ఎస్సీ, ఎస్టీలంటే ఎందుకంత చులకన?
⇒ సర్కారు తీరుపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
⇒ ఎస్సీ, ఎస్టీల కరెంటు బిల్లుల కింద ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది స్వల్పమే
⇒ కొన్ని నిధులు ఇస్తూ గొప్పగా ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు
⇒ అసెంబ్లీ నుంచి వైఎస్సార్‌సీపీ సభ్యుల వాకౌట్
సాక్షి, అమరావతి: షెడ్యూల్డ్ కులాలు, తెగల కుటుంబాలకు విద్యుత్ ఛార్జీల మినహాయింపుపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ మంగళవారం శాసనసభ నుంచి వాకౌట్ చేసింది. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య పెద్దఎత్తున వాగ్వాదం జరిగింది. మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన సమాధానంపై అనుబంధ ప్రశ్న అడిగే సమయంలో మొదలైన వాగ్వాదం వాకౌట్‌కు దారితీసింది. 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకున్న ఎస్సీ కుటుంబాలు 8,70,427, ఎస్టీ కుటుంబాలు 3,50,576 ఉన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఎస్సీలకు ఏడాదికి రు.58.02 కోట్లు, ఎస్టీలకు రు.18.54 కోట్లు విద్యుత్ చార్జీల కింద చెల్లించినట్లు వివరించారు. దీనిపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ... రాష్ట్రంలో 1,474 గిరిజన గ్రామాలున్నాయని, తనతోపాటు వస్తే ఎక్కడెక్కడ విద్యుత్ సౌకర్యం లేదో చూపిస్తానని సవాల్ విసిరారు.
ప్రైవేటు కాంట్రాక్టర్లు ఎక్కడో కూర్చొని బిల్లులు వసూలు చేసుకుపోతున్నారని, మీటర్లు లేని వాళ్లకు సైతం బిల్లులు వేస్తున్నారని విమర్శించారు. దీనిపై మంత్రి సమాధానం చెబుతూ... రాష్ట్రంలో కరెంటు లేని ఇల్లంటూ లేదని అన్నారు. ఈ దశలో తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పీకర్‌ను కోరారు. స్పీకర్ పట్టించుకోకుండా అధికార పక్షానికి చెందిన మరో సభ్యుడికి అవకాశం ఇవ్వబోతుండగా విపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతకు మైకు ఇవ్వాలని కోరారు. దీంతో జగన్‌కు మైకు ఇచ్చారు.
మైకు ఆన్‌లో ఉందో, ఆఫ్‌లో ఉందో...
గతంలో తమ ముందున్న మైకులు ఆన్‌లో ఉన్నాయో, ఆఫ్‌లో ఉన్నాయో అర్థమయ్యే దని, ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయిందని వైఎస్ జగన్‌మోహనరెడ్డి చురక అంటించారు. అందువల్ల తాము మాట్లాడేటప్పుడు ఈ మైకుల వైపు చూడాలో, మీ వైపు (స్పీకర్) చూడాలో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. దీంతో సభలో నవ్వులు విరిశాయి.
కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయ్
ఎస్సీ, ఎస్టీలకు 50 యూనిట్ల లోపు ఉచితంగా కరెంటు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఆయా వర్గాలకు ఖర్చు చేస్తున్నది చాలా స్వల్పమేనని వైఎస్ జగన్ వివరించారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు ఏదో ముష్టి వేసినట్టు కొన్ని నిధులు ఇస్తూ, గొప్పగా ఇచ్చినట్టు మంత్రి చెప్పుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని ధ్వజమెత్తారు. బాబు రాక ముందు రూ.150 ఉండే విద్యుత్ బిల్లు ఇప్పుడు ఐదారు వందల రూపాయలకు చేరిందన్నారు. దీంతో ఎస్సీ, ఎస్టీలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారని అన్నారు. ఎస్సీ, ఎస్టీలంటే ఎందుకంత చులకన? అని ప్రశ్నించారు. సర్కారు తీరుకు నిరసనగా తాము సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు.