దేశ ప్రధాని ఎవరైనా రాష్ట్రాలకు వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా అభినందించడం సహజం. ఎవరూ తప్పుపట్టలేము. కానీ ప్రధానే ఇబ్బందిపడేలా పొగిడితే? ఎంత ఎబ్బెట్టు? ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ విశాఖలో ఎన్డీయే సమావేశానికి హాజరైనప్పుడు జరిగింది ఇదే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన్ను ఆకాశానికి ఎత్తేయడం చూసి ప్రజలే విస్తుపోవాల్సి వచ్చింది. అదే సమయంలో ఇది ఆయన సొంతపార్టీ తెలుగుదేశం ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేది కూడా!.
.. అంత పొగిడినా మోదీ నుంచి ప్రశంసలేవీ రాకపోవడం బహుశా బాబును నిరాశకు గురి చేసి ఉంటుంది. అలాగని ఆ విషయం గట్టిగా చెప్పలేని స్థితి. కేంద్రంలో ప్రభుత్వం తమ పార్టీ మద్దతుతోనే కొనసాగుతోందన్న భ్రమలో టీడీపీ శ్రేణులు ఉన్న సమయంలో.. చంద్రబాబు మోదీని పొగిడి పార్టీలో మరిన్ని సందేహాలకు తావిచ్చారనిపిస్తోంది. బహుశా కేంద్రం స్థాయిలో తనపై ఉన్న కేసులు, భవిష్యత్తులో కుమారుడు నారా లోకేశ్(Nara Lokesh)కు పట్టం కట్టాల్సి వస్తే సమస్యల్లేకుండా చూసుకోవడం వంటివి బాబుకు ఈ పరిస్థితి కల్పించి ఉంటాయని అనుకుంటున్నారు!.
చంద్రబాబు తన ప్రసంగంలో అధిక భాగాన్ని మోదీ ప్రశంసలకే కేటాయించడం సొంతపార్టీలోనే చాలామందికి నచ్చలేదట!. ఇది పార్టీ ఆత్మ స్థైర్యాన్ని, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేదిగా ఉందని కొందరు అభిప్రాయపడ్డారు. ఏదైనా మంచి పని చేస్తే ప్రధానిని మెచ్చుకున్నా ఫర్వాలేదు కానీ చంద్రబాబు తన నోటితోనే 2019 ఎన్నికలకు ముందు దారుణమైన రీతిలో విమర్శించారు. పలు అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రధానమంత్రిని ‘టెర్రరిస్టు’గా అభివర్ణించారు. ముస్లింలను బతకనివ్వని నేతగా చూపించారు. చివరికి భార్యను ఏలుకోలేని వ్యక్తి అని కూడా దూషించారు.
ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) సైతం చంద్రబాబును తీవ్రంగానే విమర్శించే వారు. పోలవరం, అమరావతిలను చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని అంటూ ఎన్నికల సమయంలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు ‘యూ టర్న్ బాబు’ అని నామకరణం చేసింది కూడా మోదీనే. కొడుకు కోసమే బాబు పనిచేస్తున్నాడని ఎద్దేవా కూడా చేశారు. దీనికి ప్రతిగా బాబు తనకు కుటుంబం ఉందని, మీకేం ఉందని మోదీని ఘాటుగా ప్రశ్నించారు అప్పట్లో. అయితే 2024నాటికి తిరిగి వారిద్దరూ కలిసిన తీరు రాజకీయాలలో ఏదైనా జరగొచ్చు అనేదానికి ఒక నిదర్శనం!. పరువు ప్రతిష్టలు, ఆత్మాభిమానం అన్నవి సామాన్య ప్రజలకు సంబంధించినవే కానీ, ఇలాంటి పెద్ద నాయకులకు కాదని అనుకునే పరిస్థితి ఏర్పడింది. నిజానికి..
మోదీ కన్నా చంద్రబాబే సీనియర్ నేత. ఆయన 1978 నుంచి రాష్ట్ర రాజకీయాలలో ఉన్నారు. 1995లోనే తన మామ ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేసి ముఖ్యమంత్రి అయ్యారు. తాను సీనియర్‌ను అన్న విషయాన్ని ఆయన చాలాసార్లు పదే పదే గుర్తు చేశారు కూడా. అలాంటి బాబుగారు ఇప్పుడు ప్రధాని మోదీ తనకు స్ఫూర్తి అంటున్నారు. తమ ఇద్దరిది ఒకటే స్కూల్ అని చెబుతున్నారు. తెలుగుతో పాటు ఆంగ్లంలో కూడా ఈ పొగడ్తలను వినిపించడంతో మోదీ నవ్వుతూ కూర్చున్నారు. బహుశా ఇదే చంద్రబాబు గతంలో తనను ఉద్దేశించి ఏమన్నది మోదీకి గుర్తు వచ్చి ఉండవచ్చు!.
