సాక్షి ప్రతినిధి, గుంటూరు : తొలివిడతగా భూసేకరణకు సంబంధించిన వివరాలను గురువారం పొద్దుపోయాక కలెక్టర్ కాంతిలాల్‌దండే వెల్లడించారు. తుళ్లూరు మండలంలోని 5 గ్రామాల్లో మొత్తం 11.04 ఎకరాల్లో భూసేకరణ చేపట్టనున్నారు. ఇందులో తుళ్లూరులో 4.28 ఎకరాలు, అనంతవరంలో 4.26 ఎకరాలు, బోయపాలెం 0.83, పిచకలపాలెం 0.78, అబ్బురాజుపాలెం 0.89 ఎకరాలు ఉన్నాయి.
వైఎస్సార్ సీపీకి మద్దతు
ఇస్తున్న గ్రామాలే లక్ష్యంగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న గ్రామాలనే లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం భూసేకరణకు నిర్ణయం తీసుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు భూ సమీకరణ బాధ్యతలు నిర్వహించిన డిప్యూటీ కలెక్టర్లను భూసేకరణకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లుగా నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 3,821 ఎకరాలను సేకరించాలని నిర్ణయం తీసుకుంటే, వైఎస్సార్ కాంగ్రెస్‌కు మొదటినుంచి మద్దతు ఇస్తున్న ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, నవులూరు, కురగల్లు గ్రామాల్లో 3,066 ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
మంగళగిరి నియోజకవర్గంలోనే ఈ భూములన్నీ ఉండగా, తుళ్ళూరు మండల పరిధిలోని 755 ఎకరాలను సేకరించనున్నారు. ఈ గ్రామాల్లోని భూములు, సర్వే నంబర్లతో కూడిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేయనుంది. తుళ్ళూరు మండలంలో సేకరించాల్సిన భూములు తక్కువుగా ఉండటంతో మొదట అక్కడి భూములకు నోటిఫికేషన్ జారీ చేస్తారని అధికారులు చెబుతున్నారు.
అధికారుల సమీక్ష.. సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ బుధ, గురవారాల్లో ఒక్క భూసేకరణ అంశంపైనే సిబ్బంది, అధికారులతో సమీక్షించారు. గ్రామాలవారీగా సేకరించాల్సిన భూములు, గ్రామ కంఠం వివరాలను తీసుకున్నారు. ముఖ్యంగా ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, నవులూరు, కరగల్లు గ్రామాల్లోని భూముల వివరాలు, సర్వే నంబర్ల వివరాలను తీసుకున్నారు. ఈ భూములతోపాటు, నివేశనస్థలాలు, భవనాలు, ఇతర కట్టడాలను సేకరించేందుకు అనువుగా వివరాలను సేకరించారు. ఇప్పటివరకు అధికారులు, పాలకులు చెప్పిన దానికి భిన్నంగా గ్రామ కంఠానికి సమీపంలోని వ్యవసాయ భూములు, భవనాలు, కట్టడాలను భూ సేకరణ పరిధిలోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది.
ఆందోళనలో రైతాంగం ..ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదటినుంచి మంగళగిరి నియోజకవర్గంలోని నదీపరివాహక ప్రాంతంలోని జరీబు భూములు కలిగిన రైతులు, మంగళగిరి, తాడేపల్లి పట్టణాలకు సమీపంలో భూములు, నివేశనస్థలాలు కలిగిన రైతులు భూ సమీకరణ, భూ సేకరణను వ్యతిరేకిస్తూ వచ్చారు. అనేక మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. మరికొందరు వైఎస్సార్ కాంగ్రెస్.. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు చేపడుతున్న ఉద్యమాలు, న్యాయపోరాటంలో భాగ స్వాములయ్యారు. నిన్నమొన్నటి వరకు ఈ ఉద్యమాల్లో కొనసాగిన రైతులు చివరి అస్త్రంగా ప్రభుత్వం ప్రయోగించనున్న భూసేకరణ చట్టం పట్ల ఆందోళన చెందుతున్నారు.
సంవత్సరానికి మూడు పంటలు పండుతున్న భూములు, పట్టణాలకు సమీపంలోని నివేశనస్థలాల ధరలు అధికంగా ఉండటంతో తామంతా తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాన్ భూ సేకరణకు వ్యతిరేకంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఆ పార్టీ మిత్రపక్షమైన టీడీపీ మల్లగుల్లాలు పడుతోంది. గతంలో రాజధాని గ్రామాల్లో ఆయన పర్యటించి భూసేకరణకు ప్రభుత్వం వెళితే, రైతులకు మద్దతుగా నిలుస్తామని చెప్పారు. ప్రస్తుతం భూసేకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో పవన్ కళ్యాన్ స్పందన ఏ విధంగా ఉంటుందోనని పార్టీ నేతల్లో చర్చ సాగుతోంది.
న్యాయపోరాటంలో వైఎస్సార్‌సీపీ.. రాజధాని ప్రక్రియ ప్రారంభం నుంచి రైతుల పక్షాన నిలబడుతున్న వైఎస్సీర్ సీపీ భూ సేకరణకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేసేందుకు సిద్ధం అవుతోంది. రాజధాని ప్రతిపాదిత ప్రాంతాల్లోని భూములు నిస్సారవంతమైనవని, మెట్ట భూములు ఎక్కువగా ఉన్నాయనీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు అఫిడివిట్ ధాఖలు చేయడంపై న్యాయపోరాటం చేసేందుకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సమాయత్తం అవుతున్నారు. నదీపరివాహక ప్రాంతంలో మూడు పంటలు పండుతున్నాయని, వీటికి సంబంధించిన రుజువులతో న్యాయపోరాటం చేస్తానని ఆయన చెబుతున్నారు.
భూసేకరణ లక్ష్యం.. 3,821 ఎకరాలు
Published Fri, Aug 21 2015 4:35 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
Advertisement