ప్రభుత్వాన్ని నిలదీసిన విపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాలు, తెగల (ఎస్సీ, ఎస్టీ) స్వయం ఉపాధి పథకాలకు లబ్ధిదారుల ఎంపిక తీరుపై శనివారం రాష్ట్ర శాసనసభలో ఆగ్రహావేశాలతో కూడిన చర్చ జరిగింది. కిరణ్ సర్కారు తెచ్చిన జీవో 101ను చంద్రబాబు జమానా అమలు చేస్తోందంటూ విపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. ‘‘జీవో 101 ప్రకారం లబ్ధిదారుల ఎంపిక కమిటీలో సామాజిక కార్యకర్తలను పెడుతున్నామంటున్నారు.
ఈ జీవో అన్యాయమైంది. ఓసీలతో కూడిన ఈ కమిటీకి ఎస్సీ లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఏ అధికారం ఉంది? ప్రభుత్వ అధికారులు, ఎస్సీ, ఎస్టీ విభాగాల అధికారులు, బ్యాంకర్లు, ఆ వర్గాలకు చెందినవారుంటే సరిపోతుంది గానీ సామాజిక కార్యకర్తలు ఎందుకు? పాత విధానాన్నే అమలు చేయాలి’’ అని డిమాండ్ చేశారు. అంతకుముందు వైఎస్సార్‌సీపీ సభ్యులు ఆదిమూలపు సురేష్, గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావు అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు సంబంధిత శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు ప్రశ్నోత్తరాల సమయంలో సుదీర్ఘ జవాబు ఇచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ వర్గాలకు రూ.580 కోట్ల మేర రుణాలు ఇవ్వాలని ప్రతిపాదించామని చెప్పారు.
అయితే మంత్రి కిషోర్ బాబు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రస్తావన తేవడం, లేనిపోనివి ఆపాదించడంతో పలువురు అభ్యంతరం తెలిపారు. అనంతరం ఏ.సురేష్ మాట్లాడుతూ... ఎస్సీ లబ్ధిదారుల ఎంపికకు ఉద్దేశించిన 135, 101 జీవోలను తప్పుబట్టారు. సాంఘిక సంక్షేమ శాఖ పేరును సామాజిక సాధికారత సంస్థగా మారుస్తామంటూ ఎస్సీ, ఎస్టీలకు చెందిన నిరుద్యోగ యువతకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ గొడవ చెలరేగింది. అప్పుడు ప్రతిపక్ష నేత జగన్‌మోహన్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. ‘‘సామాజిక కార్యకర్తలు దళారులుగా మారి వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారు.
పెన్షన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రుణాలు ఇచ్చేందుకు దళారులు ఎందుకు? వాళ్లను పెట్టి గబ్బులేపొద్దు. దీనికో ప్రత్యక్ష ఉదాహరణ కూడా చెప్పగలను. సలగాల సురేష్ అనే వ్యక్తి రుణానికి దరఖాస్తు చేసుకుంటే పైనుంచి కింది దాక అన్ని టిక్కులు (సరైనవేనని) పెట్టి చివర్లో తిరస్కరించారు. కారణమేమిటా? అని ఆరా తీస్తే ఆ వ్యక్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని తిరస్కరించారు. దయచేసి వారి జీవితాలతో చెలగాటమాడవద్దు. అన్యాయమైన 101 జీవోను రద్దు చేయండి’’ అని డిమాండ్ చేశారు.
ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఎంపికకు ఓసీలతో కమిటీయా?
Published Sun, Dec 21 2014 1:10 AM | Last Updated on Sat, Sep 15 2018 3:59 PM
Advertisement
Advertisement