సాక్షి, అమరావతి : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భద్రత విషయంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. బుధవారం గుంటూరులో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వైఎస్ జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి బయల్దేరేందుకు ప్రభుత్వం సమకూర్చిన బుల్లెట్ ఫ్రూప్ వాహనంలో ఏసీ రావడం లేదని, శుభ్రంగా లేదని స్థానిక నేతలు పోలీసులకు తెలియజేశారు. దీంతో పోలీసులు గుంటూరులో వాహనాన్ని మార్చారు.
తిరుగు ప్రయాణంలో ఆ వాహనం మంగళగిరి సమీపంలో పంక్చర్ అయింది. దీంతో ఆయన ప్రైవేట్ వాహనంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గతంలో కూడా జగన్ కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్లే సమయంలో ప్రభుత్వం సమకూర్చిన వాహనం రన్నింగ్‌లో పంక్చర్ అయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వాహనం రోడ్డు పక్కకు వెళ్లిపోయింది. ప్రోటోకాల్‌లో భాగంగా ప్రభుత్వం ప్రతిపక్ష నేతకు సరైన వాహనాలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం చూపుతోందని వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒక రకంగా ఇది భద్రత కల్పించక పోవడం కిందకే వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిషత్తులో మరో మారు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ పోగ్రాం కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం పోలీసులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment