
తీర్పు స్ఫూర్తితో చిగురించిన ఆశ
ఇప్పటికే గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ముందున్న కేసు తదుపరి విచారణ శుక్రవారం జరుగనుంది.
ఇప్పటికే గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ముందున్న కేసు తదుపరి విచారణ శుక్రవారం జరుగనుంది. పర్యావరణ ప్రభావ అధ్యయనమే జరుగలేదని, మూడు పంటలు పండే వ్యవసాయ భూముల్ని నాశనం చేయడమే కాకుండా సమీకరించిన భూమి కొండవీటి వాగు వరద ప్రభావిత ప్రాంతమనే నిపుణుల నివేదికలున్నాయని వారంటున్నారు. 2013 చట్టం బహుళపంటల భూముల్ని సేకరించవద్దనే చెబుతోంది. తెలంగాణలోని మల్లన్నసాగర్ భూసేకరణలోనూ 2013 చట్ట స్ఫూర్తికి భంగం జరిగిందనే వాదనుంది.
‘‘కోర్టు కోర్టుకీ తీర్పు తీర్పుకీ ఇంత మార్పు ఉంటే మీ న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్టా యువరానర్....’’ అని జడ్జిని ఉద్దేశించి ఆగ్రహంగా, ఉద్రేకంగా అడుగుతాడు బొబ్బిలిపులి సినిమాలో కథానాయక పాత్రలో నటించిన ఎన్టీరామారావు. ఒకోసారి తేడా ఉంటుంది. ఎందుకుంటుందీ? అంటే అందుకొక కారణం చెబుతారు న్యాయనిపుణులు.
కేసు ఒకటే అయినా ఒకసారి ఓ కోర్టు ముందు ప్రవేశపెట్టిన సాక్ష్యాలు, ఆధారాలు, పరిస్థితులు, వాదనలు తర్వాతి కాలంలో అదే కోర్టులో గానీ, ఇతర ఉన్నత న్యాయస్థానాల ముందుగ్గాని వచ్చినపుడు మార్పులకు గురయితే తీర్పు భిన్నంగా ఉండటా నికి ఆస్కారం ఉంటుందనేది ఓ అభిప్రాయం.
కొన్ని విషయాల్లో న్యాయస్థా నాలు వెలువరించే తీర్పులు దాదాపు అదే పరిస్థితులున్న ఇతర పరిణామా లకు, సందర్భాలకు యథాతథం వర్తిస్తాయి. కొన్నిసార్లు పాక్షికంగానే వర్తి స్తాయి. అసలు వర్తించవు. చట్టాల్లో, విధానాల్లో నిర్దిష్టంగా పేర్కొనని సందిగ్ధ అంశాల్లో రాజ్యాంగ న్యాయస్థానాలైన హైకోర్టు, సుప్రీంకోర్టులిచ్చే తీర్పులే తర్వాతి కాలంలో తలెత్తే అటువంటి అన్ని వివాదాలకూ విధిగా వర్తిస్తాయి. ప్రామాణికం కూడా అవుతాయి.
పశ్చిమబెంగాల్‌లో దశాబ్దం కింద జరిపిన సింగూరు భూసేకరణే అక్రమమని సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పిచ్చింది. వారం కింద వెలువడ్డ ఈ తాజా తీర్పును ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతం, తెలంగాణలోని మల్లన్నసాగర్ ప్రాంత రైతులు, రైతు నాయకులు, ప్రజాసంఘాల వారు లోతుగా పరిశీలిస్తున్నారు. ఈ తీర్పు నీడలో తమకేమైనా ఉపశమనం లభించేనా? అని న్యాయనిపుణులతో సంప్ర దింపులు జరుపుతున్నారు.
రాజధాని భూముల విషయంలో సీనియర్ సంపాదకుడు ఏబీకే ప్రసాద్ తదితరులు సంప్రదించినపుడు, లేవనెత్తిన అంశాల్లోకి వెళ్లకుండానే ‘మీరు రైతులు కాదుకదా! భూములు కోల్పోయిన రైతులే వచ్చినపుడు చూద్దాం...’ అనే వ్యాఖ్యలతో కేసును సుప్రీంకోర్టు తోసిపుచ్చిన దరిమిలా ఈ కొత్త ఆలోచనలు చోటు చేసుకుంటున్నాయి.
సింగూరు భూముల విషయంలో పరిస్థితి పూర్తిగా వేరనీ, ఇది అమరావతి భూములకు వర్తించబోదనీ కొట్టివేసేవారూ ఉన్నారు. సింగూరులో జరిగింది భూసేకరణ కాగా, అమరావతిలో జరిపింది భూసమీకరణ అని వారు అన్వయం చెబుతున్నారు. సేకరణయినా, సమీకరణయినా నిర్దిష్ట అవసరాల కోసం ప్రభుత్వం భూమిని తీసుకుంటూ భూయజమానుల నుంచి దాన్ని దూరం చేయడమే! ఈ మౌలికాంశాన్నే న్యాయమూర్తులు పరిగణన లోకి తీసు కున్నట్టు సింగూరు కేసులో సుప్రీం తీర్పును విశ్లేషిస్తే స్పష్టమౌతోంది.
స్ఫూర్తి కొరవడటం తప్పిదమే!
పౌరుల భూయాజమాన్యపు అధికారం మొదట్లో ప్రాథమిక హక్కుగానే ఉండేది. రాజ్యాంగం మూడో భాగంలోని ఆస్తి హక్కు కింద 1949 నుంచే ఈ ప్రయాణం మొదలైంది. కాలక్రమంలో రాజ్యం తన విస్తృతాధికారాల్ని ఇష్టా నుసారం వినియోగించడంతో ‘ప్రజా సంక్షేమం కోసం’ అనే సాకు నీడన సుదీర్ఘకాలం పాటు భూచట్టాలు దుర్వినియోగమవుతూ వచ్చాయి.
అదే క్రమంలో రాజ్యాంగ సవరణ జరిగి ప్రాథమిక హక్కు స్థానే చట్టబద్ధమైన హక్కుగా ఇది మారింది. ప్రభుత్వాలు భూసేకరణ తలపెట్టిన ప్రతిసారీ ఈ వ్యవహారాల్లో 1894, అంటే 122 ఏళ్లకిందటి భూసేకరణ చట్టం నిర్దేశించిన అంశాలే ప్రాతిపదిక అయ్యేవి. భూహక్కుదారుల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ‘జనహితం’లో భూముల్ని సేకరించే అధికారం ప్రభుత్వాలకు ధారా దత్తమైంది.
కాలం చెల్లిన 1894 నాటి చట్టంలో ప్రభుత్వ సానుకూలత తప్ప మానవీయ అంశమే లేదనే వాదన తెరపైకి వచ్చింది. నిర్వాసితులయ్యే, ఉపాధి కోల్పోయే వారికి రక్షణ లేని పరిస్థితులు బలపడ్డాయి. ఉమ్మడి జాబితాలోని అంశమే అయినా... కేంద్ర చట్టం నీడలో తమ రాష్ట్ర భూసేకరణ చట్టాలు, విధానాలు రూపొందించుకున్న అనేక రాష్ట్రాలు సదరు లోపాల్ని సరిదిద్దకపోగా మరింత లోపభూయిష్టంగా వాటిని తయారు చేసుకుంటూ వచ్చాయి. దాంతో నిర్వాసితుల సానుకూలాంశాలే లేకుండా పోయాయి. ప్రజల్లో అవగాహన, చైతన్యం పెరుగుతున్న కొద్దీ ప్రతిఘటనలూ పెరిగాయి. భూసేకరణల్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలే వచ్చాయి.
ఒకవైపు రాజ్యబలం మరోవైపు ప్రజాందోళనలు.. నేల మీద నెత్తురు చిందే ఘటనలు అధికమయ్యాయి. చర్చ ఊపందుకోవడంతో పాలకులు తలవంచాల్సి వచ్చింది. పర్యవసానంగా పలు సానుకూల అంశాలతో 2013లో కొత్త భూసేకరణ చట్టం వచ్చింది. తప్పనిసరిగా సామాజిక-పర్యావరణ ప్రభావ అధ్యయనాలు, 70 శాతం, 80 శాతం మంది అంగీకారం, నిర్వాసితులు, ప్రభావితులయ్యేవారికి నష్టపరిహారం, పునరావాసం, పునఃప్రతిష్ట వంటి అంశాలు ఇందులో భాగమయ్యాయి. ఇప్పుడదే చట్టం అమల్లో ఉంది.
సింగూరు భూసేకరణ వ్యవహారం 2006 నాటిది కావడంతో ఆ కేసు వివిధ న్యాయస్థానాల్లో దశాబ్ద కాలం నానుతూ వచ్చింది. భూసేకరణే అక్రమమని ఇచ్చిన ధర్మాసనం తీర్పులో అసలు భూసేకరణ చట్టం నిర్దేశించే (సెక్షన్ 5ఏ) విధానాలనే ఉల్లంఘించారని ఇద్దరు న్యాయమూర్తులూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రజావసరాలని చెప్పి టాటా కంపెనీ కోసం భూమి సేక రించడాన్ని తన ఆదేశాల్లో జస్టిస్ గౌడ తప్పుబట్టారు. ప్రజాభిప్రాయ సేకరణ సరిగ్గా జరగలేదని, అభ్యంతరాల్ని పరిగణనలోకి తీసుకోకుండా భూసేకరణ కలెక్టరిచ్చిన నివేదికను యథాతథం స్వీకరించి చట్ట నిబంధనను తూతూ మంత్రంగా పాటించారని జస్టిస్ మిశ్రా ఎండగట్టారు. చట్టపు స్ఫూర్తిని కూడా పరిరక్షించలేకపోయారని జడ్జీలు తప్పుబట్టారు.
డొంకతిరుగుళ్లు... దొడ్డిదారి నడకలు
అమరావతి కొత్త రాజధాని కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూసేకరణకు బదులు భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్)కు వెళ్లింది. భవిష్యత్ ప్రయోజ నాల్లో భూయజమానులనూ భాగస్వాముల్ని చేస్తూ వారి భూముల్ని సమీ కరించడం ఈ పద్ధతి. రాజధానిని అభివృద్ధి పరిచే క్రమంలో విలువ పెరిగే కొంత నివాస, వాణిజ్య స్థలాల్ని వారికి పరిహారంగా ఇస్తారు. అప్పటివరకు ఏటా ఇంతని ప్రభుత్వం సదరు భూయజమానులకు కౌలు చెల్లించాలి. రైతులు 33వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారన్నది ప్రభుత్వ ప్రచారం.
కానీ, అక్కడ జరిగిందేమిటో అందరికీ తెలుసు. అత్యధిక సందర్భాల్లో బెది రించి, భయపెట్టి, విపరీత పరిస్థితులు కల్పించి, మైండ్ గేమ్‌తో పలు కుయుక్తులు పన్ని భూసమీకరణ పేరిట పరోక్షంగా భూసేకరణే జరిపారన్నది నిజం. కొందరు రైతులకు ఇటీవల భూసేకరణ కిందే నోటీసులిస్తున్నారు. నిజానికి 75 శాతం భూముల్నే సమీకరించ గలిగారు. ఇప్పటికీ భూములివ్వని గ్రామాలున్నాయి. మొదట తెలియక నిబంధన (పత్రం-9.3) కింద అంగీ కారం తెలిపి, నిజాలు తెలిసి అంగీకారాన్ని (పత్రం-9.14 కింద) ఉపసం హరించుకున్న వారూ ఉన్నారు. సుమారు అయిదారువేల ఎకరాల భూమి ఇంకా ప్రభుత్వ ఖాతాలోకి రానిదుంది.
ఏ రకమైన అంగీకారానికి రాని రైతుల వద్ద ఇంకా 3,200 ఎకరాల భూమి ఉంది. ఉండవల్లి (78శాతం), పెనుమాక (55శాతం), నిడమర్రు (40శాతం), రాయపూడి, వెలగపూడి, బేతపూడి, నవులూరు (10శాతం వరకు)లలో కొన్ని భూములు ఇంకా ఈ పరిధిలోకి రానేలేదు. తమ ప్రాథమిక అంగీకారాన్ని ఉపసంహరించుకున్న రైతుల తాలూకు భూమి సుమారు 1,600 ఎకరాలుంటుంది. ఇక పాలకపక్షానికి చెందిన నాయకుల, పలుకుబడిగలిగిన వారి దాష్టీకాలకు అక్కడ లెక్కే లేదు. అధికారపార్టీకి, ఒక సామాజిక వర్గానికి చెందిన వారు మొదట్నుంచీ అధికారం అండతో యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారు.
అదే సామాజిక వర్గానికి చెందిన కొంతమంది మాత్రం ప్రభుత్వ తీరును నిశితంగా విమర్శిస్తున్నారు. దాష్టీకాలకు పాల్పడుతున్న వారు అసైన్డ్ భూములకు పైసా పరిహారం రాదని మొదట ఎస్సీ, ఎస్టీల్ని బెదిరించి, భయపెట్టి వారి భూముల్ని నామమాత్రపు ధరకు కొనుగోలు చేశారు. వారిని నియంత్రణలో ఉంచుకోవడానికి వాటిని సీసీ కెమెరాల్లో రికార్డు చేయించారు. మెజారిటీ అసైన్డ్ భూములు తమ చేజి క్కిన తర్వాత ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆ భూములకూ నష్టపరిహారం లభించేలా చట్టసవరణకు పావులు కదిపారు. సమీకరించిన భూములకు సంబంధించి మొదటి సంవత్సరం కౌలు చెల్లించిన ప్రభుత్వం రెండో సంవ త్సరం నిలిపివేసింది. భూమిలేని పేద కూలీలకిచ్చే నిరుద్యోగభృతి విష యంలోనూ ఇదే జరిగింది.
