
విశాఖలోని పరీక్షా కేంద్రం వద్ద విలపిస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు
విశాఖలో డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో కఠిన ట్రాఫిక్ ఆంక్షలు
ఉదయం 7 నుంచే రోడ్లపై కూటమి నాయకుల హంగామా
రెండు గంటలకు పైగా నిలిచిపోయిన వాహనాలు
ట్రాఫిక్‌లో చిక్కుకున్న విద్యార్థులు.. జేఈఈ మెయిన్‌కు ఆలస్యం
23 మందిని పరీక్షకు అనుమతించని నిర్వాహకులు
కన్నీటి పర్యంతం అయిన పిల్లలు, తల్లిదండ్రులు
పెందుర్తి: వారంతా తన కలను సాకారం చేసుకునేందుకు నిద్రాహారాలు మాని తపించారు. జీవిత లక్ష్యం నెరవేరే రోజు వచ్చింది.. కానీ ఎన్నో ఆశలతో పరీక్షకు సిద్ధమైన ఆ విద్యార్థులకు సోమవారం విశాఖలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పర్యటన శాపంగా మారింది. ఉదయం నుంచే కూటమి నేతల కోలాహలం.. కఠినమైన ఆంక్షల కారణంగా ట్రాఫిక్‌లో చిక్కుకుని 23 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్షకు దూరమయ్యారు.
పవన్‌కళ్యాణ్ కాన్వాయ్ కోసం ఎన్‌ఏడీ నుంచి పెందుర్తి వరకు వాహనాలను నిలిపివేయడంతో జేఈఈ మెయిన్ పరీక్ష రాసేందుకు వెళుతున్న విద్యార్థులంతా చిక్కుకుపోయారు. రెండు నిమిషాలు ఆలస్యం కావడంతో నిర్వాహకులు వారిని పరీక్షకు అనుమతించలేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే పవన్‌కళ్యాణ్ రాక సందర్భంగా ట్రాఫిక్‌ను ఆపలేదని.. బీఆర్‌టీఎస్ మధ్య రోడ్డులో ఆయన వెళ్లారని.. మిగిలిన సర్విస్ రోడ్లపై ఇతర వాహనాలు యథావిధిగా ముందుకు సాగాయని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అసలేం జరిగింది..!
అల్లూరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ఎన్‌ఏడీ కొత్త రోడ్డు నుంచి పెందుర్తి వరకు ఉదయం నుంచి పోలీసులు ట్రాఫిక్‌ను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నారు. పవన్ ప్రత్యేక విమానంలో ఉదయం 8.15 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకోగా 6.30 నుంచే ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ వచ్చారు. పవన్ కాన్వాయ్‌కు కేటాయించిన బీఆర్‌టీఎస్ మధ్య రోడ్డులో ఇతర వాహనాలను పూర్తిగా నిలిపివేయగా.. ఎడమ, కుడి మార్గాల్లోనూ ఆంక్షలు విధించడంతో ట్రాఫిక్ మందకొడిగా సాగింది. ఈ రోడ్డులో 7.30 నుంచి ట్రాఫిక్‌ను పూర్తిగా నియంత్రించారు.
