కొని, తుది సామాజిక సర్వేలో మెట్టగా పేర్కొన్నందుకు ఆయా యూనిట్లలోని అధికారులే బాధ్యత వహించవలసి ఉంటుందని నోటీసులు పంపారు. మిగిలిన రైతులు కూడా కొద్దిరోజుల్లో న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు సమాయత్తం అవుతున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు ప్రభుత్వ కుట్రకు తాము బలిపశువులు కావటం ఎందుకని బదిలీపై వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా ఉండవల్లి యూనిట్ నంబర్ 8కి చెందిన స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ సచివాలయానికి, అదే యూనిట్ తహసీల్దార్ సత్తెనపల్లికి బదిలీ కోసం సన్నాహాలు చేసుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇదే దారిలో రాజధానిలోని పలువురు అధికారులు బదిలీపై వెళ్లేందుకు సిద్ధమవుతుండటం గమనార్హం. -
ప్రస్తుతానికి పనులు తాగునీటికే...
పాలమూరు’పై గ్రీన్ ట్రిబ్యునల్‌కు ప్రభుత్వం వివరణ సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కింద ప్రస్తుతం కేవలం తాగునీటి అవసరాలకు సంబంధించిన పనులకు ప్రాధా న్యమిస్తూ వాటినే చేపడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్ (చెన్నై)కు వివరణ ఇచ్చింది. సాగునీటి పనులేవీ చేపట్టడం లేదని వెల్లడించింది. సాగునీటిని అందించే డిస్ట్రి బ్యూటరీ, కాలువల పనులను ఎక్కడా చేయ డం లేదని వివరించింది. పాలమూరు ప్రాజె క్టును మొదటి విడతలో తాగునీటికే పరిమితం చేస్తామని, తర్వాతనే సాగునీటికి విస్తరిస్తామ ని పేర్కొంది. అందుకు సంబంధించి మార్చిన డిజైన్లను ఐదు రోజుల్లో సమర్పిస్తామంది. అటవీచట్ట నిబంధనలకు విరుద్ధంగా పాల మూరు ప్రాజెక్టు పనులను ప్రభుత్వం చేపట్టిం దని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై శుక్ర వారం ట్రిబ్యునల్ విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మోహన్ పరాశరణ్... పిటిషనర్ తరఫున సంజయ్ ఉపాధ్యాయ్, రచనా రెడ్డి వాదనలు వినిపించారు. అటవీ ప్రాంతంలో పనులు సంజయ్ ఉపాధ్యాయ్ వాదిస్తూ ప్రాజెక్టు పనులు అటవీ ప్రాం తంలో జరుగుతున్నాయ ని, అక్కడ ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతం ఉందని ట్రిబ్యునల్ దృష్టికి తెచ్చారు. ప్రాజెక్టు వల్ల వ్యన్య ప్రాణులకు ముప్పు వాటిల్లే అవకా శం ఉందన్నారు. పర్యావరణ అనుమతుల్లేకుం డానే దీన్ని చేపట్టారన్నారు. ఈ వాదనను మోహన్ పరాశరణ్ తోసిపుచ్చారు. టైగర్ రిజర్వ్ ప్రాంతంలో పనులేవీ జరగట్లేదన్నారు. ప్యాకేజీ–1 పనులు అటవీ పరిధిలోకి వస్తాయ ని తెలిసిన వెంటనే పనులు నిలిపివేసి డిజైన్లు మార్చామన్నారు. ప్రాజెక్టు వల్ల 1,131 గ్రామా లకు, 50లక్షల మందికి తాగునీరు అందుతుం దన్నారు. దీనిపై ట్రిబ్యునల్ స్పందిస్తూ ప్రాజెక్టు డిజైన్‌ను చూస్తుంటే అలా అనిపించట్లేదని, అనుమతుల్లేకుండా ఎలా చేపట్టా రని ప్రశ్నించింది. వారం గడువిస్తే పూర్తిగా కొత్త స్కీమ్‌తో ట్రిబ్యునల్ ముందుకు వస్తామని పరిశరణ్ బదులిచ్చారు. దీంతో ట్రిబ్యునల్ తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. మార్పులున్న చోట కొత్త ఒప్పందాలు... పాలమూరు ఎత్తిపోతల ప్యాకేజీ–1, 16ల్లో మార్పుచేర్పులకు ఇటీవల కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో ఇక్కడ మారిన మార్పులకు అనుగుణంగా పాత కాంట్రా క్టర్‌తో కొత్త ఒప్పందాలు చేసుకోవాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే ఈ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. -
‘పాలమూరు’ పిటిషన్ లో రాజకీయ కోణం
