SC Corporation
-
ఆ నిధులు ఇవ్వాలా.. వద్దా?
సాక్షి, హైదరాబాద్: దళితబంధు పెండింగ్ చెల్లింపులపై రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల ఆర్థిక సహకార సంస్థ తర్జనభర్జన పడుతోంది. దళితబంధు పథకం రెండో విడతలో భాగంగా ఎంపికైన పలువురు లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో ఆర్థిక సాయం చేయలేదు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో తీవ్ర జాప్యం జరగడం... తీరా అరకొర ‡గా అర్హులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చే నాటికి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ తొలగిపోయినా.. ఆ యా లబ్ధిదారులకు పూర్తి స్థాయి సాయం పంపిణీపై సందిగ్ధం నెలకొంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రావడం, గత ప్రభుత్వ ప్రాధాన్యత ల కంటే మెరుగైన విధంగా కొత్త పథకాల రూ పకల్పనకు సన్నద్ధమవుతుండడంతో ఈ పరిస్థి తి ఏర్పడింది. దీంతో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ వద్ద నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ వాటి ని అర్హులకు ఇవ్వాలా? వద్దా? అనే అయో మయం అధికారులను కలవరపెడుతోంది. అన్నీ పక్కన పెట్టినా గ్రేటర్‌కు మాత్రం మినహాయింపు తెలంగాణ దళితబంధు పథకం రెండో విడత కింద అప్పటి ప్రభుత్వం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి వెయ్యి చొప్పున యూనిట్లు మంజూరు చేసింది. ఈమేరకు క్షేత్రస్థాయి నుంచి శాసనసభ్యులు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌కు ప్రతి పాదనలను పంపారు. అప్పట్లో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో వా టన్నింటినీ పక్కన పెట్టారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మురుగు వ్యర్థాల సేకరణ(సిల్ట్ కార్టింగ్ వెహికల్స్) వాహనాలకు డిమాండ్ ఉండడంతో 2023–24 వార్షిక సంవత్సరంలో 162 యూనిట్లను మంజూరు చేసి యుద్ధప్రాతిపదికన లబ్దిదారులకు అందించారు. ఈ వాహనాలను జీహెచ్ఎంసీలో వినియోగించుకోనున్నారు. ఇందుకు సంబంధించి జలమండలి(హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ) ఒప్పందం కుదుర్చుకుంది. ఇంకా ఇవ్వాల్సింది 230 యూనిట్లకు మాత్రమే..: అదేవిధంగా హైదరాబాద్ పరిధిలో ఇతర కేటగిరీలకు సంబంధించి మరో 230 యూనిట్లకు మంజూరు తెలిపిన ప్రభు త్వం అర్హుల ఖాతాల్లో తొలివిడతలో భాగంగా రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు నిధిని జమ చేసింది. మిగతా నిధులను జమచేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఆ నిధులు ఎస్సీ కార్పొరేషన్ వద్దే ఉండిపోయాయి. ప్రస్తుతం కోడ్ పూర్తి కాగా... నిధులను మాత్రం అధికారులు లబ్దిదారుల ఖాతాకు విడుదల చేయడం లేదు. ఈమేరకు అనుమతి కోరుతూ ఎస్సీ కార్పొరేషన్ అధికా రులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ సమర్పించినట్లు తెలిసింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదు. మరోవైపు కొంత మేర ఆర్థిక సాయం పొందిన లబి్ధదారులు మిగతా సాయం కోసం ఎదురు చూస్తున్నారు. పూర్తిస్థాయిలో సాయం అందితే నిర్దేశించుకున్న యూనిట్లు తెరవాలని ఆశపడుతున్నారు. -
ఎస్సీ వర్గీకరణ అంశంలో కాంగ్రెస్ మొదటి ముద్దాయి: కిషన్ రెడ్డి
హైదరాబాద్: దశాబ్దాల నాటి సమస్యలపై ప్రధాని మోదీ దృష్టి సారించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఏ పార్టీ చిత్తశుద్దితో పనిచేయలేదని మండిపడ్డారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీయే మొదటి ముద్దాయి అని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు కేంద్రం కమిటీని ఏర్పాటు చేస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. పోరాటానికి బీజేపీ సంపూర్ణ మద్దతునిస్తుందని స్పష్టం చేశారు. ఈ సమస్యను ప్రధాని మోదీ అర్ధం చేసుకున్నారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ సమస్యను కాంగ్రెస్ కోల్డ్ స్టోరేజీలో పెట్టిందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణను చేపడతామని హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన సభలో ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణకు కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇదీ చదవండి: మరోసారి నోరు జారిన ఎస్పీ నేత.. ఏమన్నారంటే.. -
మోదీ మాస్టర్ మైండ్.. తెలంగాణలో బీజేపీ ప్లాన్ సక్సెస్!
తెలంగాణ శాసనసభ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగానే ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో మాదిగ సామాజికవర్గాన్ని ఉద్దేశించి విశ్వరూప సభలో చేసిన ప్రసంగం, ఆ వర్గం నేత మంద కృష్ణను పొగిడిన తీరు అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. కొన్ని రోజుల క్రితం ఎల్బీ స్టేడియంలో జరిగిన సభ కాస్త నిస్సారంగా జరిగితే , పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన సభ మాంచి జోష్‌గా జరిగింది. తొలి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నప్పటికీ, ఆయన చాలా డల్‌గా మాట్లాడటం, మోదీ సైతం మొక్కుబడిగా పవన్ పేరు ప్రస్తావించడం జరిగింది. అదే శనివారం జరిగిన భారీ సభలో మంద కృష్ణను ఉద్దేశించి ఆయన పలుమార్లు మాట్లాడిన విషయాలు, అన్నిటికి మించి తాను కూడా కృష్ణ నాయకత్వంలో పనిచేస్తానని, వర్గీకరణ పోరాటానికి అండగా ఉంటానని, సమస్య పరిష్కారానికి కమిటీని నియమిస్తామని చెప్పిన తీరు మాదిగ సామాజికవర్గాన్ని ఆనందంలో ముంచెత్తిందని చెప్పాలి. వినడానికి కొంచెం అతిగా ఉన్నా, ఆయన స్పీచ్‌తో సభికులంతా హర్షద్వానాలతో మోత మోగించారు. మోదీ, మంద కృష్ణ మద్య జరిగిన ఉద్వేగ భరిత సన్నివేశాలు కూడా అందరిని ఆకట్టుకున్నాయి. కృష్ణ ప్రధానిని కౌగించుకుని, కంట తడిపెట్టడం, దానికి ఆయన ఓదార్చడం తదితర సన్నివేశాలు ఉత్కంఠభరితంగా సాగాయి. అలాగే కృష్ణ కూడా తన ప్రసంగంలో మోదీని ఆకాశానికి ఎత్తుతూ ఉపన్యాసం చేశారు. మరో విశేషం ఏమిటంటే ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించకపోవడం. తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఇది ఒక కీలక ఘట్టమే అనిపిస్తుంది. ప్రత్యేకించి తెలంగాణలో మాదిగ వర్గం అత్యధికంగా ఉంటారు. మంద కృష్ణ మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్నారు. ఆయన ఆధ్వర్యంలో పలుమార్లు భారీ సభలు జరిగాయి. దాదాపు అన్ని పార్టీలు వర్గీకరణకు మద్దతు ఇచ్చినా కేంద్రంలో ఉషా మెహ్రా కమిటీ సిఫారస్ చేయకపోవడంతో అది ఆగిపోయింది. సుప్రీంకోర్టులో కూడా ఈ విషయం పెండింగ్‌లో ఉంది. మాల సామాజికవర్గం వర్గీకరణను తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో రాజకీయ పార్టీలు కూడా గందరగోళంలో పడ్డాయి. అయితే, బీజేపీ తొలి నుంచి ఈ డిమాండ్‌కు మద్దతు ఇస్తోంది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఇందుకోసం శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడమే కాకుండా, అధిష్టానంతో దీనిపై సంప్రదింపులు కూడా చేశారు. అయినా అది ఒక కొలిక్కి రాలేదు. విశేషం ఏమిటంటే మోదీ అధికారంలోకి వచ్చి కూడా తొమ్మిదిన్నరేళ్లు అయింది. బీజేపీ ఆధ్వర్యంలోని ఆయన ప్రభుత్వం కూడా