Scheduled Caste
-
‘మతం మెలికను రద్దు చేయాలి’
ఢిల్లీ: మతం మెలికను దళితుల మెడకు చుట్టి రాజ్యాంగ ఫలాలను దళితులకు దూరం చేసిన 1950లో ఇచ్చిన షెడ్యూల్డు కులాల రాష్ట్రపతి ఉత్తర్వును రద్దు చెయ్యాలని కోరుతూ విశ్రాంత అదనపు డీజీపీ డాక్టర్ కూచిపూడి బాబూరావు నేతృత్వంలో తెలుగు రాష్ట్రాల నుంచి మేధావుల బృందం ఎంక్వైరీ కమీషన్ చైర్మన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్‌ను కలిసింది. ‘‘ డెబ్బై నాలుగు సంవత్సరాల గణతంత్ర దేశ చరిత్రలో దళితుల మెడకు బిగించిన మతం మెలికను ఎత్తి వేయడానికి తగిన సిఫారసు చెయ్యాలని కోరాం. ఈ ఉత్తర్వు వలన దళితులు మతపరంగా విభజించబడ్డారు. ఏ మతంలోని దళితులకైనా కులపరంగా వివక్ష ఉంది. ఆ వివక్ష రూపాలను , వివక్ష జరుగుతున్న తీరును తెలిచెప్పాం. ఈ ఉత్తర్వు వలన క్రైస్తవ దళితులు షెడ్యూల్డు కులాలకు కల్పించే ప్రభుత్వ పథకాలను పొందలేక పోతున్నారు. అంతే కాకుండా విద్య ఉద్యోగాలలో కొనసాగుతున్న వివక్షను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాం. మతం, సంస్కృతి సంప్రదాయాలు ఆయా భౌగోళిక పరిస్థితుల ఆధారంగ వుంటాయి. సాంస్కృతిక విషయాలను గుర్తించాలి. అదే కోణంలో భారత దేశంలో క్రీస్తు పూర్వమే నెలకొన్న హిందూ మతాన్ని అందులోని కులాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ..ఎక్కడో ఇజ్రాయేలులో పుట్టిన క్రైస్తవ మతం లో కులం లేదు కాబట్టి భారత దేశంలో క్రైస్తవంలోకి చేరే దళితులకు కుల వివక్ష వుండదనే సూత్రీకరణల ఆధారంగా క్రైస్తవం తీసుకునే దళితులను షెడ్యూల్డు కులాల వారిగా గుర్తించనని చెప్పడం అర్థం లేనిలేదు. ఇజ్రాయెల్, ఇతర క్రైస్తవ దేశాలలో రంగు, జాతి వివక్ష అక్కడ ఉంది. ఆ దేశాలలో హిందూ మతం పుట్టలేదు. కాబట్టి అక్కడ కుల వివక్ష లేదు. భారత దేశంలో హిందూ మతం వుండడం వలన భారత దేశ మంతటా కుల వివక్ష విస్తరించింది. భారత్‌తో అన్ని మతాలలో కులం వుంటుందని అక్కడ అన్ని మతాలలో జాతి , రంగులను బట్టి వివక్ష వుంటుంది. భారత దేశంలో వుండే అన్ని రకాల మతాలలో కులం వుంటుందని భారతీయులు అధికంగా వలసపోతున్న అభివృద్ధిచెందిన దేశాలలో కుల వివక్ష ఆరంభమయ్యింది’ అని జస్టిస్ బాలకృష్ణన్ అడిగిన ఒక ప్రశ్నకు డాక్టర్ బాబు రావు వివరణ ఇచ్చారు.‘‘ నాటి రాష్ట్రపతి ఉత్తర్వు నేటికీ దళితుల జీవితాల మీద ప్రభావం చూపుతుంది. ప్రాథమిక హక్కులను, జీవించే హక్కును , ఇష్టమైన దేవుణ్ణి ఆరాధించే హక్కును దళితులు మాత్రమే కోల్పోతున్నారు. తద్వారా దళితుల ఆత్మ గౌరవం దెబ్బతింటుంది’’ అని సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు డాక్టర్ పులుగుజ్జు సురేష్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. ‘‘మాదిగ, మాల, పరయ, పులయ వంటి కులాల పేరుతో వివక్ష కొనసాగుతూనే ఉందనే ఈ విషయాన్ని 2007వ సంవత్సరంలో జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ రుజువు చేసింది’’ అని బ్రదర్ జోస్ డేనియల్ చెప్పారు. ‘‘పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు సమయంలో ఏ మతం వారికైనా కులం తప్పకుండా రికార్డు చేయాలని అటువంటప్పుడు దళితులు ఏ మతంలో వుంటే ఏముంది’’ అని తెలంగాణ హైకోర్టు లాయరు చాట్ల సుధీర్ అన్నారు. సామాజిక, ఆర్థిక , రాజకీయ రంగాల్లో దళితులు రాణించాలంటే అడ్డంకిగా ఉన్న 1950 రాష్ట్రపతి ఉత్తర్వును రద్దు చేయడం తప్ప మరొక మార్గం లేదని విన్నవించారు. అనేక రకాల అభిప్రాయాలు విన్న తరువాత నవంబరు మాసంలో ఆంధ్ర తెలంగాణకు రాష్ట్రాలు పర్యటిస్తానని తమ వాదనలు క్షేత్ర స్థాయి పర్యటనలో తెలియజేయాలని జస్టిస్ బాలకృష్ణన్ ప్రతినిధి బృందానికి తెలియజేశారు. ప్రతినిధి బృందంలో ఫా. అంతోనిరాజ్ సీబీసీఐ సెక్రటరీ, బిషప్ వీరాజీ ఇజ్రాయెల్, గోనె సాల్మన్ రాజ్ , సిస్టర్ అనేయ ఫెర్నాండెజ్, తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ వర్గీకరణ: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్, సాక్షి: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సబ్ కమిటీ సూచనల ఆధారంగా ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణపై 60 రోజుల్లో వన్‌మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించారు. వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్లు తెలిపారు. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ఇక.. 24గంటల్లో కమిషన్‌కు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా వన్ మెన్ కమిషన్ రిపోర్టు సమర్పించాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణలో 60 రోజుల వరకు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకూడదని, కమిషన్ రిపోర్ట్ ఇచ్చాకే కొత్త ఉద్యోగ నోటీఫికేషన్లు ఇవ్వాలని సీఎం రేవంత్ అధికారులు సూచనలు చేశారు. -
ప్రతి కులానికి రిజర్వేషన్ ఫలం!
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎస్సీ, ఎస్టీల్లోని ఉపకులాల్లో హర్షాతి రేకాలు వ్యక్తమవుతున్నాయి. దశాబ్దాల కల నెరవేరిందని ఆయా వర్గాల నేతలు చెబుతుండగా.. వాస్తవంగా ఏమేరకు లబ్ధి జరుగుతుందనే చర్చ మరోవైపు మొదలైంది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన అమలవుతున్నప్పటికీ అభివృద్ధిలో ఉన్న కులాలే ఎక్కువ లబ్ధి పొందుతున్నాయనే వాదన తీవ్రంగా ఉంది.ఎస్సీల్లో మాలలే ఎక్కువగా రిజర్వేషన్ల ఫలాలు అందుకుంటున్నారని, మాదిగలకు సరైన కోటా దక్కడం లేదనే వాదన ఉండగా.. ఎస్టీల్లో లంబాడాలే రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందుతున్నారంటూ ఆదివాసీ తెగలు తీవ్రస్థాయిలో ఉద్యమిస్తు న్నాయి. ఈ క్రమంలోనే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్), తుడుందెబ్బ, ఆదివాసీ హక్కుల పోరాట సమితి పేరిట ఉద్యమాలు ఏళ్లుగా కొనసాగు తున్నాయి. ఇందులో అత్యంత చురుకుగా ఎమ్మార్పీఎస్ ముందు వరుసలో ఉంది. దాదాపు 30 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ ఉద్యమాలకు సుప్రీంకోర్టు తాజా తీర్పుతో పరిష్కారం లభించినట్లైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు...రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల కేటగిరీలో 60 ఉప కులాలున్నాయి. అదే విధంగా షెడ్యూల్డ్ తెగల (ట్రైబ్స్) కేటగిరీలో 32 ఉప కులాలు న్నాయి. గిరిజన కేటగిరీలో పర్టిక్యులర్లీ వల్నరెబుల్ (అత్యంత బలహీన) ట్రైబల్ గ్రూప్స్ (పీవీటీజీ) విభాగం కింద మరో 5 కులాలున్నాయి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో ప్రధానంగా నాలుగైదు కులాల్లోనే అత్యధిక జనాభా ఉండగా.. మిగిలిన కులాల్లో మాత్రం వెయ్యిలోపు నుంచి పదివేల లోపు జనాభా ఉన్నవే ఎక్కువ.కాగా ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం అమలు చేస్తున్న రిజర్వేషన్లను వర్గీకరించేందుకు అనుమతించడంతో పాటు అన్ని కులాలకు సమానంగా అందించేవిధంగా వర్గీకరణ చేపట్టాలని సర్వోన్నత న్యాయస్థానం తాజాగా తీర్పునిచ్చింది. ఈ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవాలని సూచించింది. దీంతో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ ఏవిధంగా జరుగుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
First general elections: ఒక్క స్థానం.. ఇద్దరు ఎంపీలు!
ఒక్క లోక్‌సభ నియోజకవర్గానికి ఇద్దరు ఎంపీలుంటారా? ఇద్దరేం ఖర్మ... ముగ్గురు కూడా ఉన్నారు! ఎప్పుడు? ఎలా?మన దేశంలో రాజకీయాలు చాలా క్లిష్టంగా ఉ న్నాయని ఇప్పుడనుకుంటున్నాం. కానీ స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో జరిగిన ఎన్నికల సమయంలో మరింత సంక్లిష్టంగా ఉన్నాయి. సాధారణంగా ఒక్క నియోజకవర్గానికి ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తారు. ఎన్నికలు జరిగేదే ఆ ప్రతినిధిని ఎన్నుకోవడానికి. కానీ తొలి రెండు సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పలు నియోజకవర్గాలకు ఇద్దరేసి ఎంపీల ను ఎన్నుకున్నారు. 1961లో రద్దయ్యే దాకా ఇది కొనసాగింది. కొన్ని నియోజకవర్గాలకైతే ముగ్గురు ఎంపీలూ ఉన్నారు! దళితులు, గిరిజన సమూహాల వంటి అణగారిన వర్గాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం పెంచేందుకు ఈ ఏర్పాటు కలి్పంచారు.తొలి ఎన్నికల్లో...మొట్టమొదటి ఎన్నికల సమయంలో లోక్‌సభలో 400 స్థానాలున్నాయి. వీటిలో 314 స్థానాలకు ఒక్క ఎంపీ ఉండగా, 86 నియోజకవర్గాలకు ఒక జనరల్, మరొక షెడ్యూల్ కులాల ప్రతినిధి చొప్పున ఇద్దరేసి ఎంపీలు ఎన్నికయ్యారు. ఇలా ఇద్దరు ఎంపీలున్న నియోజకవర్గాలు యూపీలో 17, నాటి మద్రాసు రాష్ట్రంలో 13, బిహార్‌లో 11, బాంబేలో 8 ఉన్నాయి. పశి్చమబెంగాల్‌లోని నార్త్ బెంగాల్ నియోజకవర్గానికయితే ఏకంగా ముగ్గురు ఎంపీలు ప్రాతినిధ్యం వహించారు!1957లో...సీట్ల పునరి్వభజన అనంతరం 1957 సార్వత్రి క ఎన్నికల్లో 494 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఇద్దరు ఎంపీల స్థానాలు 57కు తగ్గాయి. వీటిలో అత్యధికంగా ఉత్తరప్రద్రేశ్లో 18, ఆంధ్రప్రదేశ్‌లో 8, బిహార్‌లో 8, పశి్చమబెంగాల్లో 8, బాంబేలో 8, మద్రాసులో 7 స్థానాలకు ఇద్దరు ఎంపీలు ప్రాతినిధ్యం వహించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
SC: ఎస్సీ వర్గీకరణకు కేంద్ర కమిటీ ఏర్పాటు
ఢిల్లీ: ఎస్సీల(Scheduled Castes communities) వర్గీకరణ విషయంలో కేంద్రం ముందడుగు వేసింది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర హోం, న్యాయ, గిరిజన, సామాజిక న్యాయ శాఖల కార్యదర్శులను సభ్యులుగా నియమించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో..పరేడ్ గ్రౌండ్స్‌లో ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆ సమయంలో కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఎస్సీ వర్గీకరణపై ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు గతంలో సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ నెల 22న కమిటీ తొలిసారి భేటీ కానున్నట్లు సమాచారం. On the directions of PM, a Committee of Secretaries constituted under the Chairmanship of Cabinet Secretary to examine the administrative steps that can be taken to safeguard the interests of Scheduled Castes communities, like the Madigas and other such groups, who have… — ANI (@ANI) January 19, 2024 -
Bihar Caste Reservation: రిజర్వేషన్లపై బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
పాట్నా: రిజర్వేషన్ల విషయంలో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని బిహార్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రిజర్వేషన్లు 65శాతానికి పెంచాలని ప్రాతిపాదించింది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీ వర్గాల వారి రిజర్వేషన్లు 55 శాతం ఉండగా తాజాగా వాటిని 65 శాతానికి పెంచాలని నిర్ణయించింది. ఇది ఆర్థికంగా బలహీన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్) కేంద్రం నిర్దేశించిన 10శాతం రిజర్వేషన్లకు మినహయింపు. బిహార్ ప్రభుత్వం, కేంద్రం కల్పిస్తున్న రిజర్వేషన్లు కలిపి రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 75శాతానికి చేరుకోనుంది. దీనిపై నిపుణులతో సంప్రదింపుల తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఈ మార్పులు అమలు చేయాలనేది తమ ఉద్ధేశ్యమని తెలిపారు. అయితే ఓబీసీ మహిళలకు కేటాయించిన మూడు శాతం కోటాను రద్దు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. తాజా ప్రతిపాదనల ప్రకారం.. షెడ్యూల్డ్ కులాల వారికి 20శాతం రిజర్వేషన్ లభిస్తుంది. ఓబీసీ, ఈబీసీలకు 43 శాతం ఉన్న రిజర్వేషన్ దక్కనుంది. ప్రస్తుతం ఓబీసీ, ఈబీసీలకు కలిపి 30 శాతం రిజర్వేషన్ ఉండగా.. తాజాగా మరో 13 శాతం పెరగనుంది. షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీ) వారికి రెండు శాతం రిజర్వేషన్లను ప్రతిపాదించారు. దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్లు 65 శాతానికి చేరుకుంటాయి. ప్రస్తుత ఈబీసీలకు 18 శాతం, ఓబీసీలకు 12 శాతం, ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు ఒకశాతం రిజర్వేషన్లు ఉన్నాయి. చదవండి: బీహార్ కులగణన: 34 శాతం మంది పేదలే.. నెలకు రూ. 6 వేల కంటే తక్కువ ఆదాయం కాగా కులగణనకు సంబంధించిన నివేదికను బిహార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కొన్ని గంటల్లోనే నితీష్ కుమార్ ప్రభుత్వం ఈ రిజర్వేషన్ల పెంపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక ఓబీసీ వర్గం వారిలో యాదవులు అత్యధిక సంఖ్యలలో ఉన్నారు. రాష్ట్ర జనాభాలో వారు 14. 27 శాతం ఉన్నారు. కులగణన ప్రకారం.. బిహార్ 13 కోట్ల జనాభాలో 36 శాతం మంది ఈబీసీలు, 27.1 శాతం మంది వెనకబడిన తరగతులు, 19.7 శాతం మంది ఎస్సీలు, 1.7 శాతం ఎస్టీ జనాభా, జనరల్ కేటగిరీలో 15.5 శాతం ఉన్నారు. దీని ప్రకారం రాష్ట్రంలో 60 శాతానికి పైగా ప్రజలు వెనకబడిన, అత్యంత వెనకబడిన తరగతులకు చెందిన వారే ఉన్నారు. -
బీహార్ కులగణన: 34% మంది పేదలే.. నెల ఆదాయం రూ. 6 వేల కంటే తక్కువ..
పాట్నా: బీహార్ రాష్ట్రవ్యాప్తంగా 34 శాతం పేదలు ఉన్నట్లు ఇటీవల చేపట్టిన కులగణన నివేదిక ద్వారా వెల్లడైంది. వీరి ఆదాయం నెలకు రూ.6 వేల కంటే దిగువన ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలో 29 శాతం మంది రూ.పది వేల కన్నా తక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మరో 28 శాతం మంది రూ.10 వేల నుంచి రూ.50 వేల మధ్య ఆదాయం పొందుతున్నారని, కేవలం 4 శాతం జనాభా మాత్రమే రూ.50 వేల కన్నా ఎక్కువ సంపాదిస్తున్నట్లు రిపోర్టులో తేలింది. కులగణన ఆధారిత సర్వే రెండో విడత డేటాను బీహార్ ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. మొత్తం 215 షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనబడిన వర్గాలు, అత్యంత వెనకబడిన వర్గాలు(Extremely Backward Classes), జనరల్ కేటగిరికి చెందిన వారి సామాజిక, ఆర్థిక పరిస్థితుల వివరాలను అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. సర్వే అందించిన సమాచారం ప్రకారం.. ఎస్సీ ప్రజల్లో 42 శాతం, ఎస్టీ జనాభాలో 42.70 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నట్లు వెల్లడైంది. వెనకబడిన వర్గాల్లో (ఓబీసీ) 33.16 శాతం, అత్యంత వెనకబడిన వర్గాల (ఈబీసీ) వారిలో 33.58 శాతం మంది సైతం పేదరికం అనుభవిస్తున్నట్లు తెలిపింది. జనరల్ క్యాటగిరీకి చెందిన 25.09 శాతం కుటుంబాలు పేదరికం జాబితాలో ఉన్నట్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నివేదిక ద్వారా వెల్లడైంది. ఇవేగాక ఇతర కులాల్లోని పేదలు 23.72 శాతం ఉన్నట్లు రిపోర్టులో తేలింది. షెడ్యూల్డ్ కులాల్లో కేవలం ఆరుశాతం కంటే తక్కువ మంది పాఠశాల విద్యను పూర్తిచేశారు. 11వ, 12వ తరగతి వరకు చదివిన వారు 9 శాతం మంది ఉన్నారు. ఇక గత నెలలో విడుదల చేసిన కులగణన మొదటి విడత నివేదికలో బీహార్‌లో 60 శాతానికి పైగా ప్రజలు వెనకబడిన, అత్యంత వెనుకబడిన తరగతులకు చెందిన వారే ఉన్నట్లు వెల్లడైన విషయం తెలిసిందే. మొత్తం 13.1 కోట్ల రాష్ట్ర జనాభాలో 20 శాతం జనాభా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు ఉన్నట్లు తేలింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో యాదవ్, ముస్లిం వర్గాల జనాభాను పెంచాలని నీతీశ్ కుమార్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, దీనివల్ల ఓబీసీలకు, ఈబీసీలకు అన్యాయం జరుగుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. షా వ్యాఖ్యలపై మండిపడిన బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కేంద్రమంత్రి ఆరోపణలను కొట్టిపారేశారు. యాదవులు వెనుకబడినవారు కాదా? అని ప్రశ్నించారు. కేంద్రం ఏ ప్రాతిపదికన ఒకరి జనాభా తగ్గిస్తున్నారు, ఒకరి జనాభా పెంచుతున్నారని ఆరోపిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణనకు మద్దతివ్వడానికి తమ వద్ద శాస్త్రీయ డేటా ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సర్వే డేటా బయటపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి: రాజస్థాన్: ఎపుడూ డిపాజిట్ దక్కలే.. అయినా తగ్గేదేలే! -
చట్టం ముందు అందరూ సమానమే
దోమ: చట్టం ముందు అందరూ సమానమేనని, కులాల పేరుతో గొడవలు తగవని జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ అరుణ్ హాల్డర్ అన్నారు. మండల పరిఽధిలోని బ్రాహ్మణపల్లిలో దళితుల ఆలయ ప్రవేశం విషయమై ఇటీవల ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఈ మేరకు జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్‌కుమార్, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఎస్పీ కోటిరెడ్డితో కలిసి మంగళవారం గ్రామాన్ని సందర్శించారు. ముందుగా గ్రామంలోని ఆలయంలో పూజలు చేసిన అనంతరం స్థానికులతో సమావేశమై మాట్లాడారు. దేశంలో సామాజిక మార్పు కోసం ప్రజలను జాగృత పర్చాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందన్నారు. ప్రస్తుత ఆధునిక యుగంలోనూ అంటరానితనం కొనసాగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. సమాజంలో ఇలాంటి అసమానతలను తొలగించడానికి రాజకీయాలకు అతీతంగా జనాలను చైతన్యం చేయాలన్నారు. బ్రాహ్మణపల్లిలో జరిగిన ఘటనలు జిల్లాలో ఎక్కడా పునరావృతం కాకుండా నిఘా పెట్టాలని సూచించారు. ఘటనకు బాధ్యులపైన వారిపై 302 సెక్షన్ అమలు చేసి త్వరితగతిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఘటన జరిగిన రోజే ఎస్ఐ విశ్వజన్ అప్రమత్తమై జిల్లా అధికారులతో కలసి బాధ్యులను గుర్తించి జైలుకు పంపడంపై ఎస్పీ కోటిరెడ్డి, ఎస్ఐని అభినందించారు. సోదర భావంతో మెలగాలి కులాలకు అతీతంగా ప్రజలంతా సోదరభావంతో కలసి మెలసి ఉండాలని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. బడి, గుడి అందరివని కులాల ప్రస్తావన ఇక్కడ రావద్దని సూచించారు. ఇతరుల మనోభావాలను దెబ్బతీయకుండా ఆలయాలను ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు. ఇలాంటి ఘట నలు మళ్లీ రీపీట్ కాకుండా పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. పెద్దన్న పాత్ర పోషిస్తాం.. జిల్లాలో ఎలాంటి ఘటనలు జరిగినా పెద్దన్న పాత్ర పోషిస్తుందని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. బ్రాహ్మణపల్లిలో జరిగిన ఘటనపై వెంటనే స్పందించి బాధ్యులైన 35 మందిపై కేసు నమోదు చేసి, 20 మందిని రిమాండ్‌కు తరలించామని, మరో ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నారని తెలిపారు. మిగిలిన వారిని త్వరలోనే పట్టుకుని కోర్టులో ప్రవేశపెడుతామని స్పష్టంచేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా వెంటనే 100 నంబర్‌కు డయల్ చేసి చెప్పాలన్నారు. అనంతరం బాధితులైన రఘురాం, అనసూయమ్మకు ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ అరుణ్ హాల్డర్, కలెక్టర్ నారాయణరెడ్డి చేతుల మీదుగా రూ.25 వేల చొప్పున పరిహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబుమోజెస్, అడిషన్ ఎస్పీ మురళీధర్, తహసీల్దార్ షాహెదబేగం, డీఎస్పీ కరుణసాగర్‌రెడ్డి, ఎంపీడీఓ జయరాం, ఆర్ఐలు లింగం, శివప్రసాద్, సీఐ వెంకటరామయ్య, ఎస్ఐలు గిరి, శ్రీశైలం, ఇంటలిజెన్స్ విభాగం అధికారులు, ఎస్బీ సీఐ రామకృష్ణ, కానిస్టేబుల్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
దళితుడ్ని డిప్యూటీ సీఎం చేయకపోతే తీవ్ర పరిణామాలు
బెంగళూరు: ఐదు రోజులపాటు అలుపెరగకుండా చర్చించింది. చివరకు.. కర్ణాటక ముఖ్యమంత్రి అంశం ఓ కొలిక్కి వచ్చిందని కాంగ్రెస్ అధిష్టానం ఊపిరి పీల్చుకుంది. ఈ తరుణంలో కొత్త తలనొప్పులు సిద్ధం అవుతున్నాయా?. సామాజిక వర్గాల వారీగా పలు డిమాండ్లు తెర మీదకు రాబోతున్నాయా?.. కర్ణాటక సీనియర్ నేత ఒకరు చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే అవుననిపిస్తోంది. దళితుడ్ని గనుక డిప్యూటీ సీఎం చేయకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయంటూ హెచ్చరించారాయన. కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత జి. పరమేశ్వర పార్టీ అధిష్టానానికి ముందస్తుగా ఈ హెచ్చరికలు పంపారు. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా, డీకకే శివకుమార్‌ను ఏకైక డిప్యూటీ సీఎంగా ప్రకటించిన తరుణంలోనే.. పరమేశ్వర మీడియా ముందు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తానే ఏకైక సీఎంగా ఉండాలని శివకుమార్ పెట్టిన షరతును కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించిందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు పరమేశ్వర స్పందిస్తూ.. ‘‘శివకుమార్ కోణంలో ఆయన కోరింది సరైందే కావొచ్చు. కానీ, హైకమాండ్ ఆలోచన భిన్నంగా ఉండాలి. అదే మేం ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారాయన. డిప్యూటీ సీఎం పదవితోనే దళితులకు న్యాయం జరుగుతుందా? అని మీడియా ప్రశ్నించగా.. దళిత వర్గం భారీ అంచనాలు పెట్టుకోవడం సహజమే కదా అని పేర్కొన్నారు. ‘‘ఈ అంచనాలను అర్థం చేసుకుని.. మా నాయకత్వం ఓ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాం. ఒకవేళ అది జరగకపోతే.. సాధారణంగానే ప్రతికూల స్పందన వస్తుంది. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత మేల్కొనే బదులు.. ఇప్పుడే ఆ సమస్యను పరిష్కరిస్తే సరిపోతుంది. లేకుంటే పార్టీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తుంది. అదే అర్థం చేసుకోమని నేను హైకమాండ్‌ను కోరుతున్నా’’ అని పరమేశ్వర కాంగ్రెస్ అధిష్టానానికి సున్నితంగా హెచ్చరికలు పంపించారు. అలాగే.. తానూ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పదవులను ఆశించిన వాళ్లలో ఉన్నట్లు చెబుతున్నారాయన. కానీ, హైకమాండ్ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది కదా అని పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతానికి వాళ్లిద్దరి పోస్టులను ప్రకటించారు. చూద్దాం.. కేబినెట్ ఏర్పాటులో దళితులకు ఏమాత్రం న్యాయం జరుగుతుందో’’ అని వ్యాఖ్యానించారాయన. దళిత సామాజిక వర్గానికి చెందిన 71 ఏళ్ల వయసున్న జి. పరమేశ్వర, కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పని చేశారు. అంతేకాదు.. సుదీర్ఘకాలం కర్ణాటక పీసీసీగా పని చేసిన రికార్డు కూడా(ఎనిమిది ఏళ్లు) ఈయన పేరిట ఉంది. 2013లో కేపీసీసీ ప్రెసిడెంట్ హోదాలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన పరమేశ్వర.. ఓటమి పాలయ్యారు. ఆ సమయంలో సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంచుకుంది ఈయన్నే. కానీ, ఓడిపోవడంతో సిద్ధరామయ్యకు సీఎం పగ్గాలు అప్పజెప్పింది. ఆ తర్వాత పరమేశ్వరని ఎమ్మెల్సీని చేసి.. తన ప్రభుత్వంలో మంత్రిని చేశారు సిద్ధరామయ్య. ఇక మొన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం పరమేశ్వర కొరటగెరె స్థానం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. ఇదీ చదవండి: డీకే శివకుమార్ నిజంగానే తలొగ్గాడా? -
మణిపూర్‌లో భీకర హింస
ఇంఫాల్: మణిపూర్‌లో హింస ప్రజ్వరిల్లింది. తమకు షెడ్యూల్డ్ కులాల(ఎస్టీ) హోదా కల్పించాలని రాష్ట్ర జనాభాలో 53 శాతం ఉన్న మైతీ వర్గం డిమాండ్ చేయడం అగ్గి రాజేసింది. గిరిజనులు భగ్గుమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఇళ్లు, దుకాణాలు, వాహనాలకు నిప్పుపెట్టారు. ప్రార్థనా మందిరాలపై దాడి చేశారు. గిరిజనేతరులతో ఘర్షణకు దిగారు. ఈ హింసాకాండలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి 55 పటాలాల సైన్యంతోపాటు అస్సాం రైఫిల్స్ జవాన్లను ప్రభుత్వం గురువారం రంగంలోకి దించింది. మరో 14 పటాలాల సైన్యాన్ని సిద్ధంగా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. మైతీ వర్గం అధికంగా ఉన్న దక్షిణ ఇంఫాల్, కాక్చింగ్, థౌబాల్, జిరిబామ్, బిష్ణుపూర్ జిల్లాలతోపాటు గిరిజన ప్రాబల్యం కలిగిన చురాచాంద్‌పూర్, కాంగ్పోక్పీ, తెంగౌన్పాల్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. చురాచాంద్‌పూర్, మంత్రిపుఖ్రీ, లాంఫెల్, కొయిరంగీ, సుగ్ను తదితర ప్రాంతాల్లో అస్సాం రైఫిల్స్ జవాన్లు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. సమస్మాత్మక ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) సిబ్బంది మోహరించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్‌తో ఫోన్లో మాట్లాడారు. తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రమంతటా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియక అందోళన చెందుతున్నారు. అధికారులు ఇప్పటిదాకా 9,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బాధితులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఘర్షణలను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘కనిపిస్తే కాల్చివేత’ ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ వలసల వల్లే.. మైతీలు ప్రధానంగా మణిపూర్ లోయలో నివసిస్తున్నారు. మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల కారణంగా తాము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని, తమకు ఎస్టీ హోదా కల్పించాలని వారు కోరుతున్నారు. వలసదారుల నుంచి గిరిజనులకు చట్టప్రకారం కొన్ని రక్షణలు ఉన్నాయి. మైతీలకు ఎస్టీ హోదాపై రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సును నాలుగు వారాల్లోగా కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని గత నెలలో మణిపూర్ హైకోర్టు సూచించింది. దీనిపై గిరిజనులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అపార్థం వల్లే అనర్థం: సీఎం రాష్ట్రంలో శాంతి భద్రతలకు ప్రజలంతా సహకరించాలని ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ విజ్ఞప్తి చేశారు. అమాయకులు మృతి చెందడం, ఆస్తులు ధ్వంసం కావడం బాధాకరమని పేర్కొన్నారు. కేవలం అపార్థం వల్లే ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు అన్ని చర్యలూ చేపట్టామని తెలిపారు. మణిపూర్‌లో హింసాకాండపై పొరుగు రాష్ట్రం మిజోరాం ముఖ్యమంత్రి జోరాంథాంగా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో త్వరగా శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. గిరిజన సంఘీభావ యాత్ర గిరిజనేతరులైన మైతీ వర్గానికి ఎస్టీ హోదా కల్పించాలన్న డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల్లో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్(ఏటీఎస్యూఎం) ఆధ్వర్యంలో గిరిజనులు బుధవారం ‘గిరిజన సంఘీభావ యాత్ర’ నిర్వహించారు. ఈ సందర్భంగా మైతీలకు, గిరిజనులకు నడుమ ఘర్షణ మొదలయ్యింది. రాత్రికల్లా తీవ్రస్థాయికి చేరింది. హింస చోటుచేసుకుంది. తొలుత చురాచాంద్‌పూర్ జిల్లాలో మొదలైన ఘర్షణ, హింసాకాండ క్రమంగా రాష్ట్రమంతటికీ విస్తరించింది. -
Telangana: రాష్ట్ర జనాభా మూడున్నర కోట్లు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జనాభా 3,50,03,674. అందులో పురుషుల సంఖ్య 1,76,11,633 కాగా మహిళలు 1,73,92,041మంది ఉన్నారు. 2011జనాభా లెక్కల ప్రకారం చూస్తే...మొత్తం ఎస్సీల జనాభా 54,08,800 కాగా వారిలో మహిళలు 27,15,673, పురుషులు 26,93,127 మంది ఉన్నారు. ఇక ఎస్టీల జనాభా విషయానికొస్తే... మొత్తం 31,77,940 ఉండగా, అందులో పురుషులు 16,07,656, మహిళలు 15,70,284 మంది ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా ఎస్టీల జనాభా సంఖ్య 3,92,034, మహబూబ్‌బాద్ జిల్లాలో 2,92,778, ఆదిలాబాద్ జిల్లాలో 2,24,622, నల్లగొండ జిల్లాలో 2,09,252, ఖమ్మం జిల్లాలో 1,99,342. ► ఎస్సీల విషయానికొస్తే...రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా అంటే 3,34,337, ఆ తర్వాత నల్లగొండ జిల్లాలో 2,92,951, ఖమ్మం జిల్లాలో 2,79,319, సంగారెడ్డి జిల్లాలో 2,77,429. హైదరాబాద్ జిల్లాలో 2,47,927 మంది ఉన్నారు. ►బుధవారం శాసనమండలిలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అడిగిన ప్రశ్నకు ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆయా అంశాలు పొందుపరిచారు. గతంలో ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలను షెడ్యూల్ ప్రాంతాల జిల్లాలుగా పరిగణించగా, ప్రస్తుతం అవే షెడ్యూల్ ప్రాంతం కొమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, వరంగల్, నాగర్‌కర్నూల్ అనే 9 జిల్లాల్లో ఉన్నట్టు తెలియజేశారు. ►ఉట్నూరు, ఆసిఫాబాద్, భద్రాచలం, సారపాకతో సహా షెడ్యూల్ ప్రాంతాల్లో పంచాయతీలు=1,286 ►వందశాతం ఎస్సీ గ్రామపంచాయతీలు (తండాలు/గూడెంలు) =1,177 ప్లెయిన్, ఎస్టీ రిజర్వ్ గ్రామపంచాయతీలు =687 ►2018–19 నుంచి 2022–23 ఆర్థిక సంవత్సరం వరకు షెడ్యూల్ ప్రాంత జీపీలు, వంద శాతంఎస్టీ జీపీలు, షెడ్యూలేతర ప్రాంతాల్లో ఎస్టీ జీపీలకు విడుదల చేసిన గ్రాంట్లు సంక్షిప్తంగా కలిపి మొత్తం...రూ.2,062.75 కోట్లు గ్రాంట్ల రూపంలో విడుదల చేసినట్టు తెలియజేశారు. చదవండి: బీజేపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో కనీసం ఒక గదైనా ఇవ్వండి: ఈటల -
‘ఎస్సీ’ వర్గీకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కేంద్రంతోపాటు అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ అయిన తర్వాత విచారణ జాబితాలో చేర్చాలని ఆదేశించింది. ఎస్సీ వర్గీకరణ కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీస్) దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. ఎమ్మార్పీస్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్‌రోహత్గి వాదనలు వినిపిస్తూ.. ఎస్సీల్లో ఎక్కువ జనాభాగా ఉన్నప్పటికీ మాదిగ ఉపకులాలకు తగిన రిజర్వేషన్లు వర్తించడం లేదన్నారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ.. ఈ అంశంపై ఇప్పటికే ఈవీ చిన్నయ్య కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే... ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఆలస్యం అవుతోందని, ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న వారికి మధ్యంతర పరిష్కారం ఇవ్వాలని కోరారు. అయితే కేసు విచారణ వేగవంతం చేయాలని రాజ్యాంగ ధర్మాసనాన్ని కోరలేమని, అదే కేసులో ఇంప్లీడ్ కావాలని పిటిషనర్‌కు సీజేఐ సూచించారు. ఉద్యోగాలు, విద్యా సంస్థల ప్రవేశాల్లో ఇబ్బందులు పడుతున్నారని రోహత్గి తెలపగా స్పందించిన సీజీఐ, ‘‘ఈ తరహా కేసులో విచారణ చేపట్టకుండా ఎవరైనా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తారా?’’అని న్యాయవాదిని ప్రశ్నించారు. అనంతరం ‘‘రాజ్యాంగ ధర్మాసనం కేసులో ఇంప్లీడ్ కావడానికి పిటిషనర్‌కు అనుమతిస్తున్నాం. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తున్నాం. ప్రతివాదులకు నోటీసులు జారీ పూర్తయిన తర్వాత విచారణ జాబితాలో చేర్చాలి’’అని ధర్మాసనం ఆర్డర్లో పేర్కొన్నారు. వర్గీకరణతోనే న్యాయం: మంద కృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణతోనే మాదిగ ఉపకులాలకు న్యాయం జరు గుతుందని ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ... రెండు దశాబ్దాలుగా రిజర్వేషన్ల అమలు కోసం పోరాడుతున్నామన్నారు. -
దళితులకు అతిపెద్ద శత్రువు చంద్రబాబు: మేరుగ నాగార్జున
సాక్షి, తాడేపల్లి: దళితుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన చేస్తున్నారని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. దళితుల కోసం చంద్రబాబు ఏం చేశారు? అని సూటిగా ప్రశ్నించారు. దళితులపై దాడి జరిగినప్పుడు ఏ రోజైనా మాట్లాడారా? నిలదీశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించి ఇప్పుడు దండలు వేస్తారా? అని మండిపడ్డారు. దళిత జాతిపై దాడి జరిగినప్పుడు టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడలేదని దుయ్యబట్టారు. దళితులకు అతిపెద్ద శత్రువు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో దళిత జాతిపై దాడులు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక విప్లవానికి నాంది పలికింది సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. నవరత్నాలతో నిరుపేదలకు ఎంతో మేలు జరుగుతోందని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో పథకాలన్నీ బినామీలు, దళారులకే దక్కేవని తెలిపారు. -
ఈసురోమని మనుషులుంటే...
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ముందు నుంచి అనేక సమస్యలకు నిలయాలుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్ళు, గురుకులాలు నేడు అంతకు రెండింతల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. తెలంగాణలో 2022–2023 వార్షిక బడ్జెట్ కేటాయింపులలో సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలకు పక్కా భవ నాల నిర్మాణం, వాటి అభివృద్ధికి ఎటువంటి నిధులు కేటాయించలేదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నెలకొల్పిన గురుకుల పాఠశాలలు, కళాశాలలు 90% శాతం ప్రైవేటు అద్దె బిల్డింగు లలో కొనసాగుతున్నాయి. కొన్ని గురుకులాల్లో తరగతి గది, వసతి గది (డార్మెటరీ) రెండూ ఒకటే. ఇక సంక్షేమ హాస్టళ్ల విషయానికి వస్తే... అవి సమస్యల నిలయాలుగా ఉన్నాయి. గతంలో స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టళ్ల పేరుతో కొన సాగిన హస్టళ్ళు, నేడు పోస్ట్ మెట్రిక్ కాలేజి హాస్టళ్లు, ప్రీ మెట్రిక్ హాస్టళ్లుగా మారాయి. సంక్షేమ వసతి గృహాలలో కొన్నింటిని 1990 ప్రాంతంలో రేకుల షెడ్డులుగా నిర్మించగా... ఇవ్వాల అవి శిథిలావస్థకి చేరాయి, మెజారిటీ హాస్టళ్లు ప్రైవేటు అద్దె బిల్డింగులలో కొనసాగుతున్నాయి. అద్దె బిల్డింగుల సముదా యాలు వ్యాపార సంబంధిత అవసరాలకై నిర్మించినవి కావడంతో కనీస వసతి సౌకర్యాలు కూడా లేక విద్యార్థులు తల్ల డిల్లిపోతున్నారు. మా క్షేత్ర స్థాయి పరిశీలనలో... గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పరిధిలో 22 బాలుర హాస్టళ్లు, 16 బాలికల హాస్టళ్లు పూర్తిగా ప్రైవేటు భవనాలలో కొనసాగుతున్నాయి. పదవ తరగతిలోపు విద్యార్థు లుండే ప్రీ మెట్రిక్ బీసీ వెల్ఫేర్ హాస్టళ్లు బాల బాలికలవి 12 ఉండగా... ఇందులో మూడు మాత్రమే ప్రభుత్వ భవనాలలో కొనసాగుతున్నాయి. మిగతావన్నీ ప్రైవేటు భవనాలలో ఉన్నాయి. అదేవిధంగా సాంఘిక సంక్షేమ ఎస్సీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు 24 ఉండగా, ఇందులో 23 హాస్టళ్లు ప్రైవేటు భవనాలలో కొనసాగుతున్నాయి. ఈ ప్రైవేట్ బిల్డింగు లలో కనీస సౌకర్యాలు లేక పోగా, ప్రతి నెల అద్దె లక్షల్లో చెల్లించాల్సి వస్తోంది. ఈ డబ్బుతో ప్రభుత్వ హాస్టళ్లు నిర్మించ వచ్చు. కానీ ఆ పని చేయడంలేదు. హాస్టళ్లలో రీడింగ్ రూమ్‌లు, లైబ్రరీలు, స్టడీ టేబుళ్లు, కుర్చీల సమస్యలు వెంటాడుతున్నాయి. గురుకులాల్లో కంప్యూ టర్ బోధన పేరుకు మాత్రమే సాగుతోంది. సంక్షేమ హస్టళ్ళలో చదువుతున్న పదవతరగతిలోపు విద్యార్థులకు రూ. 62 మాత్రమే కాస్మోటిక్స్ చార్జీలు ఇస్తుండగా... పోస్ట్ మెట్రిక్ కాలేజి హాస్టల్ విద్యార్థినీ, విద్యార్థులకు ఎలాంటి కాస్మోటిక్స్ చార్జీలు ఇవ్వటం లేదు. నెల నెలా కాస్మోటిక్స్ కొనుక్కో వడానికి, బస్ పాస్, ఇంటర్నెట్ రీచార్జీ తదితర అవసరాలు నెరవేర్చుకోవడానికైప్రభుత్వం ఎలాంటి స్టైఫండ్ ఇవ్వక పోవడంతో విద్యార్థులు కూలీ పనులకు వెళ్తూ అర్ధ కార్మికు లవుతున్నారు. ఇటీవల పనికి వెళ్లొస్తున్న అంబర్‌పేట హాస్టల్ విద్యార్థి యాక్సిడెంట్లో మరణించిన సంగతి ఈ సందర్భంగా గమనార్హం. చాలా హాస్టళ్లకు రెగ్యులర్ వాచ్ మెన్, వాచ్ ఉమెన్, ఇతర సిబ్బంది లేరు, హాస్టళ్లలో వైద్యసదుపాయాలు అందుబాటులో లేవు. సంక్షేమ హాస్టళ్లలో ప్రీ మెట్రిక్ విద్యార్థులకు భోజన ఖర్చులకు రోజుకు రూ. 35 ఇస్తుండగా, కాలేజి విద్యార్థులకు రూ. 50 ఇస్తున్నారు. విద్యార్థులు ఈ ఖర్చుతోనే ప్రతిరోజూ మూడుసార్లు భోజనం చేయాలి. మధ్యాహ్నం, సాయంత్రం భోజనం మెనూలో కూరగాయలతో కూర వండాల్సి ఉండగా... చాలా వసతి గృహాల్లో పప్పుతోనే సరిపెడు తున్నారు. మూడు పూటలా బియ్యంతో తయారైన ఆహారాన్నే తినటంతో... కార్బోహైడ్రేట్లు తప్ప శరీరానికి అందవలసిన మిగతా విటమిన్లు ఏ, సీ, బీ–కాంప్లెక్స్; ప్రొటీన్స్, కొవ్వులు ఇతర పోషకాలు తగినంతగా పిల్లలకు అందటంలేదు. భారత దేశంలోని పిల్లలందరి మనుగడ, పెరుగుదల, అభివృద్ధి, సామర్థ్యాలకు ఉపకరించే పోషకాహార విధానం లేదని యుని సెఫ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. సమగ్ర జాతీయ పోషకాహార సర్వే (సీఎన్‌ఎన్‌ఎస్) 2016–18 ప్రకారం పాఠశాలలకు వెళ్లే పిల్లల పోషక స్థితి గమనిస్తే 21.9 శాతం మంది పిల్లలు కుంగిపోతున్నారని తేలింది. చాలామంది అండర్ వెయిట్‌కి చేరి రోగాల బారిన పడుతున్నారు. ‘‘ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడు నోయ్’ అన్న గురజాడ మాటలు అందరూ ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. సరైన తిండి, బట్ట, వసతి సౌకర్యాల లేమితో బలహీనంగా తయారవుతున్న రేపటి పౌరులను ఆదుకోవలసిన బాధ్యత ముమ్మాటికీ ప్రభుత్వానిదే కదా! కె. ఆనంద్ వ్యాసకర్త పి.డి.ఎస్.యు. (విజృంభణ) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొబైల్: 96523 57076 -
ఉపకార వేతనాల దరఖాస్తులను అందజేయండి
సాక్షి,సిటీబ్యూరో: పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాల దరఖాస్తుల హార్డ్ కాపీలను ప్రధానోపాధ్యాయులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు వెంటనే జిల్లా ఎస్సీ సంక్షేమాధికారికి సమర్పించాలని జిల్లా కలెక్టర్ శర్మన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాల మంజూరు, విద్యార్థుల దరఖాస్తుల సమర్పించడంలో జరుగుతున్న జాప్యం పై ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్, వృత్తి విద్య కోర్సులు చదువుతున్న ఎస్సీ విద్యార్థుల దరఖాస్తులను వసతి గృహ అధికారులు ఈ నెల 28 లోగా జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు. ప్రతి షెడ్యూల్ కులాల విద్యార్థిచే పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్లో దరఖాస్తు చేయించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి రామారావు, డీఈఓ రోహిణి, డిప్యూటీ డీఈఓలు, ఏఎస్ఓలు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
దళిత మహిళా సర్పంచ్‌కు టీడీపీ ఉప సర్పంచ్ వేధింపులు
సాక్షి, ప్రత్తిపాడు (గుంటూరు): కులం పేరుతో తనను దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఓ దళిత మహిళా సర్పంచ్ శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి కథనం ప్రకారం.. గత ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా గొట్టిపాడు సర్పంచ్‌గా టీడీపీ బలపరిచిన ఆది ఆంధ్రా కాలనీకి చెందిన ప్రత్తిపాటి మరియరాణి గెలుపొందారు. ఉప సర్పంచ్‌గా టీడీపీకి చెందిన ముఖుంద శివరంజనిని పంచాయతీ సభ్యులు ఎన్నుకున్నారు. నాటినుంచి సర్పంచ్, ఉపసర్పంచ్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇప్పటికే అనేకమార్లు పంచాయతీ కార్యాలయంలోనే వివాదాలు, వాగ్వాదాలు జరిగాయి. సర్పంచ్‌గా మరియరాణి బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఉపసర్పంచ్ భర్త నిమ్మగడ్డ శ్రీకాంత్ ఆమెను కులం పేరుతో దుర్భాషలాడుతున్నాడు. ఇటీవల ఖాళీ చెక్కులపై సంతకాలు చేయాలంటూ శ్రీకాంత్, పంచాయతీ ఇన్చార్జి సెక్రటరీ రామ్మూర్తి కలిసి మరియరాణిపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఆమె సంతకాలు చేసేందుకు నిరాకరించడంతో దుర్భాషలాడుతూ చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా ఇకపై పంచాయతీకి వెళ్లనని శ్రీకాంత్ ఒప్పుకుని క్షమాపణ చెప్పాడు. చదవండి: (విమ్స్‌లో ముక్కు ద్వారా వేసే కరోనా టీకా ట్రయల్స్) ఆ తర్వాత కూడా మళ్లీ ‘నాతోనే క్షమాపణ చెప్పిస్తావా?, ...దానివి నీకెందుకు సర్పంచ్ కుర్చీ. మేం ఎలా చెబితే అలా చేయాలి లేకుంటే చంపేస్తాం’ అంటూ శ్రీకాంత్ బెదిరింపులకు దిగాడు. వేధింపులు తాళలేని మరియరాణి శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. శ్రీకాంత్‌తో పాటు జూనియర్ అసిస్టెంట్ రామ్మూర్తి నుంచి తనకు, తన భర్తకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సర్పంచ్ ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ ప్రతాప్‌కుమార్ తెలిపారు. -
రాజ్యాంగం జోలికొస్తే పతనం కాక తప్పదు!
మలక్‌పేట: ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిన భారత రాజ్యాంగం జోలికి వస్తే పతనం కాక తప్పదని తెలంగాణ సోషలిస్టు స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కూరెళ్ల మహేష్‌కుమార్ అన్నారు. రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన విద్యార్థి నాయకులతో కలిసి శనివారం మూసారంబాగ్ చౌరస్తాలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మహేష్‌కుమార్ మాట్లాడుతూ, రాజ్యాంగంపై సీఎం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మనువాద కుట్రలను తిప్పికొట్టడానికి దళిత, బహుజనులు సిద్ధం ఉన్నారన్నారు. కార్యక్రమంలో గ్రేటర్ అధ్యక్షుడు నక్క వెంకటేష్, బీసీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు వడ్డేపల్లి రాకేష్, గ్యార సతీష్, మేడి నాగరాజు, అశోక్, సాయికిరణ్ యాదవ్, రవివర్మ, మారుతి, రాజు, ప్రదీప్ పాల్గొన్నారు. -
దళితుల చేతిలోనే.. పంజాబ్ అధికార దండం
దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంతగా పంజాబ్‌లో అత్యధికంగా 32 శాతం మంది దళిత ఓటర్లు ఉన్నారు. కానీ వీరి చేతిలో 2.3 శాతం భూమి మాత్రమే ఉండటం గమనార్హం. ఛండీఘడ్: పంజాబ్‌లో రాజకీయం పంచముఖ పోరుగా మారడం, కాంగ్రెస్‌కు మారుపేరుగా నిలిచిన కెప్టెన్ అమరీందర్‌సింగ్ హస్తం పార్టీకి గుడ్‌బై కొట్టి... బీజేపీతో జట్టుకట్టడంతో ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. మరోవైపు రెండు దశాబ్దాలకు పైగా బీజేపీతో ఉన్న బంధాన్ని తెగదెంపులు చేసుకున్న శిరోమణి అకాలీదళ్–కొత్తగా మాయావతి పార్టీ బీఎస్పీతో పొత్తపెట్టుకోవడం, ఆమ్ ఆద్మీ పార్టీ... దళిత ఎమ్మెల్యే హర్బాల్ సింగ్ (దిర్బా నియోజకవర్గం)ను అసెంబీల్లో ఆప్ పక్ష నేతగా నియమించడం... ఇలా ఇప్పుడు పంజాబ్ రాజకీయమంతా దళితుల చుట్టూనే తిరుగుతోంది. వాస్తవంగా చెప్పాలంటే... పంజాబ్ రాజకీయాల్లో జాట్ సిక్కులదే ఆధిపత్యమైనప్పటికీ... ప్రస్తుతం పరిస్థితి వేరుగా ఉంది. రాష్ట్ర జనాభాలోని 60 శాతం సిక్కుల్లో జాట్ల వాటా 21 శాతమే అయినప్పటికీ అదే ఆధిపత్య వర్గం. రాజకీయ నాయకత్వమంతా దశాబ్దాలుగా ఈ వర్గం చేతిలోనే కేంద్రీకృతమవుతోంది. ఆయా పార్టీల సంప్రదాయ ఓటు బ్యాంకుకు దళితుల ఓట్లు తోడైతేనే ఏ పార్టీ అయినా ప్రస్తుతం పంజాబ్ సీఎం పీఠాన్ని అందుకోగలుగుతుంది. ఎందుకంటే పంజాబ్ జనాభాలో దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఏకంగా 32 శాతం మంది దళిత ఓటర్లు ఉన్నారు. మూడింటి ఒకవంతున్న దళిత ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పుడు రాజకీయపక్షాలన్నీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. 