► గ్రీన్ ట్రిబ్యునల్‌లో కౌంటర్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ► ఫిబ్రవరి 10న విచారణ సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులను నిలిపివేయాలంటూ వేసిన పిటిషన్ వెనుక రాజకీయ ప్రయోజనాలు దాగు న్నాయని రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్ (చెన్నై) దృష్టికి తెచ్చింది. ఇప్పటికే పనుల అప్పగింత ప్రక్రియ పూర్తయిందని, పనులు నిలిపివేయాలన్న ట్రిబ్యునల్ ఉత్తర్వుల వల్ల ప్రాజెక్టు వ్యయాలు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాజెక్టును అడ్డుకు నేందుకు కొన్ని నెలలుగా కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని, కోర్టుల్లో కేసులు వేసినా సానుకూల తీర్పులు రాలేదని వివరించింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరిం చుకోవాలని విన్నవించింది. అటవీ చట్ట నిబంధనలకు విరుద్ధంగా పాలమూరు ప్రాజెక్టు పనులను ప్రభుత్వం చేపట్టిందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ బీరం హర్షవర్ధన్ రెడ్డి వేసిన పిటిషన్ పై మంగళ వారం కేఆర్ రావుతో కూడిన ట్రిబ్యునల్ విచా రణ జరిపింది. ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది మోహన్ వాదనలు వినిపించగా, పిటిషనర్ తరఫున సంజయ్ ఉపాధ్యాయ్, రచనారెడ్డి వాదనలు వినిపించారు. కేసు విచారణకు వచ్చిన వెంటనే ప్రభుత్వం కౌంటర్‌ను ట్రిబ్యునల్‌కు సమర్పిం చింది. కౌంటర్లోని అంశాలను అధ్యయనం చేసి వాదనలు వినిపించేందుకు తమకు గడువు ఇవ్వాలని, బుధవారం వాదనలు వినిపిస్తామ ని పిటిషనర్ తరఫు న్యాయవాదులు ట్రిబ్యున ల్ను కోరారు. అయితే బుధవారం తమకు సమయం లేనందున ఫిబ్రవరి 23న తిరిగి విచారణ చేయాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. అంత గడువు వద్దని, వీలైనంత త్వరగా తిరిగి విచారణ చేయాలని పిటిషనర్లు కోరగా, ఫిబ్రవరి 10న విచారణ చేస్తామని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. పాలమూరు పను లు అటవీ ప్రాంతంలో జరుగుతున్నాయనే విష యం అటవీ అధికా రులు షోకాజ్ నోటీసు ఇచ్చిన తర్వాతే తమ దృష్టికి వచ్చిందని, దీంతో పనులను మరో చోటుకి మార్చాలని నిర్ణయించామని ప్రభుత్వం తన కౌంటర్లో తెలిపింది. ప్యాకేజీ 1, 2 పనులు ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో జరగడం లేదని, ఈ ప్రాజెక్టు వల్ల వన్యప్రాణులకు ముప్పు లేదని స్పష్టం చేసింది. అటవీ ప్రాంతానికి వెలుపల పనులు చేస్తున్న నేపథ్యంలో పర్యావరణ చట్టం కింద ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని వివరించింది. రోజుకు రూ.15 లక్షల ఫీజు పిటిషన్ పై వాదనలు వినిపించేందుకు సుప్రీం కోర్టుకు చెందిన ముగ్గురు న్యాయవాదులను ప్రభుత్వం నియమించుకుంది. న్యాయవాది మోహన్ పరాశరణ్‌కు ఏకంగా ఒకరోజు హియరింగ్‌కు రూ.15 లక్షలు చెల్లించేందుకు నిర్ణయించింది. -
‘దుఃఖదాయిని’ పరిశీలన
తాడేపల్లి రూరల్: రైతుల పాలిట దుఖఃదాయిని కొండవీటి వాగుని శనివారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుప్రీమ్‌కోర్టు న్యాయవాది సంజయ్ ఫిరిక్ పరిశీలించారు. కొండవీటి వాగు హెడ్ స్లూయిజ్ నుంచి ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయపాలెం, బ్రిడ్జిల వద్ద పరిశీలించిన ఆయన తెలుగు రాకపోయినప్పటికీ రైతులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులో రైతుల తరఫున వాదించేందుకు ఆయన ఈప్రాంతంలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. కొండవీటీవాగు నీటి ప్రవాహంతోపాటు రైతులకు కలిగే నష్టంపై ఆరా తీశారు. కృష్ణాయపాలెం వద్ద పాల వాగు, కొండవీటì æవాగుపై ఒక కిలోమీటరు దూరంలో ఆరు మలుపులు ఉన్నాయన్నారు. ఐదు ఆరు వందల ఎకరాలకు సాగునీరు అందించటమే గాకుండా భూగర్భ జలాలు నిత్యం ఉండడం ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. కృష్ణాయపాలెం, పెనుమాక డొంకరోడ్డులో ఒక రైతు పంట పొలంలో బోరు వేస్తుండగా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన వెంట న్యాయవాదులు, రైతులు మల్లెల శేషగిరిరావు, గాంధీ, మానం బోసురెడ్డి, కళ్లం సాంబిరెడ్డి, గంగిరెడ్డి శంకర్, నరసమ్మ, పద్మారెడ్డి, రవిశంకర్‌నాయడు, సురేష్, రాము, తదితరులు పాల్గొన్నారు. -