మరి ఎందుకు ఇన్నాళ్లు పరిష్కరించలేదన్న ప్రశ్న వస్తుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే మాదిగ వర్గాన్ని ఆకట్టుకోవడానికి వ్యూహాత్మకంగా ఈ ప్రకటన చేసినట్లు అర్ధం అవుతుంది. ఈ సందర్భంగా మోదీ చేసిన ప్రసంగంలో దళిత ప్రముఖ నేతలు అంబేద్కర్, జగ్జీవన్ రామ్ వంటి వారికి కాంగ్రెస్ నుంచి అవమానాలు ఎదురయ్యాయని పేర్కొన్నారు. అంతేకాక రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్‌ను ఎంపిక చేసినా, తదుపరి గిరిజన నేత మర్మును ఎంపిక చేసినా, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని ఆయన విమర్శించారు. రామ్ విలాస్ పాశ్వాన్ , బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంజీలకు బీహార్ సీఎం నితీష్ కుమార్ నుంచి అవమానాలు వచ్చాయని ఆయన అన్నారు. ప్రఖ్యాత దళిత కవి గుర్రం జాషువా రాసిన గబ్బిలం కవిత్వంలోని కాశీ అంశాన్ని ప్రస్తావించి, తాను అదే కాశీ నుంచి ఎంపీ అయ్యాయని ఆయన సెంటిమెంట్ ప్రయోగించారు. గుర్రం జాషువా ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందినవారు. తెలంగాణలో మాదిగ వర్గానికి చెందిన మాజీ మంత్రి టి.ఎన్. సదాలక్ష్మి, టివి నారాయణల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఇదంతా తెలంగాణలోని దళితులు, ముఖ్యంగా మాదిగలను తిప్పుకోవడానికి మోదీ చేసిన ప్రయత్నమే అన్న సంగతి తెలుసుకోవడం కష్టం కాదు. ఈ విషయంలో కొంతమేర మోదీ సఫలీకృతం అయినట్లు అనుకోవచ్చు. ఎందుకంటే గత సభ కంటే భారీ ఎత్తున జనం రావడం, తమ డిమాండ్ కు అనుకూలంగా ప్రధాని ఉండటం, తమ నేత మంద కృష్ణను పదేపదే ఆయన ప్రస్తావించడంతో కేరింతలు కొట్టిన తీరు సహజంగానే బీజేపీకి కొంత ఊపు ఇస్తుంది. అదే సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను విమర్శించడం ఆయన మానలేదు. బీఆర్ఎస్ గతంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామన్న హామీని విస్మరించిందని, మూడు ఎకరాల భూమి చొప్పున ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, దళిత బంధులో వివక్ష చూపుతున్నారని మోదీ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ మాదిరే కాంగ్రెస్ కూడా దళితులకు అన్యాయం చేసే పార్టీగా ఆయన అభివర్ణించారు. ఈసారి ఇరిగేషన్ స్కామ్ అంటూ తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణ చేశారు. లిక్కర్ స్కామ్ గురించి కూడా ప్రస్తావించి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ సహకరిస్తోందని, ఆప్ స్కామ్‌లో బీఆర్ఎస్ భాగస్వామి అయిందని ఆయన అంటూ, తెలంగాణ ఎన్నికలలో బీఆర్ఎస్ , కాంగ్రెస్‌లు డ్రామా ఆడుతున్నాయని ఆయన అన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం దళిత వర్గాలకు, రైతులకు చేపట్టిన వివిధ స్కీముల గురించి కూడా మోదీ వివరించారు. ఈ సంగతులు చెబుతున్నప్పుడు పెద్దగా స్పందన లేదు కానీ, వర్గీకరణ అంశాన్ని మోదీ ప్రస్తావించినప్పుడల్లా పెద్ద ఎత్తున హర్షద్వానాలు వచ్చాయి. మోదీ మొత్తం ఆ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే యత్నం చేశారు. వర్గీకరణ అంశం న్యాయ వ్యవస్థ పరిధిలో ఉందని చెబుతూనే, కమిటీ ద్వారా పరిష్కారం చేసే యత్నం జరుగుతుందని, మాదిగల ఉద్యమంలో తాను కూడా ఉంటానని చెప్పడం విశేషం. ఇక, సమస్యను పరిష్కరించవలసిన ప్రధాని తాను కూడా పోరాడతానని అనడం వినడానికి కొంత ఆశ్చర్యంగానే ఉన్నా, ఎన్నికల నేపథ్యంలో వారిని ఆకట్టుకోవడానికి ఈ డైలాగు వాడినట్లు అనిపిస్తుంది. ఈ నెలాఖరులో ఎన్నికల ప్రచారం ముగియడానికి ముందు మూడురోజులు మోదీ సభలు తెలంగాణలో పెట్టబోతున్నారు. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందనుకున్న సమయంలో మోదీ వచ్చి దానిని పైకి లేపడానికి చేస్తున్న కృషి ఎంతవరకు సఫలం అవుతుందన్నది చూడాలి. మాదిగ వర్గం ఓట్లను ఆకర్షించడం వరకు కొంత సఫలం అయినట్లే లెక్క. కాకపోతే పూర్తి స్థాయి విజయానికి ఇది సరిపోతుందా అన్నది డౌటు!. :కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నరోత్తమ్ నియామకం
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా జహీరాబాద్‌కు చెందిన ఏర్పుల నరోత్తమ్ నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్వర్వులను ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, ఏర్పుల నరోత్తమ్‌కు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తనకు చైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు ఏర్పుల నరోత్తమ్ ధన్యవాదాలు తెలిపారు. నరోత్తమ్ రాజకీయ ప్రస్థానమిదీ.. ఏర్పుల నరోత్తమ్ జహీరాబాద్‌లోని పస్తాపూర్‌లో 1965, ఏప్రిల్ 19వ తేదీన చంద్రమ్మ, నర్సయ్య దంపతులకు మూడో సంతానంగా జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1987 సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీటి పారుదల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు కాలువల డిజైన్లలో ఆయన కీలకపాత్ర పోషించారు. అనంతరం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ప్రమోషన్ పొందారు. సింగూరు ప్రాజెక్టు గేట్ల ఇంచార్జిగా వ్యవహరించారు. వికారాబాద్‌లో మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇంచార్జిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో 2008లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల బాట పట్టారు. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. మార్జినల్ ఓట్లతో నరోత్తమ్ ఓటమి చవిచూశారు. 2019లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023, జులై 6వ తేదీన బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏర్పుల నరోత్తమ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఎస్సీ కార్పొరేషన్ పథకాల కోసం దరఖాస్తు చేసుకోండి: మంత్రి మేరుగ
సాక్షి, అమరావతి: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలు చేయనున్న అమృత్ జలధార, యంగ్ ఎంటర్ ప్రెన్యూర్ పథకాలలో లబ్ది కోసం అర్హులైన ఎస్సీలు దరఖాస్తులు చేసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున ఒక ప్రకటనలో కోరారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ జలధార పథకం కింద ఎస్సీ రైతుల భూములకు నీటి వసతిని కల్పించేందుకు బ్యాంకులు, ఇతర సంస్థల ద్వారా ఇప్పటికే రుణాలు మంజూరైన రైతులకు బోరు బావులు, స్పింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకోవడానికి రూ.50 వేలు సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. రైతులు రెండున్నర ఎకరాల భూమి, రూ.3 లక్షలకు లోపు వార్షిక ఆదాయం కలిగిన రైతులు అమృత్ జలధార పథకంలో లబ్ది పొందేందుకు అర్హులని తెలిపారు. అలాగే యంగ్ ఎంటర్ ప్రెన్యూర్ పథకంలో భాగంగా ట్రాక్టర్లు, ట్రాలీలు, కమర్షియల్ వాహనాలు, వేర్ హౌసెస్ తదితర స్వయం ఉపాధి పథకాలకు ఇప్పటికే బ్యాంకులు, ఇతర సంస్థల ద్వారా రుణాలు మంజూరైన ఎస్సీ యువతకు రూ.60 వేలు సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. అమృత్ జలధార పథకం కోసమైతే పట్టాదారు పాసు పుస్తకాలు, రవాణాకు సంబంధించిన యంగ్ ఎంటర్ ప్రెన్యూర్ పథకం కోసమైతే వ్యాలీడ్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటుగా ఆదాయ, కుల, విద్యా ధృవీకరణ పత్రాలు, రేషన్ కార్డ్, ఆధార్, బ్యాంక్ పాసుపుస్తకాల నకళ్లతో దరఖాస్తులు చేసుకోవాలని నాగార్జున వివరించారు. అర్హులైన వారు తమ దరఖాస్తులను ఆయా జిల్లాలకు చెందిన ఎస్సీ కార్పొరేషన్ ఇ.డి.లకు తమ దరఖాస్తులను సమర్పించాలని కోరారు. ఈ పథకాల మంజూరు లో పరిమితి లేదని అర్హులైన వారందరికీ వీటిని మంజూరు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. చదవండి: ‘ఎన్టీఆర్ హయాంలో రామోజీతో ఇలాంటి ప్రచారమే!’.. ప్రసన్నకుమార్‌రెడ్డి ఫైర్ -
Telangana: దళితబంధు @ 600కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అమలు వేగం పుంజుకుంది. నిధుల విడుదలలో జాప్యంతో గత కొంత కాలంగా నెమ్మదించిన ఈ పథకానికి ప్రభుత్వం తాజాగా రూ.600 కోట్లు విడుదల చేసింది. దీంతో చర్యలకు ఉపక్రమించిన ఎస్సీ కార్పొరేషన్.. ఈ పథకం కింద ఇప్పటివరకు ఎంపికైన లబ్ధిదారులందరికీ ఆర్థిక సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో ఇప్పటివరకు 38,476 మంది లబ్ధిదారులు ఈ పథకం కింద ఎంపికయ్యారు. ప్రస్తుతం ఎంపికైన లబ్ధిదారుల ఖాతాల్లో రూ.3,847.6 కోట్లు ప్రభుత్వం జమ చేసింది. హుజూరాబాద్‌తో షురూ దళితబంధు పథకం ఇప్పటివరకు నాలుగు కేటగిరీల్లో అమలైంది. తొలుత కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళిత కుటుంబాలకు పూర్తిస్థాయిలో పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ మేరకు లబ్ధిదారుల ఎంపిక మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆ నియోజకవర్గంలో మొత్తం 18,211 కుటుంబాలను గుర్తించిన యంత్రాంగం.. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున అర్హులందరి ఖాతాల్లో నిధులను జమ చేసింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామంలో ఉన్న 75 దళిత కుటుంబాలను ఎంపిక చేసి వారి బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేశారు. ఆ తర్వాత చింతకాని, తిరుమలగిరి, చారగొండ, నిజాంసాగర్ మండలాలను ఎంపిక చేసిన ప్రభుత్వం ఆయా మండలాల్లోని దళిత కుటుంబాలన్నింటికీ సాయం అందించాలని నిర్ణయించి ఆ మేరకు అర్హులను ఎంపిక చేశారు. అనంతరం దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే క్రమంలో నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి వంద యూనిట్లు మంజూరు చేశారు. ఆ మేరకు స్థానిక ఎమ్మెల్యేలు లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాను ఎస్సీ కార్పొరేషన్‌కు సమర్పించగా.. ప్రస్తుతం అందరి ఖాతాల్లో అధికారులు నిధులను జమ చేశారు. యూనిట్ల ఏర్పాటుకు ప్రత్యేక కార్యాచరణ ఇప్పటివరకు పథకం కింద ఎంపికైన లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేసిన ప్రభుత్వం.. ఇక యూనిట్ల ప్రారంభంపై దృష్టి పెట్టాలని ఎస్సీ కార్పొరేషన్‌ను ఆదేశించింది. జిల్లాల వారీగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా లబ్ధిదారులతో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించి.. వారికి ఆసక్తి ఉన్న యూనిట్ల ఏర్పాటు, వాటి నిర్వహణపై ఎస్సీ కార్పొరేషన్ శిక్షణ ఇవ్వనుంది. యూనిట్లు గ్రౌండింగ్ అయ్యే విధంగా నియోజకవర్గ స్థాయిలో అధికారులకు లక్ష్యాలను నిర్దేశించి, నూరుశాతం పురోగతి వచ్చేలా చర్యలు చేపడుతోంది. కొత్తగా నియోజకవర్గానికి 500 యూనిట్లు.. 2022–23 వార్షిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 1,500 యూనిట్ల చొప్పున ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. అయితే తొలి విడత కింద ప్రతి సెగ్మెంట్‌కు 500 చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఎమ్మెల్యేలకు సూచించింది. -
‘డీలర్ డీల్’ పై ఏపీ సర్కార్ సీరియస్..
సాక్షి, అమరావతి: ఎస్సీ యువత ఉపాధి నిమిత్తం వాహనాలు ఇవ్వకపోగా, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని డీలర్లకు దారి మళ్లించిన బాగోతాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ‘‘షికారు వెనుక డీలర్ల డీల్–ఎస్సీ కార్పొరేషన్ నిధులు పరాయి పాలు’’ శీర్షికన సాక్షి కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. డీలర్ల డీల్ విషయమై చట్టపరమైన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఒప్పందాలు ఏం జరిగాయి? డీలర్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయి? తదితర కోణాల్లో ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఎండీ చినరాముడు, జనరల్ మేనేజర్ సునీల్ రాజ్‌కుమార్‌ల నుంచి వాటికి సంబంధించిన రికార్డులు, ఆధారాలను ఉన్నతస్థాయి అధికారులు గురువారం పరిశీలించారు. చదవండి: టీడీపీ సర్కార్ నిర్వాకాలు: షి‘కారు’ వెనుక డీలర్లతో డీల్! విజిలెన్స్ దర్యాప్తులో అనేక నిజాలు గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ యువత పేరుతో టీడీపీ నేతల బినామీలకు, వారు సిఫారసులు చేసిన వారికి కేటాయించి అసలు లక్ష్యాన్ని దారి మళ్లించిన వ్యవహారంపై ఇప్పటికే విజిలెన్స్ దర్యాప్తులో అనేక నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీనికితోడు కోట్లాది రూపాయలు అడ్వాన్సులుగా తీసుకుని ఒప్పందం ప్రకారం వాహనాలు ఇవ్వకుండా, డబ్బులు తిరిగి చెల్లించకుండా ముఖం చాటేసిన డీలర్ల డీల్ వ్యవహారం తోడైంది. నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్ఎఫ్డీసీ), నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్కెఎఫ్డీసీ) పథకాల కింద 2017–18 నుంచి 2018–19 వరకు సబ్సిడీపై వాహనాల కోసం గత ప్రభుత్వం రూ.365.67 కోట్లను డీలర్లకు అడ్వాన్సులుగా చెల్లించింది. ఆ మొత్తంలో వాహనాలు ఇవ్వకుండా సుమారు రూ.67.68 కోట్లు డీలర్ల వద్దే ఉండిపోయాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. అడ్వాన్స్‌ను చెల్లించని డీలర్లు ఇక సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున సంబంధిత డీలర్లతో ఒకటి, రెండుసార్లు సమావేశం నిర్వహించి వాహనాలు ఇవ్వలేకపోతే, అడ్వాన్స్ డబ్బులైనా ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని కోరినా ఫలితం లేకపోయింది. ఇన్నోవాలు, ఇటియోస్లు ఇచ్చేందుకు అడ్వాన్సులు తీసుకున్న రాధా మాధవ్ ఆటోమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ (విజయవాడ) కంపెనీ రూ.23.05 కోట్లకు పైగా, కినెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్(పూణే), ఈగల్ అగ్రీ ఎక్విప్మెంట్ (కావలి) పేరుతో అడ్వాన్సులు తీసుకున్న ప్రకాశం జిల్లాకు చెందిన అనిల్ రూ.41.67 కోట్లకు పైగా, ఎంట్రాన్ ఆటోమొబైల్స్ ప్రైవేటు లిమిటెడ్ (పశ్చిమ గోదావరి జిల్లా) పేరుతో గమ్మిడి మోహిని రూ.2.93 కోట్ల మొత్తాన్ని వసూలుచేసేలా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టింది. వాహనాలు ఇవ్వకుండా ప్రజాధనం లూటీచేసిన వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని తదుపరి చర్యలకు సమాయత్తమైంది. ఈ మొత్తం వ్యవహారంపై లోతైన పరిశీలన చేసి చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు రంగం సిద్ధంచేస్తోంది. -
టీడీపీ సర్కార్ నిర్వాకాలు: షి‘కారు’ వెనుక డీలర్లతో డీల్!
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో ఎస్సీ యువతకు ఉపాధి పేరుతో కేటాయించిన వాహనాలు, యంత్రాలను పక్కదారి పట్టించిన వ్యవహారంలో తవ్వేకొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. నిరుద్యోగ ఎస్సీలకు దక్కాల్సిన కార్లను టీడీపీ ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ నేతలు కాజేసినట్లు ఇటీవల విజిలెన్స్ నిగ్గుతేల్చిన సంగతి తెలిసిందే. టీడీపీ పెద్దల సిఫారసు ఉన్నవారికే వాహనాలు ఇచ్చేలా ముందస్తు ఒప్పందాలు జరిగాయి. ఎస్సీ కార్పొరేషన్ అధికారులపై ఒత్తిడి తెచ్చి తమ వారికి లబ్ధి చేకూర్చారు. ఇదిలా ఉండగా వాహనాలు సరఫరా చేసే డీలర్లతో టీడీపీ పెద్దలు కుదుర్చుకున్న డీల్ తాజాగా బహిర్గతమైంది. నిబంధనలకు విరుద్ధంగా ఇండెంట్ పెట్టిన వాహనాలన్నింటికీ డీలర్లకు ముందుగానే అడ్వాన్సులు చెల్లించారు. అయితే డీలర్లు ఆ మేరకు వాహనాలను సరఫరా చేయలేదు. ఏళ్ల తరబడి వాహనాలు ఇవ్వకుండా, ప్రభుత్వానికి నగదు తిరిగి చెల్లించకుండా డీలర్ల వద్దే డబ్బులు ఉండటాన్ని గమనిస్తే బినామీల బాగోతం, అక్రమ వ్యవహారాలు తేటతెల్లమవుతున్నాయి. సబ్సిడీ రుణాలంటూ గొప్పలు.. ఎస్సీ యువతకు ఉపాధి కోసం వాహనాలు / యంత్రాలు సమకూర్చి సబ్సిడీ రుణాలు ఇచ్చినట్లు గత సర్కారు గొప్పలు చెప్పుకుంది. నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎస్ఎఫ్డీసీ), నేషనల్ సఫాయి కర్మచారీ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎస్కేఎఫ్డీసీ) ద్వారా వివిధ పథకాల కింద 2017–18 నుంచి 2018–19 వరకు సబ్సిడీపై వాహనాల కోసం రూ.వందల కోట్ల నిధులు కేటాయించారు. టీడీపీ ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ నేతలకే లబ్ధి చేకూర్చేలా గత సర్కారు పెద్దలు డీలర్లతో గుట్టు చాటుగా వ్యవహారాన్ని నడిపించారు. ఐదు పథకాలు.. పథకం ప్రకారం! వాహనాలు అందకుండానే గత సర్కారు డీలర్లకు ముందే చెల్లింపులు జరపడం అక్రమాలను బలపరుస్తోంది. ఎన్ఎస్ఎఫ్డీసీ, ఎన్ఎస్కేఎఫ్డీసీ ద్వారా ఐదు పథకాల కింద లబ్ధిదారులకు ఇన్నోవాలు, ఇతియోస్, ట్రాక్టర్లు, ఈ ఆటోలు, మెకనైజ్డ్ డ్రెయిన్ క్లీనింగ్ మెషిన్లు(ఎండీసీఎం) ఇవ్వాలని ప్రతిపాదించారు. ఇందుకోసం టీడీపీ సర్కారు డీలర్లకు రూ.365,67,29,910 అడ్వాన్సులుగా చెల్లించింది. ఆ మొత్తంలో రూ.298,00,01,285 విలువైన యూనిట్లను డీలర్లు సరఫరా చేశారు. మరో 5,467 యూనిట్లు (వాహనాలు, యంత్రాలు) ఇవ్వకపోవడంతో డీలర్ల వద్దే రూ.67,67,28,625 మేర డబ్బులు ఉండిపోవడం గమనార్హం. ఇందులో రూ.23.05 కోట్లకుపైగా ఇవ్వాల్సిన రాధా మాధవ్ ఆటోమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ (విజయవాడ) ఇటీవల బోర్డు తిప్పేసింది. మరో మూడు కంపెనీల పేరుతో తప్పుడు చిరునామా ఇచ్చారు. వాహనాలు ఇవ్వకుండా ముఖం చాటేసిన సదరు డీలర్ ఏకంగా రూ.41.67 కోట్లకు పైగా ఎగ్గొట్టేందుకు దారులు వెతుకుతున్నాడు. మరో కంపెనీ పేరుతో అడ్వాన్సులు తీసుకున్న ఓ మహిళ నుంచి రూ.2.93 కోట్లు వసూలు చేసేందుకు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు ఎన్ని నోటీసులు పంపినా స్పందన లేదు. డీలర్ల నుంచి రాబట్టేందుకు సన్నద్ధం టీడీపీ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు పొందిన డీలర్లు ఆ మేరకు వాహనాలు ఇవ్వకపోవడం, అడ్వాన్సులు తిరిగి వెనక్కు చెల్లించకపోవటాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఎస్సీ కార్పొరేషన్‌కు చెందిన దాదాపు రూ.67.67 కోట్లు నాలుగేళ్లుగా డీలర్ల వద్దే ఉండటంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. కొద్ది రోజుల క్రితం ఆయా డీలర్లతో సమావేశం నిర్వహించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ఒప్పందం ప్రకారం వాహనాలు ఇవ్వాలని లేదంటే డబ్బులైనా తిరిగి చెల్లించాలని స్పష్టం చేశారు. అయితే అప్పటి ధరల ప్రకారం వాహనాలు ఇవ్వలేమని, పెరిగిన ధరల ప్రకారం తీసుకునేందుకు అంగీకరిస్తే పరిశీలిస్తామని రాధా మాధవ్ ఆటోమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్(విజయవాడ) ప్రతినిధులు పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు మూడు కంపెనీల పేరుతో ప్రకాశం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి అడ్వాన్సులు తీసుకుని చేతులెత్తేయడంతో అతడితో తమకు సంబంధం లేదని ఆయా కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మహిళ కూడా తప్పించుకుని తిరుగుతోంది. దీంతో మరోసారి ఆ డీలర్లను పిలిచి మాట్లాడాలని, అప్పటికీ దారికి రాకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. -
గుడ్‌న్యూస్: ఆ నాలుగు జిల్లాలకు దళితబంధు నిధుల విడుదల
సాక్షి, హైదరాబాద్: దళితబంధు పథకం అమలు కోసం ఎస్సీ కార్పొరేషన్ నిధులు విడుదల చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో ఈ పథకం అమలుకు మొత్తం రూ.250 కోట్లను ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాలో మంగళవారం జమ చేసింది. సూర్యాపేట జిల్లా తుం గతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరికి రూ.50 కోట్లు, ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకానికి రూ.100 కోట్లు, నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలోని చారగొండకు రూ.50 కోట్లు, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గానికి చెందిన నిజాంసాగర్‌కు రూ.50 కోట్ల చొప్పున కలెక్టర్ల ఖాతాలో జమ అయినట్లు సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. (చదవండి: తెలంగాణలో కొత్తగా మరో 4 ఒమిక్రాన్ కేసులు) -
‘దళితబంధు’ను అడ్డుకుంటే ఆత్మహత్య చేసుకుంటా
అమీర్‌పేట(హైదరాబాద్): దళితులపాలిట వరంగా మారనున్న దళితబంధు పథకాన్ని విపక్షాలు అడ్డుకుంటే యాదగిరిగుట్టలో ఆత్మహత్య చేసుకుంటానని మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు హెచ్చరించారు. దళితబంధుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపిస్తూ ఆదివారం హైదరాబాద్ లోని తన నివాసంలో ఒకరోజు నిరసనదీక్ష చేపట్టారు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి మోత్కుపల్లికి పూలమాల వేసి దీక్ష ప్రారంభించారు. నర్సింహులు మాట్లాడుతూ అగ్రవర్ణాలకు దీటుగా దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే దృఢసంకల్పంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సాహసోపేత నిర్ణయం తీసుకుని దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని కొనియాడారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను పెట్టి అమలు చేస్తున్నారని, ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారనే అపార నమ్మకం తనకుందని తెలిపారు. రేవంత్‌రెడ్డివి బ్లాక్మెయిల్ రాజకీయాలు ఓటుకు కోట్లు కేసులో జైలుకు వెళ్లి వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. ‘రేవంత్‌రెడ్డిది ఐరన్ లెగ్, టీటీడీపీని పత్తాలేకుండా చేయించి కాంగ్రెస్ పార్టీలో దూకిన వ్యక్తికి టీపీసీసీ కట్టబెట్టడం సిగ్గుచేట’న్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రకు అర్థం లేదని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను కప్పిపుచ్చుకోవటానికే యాత్రను చేపట్టారని విమర్శించారు. దళితుల సంక్షేమం కోసం పాటుపడుతున్న కేసీఆర్‌కు దళితులందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. -
దళితుల భూములపై బీజేపీ నేత కన్ను..
సాగులో ఉన్న దళితులకు భూ హక్కు పత్రాల మంజూరులో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. ఇదే అదనుగా తీసుకుని బీజేపీ నేత ఆ భూములపై కన్నేశాడు. దళితులకు ఆ భూములు దక్కకుండా పన్నాగం చేస్తున్నాడు. భూములు ఆక్రమణకు గురయ్యాయంటూ పూజారి చేత పిటిషన్ వేయించి భూమి హక్కు పత్రాలు రాకుండా అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నాడు. సాక్షి,కదిరి: తలుపుల మండలం వేపమానిపేట పంచాయతీ పరిధిలోని కొత్తపూలవాండ్లపల్లి, గంజివారిపల్లి గ్రామాలకు చెందిన 45 మంది దళితులు కొన్నేళ్లుగా అక్కడి ఓబులేశ్వర స్వామి మాన్యం భూములు సాగు చేసుకుంటున్నారు. సాగు చేసుకుంటున్న దళితులకే భూములు దక్కాలని గతంలో కదిరి ప్రాంతానికి చెందిన కొందరు వామపక్ష పార్టీల నాయకులు అప్పట్లో డిమాండ్ చేశారు. ఈ మేరకు సాగుదారులు కూడా అధికారులకు అర్జీల రూపంలో విన్నవించుకున్నారు. దేవదాయ భూమి కావడంతో అప్పట్లో ఉన్న జిల్లా ఉన్నతాధికారులు ఓ నిర్ణయానికి వచ్చి ఎకరం రూ.15 వేలు చొప్పున సాగుదారులకు విక్రయించాలని నిర్ణయించారు. గతంలోనే 80 శాతం సొమ్ము చెల్లింపు.. ఓబులేశ్వర స్వామి మాన్యం భూములు సర్వే నంబర్ 901లోని మొత్తం 88.45 ఎకరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అందులోని 22.45 ఎకరాల భూమిని ఆ ఆలయ పూజారులకు ధూప, దీప నైవేద్యాల కోసం ప్రభుత్వం అప్పగించింది. మిగిలిన 66 ఎకరాల భూమిలో ఒక్క సెంటు భూమి కూడా లేని ఐదుగురు దళిత మహిళలకు 1.85 ఎకరాల చొప్పున, ఎకరం లోపు భూమి ఉన్న 20 మంది దళిత రైతులకు 1.80 ఎకరాలు చొప్పున, ఎకరం పైన–రెండెకరాల లోపు ఉన్న మరో 20 మంది దళితులకు ఎకరం చొప్పున లాటరీ పద్ధతిలో మొత్తం కేటాయించారు. ఇందుకు గాను 1999 ఏప్రిల్ 19న దళితుల తరఫున ఎస్సీ కార్పొరేషన్ 80 శాతం అంటే రూ7.92 లక్షలను దేవదాయ శాఖకు డీడీ రూపంలో చెల్లించింది. మిగిలిన 20 శాతం అంటే రూ1.98 లక్షలు ఆ దళితుల పేరు మీద హక్కు పత్రాలు ఇచ్చిన వెంటనే చెల్లిస్తామని అప్పట్లో ఎస్సీ కార్పొరేషన్ స్పష్టం చేసింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ భూములను దళితులే సాగు చేసుకుంటున్నారు. కానీ వాటిని దళితుల పేరు మీద మార్చడంలో అధికారులు విఫలమయ్యారు. కోర్టును సైతం తప్పుదోవ పట్టించే యత్నం.. బీజేపీకి చెందిన ఓ నాయకుడు ఓబులేశ్వరస్వామి ఆలయ పూజారి ద్వారా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించారు. దేవాలయ భూములను కొందరు దళితులు కబ్జా చేశారని, వాటిని కాపాడాలని కోర్టును సైతం తప్పుదోవ పట్టించే విధంగా పిటిషన్లో పేర్కొన్నట్లు సాగుదారులు ఆరోపిస్తున్నారు. అందుకే తాము కూడా హైకోర్టును ఆశ్రయించి కోర్టుకు వాస్తవం తెలియజేసే విధంగా మరో పిటీషన్ దాఖలు చేశామని తెలిపారు. కొందరు అధికారులు సైతం తమను మోసం చేసేందుకు పూజారులతోనూ, బీజేపీ నాయకుడితోనూ కుమ్మక్కయారని ఆరోపించారు. దళితులకు న్యాయం చేస్తాం ఓబులేశ్వర స్వామి మాన్యం భూములు దళితులు సాగు చేసుకుంటున్న మాట వాస్తవం. వారికి భూ హక్కు పత్రాలు అందేలా చూ స్తాను. గత ప్రభుత్వం వారికి అన్యాయం చేసింది. వారికి న్యాయబద్ధంగా రావాల్సిన పంట నష్టపరిహారం కూడా అందేలా చూస్తాను. – కదిరి ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డి చదవండి: Tokyo Paralympics:టేబుల్ టెన్నిస్ ఫైనల్స్‌కు భవీనాబెన్ -
డప్పుకొట్టి నిరసన...
శంకరపట్నం: నాలుగేళ్లుగా తిరుగుతున్నా ఎస్సీ కార్పొరేషన్ రుణం మంజూరు చేయడం లేదని కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల పరిషత్ కార్యాలయం ముందు సోమవారం కన్నాపూర్‌కు చెందిన అంధుడు దేవునూరి వీరయ్య డప్పుకొట్టి నిరసన తెలిపాడు. 2017 డిసెంబర్ 27న వికలాంగుల కోటా కింద రూ.2 లక్షలకు బ్యాంక్ కాన్సెంట్ లెటర్ ఇచ్చింది. 2017 డిసెంబర్ నుంచి శంకరపట్నం మండల పరిషత్ కార్యాలయం, కరీంనగర్ ఏడీ కార్పొరేషన్ రుణ మంజూరు పత్రం అందించడం లేదు. లెటర్ ఇవ్వాలని ఏడీని వేడుకుంటే కార్యాలయం నుంచి సిబ్బందితో బయటకు పంపించారని వీరయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు గంటసేపు కార్యాలయం ముందు మండుటెండలో నిల్చుని డప్పుకొట్టడంతో సమాచారం అందుకున్న ఎంపీవో సురేందర్ వీరయ్యతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలో మంజూరు కోసం ఇచ్చిన పత్రం మండల పరిషత్‌లో ఉండదని, ఆన్లైన్లో నమోదు చేస్తేనే రుణ మంజూరు చేసే అధికారం ఉంటుందని సర్దిచెప్పారు. -
దళిత బంధు: నెలలో ప్రతిఫలం ఉండే వాటికే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న దళిత బంధు పథకం కింద ఎలాంటి యూనిట్లు ప్రారంభిస్తే సత్ఫలితాలు వస్తాయనే అంశంపై ఎస్సీ కార్పొరేషన్ కసరత్తు చేస్తోంది. వచ్చే నెల రెండో వారంలో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో ఆలోగా యూనిట్లను ఖరారు కోసం చర్యలు వేగవంతం చేసింది. ఎలాంటి యూనిట్ ప్రారంభించినా నెల రోజుల నుంచే రాబడి వచ్చే వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో దాదాపు 47 రకాల యూనిట్లతో ప్రాథమిక జాబితాను రూపొందించింది. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా... మరిన్ని మార్పులు చేయాలని సూచించడంతో ఒకట్రెండు రోజుల్లో తుది జాబితాను ప్రభుత్వానికి సమర్పించనుంది. సత్వర ఆదాయం వచ్చే వాటికి ప్రాధాన్యత... దళిత బంధు కింద ఒక్కో లబ్ధిదారుకు రూ. 10 లక్షల ఆర్థిక సాయాన్ని నేరుగా ఆ వ్యక్తి బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. దీంతో లబ్ధిదారులు ప్రారంభించే యూనిట్లకు సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టును సమర్పించాల్సి ఉంటుంది. యూనిట్ విలువ రూ. 10 లక్షలకు సరిపడా ఉండాలి. అయితే క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నప్పటికీ ప్రాధాన్యతా రంగాలు, ప్రజలకు ఎక్కువ ఉపయోగపడే యూనిట్లను ఉదహరిస్తూ ఎస్సీ కార్పొరేషన్ ఒక జాబితాను తయారు చేసింది. ఇందులో 47 రకాల యూనిట్లు ఉన్నాయి. వ్యవసాయ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, జనరల్ స్టోర్స్, హార్డ్‌వేర్ షాప్స్, వైద్యం, గ్రోసరీస్, భవన నిర్మాణం, ప్లాస్టిక్ యూనిట్లు, స్టీల్, సిమెంట్ స్టోర్స్, ఆహారోత్పత్తి యూనిట్లు, హోటల్, రవాణా రంగాలకు చెందిన యూనిట్లు ఇందులో ఉన్నాయి. సాధారణ యూనిట్లకు భిన్నంగా ఈ యూనిట్లను పూర్తి సౌకర్యాలతో నెలకొల్పేలా ఎస్సీ కార్పొరేషన్ పథకాలను రూపొందించింది. ఉదాహరణకు ఇటుక బట్టీ ఏర్పాటు చేస్తే అందుకు తగినట్లుగా రవాణా సౌకర్యం కింద ట్రాలీని కూడా ఈ యూనిట్‌తో జత చేశారు. మొత్తంగా ప్రభుత్వం సాయం చేసే రూ. 10 లక్షలతో యూనిట్‌ను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ తుది జాబితాకు ప్రభుత్వ ఆమోదం లభిస్తే ఆయా వివరాలను వెబ్సైట్లో నమోదు చేసి లబ్ధిదారులు యూనిట్లను ఎంపిక చేసుకొని ప్రాజెక్టు రిపోర్ట్ సమర్పించేలా దరఖాస్తు ప్రక్రియ సాగుతుంది. -
‘ఈటల ప్రధాన అనుచరుడి’కి సీఎం కేసీఆర్ కీలక పదవి
-
‘ఈటల ప్రధాన అనుచరుడి’కి సీఎం కేసీఆర్ కీలక పదవి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ (ఎస్సీ కార్పొరేషన్) చైర్మన్‌గా బండా శ్రీనివాస్‌ను సీఎం కేసీఆర్ నియమించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గానికి చెందిన బండా శ్రీనివాస్ విద్యార్థి నాయకుడిగా అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో పలు హోదాల్లో పనిచేసి ఆ పార్టీ విద్యార్థి విభాగం కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా కూడా పని చేశారు. హాకీ ప్లేయర్ అయిన శ్రీనివాస్ హుజూరాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షుడిగా, ప్రస్తుతం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. గతంలో హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరక్టర్‌గా, జిల్లా టెలికాం బోర్డు సభ్యుడిగా బండా శ్రీనివాస్ పనిచేశారు. హుజూరాబాద్ నుంచి ఎంపీటీసీ సభ్యుడిగా రెండుసార్లు ఎన్నికయ్యారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నాటి ఉద్యమ సారథి, సీఎం కేసీఆర్ ప్రారంభించిన టీఆర్ఎస్ పార్టీలో 2001లోనే చేరారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు స్వరాష్ట్ర ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ మండలాధ్యక్షుడిగా, జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పలు హోదాల్లో పనిచేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రతి పిలుపుకు స్పందించి పార్టీ కార్యక్రమాల్లో, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ప్రధాన అనుచరుడిగా శ్రీనివాస్ గుర్తింపు పొందారు. -
ఇదీ నిజామాబాద్‌లో అధి‘కార్ల’ దందా
జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌కు గతంలో అద్దె కారు ఉండేది. అయితే, గతంలో పని చేసిన ఓ అధికారిణి అద్దె కారును పక్కన పెట్టి.. తన సొంత వాహనాన్ని ‘అద్దె’కు వినియోగించుకున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి తెల్ల నెంబరు ప్లేటు గల వాహనాన్ని కొన్ని నెలల పాటు నడిపించి నెలనెలా అద్దె డబ్బులను పర్సులో వేసుకున్నారు. సాక్షి, ఇందూరు(నిజామాబాద్): జిల్లాలో కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. అద్దె వాహనాల పేరుతో వేల రూపాయలు వెనుకేసుకుంటున్నారు. సొంత వాహనాలనే వినియోగిస్తూ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు. చాలా ప్రభుత్వ శాఖల్లో పని చేసే అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఓనర్ కమ్ డ్రైవర్ పథకానికి అధికారులే తూట్లు పొడుస్తున్నారు. దీంతో నిరుద్యోగులకు ఉపాధి దొరక్కుండా పోతోంది. ప్రభుత్వ శాఖ ల్లో అధి‘కార్ల’ దందా కొనసాగుతున్నా అడిగే వారు లేరు. ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. సర్కారు కార్యాలయాల్లో సంబంధిత శాఖకు సొంత కార్లు లేకపోతే అధికారుల పర్యటనలకు అద్దెకు తీసుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అద్దె వాహనం తీసుకోవాలంటే చాలా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఓనర్ కమ్ డ్రైవర్ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిలో సీనియారిటీ కలిగిన వారికి అవకాశం కల్పించాలి. పసుపు రంగు (ట్యాక్సీ) నెంబరు ప్లేట్ కలిగి ఉండడంతో పాటు వాహనం పూర్తి కండిషన్‌తో ఉండాలి. అగ్రిమెంట్ సమయంలో ఆయా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. నెలకు 2,500 కిలో మీటర్లు తిరిగితే ఇంధనం (పెట్రోల్/డీజిల్), కారు అద్దె, డ్రైవర్ బత్తా అన్నీ కలిపి గతంలో రూ.24 వేలు ఇచ్చే వారు. అయితే, ప్రభుత్వం దీనిని రూ.33 వేలకు పెంచింది. దీంతో అధికారుల కన్ను ‘అద్దె’పై పడింది. తెల్ల నెంబరు ప్లేటు ఉన్న తమ సొంత వాహనాలను అద్దెకు పెట్టి ‘ఆన్ గోవ్ట్ డ్యూటీ’ అని రాయించుకుని మరీ యథేచ్ఛగా తిప్పుతున్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు కలిపి సుమారు 40 మంది అధికారులు తమ సొంత వాహనాలను వినియోగిస్తూ నెలకు రూ.13 లక్షల వరకూ ‘అద్దె’ వసూలు చేస్తున్నారు! తిరగకున్నా.. సొంత వాహనం లేదా బినామీ పేర్లతో బంధువుల వాహనాలను ప్రభుత్వ శాఖల్లో అద్దెకు వినియోగిస్తున్న అధికారులు.. ఇతర వాహనాల విషయంలో మాత్రం నిబంధనల పేరుతో కొర్రీలు పెడుతున్నారు. నిరుద్యోగులు తమ వాహనాన్ని అద్దెకు పెడితే నిబంధనల పేరుతో మెలికలు పెడుతూ సతాయిస్తున్నారు. బిల్లులు ఆలస్యంగా ఇస్తున్నారు. అయితే, వేతనానికి కారు అద్దె తోడవుతుందనే ఆశతో అధికారులు సొంత వాహనాలు, బంధువుల పేరిట కలిగినవి ఉపయోగిస్తున్నారు. నెలకు 2,500 కిలో మీటర్లు తిరగకున్నా, తిరిగినట్లు రీడింగ్ చూపి నెలనెలా అద్దెను కాజేస్తున్నారు. ⇔ పై చిత్రంలో కనిపిస్తున్న స్విఫ్ట్ కారు జిల్లా ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖలో అద్దెకు నడుస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అద్దె వాహనం జిల్లా/రాష్ట్ర పరిధిలో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. అలాగే, తెల్ల నెంబరు ప్లేటు కాకుండా పసుపు రంగు (ట్యాక్సీ) ప్లేటు ఉండాలి. కానీ ఈ నిబంధనలకు విరుద్ధంగా వాహనాన్ని అద్దెకు తీసుకున్నారు. ఢిల్లీలో రిజిస్ట్రేషన్ అయిన తెల్ల నెంబరు ప్లేటుతో ఏడు నెలలుగా ఆ శాఖ అధికారులు ఈ వాహనాన్ని వినియోగిస్తున్నారు. ఢిల్లీ నెంబరు ప్లేటు ఉండడంతో అద్దె బిల్లులు చేయడానికి వీలు కావడం లేదు. అయితే, పాత కారు పేరిట బిల్లులు కూడా లేపేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ‘కామారెడ్డి’లో కూడా.. అధికారులు తమ సొంత వాహనాలను వినియోగిస్తున్నారని తెలుసుకున్న కామారెడ్డి జిల్లా ఉన్నతాధికారులు నిబంధనలు కఠినతరం చేశారు. సొంత వాహనాలు ఎట్టి పరిస్థితుల్లో వినియోగించవద్దని గత కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఓనర్ కమ్ డ్రైవర్ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని, అందుకు ప్రభుత్వ శాఖల్లో ట్యాక్సీ ప్లేటు గల వాహనాలను వినియోగించాలని సూచించారు. కానీ చాలా మంది అధికారులు సొంత వాహనాలే వినియోగిస్తున్నారు. -
దళిత యువతకు మినీ డెయిరీలు!
సాక్షి, హైదరాబాద్: దళిత నిరుద్యోగ యువతకు మినీ డెయిరీల ద్వారా ఉపాధి కల్పించాలని ఎస్సీ కార్పొరేషన్ కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ మహానగరంలో పాల ఉత్పత్తులకు డిమాండ్ అధికంగా ఉండడం.. డిమాండ్‌కు తగిన విధంగా పాల దిగుబడి లేకపోవడంతో పాడిపరిశ్రమకు మంచి భవిష్యత్ ఉంటుందని ఎస్సీ కార్పొరేషన్ అంచనా వేస్తోంది. ఇందుకు సంబంధించి పశుసంవర్థక శాఖ అధికారులతో సమాలోచనలు చేసిన ఎస్సీ కార్పొరేషన్.. ఔత్సాహికులతో మినీ డెయిరీలు ఏర్పాటు చేయించాలని భావిస్తోంది. వాస్తవానికి గత ఏడాదే ఈ అంశంపై దృష్టిసారించిన ఎస్సీ కార్పొరేషన్, కరోనా నేపథ్యంలో ఆ ప్రయత్నాలను వాయిదా వే సింది. తాజాగా పరిస్థితులు సద్దుమణుగుతుండ డంతో మళ్లీ మినీ డెయిరీల ఏర్పాటుపై దృష్టి సారించింది. 2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రభుత్వం ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు పొందుపరిచే అవకాశం ఉందని చెబుతున్నారు. గరిష్టంగా రూ.4 లక్షలతో.. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న రెండు, మూడు జిల్లాల్లో ఈ ప్రాజెక్టును తొలుత ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని ఎస్సీ కార్పొరేషన్ యోచిస్తోంది. జిల్లాకు సగటున 100 యూనిట్లు మంజూరు చేయా లని భావిస్తోంది. ఒక్కో యూనిట్‌ను రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల మధ్య బ్యాంకు అనుసంధానంతో రుణం ఇచ్చి ఇందులో 60 శాతం వరకు రాయితీ ఇవ్వనుంది. ప్రతి డెయిరీ యూనిట్‌కు 3 గేదెలు పంపిణీ చేస్తారు. అదేవిధంగా గేదెలకు షెల్టర్ కోసం ప్రత్యేక షెడ్ ఏర్పాటు, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రాజెక్టు యూనిట్ కాస్ట్లో కొంత మొత్తాన్ని కేటాయిస్తారు. దీంతోపాటు ఆరునెలలకు సరిపడా పశుగ్రాసం కోసం అవసరమైన నిధులకు కూడా ప్రత్యేక మొత్తాన్ని నిర్దేశిస్తారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటున్న అధికారులు.. యూనిట్ విలువ కనీసం రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉండేలా అంచనాలు రూపొందిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నారు. త్వరలోనే సబ్సిడీ పాడిగేదెల పంపిణీ పాడిపరిశ్రమ రంగాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు లబ్ధిదారులకు త్వరలోనే సబ్సిడీపై పాడిగేదెలను అందించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలి పారు. గురువారం మంత్రి కార్యాలయంలో విజయ డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి అధ్యక్షతన బోర్డు సమావేశం జరిగింది. మంత్రి మాట్లాడుతూ సబ్సిడీ పాడిగేదెల కోసం 3,834 మంది లబ్ధిదారులు డీడీలు చెల్లించారని, గేదెల పంపిణీకి సంబం ధించి విజయ డెయిరీ సంస్థ నోడల్ ఏజెన్సీగా ఉం టుందని వెల్లడించారు. కాగా, గతంలో లబ్ధిదారులకు పంపిణీ చేసిన పాడిగేదెల్లో 2,691 గేదెలు చనిపోయాయని, వాటికి సంబంధించి పరిహారం కింద కొత్తగా పాడి గేదెలను కొనుగోలు చేసి వెంటనే పంపిణీ ప్రక్రియ చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇక నుంచి లీటర్ పాలకు ప్రభుత్వం రూ.3, ఆయా డెయిరీ సంస్థలు రూ.1 చొప్పున కలిపి రైతులకు ప్రోత్సాహకం కింద చెల్లిస్తామ న్నారు. ఇందులో భాగంగా కరీంనగర్, మదర్ డెయిరీ, ముల్కనూర్ డెయిరీలకు పాలుపోసే రైతులకు చెల్లించాల్సిన ప్రోత్సాహకం బకాయిలలో రూ.8 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. విజయ ఐస్క్రీంల విక్రయాలకు సైకిల్ రిక్షాలు.. విజయ ఐస్క్రీంల విక్రయాల కోసం ప్రత్యేక పుష్ కార్ట్ (సైకిల్ రిక్షా)లను వినియోగంలోకి తీసుకురావాలని మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు. ముందుగా 250 పుష్‌కార్ట్‌ల ద్వారా ఐస్ క్రీంల విక్రయాలు ప్రారంభించాలన్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్, శిల్పారామం, గోల్కొండ కోట, దుర్గంచెరువు వంటి ప్రాంతాల్లో విక్రయాలు చేప ట్టాలన్నారు. విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయాల కోసం జీహెచ్ఎంసీ పరిధిలో అనువైన ప్రాంతాలను గుర్తించి నూతన ఔట్లెట్లను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసి మార్చిలో వాటిని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు. సమావేశంలో పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, డెయిరీ ఎండీ శ్రీనివాసరావు, పశుసంవర్థక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, అదనపు డైరెక్టర్ రాంచందర్ పాల్గొన్నారు. -
మహిళల చేతికి ‘స్టీరింగ్’..!
సాక్షి, సంగారెడ్డి: ‘మహిళలు విమానాలు నడుపుతున్నారు.. అంతరిక్షంలోకి రాకెట్లతో వెళ్తున్నారు.. కుటుంబాలను నడిపే బాధ్యతనూ సమర్థంగా నిర్వహిస్తున్నారు.. కార్లను నడపటం వారికి కష్టమేమీ కాదు.. అందుకే ఇంటి స్టీరింగ్‌తో పాటు ఉపాధి పొందడానికి మొదటిసారిగా ప్రభుత్వం ‘కారు’ స్టీరింగ్ కూడా మీ చేతుల్లో పెడుతోంది..’అని ఆర్థికమంత్రి హరీశ్‌రావు అన్నారు. వీటిని విజయవంతంగా నడిపించుకొని ఉపాధి పొందుతారనే విశ్వాసముందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో జరిగిన కార్యక్రమంలో సోమవారం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 18 మంది మహిళలకు ‘షీ క్యాబ్స్’కార్లను అందజేశారు. సమాజ అభివృద్ధికి దోహదం.. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఇది సమాజ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని హరీశ్ చెప్పారు. ‘తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎస్సీలకు రూ.2,737 కోట్లతో 1.63 లక్షల మంది ఎస్సీ లబ్ధిదారులకు మేలు చేసేలా పథకాలు అమలుపరిచాం. గత ప్రభుత్వాల హయాంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాల్సి ఉండేది. మహిళలకు షీ క్యాబ్స్ పేరుతో అద్దెకు నడిపి ఉపాధి పొందడానికి కార్లను అందజేసే కార్యక్రమం రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తున్నాం. ఈ జిల్లా నుంచి ప్రారంభిస్తున్న ఈ పథకానికి 25 మంది దరఖాస్తు చేసుకోగా 18 మందిని ఎంపిక చేసి వారికి డ్రైవింగ్‌లో శిక్షణ ఇప్పించి లైసెన్సులు సైతం ఇచ్చాం. క్యాబ్ డ్రైవర్స్ ఆత్మరక్షణకు పెప్పర్ స్ప్రే, సెల్‌ఫోన్, జియో లొకేషన్ సౌకర్యం కల్పించాం. ఈ పథకం విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా అమలు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇటు ఈ పథకం సక్సెస్ అయ్యేందుకు కార్లను అందజేసిన మహిళలను మూడు నెలల పాటు వారం వారం పర్యవేక్షిస్తూ నెలకోసారి అధికారులు నివేదికను అందజేయాలి. జిల్లాలో అత్యధికంగా పరిశ్రమలున్నాయి. వాటిలో పనిచేసే మేనేజర్లు, పర్సనల్ మేనేజర్లు, ఇతర అధికారులకు కార్లు అద్దెకు అవసరం అవుతాయి. కార్లు పొందిన మహిళలకు ఆసక్తి ఉంటే పరిశ్రమల యజమానులతో మాట్లాడి టై అప్ చేయిస్తాం.. దీంతో ప్రతినెలా పని లభించడమే కాకుండా నెలనెలా అద్దె వస్తుంది. ఇటు ‘ఊబర్’సంస్థతో కూడా టై అప్ చేసుకోవచ్చు..’అని మంత్రి అన్నారు. అనంతరం మహిళా లబ్ధిదారులు నడిపిన షీ క్యాబ్స్‌లో హరీశ్ ప్రయాణించి వారికి సూచనలు అందజేశారు. అనంతరం వారితో సెల్ఫీలు దిగి సంతోషాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎం.హనుమంతరావు, జెడ్పీ చైర్పర్సన్ పట్లోళ్ల మంజుశ్రీ, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, మాణిక్‌రావు, భూపాల్‌రెడ్డి, పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. మిగతావారికి వారంలో రైతుబంధు.. ఇక యాసంగిలో రూ.7,500 కోట్లు రైతుబంధు కింద రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తున్నామని మంత్రి హరీశ్ తెలిపారు. మునిపల్లి మండలం కంకోల్లో రైతువేదికను ప్రారంభించిన ఆయన.. ఇప్పటివరకు రూ.5,500 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశామని చెప్పారు. మిగతావారికి వారంలోగా డబ్బులు జమ అవుతాయన్నారు. కల్లాల నిర్మాణానికి రూ.600 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. కుటుంబానికి ఆసరా అవుతా.. సంగారెడ్డి కేంద్రంలోని తారా డిగ్రీ కళాశాలలో చదువుతున్నాను. కుటుంబానికి చేయూతనివ్వాలని ఏదో ఒక వ్యాపారం చేయాలనుకున్నాను. పెట్టుబడి పెట్టేంత ఆర్థిక స్థోమత లేకపోయింది. ప్రభుత్వ ‘షీ క్యాబ్’పథకం గురించి తెలిసి దరఖాస్తు చేశాను. ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎంపిక చేసి, డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చి లైసెన్స్ కూడా ఇప్పించారు. ఇప్పుడు కారు కూడా వచ్చింది. కుటుంబానికి ఎంతో కొంత ఆసరా అవుతాననే భరోసా కలిగింది. – బి.ప్రవళిక, చేర్యాల్, కంది మండలం ఆత్మస్థైర్యం కలిగింది.. మావారు క్యాటరింగ్ చేస్తారు. ఆ సంపాదనతో కుటుంబ పోషణ కష్టంగా ఉంది. గృహిణిగా ఉన్న నేను కూడా ఏదో ఓ పనిచేసి అండగా నిలవలానుకున్నా. ఎస్సీ కార్పొరేషన్ ప్రకటనతో షీ క్యాబ్‌కు దరఖాస్తు చేసుకోవడంతో లబ్ధిదారుగా ఎంపిక చేశారు. నెలరోజుల పాటు ఇచ్చిన శిక్షణలో పురుషులతో పాటు మహిళలు కూడా అన్ని పనులు చేయగలరనే ఆత్మస్థైర్యం కలిగింది. అన్ని ఖర్చులు పోను నెలకు రూ.10 వేలు మిగిలినా కుటుంబానికి భారం తప్పుతుంది. – పాతర తేజస్వి, సంగారెడ్డి టౌన్ అమ్మను పోషించుకునేందుకు.. 11 ఏళ్లు ఉన్నప్పుడే నాన్న చనిపోయాడు. నేను అమ్మ ఇద్దరమే ఉంటున్నాం. ఆమెనే నా ఆలనా పాలనా చూసేది. కూలిపనికి వెళ్లి కష్టపడి నన్ను చదివించింది. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడే పత్రికలో షీ క్యాబ్ స్కీం ప్రకటన చూశా. లబ్ధిదారుగా ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. సబ్సీడీపై కారు అందించారు. అన్నీ తానై నన్ను పోషించిన అమ్మకు అన్ని విధాలా అండగా ఉండాలనేదే లక్ష్యం. – గొర్లకాడి వసంత, జుల్కల్, కంది మండలం -
అంబేద్కర విగ్రహా ఆవిష్కరణపై మంత్రుల సమీక్ష
సాక్షి, తాడేపల్లి: 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని మాదిగ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశానికి మంత్రి ఆదిమూలపు సురేష్, విశ్వరూప్, వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనులను ప్రారంభించాలని మంత్రులు ఆదేశించారు. అదే విధంగా విగ్రహం ఏర్పాటు కోసం ప్రత్యేకంగా కేటాయించిన స్థలాన్ని మొదటగా స్వాధీనం చేసుకోవాలని మంత్రి సురేష్ అధికారులకు ఆదేశించారు. -
‘వారితో చర్చించి పనితీరు మెరుగుపరుచుకుంటాం’
సాక్షి, విజయవాడ: మంగళవారం విజయవాడలో రెండో రోజు ‘మనపాలన- మీ సూచన’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, జిల్లా ఎమ్మెల్యేలు వసంత్ కృష్ణప్రసాద్, మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేర్నినాని మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. సంక్షేమ పథకాలన్ని ప్రజలకి సక్రమంగా అందుతున్నాయి. చక్కటి పాలన అందిస్తున్నారని ప్రజలంతా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై మేథోమధనం చేస్తున్నాం. రైతు భరోసా, రైతులకు 9 గంటల విద్యుత్, జనతా బజార్ల ఏర్పాటు, ధరల స్థిరీకరణ నిధి, కొనుగోలు కేంద్రాలు తదితర అంశాలపై చర్చించి సీఎం జగన్ మోహన్ రెడ్డి నివేదిక అందిస్తాం. కృష్ణా జిల్లా రైతు సంఘాల ప్రతినిధులు, లబ్థిదారులతో చర్చించి ప్రభుత్వ పనితీరును మెరుగుపరుచుకుంటాం అని తెలిపారు. (చంద్రబాబుపై హైకోర్టులో పిల్..) మరోవైపు కరోనా కష్టాల్లోనూ సంక్షేమ పథకాలని కొనసాగిస్తున్న ప్రభుత్వం ఎన్ఎస్ఎఫ్డీసీ పథకం కింద ఎస్సి కార్పొరేషన్ ద్వారా ఆరు మంది నిరుద్యోగులకు వాహనాలు అందజేశారు. లబ్ధిదారులకు మంత్రి పేర్ని నాని పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జేసీ మాధవీలత పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పేర్నినాని పిలుపునిచ్చారు. బ్యాంకు రుణాలను సకాలంలో చెల్లించాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని స్వశక్తితో అభివృద్ధి చెందాలని నాని ఈ సందర్బంగా లబ్ధిదారులను కోరారు. (శ్రీకాకుళం జిల్లాలో బస్సు బోల్తా.. ) -