దీంతో పరీక్షకు హాజరు కావాల్సిన విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు. దాదాపు 2 గంటల పాటు ట్రాఫిక్‌ను కఠినంగా నియంత్రించడం.. జనసేన కార్యకర్తలు ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేయడంతో బీఆర్‌టీఎస్ సర్విస్ రోడ్డుపై రద్దీ పెరిగిపోయి విద్యార్థులు జేఈఈ పరీక్షకు ఆలస్యమైనట్లు స్పష్టమవుతోంది. మరోపక్క పవన్ ఎయిర్‌పోర్టులో ఉదయం 8.21 గంటలకు బయల్దేరగా వేపగుంట నుంచి పెందుర్తి మార్గంలో అన్ని వైపులా ఉదయం 8.10 గంటలకే ట్రాఫిక్‌ను నిలిపివేసేలా జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
దీనివల్ల పవన్‌వెళ్లే వరకు ఆ మార్గంలో వాహనాలు కదల్లేదు. దీంతో వేపగుంట నుంచి చినముషిడివాడ కేంద్రానికి కేవలం 10 నిమిషాల లోపు చేరుకోవాల్సిన విద్యార్థులు ఆలస్యమయ్యారు. మరోవైపు జనసేన పార్టీ నిబంధనల ప్రకారం గజమాలతో అధినేతను గానీ ఇతర నాయకులను గానీ సత్కరించడం నిషిధ్ధం. కానీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గజమాలతో పవన్‌ను (షెడ్యూల్ ప్రకారం పవన్‌కళ్యాణ్ ఎక్కడా ఆగే వీలు లేదు) సత్కరించేందుకే ఇంత హడావిడి చేసి విద్యార్థులు పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయేలా చేశారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
పవన్ వెళుతున్న రోడ్డులోనే ఉన్న చినముషిడివాడలోని అయాన్ డిజిటల్ కేంద్రంలో 1,350 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్షకు హజరవుతున్నారని తెలిసి కూడా అధికారులు దానిపై ప్రత్యేక దృష్టి సారించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవన్‌కళ్యాణ్ పర్యటన కారణంగా ట్రాఫిక్ నిలిపివేయడంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. చినముషిడివాడ కేంద్రంలో జేఈఈ పరీక్షకు సగటున 50 నుంచి 70 మంది గైర్హాజరు అవుతున్నట్లు సీపీతో పాటు వెస్ట్ జోన్ ఏసీపీ పృధ్వితేజ పేర్కొన్నారు.
అలా ఎలా సార్!!
సాధారణంగా ఎన్‌ఏడీ కొత్త రోడ్డు నుంచి బీఆర్‌టీఎస్ మీదుగా చినముషిడివాడ చేరుకోవడానికి వాహనం / ట్రాఫిక్ పరిస్థితిని బట్టి 10 నుంచి 20 నిమిషాలు పడుతుంది. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ కాన్వాయ్ చినముషిడివాడ అయాన్ డిజిటల్ కేంద్రాన్ని ఉదయం 8.41 గంటలకు (ఎయిర్‌పోర్టులో బయలుదేరిన సమయం ఉదయం 8.21 గంటలు అని చెబుతున్నారు) దాటిందని చెబుతున్నారు. ఒక వీవీఐపీ వస్తున్నారంటే కనీసం గంట ముందు నుంచే ఇటు పోలీసులు అటు పార్టీ అభిమానులు, నాయకుల హడావుడి ఉంటుంది. అంటే ఉదయం 7 నుంచే రోడ్లపై వారి హంగామా మొదలైంది.
బీఆర్‌టీఎస్ మధ్య మార్గంలో ఇతర వాహనాలపై నిషేధం విధించడం.. వాటిని సర్విసు రోడ్డులోకి మళ్లించడం.. జనసేనతో పాటు ఇతర కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తల ఓవరాక్షన్ కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిందని జేఈఈ పరీక్ష రాసే అవకాశం కోల్పోయిన విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే పోలీసులు తప్పుడు వివరణలు ఇవ్వడం విడ్డూరంగా ఉంది. ఎయిర్‌పోర్టు నుంచి చినముషిడివాడకు డిప్యూటీ సీఎం కాన్వాయ్ రావడానికి 20 నిమిషాల సుదీర్ఘ సమయం (వీవీఐపీల ప్రయాణ సమయం సుమారుగా 10 నిమిషాలు) పట్టడం మరో ఆశ్చర్యకరమైన విషయం.
నా కల చెదిరింది..
జేఈఈ రాసి ఉన్నతస్థాయిలో నిలవాలన్నది నా కల. దీని కోసం చాలా కష్టపడ్డా. మా ఇంటి (కంచరపాలెం) నుంచి చినముషిడివాడకు ఎంత ట్రాఫిక్ ఉన్నా 30–40 నిమిషాల్లో వెళ్లిపోవచ్చు. ఎన్‌ఏడీ కొత్త రోడ్డుకు వచ్చేసరికి చాలా ట్రాఫిక్ ఉంది. అక్కడి నుంచి చినముషిడివాడ చేరుకోవడానికి 45–50 నిమిషాలు పట్టింది. 2 నిమిషాల ఆలస్యంతో పరీక్ష రాసే అవకాశం కోల్పోయా. నా కల చెదిరిపోయింది. – బొడ్డు జశ్వంత్, జేఈఈ అభ్యర్థి, కంచరపాలెం
విచారణ చేపట్టండి: పవన్‌కళ్యాణ్
సాక్షి, అమరావతి: పెందుర్తి ప్రాంతంలో జేఈఈకి కొందరు విద్యార్థులు హాజరుకాలేకపోవడానికి ఉప ముఖ్యమంత్రి కాన్వాయి కారణమని వచ్చిన వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకుని వాస్తవాలపై విచారణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఆదేశించారు. తన కాన్వాయి కోసం ఎంతసేపు ట్రాఫిక్‌ని ఆపేశారు, పరీక్ష కేంద్రం దగ్గరకు విద్యార్థులు చేరుకోవలసిన మార్గాల్లో ఆ సమయంలో ట్రాఫిక్ పరిస్థితి, సర్వీసు రోడ్లలో ట్రాఫిక్‌ను నియంత్రించారా? వంటి అంశాలపై విచారించాలని సూచించారు.
రేయింబవళ్లు కష్టపడి..
జేఈఈ పరీక్ష కోసం మా అబ్బాయి రేయింబవళ్లు కష్టపడి చదివాడు. చినముషిడివాడ కేంద్రం వద్దకు వెళ్లేందుకు ఉదయం 6.30కే ఇంటి నుంచి బయలుదేరాం. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిపేయడంతో చిక్కుకుపోయాం. రెండు నిమిషాలు ఆలస్యం కావడంతో లోపలికి అనుమతించలేదు. మా అబ్బాయి మళ్లీ పరీక్ష రాసేలా పవన్‌కళ్యాణ్, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – సత్యవతి, కంచరపాలెం, విద్యార్థి తల్లి
ఏం చేయాలో..
మాది సాధారణ కుటుంబం. జేఈఈపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా. తుని నుంచి వేకువజామున బయలుదేరి వచ్చా. ఎన్‌ఏడీ వచ్చేసరికి వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పరీక్షా కేంద్రానికి మరో 10 నిమిషాల్లో చేరుకుంటాననగా ట్రాఫిక్‌ను ఆపేశారు. రెండు నిమిషాలు ఆలస్యం కావడంతో అనుమతించలేదు. ఇప్పుడు నా భవిష్యత్ ఏమిటో.. ఏం చేయాలో పాలుపోవడం లేదు. – ఆళ్ల హేమంత్, తుని
మరో అవకాశం ఇవ్వాలి.. బాబు, పవన్ స్పందించాలి
ముమ్మాటికి పవన్‌కళ్యాణ్ పర్యటన కారణంగా ట్రాఫిక్ జామ్ వల్లే మా పిల్లలు పరీక్షకు ఆలస్యం అయ్యారు. లేదంటే నిర్దేశిత సమయానికి చాలా ముందే కేంద్రానికి చేరుకునేవాళ్లు. పరీక్షకు అనుమతించకపోవడంతో పిల్లల భవిష్యత్ పాడవుతుంది. మంగళవారం వరకు పరీక్షలు ఉంటాయి కాబట్టి పిల్లలందరికీ మరో అవకాశం ఇవ్వాలి. దీనిపై పవన్, చంద్రబాబు ఉన్నత స్థాయిలో మాట్లాడాలి. – అనిల్, విద్యార్థి తండ్రి
ట్రాఫిక్ వల్లే..
ఎన్‌ఏడీ నుంచి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయా. చాలా దూరం ట్రాఫిక్ నిలిచిపోయింది. అయినా ఏదోలా కేంద్రానికి చేరుకున్నా రెండు నిమిషాలు ఆలస్యం అయ్యానని పరీక్షకు అనుమతించలేదు. కేవలం ట్రాఫిక్ వల్లే పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయా. – ఆర్యన్‌రాజ్