10 నెలల కిందటే మొదలుపెట్టిన బీజేపీ మూడు నూతన వ్యవసాయ సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దీర్ఘకాలిక భాగస్వామి అయిన శిరోమణి అకాలీదళ్ ఎన్డీయేను వీడటంతోనే కమలదళం అప్రమత్తమైంది. ప్రధానంగా వ్యవసాయాధారిత రాష్ట్రమైన పంజాబ్‌లో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో (ఫిబ్రవరి 20న జరగనున్నాయి) తాము గెలిస్తే దళిత సామాజికవర్గానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రిని చేస్తామని గత ఏప్రిల్‌లోనే ప్రకటించడం ద్వారా బీజేపీ ఈ వర్గంలో కొత్త ఆశలు రేకెత్తించింది. అమరీందర్ సింగ్– సిద్ధూల మధ్య గొడవ తలకుమించిన భారం కావడంతో కాంగ్రెస్ గత ఏడాది సెప్టెంబరులో తెగించేసింది. జాట్ సిక్కు అయిన కెప్టెన్ అమరీందర్ స్థానంలో రవిదాసియా వర్గానికి చెందిన దళితుడైన చరణ్‌జిత్‌సింగ్ చన్నీని సీఎంగా నియమించి అందరికంటే ముందుగానే దళిత ఛాంపియన్ అనిపించుకునే ప్రయత్నం చేసింది. గురు రవిదాస్ జయంతిని పురస్కరించుకొని... ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14న కాకుండా మరో ఆరురోజులు ముందుకు జరిపి ఈ నెల 20 నిర్వహించాలని పంజాబ్ సీఎం చన్నీ ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. మిగతా రాజకీయపక్షాలన్నీ ఆయన డిమాండ్‌కే మద్దతు పలకడంతో ఈసీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను ఈనెల 20కి వాయిదా వేసింది. ఈ చర్య దళితుల్లో చన్నీ గ్రాఫ్‌ను అమాంతంగా పెంచేసిందని రాజకీయ పండితులు విశ్లేషణ. అయితే అధికార వ్యతిరేకతను అధగమించడం, పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ కొట్టే సిక్సర్లను తట్టుకోవడం లాంటి పనులతోనే పాపం చన్నీ బిజీగా గడపాల్సి వస్తోంది. దళితుల్లోనూ మళ్లీ రెండు వర్గాలు పంజాబ్‌లోని దళితుల్లో... హిందు దళితులు, సిక్కు దళితులుగా రెండు వర్గాలున్నాయి. హిందు దళితుల శాతం ఎప్పటికప్పుడు మారుతూ ఉండటానికి కారణం... వీరిలో చాలా మంది సిక్కు మతంలోకి మారిపోవడం, రవిదాసియా, ఆది ధర్మిలు మాత్రం తమను ప్రత్యేక మతంగా గుర్తించాలనే డిమాండ్లు వినిపిస్తున్నారు. 2018 సామాజిక సాధికార శాఖ గణాంకాల ప్రకారం పంజాబ్ దళితుల్లో మొత్తం 39 ఉపకులాలున్నాయి. వీటిలో ఐదు ప్రముఖమైనవి. రాష్ట్రంలోని 32 శాతం దళిత జానాభాలో వీటి వాటాయే 80 శాతం దాకా ఉంటుంది. మజ్హబీ సిక్కులు అత్యధికంగా 30 శాతం ఉండగా... తర్వాత రవిదాసియాలు 24 శాతం మేరకు ఉంటారు. కాగా ఆది ధర్మీలు 11 శాతం ఉంటారు. ఇక ప్రాంతాల వారీగా చూస్తే... దౌబాలో 37 శాతం, మాల్వాలో 31 శాతం, మజ్హాలో 29 శాతం దళితులున్నారు. మొత్తం 117 అసెంబ్లీ సీట్లున్న పంజాబ్‌లో 34 సీట్లు ఎస్సీలకు రిజర్వు చేశారు. 2017లొ ఈ 34 స్థానాల్లో కాంగ్రెస్ ఏకంగా 21 నెగ్గగా, ఆప్ 9 సీట్లు గెల్చుకుంది. డేరాల ప్రభావం క్షీణించినట్లేనా! గతంలో దళిత ఓటర్లపై డేరా సచ్చా సౌదా (సమానత్వాన్ని ప్రబోధించే ధ్యాన కేంద్రా)ల ప్రభావం తీవ్రంగా ఉండేది. డేరాసచ్చా సౌదా అధిపతి రామ్‌రహీమ్ సింగ్ అత్యాచారం, హత్య కేసులో అరెస్టయి జైల్లో ఉండటంతో దళితులపై ఈ డేరాల ప్రభావం మునుపటి స్థాయిలో లేదు. 69 సీట్లున్న మాల్వా ప్రాంతంలో గత ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ తీవ్రంగా దెబ్బతింది. అకాలీ దళిత ఓటు బ్యాంకు కాస్తా కాంగ్రెస్ బదిలీ అయింది. ఐక్యత లేదు.. పంజాబ్‌లో జనాభాలో దళితులు ఏకంగా 32 శాతం ఉన్నప్పటికీ... వారి మధ్య రాజకీయ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఐక్యత లేకపోవడమే వీరిని దెబ్బతీస్తోంది. ఏదో ఒక ఆధ్యాత్మిక బోధకుడి సూక్తులకు కట్టుబడి ఉండకపోవడం, భిన్నమైన ఆచారాలు, సంస్కృతులు ఉండటం మూలంగా పంజాబ్ దళితుల్లో ఐక్యత లోపించి బీఎస్సీ ఇక్కడ దారుణంగా విఫలమైందని, గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ కనీసం ఒక్క సీటును కూడా గెలవకపోవడానికి ఇదే కారణమని పంజాబ్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ ప్రమోద్ కుమార్ విశ్లేషించారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
BJP: తెలంగాణ టార్గెట్ 31
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఆయా వర్గాల ప్రజల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తి, స్థానిక ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆ సీట్లలో పాగా వేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే రెండేళ్లపాటు ఆ నియోజకవర్గాల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడంలో నిమగ్నమైంది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమించి ఒక రోడ్‌మ్యాప్‌ను, ఫార్మూలాను ఖరారు చేయనుంది. ఈ సీట్లలో ఉన్న రాజకీయ పరిస్థితులు, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, ప్రధాన రాజకీయ పార్టీల బలాబలాలు, ఆయా స్థానాల్లో బీజేపీ పరిస్థితి ఏమిటన్న దానిపై లోతైన అధ్యయనాన్ని నిర్వహిస్తోంది. ఈ నియోజకవర్గాలతోపాటు మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు దోహదపడే అంశాలను పరిశీలిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేయాలనే డిమాండ్‌తో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని భావిస్తోంది. ముందుగానే అభ్యర్థుల ఎంపిక దిశగా.. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలవారీగా విస్తృత కసరత్తు ద్వారా బలమైన అభ్యర్థులను గుర్తించి ముందు నుంచే వారిని పోటీకి సిద్ధం చేయాలని బీజేపీ యోచిస్తోంది. ఆయా స్థానాలకు సంబంధించి పార్టీలో బలమైన అభ్యర్థులు లేని చోట్ల, ఆయా సీట్లలో ఎవరైతే గెలిచే అవకాశాలున్నాయి, ఏ పార్టీ వారిని చేర్చుకొని సీటిస్తే పక్కాగా విజయం సాధించవచ్చు వంటి అంశాలపై కసరత్తు చేపడుతోంది. కనీసం 10 సీట్లు కైవసం చేసుకొనేందుకు అవసరమైన రాజకీయ వ్యూహాలు, కార్యక్రమాలను సిద్ధం చేసుకోనుంది. ప్రజాసమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీల్లో అమలు కాని అంశాలపై విశ్లేషణకు కమలదళం సిద్ధమవుతోంది. దళితులకు ఇచ్చిన మూడెకరాల చొప్పున భూకేటాయింపు హామీ, దళితబంధు కింద రూ. 10 లక్షలు ఖాతాల్లో డిపాజిట్ అంశాలను ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమాల ద్వారా ఎండగట్టాలని నిర్ణయించింది. ఎస్టీలకు సంబంధించి రిజర్వేషన్లు పెంపుదల, ఇతర హామీల అమలుపై టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీసేలా నిరసనలు చేపట్టాలని భావిస్తోంది. 28న పార్టీ ముఖ్యుల భేటీ.. ఈ నెల 28న రాష్ట్రంలోని ఎస్సీ అసెంబ్లీ సీట్లపై కూలంకష పరిశీలనకు ఎస్సీ నేతలు, పార్టీ ముఖ్యనేతలతో బీజేపీ అంతర్గత భేటీ నిర్వహించనుంది. ఈ సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్చార్జి తరుణ్ ఛుగ్ హాజరుకానున్నారు. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించి స్పష్టమైన కార్యాచరణను ఖరారు చేయనున్నారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లకు దారి చూపండి.. సుప్రీంకోర్టుకు కేంద్రం విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: ఏళ్లుగా ప్రధాన స్రవంతికి దూరంగా ఉండిపోయినా వారికి... రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రిజర్వేషన్లు రూపంలో సమాన అవకాశాలు కల్పించాలని చూస్తున్నామని, దీనికి తగిన దారి చూపించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పదోన్నతుల సమయంలో ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులకు రిజర్వేషన్లు అమలు చేయడానికి రాష్ట్రాలు, కేంద్రానికి కచ్చితమైన మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో రిజర్వేషన్లపై జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. కేంద్రం తరఫు అటార్నీ జనరల్ వాదనలు వినిపిస్తూ... పదోన్నతుల్లో రిజర్వేషన్లపై తగిన మార్గదర్శకాలు రూపొందించకపోతే సమస్యలు తీవ్రం అవుతాయని, ఎప్పటికీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదని తెలిపారు. చదవండి: (గుడ్ న్యూస్: విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా) ‘‘పదోన్నతులు మెరిట్ ఆధారంగా తప్ప భర్తీ చేయడం లేదు. కానీ ఏళ్ల తరబడి ఓ వర్గం వెనకబడిపోయింది. దేశప్రయోజనాలు, రాజ్యాంగ ప్రయోజనాల దృష్ట్యా సమానత్వం తీసుకురావాలి. దామాషా ప్రాతినిధ్యంతోనే సమానత్వం వస్తుంది’’ అని వేణుగోపాల్ తెలిపారు. పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడానికి ఓ సూత్రం కావాలని, ఒక వేళ నిర్ణయాన్ని రాష్ట్రాలకు వదిలేస్తే సమస్య మళ్లీ మొదటికి వస్తుందని వేణుగోపాల్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. వాదనల అనంతరం ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. -
అంబేడ్కర్‌ను సరిగ్గా అర్థం చేసుకోవాలి!