తీర్పు స్ఫూర్తితో చిగురించిన ఆశ
ఇప్పటికే గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ముందున్న కేసు తదుపరి విచారణ శుక్రవారం జరుగనుంది. పర్యావరణ ప్రభావ అధ్యయనమే జరుగలేదని, మూడు పంటలు పండే వ్యవసాయ భూముల్ని నాశనం చేయడమే కాకుండా సమీకరించిన భూమి కొండవీటి వాగు వరద ప్రభావిత ప్రాంతమనే నిపుణుల నివేదికలున్నాయని వారంటున్నారు. 2013 చట్టం బహుళపంటల భూముల్ని సేకరించవద్దనే చెబుతోంది. తెలంగాణలోని మల్లన్నసాగర్ భూసేకరణలోనూ 2013 చట్ట స్ఫూర్తికి భంగం జరిగిందనే వాదనుంది. ‘‘కోర్టు కోర్టుకీ తీర్పు తీర్పుకీ ఇంత మార్పు ఉంటే మీ న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్టా యువరానర్....’’ అని జడ్జిని ఉద్దేశించి ఆగ్రహంగా, ఉద్రేకంగా అడుగుతాడు బొబ్బిలిపులి సినిమాలో కథానాయక పాత్రలో నటించిన ఎన్టీరామారావు. ఒకోసారి తేడా ఉంటుంది. ఎందుకుంటుందీ? అంటే అందుకొక కారణం చెబుతారు న్యాయనిపుణులు. కేసు ఒకటే అయినా ఒకసారి ఓ కోర్టు ముందు ప్రవేశపెట్టిన సాక్ష్యాలు, ఆధారాలు, పరిస్థితులు, వాదనలు తర్వాతి కాలంలో అదే కోర్టులో గానీ, ఇతర ఉన్నత న్యాయస్థానాల ముందుగ్గాని వచ్చినపుడు మార్పులకు గురయితే తీర్పు భిన్నంగా ఉండటా నికి ఆస్కారం ఉంటుందనేది ఓ అభిప్రాయం. కొన్ని విషయాల్లో న్యాయస్థా నాలు వెలువరించే తీర్పులు దాదాపు అదే పరిస్థితులున్న ఇతర పరిణామా లకు, సందర్భాలకు యథాతథం వర్తిస్తాయి. కొన్నిసార్లు పాక్షికంగానే వర్తి స్తాయి. అసలు వర్తించవు. చట్టాల్లో, విధానాల్లో నిర్దిష్టంగా పేర్కొనని సందిగ్ధ అంశాల్లో రాజ్యాంగ న్యాయస్థానాలైన హైకోర్టు, సుప్రీంకోర్టులిచ్చే తీర్పులే తర్వాతి కాలంలో తలెత్తే అటువంటి అన్ని వివాదాలకూ విధిగా వర్తిస్తాయి. ప్రామాణికం కూడా అవుతాయి. పశ్చిమబెంగాల్లో దశాబ్దం కింద జరిపిన సింగూరు భూసేకరణే అక్రమమని సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పిచ్చింది. వారం కింద వెలువడ్డ ఈ తాజా తీర్పును ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతం, తెలంగాణలోని మల్లన్నసాగర్ ప్రాంత రైతులు, రైతు నాయకులు, ప్రజాసంఘాల వారు లోతుగా పరిశీలిస్తున్నారు. ఈ తీర్పు నీడలో తమకేమైనా ఉపశమనం లభించేనా? అని న్యాయనిపుణులతో సంప్ర దింపులు జరుపుతున్నారు. రాజధాని భూముల విషయంలో సీనియర్ సంపాదకుడు ఏబీకే ప్రసాద్ తదితరులు సంప్రదించినపుడు, లేవనెత్తిన అంశాల్లోకి వెళ్లకుండానే ‘మీరు రైతులు కాదుకదా! భూములు కోల్పోయిన రైతులే వచ్చినపుడు చూద్దాం...’ అనే వ్యాఖ్యలతో కేసును సుప్రీంకోర్టు తోసిపుచ్చిన దరిమిలా ఈ కొత్త ఆలోచనలు చోటు చేసుకుంటున్నాయి. సింగూరు భూముల విషయంలో పరిస్థితి పూర్తిగా వేరనీ, ఇది అమరావతి భూములకు వర్తించబోదనీ కొట్టివేసేవారూ ఉన్నారు. సింగూరులో జరిగింది భూసేకరణ కాగా, అమరావతిలో జరిపింది భూసమీకరణ అని వారు అన్వయం చెబుతున్నారు. సేకరణయినా, సమీకరణయినా నిర్దిష్ట అవసరాల కోసం ప్రభుత్వం భూమిని తీసుకుంటూ భూయజమానుల నుంచి దాన్ని దూరం చేయడమే! ఈ మౌలికాంశాన్నే న్యాయమూర్తులు పరిగణన లోకి తీసు కున్నట్టు సింగూరు కేసులో సుప్రీం తీర్పును విశ్లేషిస్తే స్పష్టమౌతోంది. స్ఫూర్తి కొరవడటం తప్పిదమే! పౌరుల భూయాజమాన్యపు అధికారం మొదట్లో ప్రాథమిక హక్కుగానే ఉండేది. రాజ్యాంగం మూడో భాగంలోని ఆస్తి హక్కు కింద 1949 నుంచే ఈ ప్రయాణం మొదలైంది. కాలక్రమంలో రాజ్యం తన విస్తృతాధికారాల్ని ఇష్టా నుసారం వినియోగించడంతో ‘ప్రజా సంక్షేమం కోసం’ అనే సాకు నీడన సుదీర్ఘకాలం పాటు భూచట్టాలు దుర్వినియోగమవుతూ వచ్చాయి. అదే క్రమంలో రాజ్యాంగ సవరణ జరిగి ప్రాథమిక హక్కు స్థానే చట్టబద్ధమైన హక్కుగా ఇది మారింది. ప్రభుత్వాలు భూసేకరణ తలపెట్టిన ప్రతిసారీ ఈ వ్యవహారాల్లో 1894, అంటే 122 ఏళ్లకిందటి భూసేకరణ చట్టం నిర్దేశించిన అంశాలే ప్రాతిపదిక అయ్యేవి. భూహక్కుదారుల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ‘జనహితం’లో భూముల్ని సేకరించే అధికారం ప్రభుత్వాలకు ధారా దత్తమైంది. కాలం చెల్లిన 1894 నాటి చట్టంలో ప్రభుత్వ సానుకూలత తప్ప మానవీయ అంశమే లేదనే వాదన తెరపైకి వచ్చింది. నిర్వాసితులయ్యే, ఉపాధి కోల్పోయే వారికి రక్షణ లేని పరిస్థితులు బలపడ్డాయి. ఉమ్మడి జాబితాలోని అంశమే అయినా... కేంద్ర చట్టం నీడలో తమ రాష్ట్ర భూసేకరణ చట్టాలు, విధానాలు రూపొందించుకున్న అనేక రాష్ట్రాలు సదరు లోపాల్ని సరిదిద్దకపోగా మరింత లోపభూయిష్టంగా వాటిని తయారు చేసుకుంటూ వచ్చాయి. దాంతో నిర్వాసితుల సానుకూలాంశాలే లేకుండా పోయాయి. ప్రజల్లో అవగాహన, చైతన్యం పెరుగుతున్న కొద్దీ ప్రతిఘటనలూ పెరిగాయి. భూసేకరణల్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలే వచ్చాయి. ఒకవైపు రాజ్యబలం మరోవైపు ప్రజాందోళనలు.. నేల మీద నెత్తురు చిందే ఘటనలు అధికమయ్యాయి. చర్చ ఊపందుకోవడంతో పాలకులు తలవంచాల్సి వచ్చింది. పర్యవసానంగా పలు సానుకూల అంశాలతో 2013లో కొత్త భూసేకరణ చట్టం వచ్చింది. తప్పనిసరిగా సామాజిక-పర్యావరణ ప్రభావ అధ్యయనాలు, 70 శాతం, 80 శాతం మంది అంగీకారం, నిర్వాసితులు, ప్రభావితులయ్యేవారికి నష్టపరిహారం, పునరావాసం, పునఃప్రతిష్ట వంటి అంశాలు ఇందులో భాగమయ్యాయి. ఇప్పుడదే చట్టం అమల్లో ఉంది. సింగూరు భూసేకరణ వ్యవహారం 2006 నాటిది కావడంతో ఆ కేసు వివిధ న్యాయస్థానాల్లో దశాబ్ద కాలం నానుతూ వచ్చింది. భూసేకరణే అక్రమమని ఇచ్చిన ధర్మాసనం తీర్పులో అసలు భూసేకరణ చట్టం నిర్దేశించే (సెక్షన్ 5ఏ) విధానాలనే ఉల్లంఘించారని ఇద్దరు న్యాయమూర్తులూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజావసరాలని చెప్పి టాటా కంపెనీ కోసం భూమి సేక రించడాన్ని తన ఆదేశాల్లో జస్టిస్ గౌడ తప్పుబట్టారు. ప్రజాభిప్రాయ సేకరణ సరిగ్గా జరగలేదని, అభ్యంతరాల్ని పరిగణనలోకి తీసుకోకుండా భూసేకరణ కలెక్టరిచ్చిన నివేదికను యథాతథం స్వీకరించి చట్ట నిబంధనను తూతూ మంత్రంగా పాటించారని జస్టిస్ మిశ్రా ఎండగట్టారు. చట్టపు స్ఫూర్తిని కూడా పరిరక్షించలేకపోయారని జడ్జీలు తప్పుబట్టారు. డొంకతిరుగుళ్లు... దొడ్డిదారి నడకలు అమరావతి కొత్త రాజధాని కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూసేకరణకు బదులు భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్)కు వెళ్లింది. భవిష్యత్ ప్రయోజ నాల్లో భూయజమానులనూ భాగస్వాముల్ని చేస్తూ వారి భూముల్ని సమీ కరించడం ఈ పద్ధతి. రాజధానిని అభివృద్ధి పరిచే క్రమంలో విలువ పెరిగే కొంత నివాస, వాణిజ్య స్థలాల్ని వారికి పరిహారంగా ఇస్తారు. అప్పటివరకు ఏటా ఇంతని ప్రభుత్వం సదరు భూయజమానులకు కౌలు చెల్లించాలి. రైతులు 33వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారన్నది ప్రభుత్వ ప్రచారం. కానీ, అక్కడ జరిగిందేమిటో అందరికీ తెలుసు. అత్యధిక సందర్భాల్లో బెది రించి, భయపెట్టి, విపరీత పరిస్థితులు కల్పించి, మైండ్ గేమ్‌తో పలు కుయుక్తులు పన్ని భూసమీకరణ పేరిట పరోక్షంగా భూసేకరణే జరిపారన్నది నిజం. కొందరు రైతులకు ఇటీవల భూసేకరణ కిందే నోటీసులిస్తున్నారు. నిజానికి 75 శాతం భూముల్నే సమీకరించ గలిగారు. ఇప్పటికీ భూములివ్వని గ్రామాలున్నాయి. మొదట తెలియక నిబంధన (పత్రం-9.3) కింద అంగీ కారం తెలిపి, నిజాలు తెలిసి అంగీకారాన్ని (పత్రం-9.14 కింద) ఉపసం హరించుకున్న వారూ ఉన్నారు. సుమారు అయిదారువేల ఎకరాల భూమి ఇంకా ప్రభుత్వ ఖాతాలోకి రానిదుంది. ఏ రకమైన అంగీకారానికి రాని రైతుల వద్ద ఇంకా 3,200 ఎకరాల భూమి ఉంది. ఉండవల్లి (78శాతం), పెనుమాక (55శాతం), నిడమర్రు (40శాతం), రాయపూడి, వెలగపూడి, బేతపూడి, నవులూరు (10శాతం వరకు)లలో కొన్ని భూములు ఇంకా ఈ పరిధిలోకి రానేలేదు. తమ ప్రాథమిక అంగీకారాన్ని ఉపసంహరించుకున్న రైతుల తాలూకు భూమి సుమారు 1,600 ఎకరాలుంటుంది. ఇక పాలకపక్షానికి చెందిన నాయకుల, పలుకుబడిగలిగిన వారి దాష్టీకాలకు అక్కడ లెక్కే లేదు. అధికారపార్టీకి, ఒక సామాజిక వర్గానికి చెందిన వారు మొదట్నుంచీ అధికారం అండతో యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన కొంతమంది మాత్రం ప్రభుత్వ తీరును నిశితంగా విమర్శిస్తున్నారు. దాష్టీకాలకు పాల్పడుతున్న వారు అసైన్డ్ భూములకు పైసా పరిహారం రాదని మొదట ఎస్సీ, ఎస్టీల్ని బెదిరించి, భయపెట్టి వారి భూముల్ని నామమాత్రపు ధరకు కొనుగోలు చేశారు. వారిని నియంత్రణలో ఉంచుకోవడానికి వాటిని సీసీ కెమెరాల్లో రికార్డు చేయించారు. మెజారిటీ అసైన్డ్ భూములు తమ చేజి క్కిన తర్వాత ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆ భూములకూ నష్టపరిహారం లభించేలా చట్టసవరణకు పావులు కదిపారు. సమీకరించిన భూములకు సంబంధించి మొదటి సంవత్సరం కౌలు చెల్లించిన ప్రభుత్వం రెండో సంవ త్సరం నిలిపివేసింది. భూమిలేని పేద కూలీలకిచ్చే నిరుద్యోగభృతి విష యంలోనూ ఇదే జరిగింది. కూలీల ఎంపికే సరిగ్గా జరగలేదని, 29 గ్రామాల కింద 16 వేల మందినే ఎంపిక చేశారనేది విమర్శ. అత్యధిక చోట్ల నిజమైన వారిని ఎంపిక చేయకుండా మొండిచేయి చూపారన్నది అభియోగం. నెలకు రూ. 2,500 భృతి కింద ఇవ్వాల్సి ఉంది. అది ఏటా పదిశాతం పెరగాలి. మభ్యపెట్టేందుకు మొదట అయిదు మాసాలదీ కలిపి రూ.12,500 అక్కడ క్కడ ఇచ్చి తర్వాత నిలుపుదల చేశారు. భూమిలేని చేతివృత్తుల వారిని పూర్తిగా గాలికొదిలేశారు. గ్రామకంఠాల వివాదం తేల్చకుండా నాన్చుతూ ఊరూరా కొత్త సమస్యలు రేపి అశాంతి రగిలిస్తున్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెబుతుందో? భూసమీకరణలో అవకతవకలు, అక్రమాలు ఒక ఎత్తయితే చట్ట నిబంధన లకూ, నైతిక సూత్రాలకూ తూట్లు పొడిచి విదేశీ సంస్థలతో కుదుర్చుకుం టున్న ఒప్పందాలు, లీజులు, వాణిజ్య యత్నాలు అమరావతిలో మరింత వివాదాస్పదమయ్యాయి. భూ వినియోగం దేనికి? కనీస వినియోగ స్థలం ఎంత? తదితరాంశాల్ని స్పష్టం చేయకుండా జరిపిన భూసమీకరణే చట్ట విరుద్ధమని కొందరు వాదిస్తున్నారు. పరిహారం, పునరావాస-పునఃప్రతిష్ఠ, పర్యావరణ ప్రభావ అధ్యయనం, సామాజిక భద్రత వంటి అంశాల్లో 2013 చట్టం స్ఫూర్తికి గండికొట్టిన ఈ సమీకరణనే వారు తప్పుబడుతున్నారు. ఇదే విషయమై సుప్రీంకోర్టును సంప్రదించే యత్నాల్లో ఉన్నారు. ఇదివరకే న్యాయ స్థానాల్ని సంప్రదించిన కేసుల్లో కొందరు రైతులు ఇంప్లీడ్ అవుతున్నారు. ఇప్పటికే గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ముందున్న కేసు తదుపరి విచారణ శుక్రవారం జరుగనుంది. పర్యావరణ ప్రభావ అధ్యయనమే జరుగలేదని, మూడు పంటలు పండే వ్యవసాయ భూముల్ని నాశనం చేయడమే కాకుండా సమీకరించిన భూమి కొండవీటి వాగు వరద ప్రభావిత ప్రాంతమనే నిపు ణుల నివేదికలున్నాయని వారంటున్నారు. 2013 చట్టం బహుళపంటల భూముల్ని సేకరించవద్దనే చెబుతోంది. తెలంగాణలోని మల్లన్నసాగర్ భూసే కరణలోనూ 2013 చట్ట స్ఫూర్తికి భంగం జరిగిందనే వాదనుంది. ఆ చట్టంలో నిర్దేశించిన దానికన్నా 123 జీవోలో ఎక్కువ నష్టపరిహారం ప్రతిపాదించామని ప్రభుత్వం చెబుతున్నా, అదొక్కటే ప్రాతిపదిక కాదని, పలు అంశాల్లో చట్టం స్ఫూర్తికి గండికొట్టారని రైతులు, ప్రజాసంఘాల వారంటున్నారు. ఈ అంశా లన్నింటినీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకుపోగలిగితే తప్పక న్యాయం జరుగు తుందని రెండు రాష్ట్రాల భూనిర్వాసితులు ఆశిస్తున్నారు. జీవనాధారమైన కాసింత భూమితో ఉండే అనుబంధానికి దూరమౌతూ నలిగి పోతున్నవారెం దరో! ‘‘చావడానికి ధైర్యంలేక బతుకుతున్నాం’’ అంటున్న కొందరి ఆర్తినైనా సుప్రీంకోర్టు పట్టించుకోకపోతుందా! అన్నది మిణుకు మిణుకుమనే ఆశ! దిలీప్ రెడ్డి ఈమెయిల్:dileepreddy@sakshi.com -
జెన్కోకు మళ్లీ చుక్కెదురు!