గత మూడు దశాబ్దాలలో మోదీకి, చంద్రబాబుకు మధ్య పలుమార్లు వివాదాలు వచ్చాయి. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నప్పుడు.. జరిగిన మత ఘర్షణలలో ఆయన రాజీనామాకు చంద్రబాబు డిమాండ్ చేశారు. మోదీని హైదరాబాద్ రానివ్వబోమని.. వస్తే అరెస్టు చేయిస్తానిని కూడా హెచ్చరించారు. అప్పటికి బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ చంద్రబాబు అలా మాట్లాడారు. 2009లో బీజేపీని వదలి టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్‌ఎస్), వామపక్షాలతో కూటమి కట్టి ఓటమి పాలవడంతో తిరిగి బీజేపీ వైపు మళ్లారు. 2014లో మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్దిగా ప్రకటించడంతో మెల్లగా ఆయనతో స్నేహం చేయడానికి నానా పాట్లు పడ్డారు. మోదీ ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి మాట కలిపే యత్నం చేశారు. ఎలాగైతేనేం..2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి రాగలిగారు. ఆ తర్వాత..
ప్రత్యేక హోదా అంశం పేరుతో బీజేపీని వ్యతిరేకించి కేంద్రం నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో అవసరం ఉన్నా, లేకపోయినా మోదీని టీడీపీ ముఖ్యనేతలు దూషించేవారు. ఆ క్రమంలో మోదీని వ్యక్తిగత స్థాయిలో కూడా చంద్రబాబు విమర్శించారు. ఆ దెబ్బకు ఇక వీరిద్దరూ కలవడం అసాధ్యం అనే భావన ఏర్పడేది. దానికి తోడు చంద్రబాబు 2018లో తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. దానివల్ల తనకు నష్టం జరిగిందని భావించిన చంద్రబాబు.. 2019లో ఏపీలో ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికలలో ఓడిపోవడంతో.. తిరిగి చంద్రబాబు మాట మార్చి బీజేపీని ప్రసన్నం చేసుకునే వ్యూహంలోకి వెళ్లారు. ఇందుకోసం పవన్ కల్యాణ్‌ను ప్రయోగించారు. అలాగే.. టీడీపీ ఎంపీలను బీజేపీలోకి పంపించారు. ఇదే టైమ్‌లో బీజేపీతో పొత్తు కోసం వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ సిద్దం కాకపోవడం కూడా చంద్రబాబుకు కలిసి వచ్చింది!.
.. ఎలాగైతేనేం 2024 ఎన్నికలలో జనసేన, బీజేపీలతో కూటమి కట్టి అధికారంలోకి వచ్చారు.ఈ నేపథ్యంలో మోదీతో పాటు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను పొగుడుతున్నారు. అది విశాఖ సభలో శ్రుతి మించిందని చెప్పకతప్పదు. మోదీ భజన చేస్తే చేశారులే.. ఏపీకి అవసరమైన కీలకమైన అంశాల గురించి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు మాట్లాడతారేమో అని ఆశగా ఎదురు చూసినవారికి మాత్రం నిరాశే ఎదురైంది. ముఖ్యంగా..
విశాఖపట్నంలో ఐదు దశాబ్దాలుగా విరాజిల్లుతున్న విశాఖ స్టీల్ ను పరిరక్షించాలని మాత్రం కోరలేకపోయారు. పైగా పుండు మీద కారం చల్లినట్లు నక్కపల్లి వద్ద మిట్టల్ కంపెనీ ఏర్పాటు చేయదలపెట్టిన స్టీల్ ప్లాంట్‌కు ఇనుప ఖనిజం సరఫరాకు అనుమతి ఇవ్వాలని కోరిన సంగతి గుర్తు చేసి, ప్రధాని పాజిటివ్‌గా ఉన్నారని చంద్రబాబు అన్నారు. ‘‘విశాఖ స్టీల్ సంగతేమిటి?’’ అని ఎవరికైనా సందేహం వస్తే అది వారి ఖర్మ. కార్మిక సంఘాలు గత కొద్ది సంవత్సరాలుగా చేస్తున్న ఆందోళనలు, నిరసన దీక్షలు ఆయనకు పట్టలేదు. పోనీ గతంలో చంద్రబాబు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు అనుకూలమని ఏమైనా చెప్పారా? అంటే అదీలేదు. శాసనసభ ఎన్నికలకు ముందు విశాఖ స్టీల్ అన్నది ఆంధ్రుల హక్కు, ప్రత్యేక సెంటిమెంట్ అని, దానిని కాపాడుకోవాల్సిందేనని, ప్రభుత్వ రంగంలోనే నడవాలని చంద్రబాబు ప్రచారం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపిస్తేనే విశాఖ స్టీల్ ను సేవ్ చేయగులుగుతామని, తాము ప్రధానిని ఒప్పించగలుగుతామని చంద్రబాబు, పవన్ నమ్మబలికారు. వాటిని కూడా నమ్మి అక్కడి వారు రికార్డు స్థాయిలో కూటమి అభ్యర్దులను గెలిపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మారిపోయింది.