‘‘మహా సామ్రాజ్యాలు, సంకుచిత మనస్తత్వాలు కలిసి మనుగడ సాగించలేవు’’ అన్న అంబేడ్కర్ మాటలు రాజ్యాంగ సభను నివ్వెరపరిచాయి. 18వ శతాబ్దపు ఐరిష్ రాజనీతి తాత్వికుడు ఎడ్మండ్ బర్క్ మాటలను అంబేడ్కర్ తీవ్ర స్వరంతో పలికారు. ఆగస్టు 26, 1949న రాజ్యాంగంలో పొందుపరి చిన ఆర్టికల్ 334పై జరిగిన చర్చను ముగిస్తూ అంబేడ్కర్ చేసిన నిరసన గర్జన అది. షెడ్యూల్డ్ కులాల రాజకీయ హక్కుల కోసం పోరాడిన అంబేడ్కర్‌కు రాజ్యాంగసభ నిరాశను మిగిల్చింది. దాని పర్యవ సానమే 1955 ఆగస్టు 21న బొంబాయిలో జరిగిన ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కులాల సమాఖ్య, వర్కింగ్ కమిటీ సమావేశంలో... పార్లమెంటు, శాసనసభలు, జిల్లా, పట్టణ స్థాయి స్థానిక సంస్థల్లో ఎస్సీలకు కేటాయించిన రిజర్వుడు సీట్లను ఎత్తివేయాలన్న తీర్మానం. ఈ సమావేశంలో అంబేడ్కర్ కూడా పాల్గొన్నారు. దీనిని కొంతమంది ఎస్సీ రిజర్వేషన్లకే అంబేడ్కర్ వ్యతిరేకమని అర్థం చేసుకుంటున్నారు. అదే సంవత్సరం అంటే 1955 డిసెం బర్ 23న, భాషా ప్రయుక్త రాష్ట్రాలపై రూపొందించిన డాక్యు మెంటులో ‘‘ప్రత్యేక ఓటింగ్ విధానం గానీ, సీట్ల రిజర్వేషన్ గానీ సాధ్యం కానప్పుడు బహుళ సభ్యుల నియోజక వర్గాలు అంటే రెండు లేక మూడు నియోజక వర్గాలు కలిపి ఒకే నియోజక వర్గంగా రూపొందిస్తే అది అల్ప సంఖ్యాకులుగా ఉన్న వారికి భరోసాను ఇస్తుంది. దీనినే క్యుములేటివ్ ఓటింగ్ అంటారు’’ అని ప్రత్యామ్నాయాన్ని సైతం అంబేడ్కర్ సూచించిన విష యాన్ని మర్చిపోవద్దు. బాబాసాహెబ్ రాజ్యాంగ సభలో సభ్యుడిగా వెళ్లిన కారణమే రాజకీయ, సామాజిక హక్కులను పొందుపరచడానికని మరచి పోవద్దు. పార్లమెంటు, అంసెబ్లీలలో రిజర్వేషన్లు పదేళ్ళు మాత్రమే ఉంటాయనే విషయాన్ని అంబేడ్కర్ అంగీకరించలేదు. ‘ఎస్సీ, ఎస్టీల కోసం నిర్దేశించిన రిజర్వేషన్లు పదేళ్ళు ఉండాలని చాలామంది మాట్లాడారు. వాళ్ళందరికీ నేను చెప్పదల్చుకున్నది ఒక్కటే. మహా సామ్రాజ్యాలు, సంకుచిత మనస్తత్వాలు కలిసి మనుగడ సాగించలేవు’ అన్నారు. దీనర్థం పదేళ్ళ పరిమితిని అంగీకరించినట్టా, వ్యతిరేకించినట్టా? 1955లో షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ చేసిన తీర్మానానికీ, రాజ్యాంగం ఆమోదించిన దానికీ మధ్యలో చాలా పరిణామాలు జరిగాయి. అంబేడ్కర్ ఆశించిన రాజకీయ హక్కుల రక్షణకే వల్లభ్ భాయి పటేల్ లాంటి వాళ్ళు ఎసరు పెట్టారు. తాను ప్రతిపాదిస్తున్న ప్రత్యేక ఓటింగ్ విధానం కూడా సాధ్యం కాదేమో అనే అభిప్రాయానికి అంబేడ్కర్ వచ్చారు. 1947 ఆగస్టులో రూపొందించిన రాజ్యాంగ ముసాయిదాలో షెడ్యూల్డ్ కులాలకు, ఇతర మైనారిటీలకు రాజకీయ రక్షణలను చేర్చారు. అంబేడ్కర్ డిమాండ్ చేసిన ప్రత్యేక ఓటింగ్ విధానం ఆమోదం పొందలేదు. అయినప్పటికీ అంబేడ్కర్ రిజర్వుడు సీట్ల విధానానికి ఒప్పు కున్నారు. అప్పుడు పదేళ్ళ పరిమితి లేదు. అయితే పాకిస్తాన్ విభజన జరగడం, గాంధీజీ హత్యకు గురవడంతో సర్దార్ పటేల్ 1947 నాటి ముసాయిదాను తిరగదోడారు. రిజర్వేషన్లనే తీసి వేస్తామని ప్రకటించారు. 1948 ఆగస్టు నాటికి రాజ్యాంగ రచన పూర్తయింది. చర్చలు ముగిశాయి. అంబేడ్కర్ తీవ్ర ఆగ్రహంతో రాజ్యాంగ సభ నుంచి వాకౌట్ చేశారు. అంటరాని వారి సంక్షేమాన్ని హిందువులు ఎట్లా అడ్డుకున్నారో తరతరాల చరిత్ర మరువని విధంగా తాను రాజ్యాంగ సభ నుంచి వాకౌట్ చేస్తున్నా నని ప్రకటించారు. దాంతో దిగివచ్చిన కాంగ్రెస్ నాయకులు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు అంగీకరించారు. అయితే రాజ్యాంగం ఆమోదం సమయంలో పటేల్, నెహ్రూ పదేళ్ళ పాటు మాత్రమే రిజర్వేషన్లు ఉంటాయని చేసిన ప్రసం గాలు అంబేడ్కర్‌ను బాధించాయి. 1951, 1952లో జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ ఎటువంటి విజయాలు సాధించలేదు. అంబేడ్కర్ కూడా ఓడి పోయారు. రిజర్వుడు సీట్ల విధానం వల్ల నిజమైన ఎస్సీ ప్రతి నిధుల ఎన్నిక అసాధ్యమనే విషయాన్ని మరోసారి ఆ ఎన్నికలు రుజువు చేశాయి. 1936లో, 1942లో జరిగిన ఎన్నికల్లో ఇదే అను భవం అంబేడ్కర్‌కు ఎదురైంది. అందుకే 1947లో తయారు చేసిన నమూనా రాజ్యాంగంలో ప్రత్యేక ఓటింగ్ విధానాన్ని ప్రతిపాదించారు. నమూనా రాజ్యాంగానికి ‘స్టేట్స్ అండ్ మైనారి టీస్’ అనే పేరు పెట్టారు. ‘‘ఈ రిజర్వేషన్లు పదేళ్ళే ఉంటాయి. ఆ తర్వాత ఉండవు. అందువల్ల మనం ఐక్యంగా ఉద్యమించాలి. అంతే కాకుండా, హిందువుల దయాదాక్షిణ్యాల మీద ఎన్నికయ్యే ఈ రిజర్వుడు సీట్ల విధానం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం లేదు’’ అంటూ పంజాబ్ ఎన్నికల సభల్లో అంబేడ్కర్ చేసిన ప్రసంగాలు అంబేడ్కర్ సమగ్ర రచనల 17వ సంపుటంలోనే ఉన్నాయి. పనికిరాని రిజర్వేషన్లు, పదేళ్ళే ఉండే రిజర్వేషన్లు ఉంటే ఎంత, పోతే ఎంత అనే అభిప్రాయానికి అంబేడ్కర్ వచ్చారు. దాని ఫలితమే షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ తీర్మానం. ఆ తర్వాత క్యుములేటివ్ ఓటింగ్ విధానాన్ని ఆయన ముందుకు తెచ్చారు. ఈ విధానంలో ఎన్ని నియోజక వర్గాలను కలిపి ఒక్కటిగా చేస్తారో, ప్రతి ఓటరుకు అన్ని ఓట్లు ఉంటాయి. మూడు నియోజకవర్గాలను కలిపితే మూడు ఓట్లు ఉంటాయి. రిజర్వేషన్లు ఉండవు. ఎవరైనా పోటీ చేయొచ్చు. తమ నియోజక వర్గాలకు ప్రతి పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు ఉంటారు. ఒక ఓటరు తన మూడు ఓట్లను ముగ్గురికి ఒక్కొక్క ఓటుగా వేయొచ్చు; ఇద్దరికే వేయొచ్చు; మూడు ఓట్లను ఒక అభ్యర్థికి కూడా వేయొచ్చు. ఎస్సీ అభ్యర్థి ఒక్కడే ఉండే ఆ నియోజక వర్గంలో ఎస్సీలందరూ ఒక్క అభ్యర్థికే తమ మూడు ఓట్లను వేస్తే, తప్పనిసరిగా ఎస్సీ అభ్యర్థి గెలుస్తాడు. అయితే అంబేడ్కర్‌కి ఈ విధానం మీద ఉద్యమం చేసేంతటి సమయం లేదు. ఆ సమ యంలో ఆయన బౌద్ధంపై కేంద్రీకరించి ఉన్నారు. ఈ ఆలోచన ‘స్టేట్స్, అండ్ మైనారిటీస్’లో కూడా ప్రతిపాదించారు. కానీ అది ప్రచారం పొందలేదు. రిజర్వేషన్ సీట్లు రాజకీయ అధికార భాగస్వామ్యం కోసం నిర్దేశించుకున్న ఒక రూపం. రిజర్వుడు సీట్లు అంబేడ్కర్ రాజకీయ మార్గం కాదు. ఎన్నో మార్గాలను అంబేడ్కర్ వెతికారు. ఆయన నిజమైన లక్ష్యం ఎస్సీలు రాజకీయాధికారంలో భాగం కావడం. ఆ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళేవారు ఆయన ఆలోచనా సరళిని సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మల్లెపల్లి లక్ష్మయ్య, వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 81063 22077 -
ఎస్సీల సమగ్రాభివృద్ధిలో రాష్ట్రానికి రెండు అవార్డులు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా షెడ్యూల్ కులాల సమగ్రాభివృద్ధి పథకం అమలుకు సంబంధించి కేంద్రం ప్రకటించిన మూడు అవార్డుల్లో రెండింటిని ఆంధ్రప్రదేశ్ గెలుచుకుంది. ఈ పథకం అమలులో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన దేశంలోని మూడు జిల్లాలకు ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన (పీఎంఏజీవై) అవార్డులను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. వీటికి ఎంపికైన మూడింటిలో రెండు జిల్లాలు మన రాష్ట్రానివే కావడం విశేషం. ఇందులో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రెండో స్థానం, తూర్పు గోదావరి జిల్లా మూడో స్థానం దక్కించుకున్నాయి. దేశంలోనే అత్యున్నత పనితీరు షెడ్యూల్డ్ కులాల ప్రజలు ఎక్కువ మంది నివసించే ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన.. సామాజిక, ఆర్థికాభివృద్ది కార్యక్రమాలు చేపట్టడంలో మన రాష్ట్రం దేశంలోనే అత్యున్నతంగా పని చేస్తోందని కేంద్రం ప్రశంసించింది. ఆ ప్రాంతాల్లో బడికి దూరంగా ఉండే పిల్లలను బడులలో చేర్పించడం, అక్కడి పిల్లలు, మహిళలకు పౌష్టికాహారం అందజేయడం, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్ల మంజూరు, వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల జీవనోపాధిని పెంచడంతో పాటు ఆ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యం, రోడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పన వంటి మౌలిక వసతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల ప్రాతిపదికగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటించింది. ఎక్కువగా ఎస్సీ జనాభా ఉండే గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లోని 530 జిల్లాల పరిధిలో 19,172 గ్రామాల్లో ఈ పథకం అమలవుతోంది. మన రాష్ట్రంలో విజయనగరం, విశాఖ జిల్లాలు మినహా 11 జిల్లాల పరిధిలోని 501 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఆయా గ్రామాల్లో అన్ని మౌలిక వసతుల కల్పనకు గ్యాప్ ఫండింగ్ రూపంలో ప్రత్యేకించి రూ.20 లక్షల చొప్పున అదనంగా ఒక్కొక్క గ్రామానికి ప్రభుత్వం నిధులిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2015 నుంచే ఈ పథకం అమల్లోకి తెచ్చినప్పటికీ.. 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచే మన రాష్ట్రంలోఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. పథకం అమలు తీరు ఆధారంగా 2020–21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ విభాగం జిల్లాల వారీగా అవార్డులను ప్రకటించింది. సీఎస్‌కు లేఖ రాసిన కేంద్ర కార్యదర్శి మొత్తం మూడు అవార్డులకు గాను రెండు అవార్డులు ఏపీకే దక్కినట్టు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కు బుధవారం లేఖ రాశారు. ప్రభుత్వానికి, నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల అధికారులకు ఆ లేఖలో అభినందనలు తెలియజేశారు. -