భద్రాద్రి పవర్ ప్లాంట్‌పై స్టే యథాతథం ♦ స్టే ఎత్తివేతకు నిరాకరించిన గ్రీన్ ట్రిబ్యునల్ ♦ కేంద్రం తప్పుడు నివేదిక ఇచ్చిందని ♦ అఫిడవిట్ దాఖలు చేసిన జెన్కో సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా మణుగూరులో 1080(270x4) మెగావాట్ల సామర్థ్యంతో తలపెట్టిన భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం విషయంలో తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో)కు మళ్లీ చుక్కెదురైంది. ఈ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులు మంజూరు చేయకుండా యథాతథ స్థితి కొనసాగించాలని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు ఈ నెల 2న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ఉప సంహరించుకోవాలని జెన్కో చేసిన విజ్ఞప్తిని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) తోసిపుచ్చింది. పర్యావరణ అనుమతులు లేకుండానే భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను జెన్కో ప్రారంభించడాన్ని సవాలు చేస్తూ హ్యూమన్ రైట్స్ ఫోరం అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం చెన్నైలోని దక్షిణ ప్రాంత ఎన్జీటీ విచారణ జరిపింది. గతంలో ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల మేరకు గతేడాది డిసెంబర్ 14నే ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలుపుదల చేసినా... పనులు కొనసాగించినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తప్పుడు విచారణ నివేదిక సమర్పించిందని జెన్కో ఎన్జీటీలో అఫిడవిట్ దాఖలు చేసింది. జెన్కో అఫిడవిట్‌పై వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్జీటీ ధర్మాసనం ఫిర్యాదుదారులను ఆదేశిస్తూ కేసు విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. పర్యావరణ అనుమతులు లేకుండానే భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులను జెన్కో ప్రారంభించిందని హ్యూమన్ రైట్స్ ఫోరం గతేడాది ఫిర్యాదు చేయడంతో ఎన్జీటీ తీవ్రంగా స్పందించింది. ప్రాజెక్టు నిర్మాణ పనులను తక్షణమే నిలుపుదల చేయాలని అప్పట్లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించి జెన్కో నిర్మాణ పనులను కొనసాగిస్తోందని ఫిర్యాదుదారులు మళ్లీ ఎన్జీటీని ఆశ్రయించారు. దీనిపై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖతో ఎన్జీటీ విచారణ జరిపించింది. పర్యావరణ అనుమతి పొందకుండానే జెన్కో ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభించిందని, ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వుల తర్వాత సైతం పనులు కొనసాగించి తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిందని కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుడు ఎన్జీటీకి నివేదిక సమర్పించారు. జెన్కో ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణించిన ఎన్జీటీ తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు భద్రాద్రి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేయవద్దని గత ఏప్రిల్ 7న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మధ్యంతర ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఈ నెల 2న జరిగిన విచారణ సందర్భంగా జెన్కో చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన ఎన్జీటీ..తాజాగా మంగళవారం జరిగిన విచారణలో సైతం అందుకు నిరాకరించింది. -
ఏపీ తాత్కాలిక సచివాలయంపై విచారణ వాయిదా
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాత్కాలిక సచివాలయంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలైంది. వెలగపూడిలో నిర్మాణాలకు ఇచ్చిన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషిన్ వేశారు. పర్యావరణ అనుతులు లోపభుయిష్టంగా ఇచ్చారని పిటిషనర్ శర్మ వాదించారు. ఈ నేపథ్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పర్యావరణ మంత్రిత్వశాఖ, రాష్ట్ర పర్యావరణ అథారిటీకి నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. కాగా, తదుపరి విచారణ జులై 7కు వాయిదా పడింది. -
రాజధానిని అడ్డుకోవడానికే..
సాక్షి కథనాలపై సీఎంవో ప్రకటన సాక్షి, విజయవాడ బ్యూరో: అవినీతిలో కూరుకుపోయిన వైఎస్సార్ సీపీ రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడానికి, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయడానికి మరోసారి విష ప్రచారం మొదలు పెట్టిందని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. రైతులను రెచ్చగొట్టారని, గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు వేశారని, పంటలను తగులబెట్టించారని, ఇప్పుడు తెలుగుదేశం నాయకులు వేల ఎకరాలు కొన్నారని విష ప్రచారం చేస్తున్నారని గురువారం రాత్రి విడుదల చేసి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయలేదని, 32 లక్షలమంది డిపాజిట్ దారులు ప్రయోజనాలను పణంగా పెట్టారని, ప్రతిఫలంగా రూ. 425 కోట్ల విలువైన హాయ్ ల్యాండ్‌ను చినబాబు కొట్టేశారనే ఆరోపణలు సరికాదన్నారు. ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ పైనాన్షియల్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ 1999 ప్రకారం మిగిలిన అగ్రిగోల్డ్ ఫామ్స్ ఆండ్ ఎస్టేట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆస్తులతో పాటుగా హాయ్ ల్యాండ్ నుకూడా జప్తుచేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. మురళీమోహన్ అక్రమంగా భూములు కొన్నారనడం, బాలకృష్ణ వియ్యంకుడికి 430 ఎకరాల భూమి అంటూ ఆరోపణలు సరికాదన్నారు. 3,129 ఎకరాలు కొన్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి నారాయణ వివరణ ఇచ్చారని ప్రకటనలో పేర్కొన్నారు. -
మార్పు తప్పదు!
బీటీపీఎస్ నిర్మాణంపై నీలినీడలుముందుచూపు లేని టీఎస్ జెన్కోకేంద్రం సీరియస్ కావడంతోపునరాలోచన పనులు నిలిచిపోవడంతో కాంట్రాక్టర్ల గగ్గోలు మణుగూరు: భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్(బీటీపీఎస్) నిర్మాణంపై అస్పష్టత నెలకొంది. మణుగూరు, పినపాక మండలాల సరిహద్దులోని సాంబాయిగూడెం, చిక్కుడుగుంట, దమ్మక్కపేట, సీతారాంపురం గ్రామాల వద్ద నిర్మించే ప్లాంటు, ఉత్పత్తికి సంబంధించి కాలంచెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడడమే కాక కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు ల శాఖ నుంచి ఎలాంటి పర్యావరణ అనుమతులు రాకుండానే హడావుడిగా బీహెచ్ఈఎల్ ద్వారా టీఎస్ జెన్కో నిర్మాణ పనులు మొదలుపెట్టి.. శరవేగంగా చేయిస్తుండడంతో పరిస్థితి మొదటికొచ్చింది. అత్యంత కీలకమైన పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే గత ఏడాది సెప్టెంబర్ నుంచే యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించారు. ఒక్కొక్కటి 270 యూనిట్ల సామర్థ్యం కలిగిన 4 యూనిట్ల ద్వారా 1,080 మొగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో సుమారు 1100 ఎకరాల్లో ప్లాంట్ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి భూనిర్వాసిత కుటుంబాలకు పూర్తిస్థాయిలో ప్యాకేజీలు చెల్లించకపోవడంతోపాటు ఉద్యోగాలు కోరుకున్న 371 మంది యువతకుఇప్పటికీ ఉద్యోగ హామీ పత్రాలు ఇవ్వలేదు. ఈ క్రమంలో పర్యావరణ అనుమతులు లేకుండానే పనులు మాత్రం శరవేగంగా జరిగాయి. 2016 డిసెంబర్ కల్లా మొదటి యూనిట్ నుంచి 270 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో యూనిట్ పనులతోపాటు స్విచ్‌యార్డ్, బాయిలర్, చిమ్నీ పనులు సైతం పునాది దశను దాటాయి. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు మానవ హక్కుల వేదిక ద్వారా నేషనల్ ట్రీన్ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పర్యావరణ అనుమతులు లేనందున భద్రాద్రి పనులు నిలిపేయాలని జెన్కోను ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ ఆదేశాలపై స్టే కోరుతూ టీఎస్ జెన్కో హైకోర్టును ఆశ్రయించింది. పర్యావరణ అనుమతులు లేనందున పనులెలా చేస్తారని హైకోర్టు సైతం జెన్కోను ప్రశ్నించింది. ఇందులో హైకోర్టు కేంద్ర పర్యావరణ శాఖను ప్రతివాదిగా చేర్చింది. దీంతో కేంద్ర పర్యావరణ శాఖ నుంచి వచ్చిన డిప్యూటీ డెరైక్టర్ కరుపయ్య గత నెల 9వ తేదీన ప్లాంట్ పనులను తనిఖీ చేసుకుని వెళ్లి.. నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని నివేదిక ఇచ్చారు. ఈ క్రమంలో విషయాన్ని కేంద్ర పర్యావరణ శాఖ సీరియస్‌గా పరిగణించడంతోపాటు హైకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్ సైతం పర్యావరణ అనుమతులు లేకుండా చేస్తున్న పనులపై ప్రశ్నించింది. దీంతో 20 రోజుల కిందట ప్లాంట్ పనులు పూర్తిగా నిలిపేశారు. తిరిగి పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయమై ఇప్పటివరకు స్పష్టత లేకుండా పోయింది. ఏ అధికారి సైతం ఈ విషయమై స్పందించే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు సబ్ కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటివరకు చేసిన పనులకు బిల్లులు రాకపోగా, యంత్రాలు ఆపివేయడంతో అవి దెబ్బతింటాయని ఆందోళనకు గురవుతున్నారు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అవలంబిస్తేనే అనుమతులు.. మారిన పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర పర్యావరణ, విద్యుత్ శాఖల నిబంధనల ప్రకారం 600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంకన్నా ఎక్కువగా ఉంటే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడాల్సి ఉంది. అయితే 1080 మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్లాంట్ నిర్మిస్తున్నందున కాలుష్యం తక్కువగా వెదజల్లే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడాల్సి ఉంది. అయితే దీనికి విరుద్ధంగా కాలంచెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ మాత్రమే వాడుతుండడంతో కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించింది. అయినప్పటికీ పనులు చేపట్టడంతో పరిస్థితి గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు వరకు వెళ్లింది. ప్రస్తుతం బంతి హైకోర్టు పరిధిలో ఉంది. మరోవైపు కేంద్ర పర్యావరణ శాఖ కూడా ఈ అంశాలపై హైకోర్టులో వాదనలు వినిపించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలో సబ్ క్రిటికల్ టెక్నాలజీ నుంచి సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి మారడంతోపాటు దీనికి సంబంధించిన అన్ని రకాల మెటీరియల్ మారిస్తేనే పర్యావరణ అనుమతులు వచ్చే పరిస్థితి ఏర్పడింది. పైగా ఇప్పటివరకు యుద్ధప్రాతిపదికన పనులు చేయడంతో జెన్కోపై చర్యలు తీసుకోవాలని పర్యావరణ శాఖ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. దీంతో టీఎస్ జెన్కో పునరాలోచనలో పడింది. మరోవైపు కాలం చెల్లిన మెటీరియల్ వదిలించుకునేందుకు బీహెచ్ఈఎల్ పనికిరాని పరికరాలను టీఎస్ జెన్కోకు అంటగట్టేందుకు ప్రయత్నించిందనే అనుమానాలను పలువురు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ టెక్నాలజీ, పరికరాలు మారిస్తేనే బీటీపీఎస్‌కు పర్యావరణ అనుమతులు వచ్చే అవకాశం ఉంది. -
రూ. 40 కోసం రూ. 33 వేల ఖర్చు
న్యూఢిల్లీ: కేవలం 40 రూపాయల కోసం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ.33 వేలు లాయర్ ఖర్చుల కింద ఖర్చుపెట్టిందిట! ప్రజాధనాన్ని ఎందుకు ఇంతలా వృథా చేసిందో తెలిస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోతారు. గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఎన్ని దరఖాస్తులు దాఖలయ్యాయి, వాటిల్లో ఎన్ని పరిష్కరించారో తెలపాలంటూ ఈ మధ్య నే ఆర్కే జైన్ అనే ఆర్టీఐ కార్యకర్త ఒక దరఖాస్తు ఇచ్చారు. ఫస్ట్ అప్పిలేట్ అథారిటీ ఆదేశాలను కూడా పట్టించుకోకుండా 20 పేజీల సమాచారాన్ని ఇవ్వడానికి రూ.40 చెల్లించాలంటూ ఆర్కే జైన్‌పై సీపీఐవో చేతన్ చావ్లా ఒత్తిడి తెచ్చారు. దీనిపై సమాచారకమిషన్లో తమ వాదనలు వినిపించడానికి లాయర్ ఫీజు కింద ఎన్జీటీ అధికారులు రూ. 33 వేలు చెల్లించారు. ఈ దుబారాపై మండిపడ్డ సమాచారకమిషనర్ మాఢభూషి శ్రీధర్ఆచార్యులు.. ఈ కేసులో దుబారా చేసిన అధికారి నుంచి ఆ మొత్తాన్ని తిరిగి రాబట్టాలని ఎన్జీటీ చైర్మన్‌ను ఆదేశించారు. -
ఇసుక తవ్వకాలపై గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్
ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో అడ్డగోలుగా సాగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపేయాలని ఆదేశించింది. పర్యావరణ అనుమతులు లేకుండా జరిపే ఇసుక తవ్వకాలు అక్రమం అని తెలిపిన గ్రీన్ ట్రిబ్యునల్.. ఈ అంశంపై రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని తెలుగు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. నదీ తీర ప్రాంతాల్లో యంత్రాలతో ఇసుక తవ్వడంపై గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై తదుపరి విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా వేసింది. -
'డీజిల్ కార్లకు రిజిస్ట్రేషన్లు చేయొద్దు'
-
ఏపీ సర్కార్ కు గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు
-
బాబు సర్కార్‌కు గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు
న్యూఢిల్లీ: ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. రాజధాని నిర్మాణం కోసం ఎంపిక చేసిన గుంటూరు జిల్లా తుళ్లూరు ప్రాంతంలో భారీ భవనాలను నిర్మించడం వల్ల కృష్ణా రివర్ బెడ్‌కు ముప్పు పొంచివుందని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. గ్రీన్ ట్రిబ్యునల్‌లోనూ ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. గ్రీన్ ట్రిబ్యునల్ చంద్రబాబు సర్కార్‌కు నోటీసులు జారీ చేసింది.