పైకి మాత్రం మొక్కుబడిగా స్టీల్ ప్లాంట్ ను రక్షిస్తామని చెబుతూ, అక్కడ ఉద్యోగాలు పోతున్నా, ఇనుప ఖనిజం సరఫరా సమస్య అయినా పట్టించుకోవడం మానేశారు. ప్రధానమంత్రితో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడించాలని వైఎస్సార్ కాంగ్రెస్ సహా వామపక్షాలు, కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. కానీ చంద్రబాబు, పవన్‌లు ప్రధాని సమక్షంలో దాని గురించి ప్రస్తావించకుండా పిరికిగా వ్యవహరించారు. అదే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) అప్పట్లో ఇదే ప్రాంగణంలో జరిగిన సభలో ప్రధాని మోదీని విశాఖ స్టీల్ ను ప్రైవేటైజ్ చేయవద్దని, దానికి అసరమైన గనులు కేటాయించాలని కోరారు కదా. మోదీతో తమ సంబంధం రాజకీయాలకు అతీతమైనది అని అంటూనే, ఏపీకి కావల్సిన డిమాండ్లను తీర్చాలని విస్పష్టంగా కోరారు. ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలని అడిగారు. కానీ..
ఇప్పుడు కూటమి నేతలు ఎవరూ ప్రత్యేక హోదా ఊసే ఎత్తలేదు. దాని గురించి మర్చిపోయారు. ఇలాంటి కీలకమైన విషయాలను చంద్రబాబు, పవన్ లు ప్రస్తావించకపోవడంతో ప్రధాని మోడీకి సమాధానం చెప్పే అవసరమే లేకుండా పోయింది.విశాఖ ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలకే కూటమి నేతలంతా పరిమితం అయ్యారు. ఇక్కడ విశేషం ఏమిటంటే గత జగన్ ప్రభుత్వంలో వచ్చిన ప్రాజెక్టులకే ఇప్పుడు శంకుస్థాపనలు చేశారు. అందులో కొన్ని ప్రాజెక్టులకు ఆరోజుల్లో తెలుగుదేశం నేతలు అడ్డుపడే యత్నం కూడా చేశారు.
పలు రాష్ట్రాలు పోటీపడినా ఏపీకి బల్క్ డ్రగ్ పార్కును జగన్ ప్రభుత్వం సాధించింది. దీనిని వ్యతిరేకిస్తూ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు దానిని నక్కపల్లి వద్ద ఏర్పాటు చేస్తే అది తమ ఘనతేనని నిస్సిగ్గుగా టీడీపీ ప్రచారం చేసుకుంటోంది.
ఎన్.టి.పి.సి ఏర్పాటు చేయతలపెట్టిన గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ కు సంబంధించిన ఒప్పందం చేసుకున్నది కూడా జగన్ ప్రభుత్వమే.
అలాగే రైల్వేజోన్ కు అవసరమైన భూమిని కేటాయించింది సైతంం జగన్ సర్కారే. కానీ ఆ భూమిపై లేనిపోని వివాదాలు సృష్టించారు. చివరికి అదే భూమిలో శంకుస్థాపన చేశారు.
అయినా మంచిదే ప్రధాని వచ్చి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం.కాకపోతే వేగంగా ఈ ప్రాజెక్టులు పూర్తి అయ్యేలా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేయగలగాలి. శ్రమ ఎవరిదైనా ఫలితం దక్కించుకోవడంలో ,ప్రచారం చేయించుకోవడంలో చంద్రబాబు మించినవారు ఉండరేమో!.
ప్రధాని మోదీని రాష్ట్ర ప్రయోజనాల కోసం పొగిడితే అదో పద్దతి అనుకోవచ్చు. అలాకాకుండా ఏదో వ్యక్తిగత రాజకీయాల కోసం భజన చేస్తే ఏపీ ప్రజలకు ఏమి ప్రయోజనం?. ఇంతకీ మోదీని ఆనాడు చంద్రబాబు దూషించడాన్ని సమర్ధించాలా? లేక ప్రస్తుతం పొగడడాన్ని ఒప్పుకోవాలా?.. అంటే ఏమి చెబుదాం. అలాగే ఒకప్పుడు అవినీతిపరుడు అన్న చంద్రబాబుతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్న మోదీని ఏమనుకోవాలి? మొత్తం మీద వీరిద్దరు కలిసి ప్రజలను పిచ్చోళ్లను చేశారా?!.
:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
చదవండి👉🏾: ‘చంద్రబాబు ఎన్డీయేకి ఎప్పుడు చెయ్యిస్తారో చెప్పలేం!’
Comments
Please login to add a commentAdd a comment