AP: బడుగుల భద్రతలో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: దళితులు, గిరిజనులకు పూర్తి భద్రత.. సామాజికంగా భరోసా.. రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణ.. ఇదే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ చేపడుతోంది. ఎస్సీ, ఎస్టీలపై నేరాలకు పాల్పడినా పర్వాలేదనే టీడీపీ ప్రభుత్వ హయాంలోని పరిస్థితిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమూలంగా సంస్కరించింది. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో అప్రతిహతంగా సాగిన దళితులు, గిరిజనుల హక్కుల హననానికి అడ్డుకట్ట వేసింది. ఎస్సీ, ఎస్టీలపై నేరాలను తీవ్రంగా పరిగణిస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నది. 2014–19 మేతో పోలిస్తే 2019 జూన్ నుంచి 2021 జూలై వరకు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై నేరాలు తగ్గాయి. ఎస్సీ, ఎస్టీలకు భద్రత కల్పించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మెరుగైన పనితీరు కనబరుస్తోందని జాతీయ క్రైమ్‌రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక వెల్లడించడం రాష్ట్ర ప్రభుత్వ సమర్థతకు తార్కాణంగా నిలుస్తోంది. 2019 నుంచి తగ్గిన కేసులు రాష్ట్రంలో 2015–19తో పోలిస్తే 2019–21లో దళితులు, గిరిజనులపై దాడులు, ఇతర వేధింపులు గణనీయంగా తగ్గాయి. గత ఆరేళ్లలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు అత్యల్పంగా 2021లోనే నమోదు కావడం విశేషం. 2015తో పోలిస్తే 2020లో దళితులు, గిరిజనులపై నేరాలు 13శాతం తగ్గాయి. ఎస్సీ, ఎస్టీలపై నమోదైన కేసులను కేటగిరీలవారీగా పరిశీలిస్తే నేరాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీలపై నేరాలు గణనీయంగా తగ్గాయి. 2019తో పోలిస్తే 2020లో హత్య కేసులు 40శాతం, అత్యాచారం కేసులు 15శాతం తగ్గాయి, దాడులు 6శాతం, గృహదహనాలు 38శాతం, ఎస్సీ, ఎస్టీ వేధింపులు 18శాతం, ఇతర కేసులు 12శాతం తగ్గడం ప్రాధాన్యం సంతరించుకుంది. తప్పు చేస్తే పోలీసులైనా కఠిన చర్యలే.. ఎస్సీ, ఎస్టీలపై నేరాలకు పాల్పడితే పోలీసులయినాసరే ఉపేక్షించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన సందేశాన్నిచ్చింది. శ్రీకాకుళంజిల్లాలో కాశీబుగ్గ సీఐను 24 గంటల్లోనే అరెస్టు చేసింది. రాజమహేంద్రవరంలోని సీతానగరం పోలీస్ స్టేషన్లో ఓ ఎస్ఐను ఘటన జరిగిన రోజే అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా చీరాల టూ టౌన్ ఎస్ఐను అరెస్టు చేసి చార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. బాధితులకు పరిహారం పెంపు నేరాలకు గురయిన దళితులు, గిరిజనులను ఆదుకోవడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరిస్తోంది. బాధిత కుటుంబాలకు పరిహారాన్ని పెంచింది. 2014–2019లో టీడీపీ ప్రభుత్వం బాధిత ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు కేవలం రూ.52.32 కోట్లు మాత్రమే పరిహారంగా అందించింది. కాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019 జూన్ నుంచి 2021 జూలై వరకు బాధిత ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.87.70కోట్లు పరిహారంగా అందించడం విశేషం. అందుకోసం ప్రత్యేకంగా పోర్టల్‌ను ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలకు సత్వరం పరిహారం అందేలా చొరవ చూపిస్తోంది. దేశంలోనే భేష్.. ఎస్సీ, ఎస్టీల రక్షణలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే సమర్థంగా వ్యవహరిస్తోందని ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంది. వివిధ రాష్ట్రాల్లో లక్షమందిజనాభాలో ఎస్సీ, ఎస్టీలపై నమోదైన కేసులను ప్రమాణంగా తీసుకుని ఎన్సీఆర్బీ ఈ నివేదిక వెల్లడించింది. ► ఎస్సీలపై అత్యధికంగా నేరాలు జరుగుతున్న రాష్ట్రాల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, బిహార్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ప్రతి లక్ష ఎస్సీలలో రాజస్థాన్‌లో 55.6, మధ్యప్రదేశ్‌లో 46.7, బిహార్‌లో 39.5మందిపై నేరాలకు పాల్పడుతున్నారు. గుజరాత్లో 34.8మందిపై, తెలంగాణలో 31.1మందిపై ఉత్తర ప్రదేశ్‌లో 28.6మందిపై, కేరళలో 28.2మందిపై, ఒడిశాలో 26.2మందిపై నేరాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి లక్షమందికి 24.5 మందిపై మాత్రమే నేరాలు జరుగుతున్నాయని ఆ నివేదిక తెలిపింది. ► ఎస్టీలపై అత్యధికంగా నేరాలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, కేరళ, రాజస్థాన్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ప్రతి లక్షమంది ఎస్టీలకు ఉత్తరప్రదేశ్‌లో 63.6మందిపై, కేరళలో 28.9మందిపై, రాజస్థాన్‌లో 19.5మందిపై నేరాలకు పాల్పడుతున్నారు. తెలంగాణలో 16.1మంది ఎస్టీలు దాడులకు గురవుతున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి లక్షమందికి కేవలం 12.5 మందిపైనే నేరాలు జరుగుతున్నాయని ఎన్సీఆర్బీ నివేదిక తెలిపింది. సమర్థంగా కేసుల పరిష్కారం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలపై నేరాల దర్యాప్తును వేగవంతం చేసి దోషులను సకాలంలో గుర్తించి శిక్షలు పడేలా చేస్తోంది. దాంతో ఎస్సీ, ఎస్టీలపై నేరాలకు పాల్పడాలంటే భయపడే పరిస్థితిని తీసుకువచ్చింది. గత రెండేళ్లలో ఏకంగా 94శాతం కేసుల్లో దోషులను గుర్తించడం రాష్ట్ర ప్రభుత్వ సమర్థ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. రికార్డు వేగంతో దర్యాప్తు దళితులు, గిరిజనులపై నేరాల కేసులను పోలీసు శాఖ రికార్డు వేగంతో దర్యాప్తు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీలపై కేసుల దర్యాప్తును టీడీపీ ప్రభుత్వంలో కంటే 78శాతం తక్కువ రోజుల్లోనే పూర్తి చేస్తుండడం జాతీయస్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. ► కేసుల వారీగా చూస్తే 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వంలో దళితులు, గిరిజనుల అత్యాచారాలు, హత్యల కేసుల దర్యాప్తునకు సగటున 240 రోజులు పట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2019 జూన్ నుంచి 2022 జూలై వరకు సగటున 55 రోజుల్లోనే విజయవంతంగా దర్యాప్తు పూర్తి చేస్తున్నారు. ► 2014 నుంచి 2019 మే వరకు సామూహిక అత్యాచారం కేసుల దర్యాప్తునకు సగటున 279 రోజులు పట్టి్టంది. కాగా 2019 జూన్ నుంచి 2020 వరకు దర్యాప్తును సగటున 153 రోజుల్లోనే పూర్తి చేశారు. 2021లో అయితే 44 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేయడం విశేషం. ► 2014 నుంచి 2019 మే వరకు పోస్కో చట్టం కేసుల దర్యాప్తునకు సగటున 192 రోజులు పట్టాయి. 2019 జూన్ నుంచి 2020 వరకు దర్యాప్తును సగటున 133 రోజుల్లోనే పూర్తి చేశారు. 2021లో కేవలం 53 రోజుల్లోనే దర్యాప్తును పూర్తి చేయడం పోలీసుల సమర్థ పనితీరుకు నిదర్శనం. ► 2014 నుంచి 2019 వరకు అత్యాచారం కేసుల దర్యాప్తునకు సగటున 266 రోజులు పట్టాయి. 2019 జూన్ నుంచి 2020 వరకు సగటున 111 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేశారు. ఇక 2021లో కేవలం 46రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ► ఇక టీడీపీ ప్రభుత్వంలో 2014 నుంచి 2019 మే వరకు ఎస్సీ, ఎస్టీలపై నేరాలకు సంబంధించిన కేసులను పెండింగ్‌లో ఉంచగా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ కేసులను సమర్థంగా దర్యాప్తు చేసి పూర్తి చేశారు. ఆ విధంగా అత్యాచారం– హత్య కేసులు 3, సామూహిక అత్యాచారం కేసులు 2, పోస్కో చట్టం కేసులు 19, అత్యాచారం కేసులు 64ను దర్యాప్తు పూర్తి చేయడం గమనార్హం. -
దళితులకు సీఎం జగన్ ఆశయాలు ఊపిరి
సాక్షి, అమరావతి: దళిత వర్గాల విద్యాభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ఏపీ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం ప్రశంసించింది. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీల్‌కుమార్ ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నాడు–నేడు, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, ఆంగ్ల విద్యా బోధన లాంటి పథకాలు బడుగులకు చేయూతనిస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టి, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేయాలన్న ఆయన సంకల్పానికి తమ సంఘం అండగా నిలుస్తుందని తెలిపారు. -
ఎస్సీల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, వారి సంక్షేమానికి పెద్ద ఎత్తున కేటాయించిన నిధులను సకాలంలో సద్వినియోగం చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. ఎస్సీ ఉప ప్రణాళిక 27వ నోడల్ ఏజెన్సీ సమావేశం వెలగపూడి సచివాలయం ఐదో బ్లాక్‌లో మంగళవారం జరిగింది. మంత్రి మాట్లాడుతూ.. ఎస్సీ ఉప ప్రణాళిక నిధులు నూరు శాతం వినియోగంలో అన్ని శాఖలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. 2020–21లో షెడ్యూల్ కులాల ఉప ప్రణాళికలో 44 శాఖలకు రూ.19,430 కోట్లు కేటాయించగా రూ.13,672 కోట్లు ఖర్చు చేశారన్నారు. కేటాయించిన నిధుల్లో 12 శాఖలు 76 శాతం కంటే ఎక్కువగా ఖర్చు చేయగా, 23 శాఖలు 25 నుంచి 51 శాతం ఖర్చు చేశాయని, 9 శాఖలు ఏ విధమైన నిధులు ఖర్చు చేయలేదని తెలిపారు. 2021–22లో ఎస్సీ ఉప ప్రణాళిక కింద 42 శాఖలకు రూ.17,403 కోట్లు కేటాయించామన్నారు. వచ్చే మూడు నెలల (త్రైమాసిక) సమీక్ష సీఎం అధ్యక్షతన జరుగుతుందని, ఈలోగా నూరు శాతం నిధులు సద్వినియోగం చేయాలని మంత్రి సూచించారు.