తప్పులు.. తలనొప్పులు
సాక్షి, అమరావతి బ్యూరో : రాజధాని నిర్మాణం పేరుతో ప్రభుత్వం చేస్తున్న అధికార దుర్వినియోగంపై ఇప్పటికే రైతుల తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) న్యాయపోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అండతో ల్యాండ్‌పూలింగ్‌కు భూములు ఇవ్వటానికి ఇష్టపడని 4,800 ఎకరాలకు చెందిన రైతులు కోర్టు ద్వారా అనుమతులు తెచ్చుకుని స్వేచ్ఛగా సాగు చేసుకుంటున్నారు.
తాజాగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన వై. వెంకాయమ్మ, మరికొందరు రైతులు తమ భూముల తారుమారుపై హై కోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం సీఆర్‌డీఏ, రెవెన్యూ అధికారులకు నోటీసులు జారీ చేసింది. అలాగే కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన మరికొందరు రైతులు జరీబు భూములను మెట్టగా మార్చిన వైనంపై కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ప్రభుత్వం జరీబు నుంచి మెట్టగా మార్చే దిశగా చేస్తున్న ప్రయత్నాలు సీఆర్‌డీఏ యూనిట్ కాంపిటెంట్ అథారిటీ అధికారులకు తలనొప్పులను తెచ్చిపెడుతోంది.
గ్రీన్ ట్రిబ్యునల్‌లో పంతం నెగ్గించుకునేందుకు ప్రభుత్వం బహుళ పంటలు పండే భూములన్నింటినీ రికార్డుల్లో మెట్టగా మారుస్తోంది. ఇప్పటికే పెనుమాక, ఉండవల్లి, బోరుపాలెం, అబ్బురాజుపాలెం, రాయపూడి గ్రామాల్లోని జరీబు భూములను మెట్టగా మార్చారు. మిగిలిన ప్రాంతాల్లోని జరీబు భూములనూ మెట్టగా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా భూ సేకరణలో కీలకపాత్ర పోషిస్తున్న ముఖ్య అధికారి నుంచి కింది స్థాయి అధికారులందరికీ మౌఖిక ఆదేశాలు అందినట్లు విశ్వసనీయ సమాచారం.
అడుగడుగునా తప్పులే ...
రాజధాని నిర్మాణానికి 2015లో ప్రభుత్వం భూ సమీకరణకు నోటిఫికేషన్లు ఇచ్చింది. అందులో జనవరి 11న ఉండవల్లికి, ఫిబ్రవరి 12న పెనుమాకకు 9.1 కింద షెడ్యూల్ 2 ప్రకారం నోటిఫికేషన్లు ఇచ్చింది. అందులో రెండు గ్రామాల్లోని భూములను జరీబుగానే పేర్కొంది. ఈపీటీఆర్‌ఐ (ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) వారు ప్రభుత్వానికి 2016 డిసెంబర్‌లో సమర్పించిన ముసాయిదా సామాజిక ప్రభావ అంచనా నివేదికలో పట్టిక ‘ఇ1ఎ’ నోటిఫికేషన్‌లో సైతం ఉండవల్లిలోని భూములు మొత్తం జరీబుగానే చూపింది. అయితే అందులో ఉద్దేశపూర్వకంగా భూముల సర్వే నంబర్లు, విస్తీర్ణం, రైతుల పేర్లు నమోదు చేయలేదు. దీంతో 2016 డిసెంబర్ 16న ఉండవల్లిలో జరిగిన గ్రామసభలో స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
రైతుల తిరుగుబాటును గ్రహించిన సీఆర్‌డీఏ ఆ క్షణం తప్పించుకునేందుకు ప్రయత్నించింది. సామాజిక ప్రభావ అంచనా సర్వే తిరిగి జరిపించటంతో పాటు రైతుల పేర్లు సైతం నోటిఫికేషన్ పట్టికలో చేరుస్తామని హామీ ఇచ్చారు. ఆ వివరాలను మినిట్స్ పుస్తకంలో నమోదు చేయించి రైతులు గ్రామ సభను బహిష్కరించారు. అయితే తిరిగి సర్వే జరపకుండానే , కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన తుది సామాజిక ప్రభావ అంచనా నివేదికలో మాత్రం మొత్తం జరీబు భూములను మెట్టగా మార్చారు. అదే విధంగా పెనుమాక గ్రామానికి సంబంధించి గత ఏడాది డిసెంబర్ 13న జరిగిన గ్రామ సభలోనే భూముల వర్గీకరణను మెట్టగా చూపటంతో రైతులు అధికారులపై ఆగ్రహంతో ముసాయిదా పత్రాలను దహనం చేసి సభను బహిష్కరించారు. ఆ తరువాత విడుదల చేసిన తుది నివేదికలో జరీబును మెట్టగానే చూపటం గమనార్హం.
అధికారాలు ఉన్న వారే బాధ్యులు...
సీఆర్‌డీఏ విడుదల చేసిన జీఓ ఎంఎస్ నంబరు 304లో పేర్కొన్న విధంగా ల్యాండ్‌పూలింగ్, భూ సేకరణ బాధ్యతలను ఆయా యూనిట్లలోని స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లే నిర్వర్తిస్తారని చెప్పింది. అయితే ఇటీవల ప్రభుత్వం రాజధానిలో 13 గ్రామాలకు భూ సేకరణ నోటిఫికేషన్‌ను జిల్లా కలెక్టర్‌చే ఇప్పించింది. ఆ జీఓను గుర్తుచేస్తూ రైతులు అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. సర్వే నివేదికల్లో జరీబుగా పేర్కొని, తుది సామాజిక సర్వేలో మెట్టగా పేర్కొన్నందుకు ఆయా యూనిట్లలోని అధికారులే బాధ్యత వహించవలసి ఉంటుందని నోటీసులు పంపారు. మిగిలిన రైతులు కూడా కొద్దిరోజుల్లో న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు సమాయత్తం అవుతున్నారు.
విషయం తెలుసుకున్న అధికారులు ప్రభుత్వ కుట్రకు తాము బలిపశువులు కావటం ఎందుకని బదిలీపై వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా ఉండవల్లి యూనిట్ నంబర్ 8కి చెందిన స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ సచివాలయానికి, అదే యూనిట్ తహసీల్దార్ సత్తెనపల్లికి బదిలీ కోసం సన్నాహాలు చేసుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇదే దారిలో రాజధానిలోని పలువురు అధికారులు బదిలీపై వెళ్లేందుకు సిద్ధమవుతుండటం గమనార్హం.