కూలీల ఎంపికే సరిగ్గా జరగలేదని, 29 గ్రామాల కింద 16 వేల మందినే ఎంపిక చేశారనేది విమర్శ. అత్యధిక చోట్ల నిజమైన వారిని ఎంపిక చేయకుండా మొండిచేయి చూపారన్నది అభియోగం. నెలకు రూ. 2,500 భృతి కింద ఇవ్వాల్సి ఉంది. అది ఏటా పదిశాతం పెరగాలి. మభ్యపెట్టేందుకు మొదట అయిదు మాసాలదీ కలిపి రూ.12,500 అక్కడ క్కడ ఇచ్చి తర్వాత నిలుపుదల చేశారు. భూమిలేని చేతివృత్తుల వారిని పూర్తిగా గాలికొదిలేశారు. గ్రామకంఠాల వివాదం తేల్చకుండా నాన్చుతూ ఊరూరా కొత్త సమస్యలు రేపి అశాంతి రగిలిస్తున్నారు.
గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెబుతుందో?
భూసమీకరణలో అవకతవకలు, అక్రమాలు ఒక ఎత్తయితే చట్ట నిబంధన లకూ, నైతిక సూత్రాలకూ తూట్లు పొడిచి విదేశీ సంస్థలతో కుదుర్చుకుం టున్న ఒప్పందాలు, లీజులు, వాణిజ్య యత్నాలు అమరావతిలో మరింత వివాదాస్పదమయ్యాయి. భూ వినియోగం దేనికి? కనీస వినియోగ స్థలం ఎంత? తదితరాంశాల్ని స్పష్టం చేయకుండా జరిపిన భూసమీకరణే చట్ట విరుద్ధమని కొందరు వాదిస్తున్నారు. పరిహారం, పునరావాస-పునఃప్రతిష్ఠ, పర్యావరణ ప్రభావ అధ్యయనం, సామాజిక భద్రత వంటి అంశాల్లో 2013 చట్టం స్ఫూర్తికి గండికొట్టిన ఈ సమీకరణనే వారు తప్పుబడుతున్నారు. ఇదే విషయమై సుప్రీంకోర్టును సంప్రదించే యత్నాల్లో ఉన్నారు. ఇదివరకే న్యాయ స్థానాల్ని సంప్రదించిన కేసుల్లో కొందరు రైతులు ఇంప్లీడ్ అవుతున్నారు. ఇప్పటికే గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ముందున్న కేసు తదుపరి విచారణ శుక్రవారం జరుగనుంది.
పర్యావరణ ప్రభావ అధ్యయనమే జరుగలేదని, మూడు పంటలు పండే వ్యవసాయ భూముల్ని నాశనం చేయడమే కాకుండా సమీకరించిన భూమి కొండవీటి వాగు వరద ప్రభావిత ప్రాంతమనే నిపు ణుల నివేదికలున్నాయని వారంటున్నారు. 2013 చట్టం బహుళపంటల భూముల్ని సేకరించవద్దనే చెబుతోంది. తెలంగాణలోని మల్లన్నసాగర్ భూసే కరణలోనూ 2013 చట్ట స్ఫూర్తికి భంగం జరిగిందనే వాదనుంది.
ఆ చట్టంలో నిర్దేశించిన దానికన్నా 123 జీవోలో ఎక్కువ నష్టపరిహారం ప్రతిపాదించామని ప్రభుత్వం చెబుతున్నా, అదొక్కటే ప్రాతిపదిక కాదని, పలు అంశాల్లో చట్టం స్ఫూర్తికి గండికొట్టారని రైతులు, ప్రజాసంఘాల వారంటున్నారు. ఈ అంశా లన్నింటినీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకుపోగలిగితే తప్పక న్యాయం జరుగు తుందని రెండు రాష్ట్రాల భూనిర్వాసితులు ఆశిస్తున్నారు. జీవనాధారమైన కాసింత భూమితో ఉండే అనుబంధానికి దూరమౌతూ నలిగి పోతున్నవారెం దరో! ‘‘చావడానికి ధైర్యంలేక బతుకుతున్నాం’’ అంటున్న కొందరి ఆర్తినైనా సుప్రీంకోర్టు పట్టించుకోకపోతుందా! అన్నది మిణుకు మిణుకుమనే ఆశ!
దిలీప్ రెడ్డి
ఈమెయిల్:dileepreddy@sakshi.com