‘సామాజిక అంశానికి పెద్ద పీట వేసిన వ్యక్తి సీఎం జగన్’
సాక్షి, అమరావతి : . రాష్ట్ర జనాభాలో 18 శాతం ఉన్న ఎస్సీల ఆకాంక్షలకు అనుగుణంగా పనిస్తామని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు తెలిపారు. తాడేపల్లిలోని ఏపీ షెడ్యూల్ క్యాస్ట్ సంక్షేమ సహాయకార ఆర్థిక సంస్థ రాష్ట్ర కార్యాలయంలో గురువారం షెడ్యూల్ క్యాస్ట్ సొసైటీ అధికారులతో మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్ల చైర్మన్లు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్ల చైర్మన్లు పి.అమ్మాజీ, కె.కనకారావు, వి.మధుసూధనరావుతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఈడీలు, ఈవోలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కనకారావు మాట్లాడుతూ.. జిల్లా స్థాయి అధికారులతో ఆత్మీయ సమావేశం నిర్వహించామని, ఈ సమావేశంలో పాలనపరమైన అంశాలపై అధికారులతో చర్చించామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తమపై ఉంచిన బాధ్యతలను నేరవేరుస్తామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లామని పేర్కొన్నారు. 13 జిల్లాలోని సమస్యలపై అవగాహన పెంచుకునేందుకు ఈ సమావేశము ఏర్పాటు చేశామని మాల కార్పొరేషన్ చైర్మన్ పెడపాటి అమ్మాజీ అన్నారు. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న సమస్యలపై చర్చించామని, అన్ని జిల్లాల్లో అవగాహన క్యాంపులు నిర్వహిస్తామని చెప్పారు. ప్రజల వద్దకే పాలన అనేలా నీతి ,నిజాయితీ, నిబద్దతతో పనిచేస్తామని తెలిపారు. రెల్లి కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు మధుసూధనరావు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు మంచి ఫలితాల అందేలా పనిచేస్తామని, సామాజిక న్యాయం అమలుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. సామాజిక అంశానికి పెద్ద పీట వేసిన నాయకుడు సీఎం జగన్ అని, గతంలో ఏ ముఖ్యమంత్రి తీసుకొని నిర్ణయాలను ముఖ్యమంత్రి తీసుకున్నారని ప్రశంసించారు. -
రెల్లి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ల నియామకం
సాక్షి, అమరావతి: రెల్లి, ఎస్సీల కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మాల కార్పొరేషన్ చైర్మన్‌గా పెడపాటి అమ్మాజీ, మాదిగ కార్పొరేషన్ చైర్మన్‌గా కొమ్మూరి కనకరావు, రెల్లి కార్పొరేషన్ చైర్మన్‌గా వదయ్ మధుసూధన్‌రావులు నియమితులయ్యారు. -
రుణాల పంపిణీకి ఉమ్మడి ప్రణాళిక
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు తదితర కార్పొరేషన్ల ద్వారా రుణాల పంపిణీ విషయంలో ఉమ్మడి ప్రణాళికను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అన్ని వర్గాల పేదలకు సబ్సిడీ రుణ సాయాన్ని ఒకేసారి అందించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. రుణాల పంపిణీ విషయంలో కార్పొరేషన్లు ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తుచేసింది. ఆన్లైన్ బెనిఫిషరీ మానిటరింగ్ సిస్టం ద్వారా అన్ని కార్పొరేషన్లు ఒకేసారి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ నెల 4న జీవో విడుదల చేసింది. డిసెంబరు నాటికి రుణాలు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ, అందుకు తేదీలను కూడా ఖరారు చేసింది. రుణాల పంపిణీ కోసం సెప్టెంబరు నెలాఖరు వరకు దరఖాస్తులను స్వీకరించాలని, ఆ తరువాత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కావాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇలాంటి ఉత్తర్వులు ప్రభుత్వం ఇవ్వడం ఇదే మొదటిసారి. గతంలో రుణాల మంజూరు విషయంలో కార్పొరేషన్లు మార్చిలో నిర్ణయం తీసుకోవడం, మార్చి అయిపోయిన తరువాత ఆర్థిక సంవత్సరం మారిందంటూ పట్టించుకోకుండా వదిలేయడం వంటివి జరిగేవి. అధికారుల ద్వారానే ఎంపిక రుణాలు పొందే లబ్ధిదారులను బ్యాంకు అధికారులు, ఎంపీడీవో, కార్పొరేషన్ల ప్రతినిధులు ఎంపిక చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గతంలో జన్మభూమి కమిటీల సభ్యులు సంతకాలు చేస్తేనే రుణాలు తీసుకునేందుకు పేదలు అర్హత సాధించేవారు. ఆ పరిస్థితిని ప్రభుత్వం మార్చేసింది. అర్హుల జాబితాను నేరుగా కార్పొరేషన్ ఈడీకి పంపిస్తే, వారు కలెక్టర్ అనుమతి తీసుకుని నిధుల కోసం కమిషనర్‌కు పంపిస్తారు. దీంతో ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబరులో గ్రౌండింగ్ అయిన యూనిట్లకు జనవరిలో యుటిలైజేషన్ సర్టిఫికెట్లు(యూసీ) ఇవ్వాలి. ఫిబ్రవరిలో యూనిట్‌ను కార్పొరేషన్ ఈడీ సందర్శించి పరిశీలించాల్సి ఉంటుంది. మార్చిలో నిర్దేశిత ఏజెన్సీ ద్వారా యూనిట్ పనితీరును మరోసారి పరిశీలించాలి. రుణాల పంపిణీకి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, ఇతర కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారులకు ఒకేసారి రుణాలు ఇవ్వాలని నిర్ణయించడం మంచి నిర్ణయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
బడుగులకు బాసట
రాష్ట్ర ప్రభుత్వం బడుగులకు బాసటగా నిలిచింది. వారి బతుకుల్లో వెలుగులు నింపడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంది. సంక్షేమ ఫలాలు అందరికీ చేరేలా నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌ను విభజించింది.ఎస్సీలో మెజారిటీ సామాజిక వర్గాలైన మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్ల ఏర్పాటు చేయనుంది. దీనిపై ఆయా వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, విశాఖపట్నం: ఎస్సీ కార్పొరేషన్ ఇకపై మూడు కార్పొరేషన్లు కానుంది. మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లగా విభజిస్తూ ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. ప్రజాసంకల్పయాత్రలో వై ఎస్ జగన్మోహన్రెడ్డి తమ ప్రభుత్వం అధి కారంలోకి వస్తే మాల, మాదిగలతో పాటు రెల్లి కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆదివారం ఎస్సీ కార్పొరేషన్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో లక్షలాది మందికి ప్రయోజనం.. జిల్లాలో షెడ్యూల్డ్ కులాల్లో 46 ఉపకులాలు న్నాయి. అందులో మాదిగ, మాల, రెల్లి, పైడి, ఆది ఆంధ్ర వారు ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీలు) సుమారుగా 3,29,486 మంది వరకు ఉన్నారు. ఇందులో 1,62,873 పురుషులు, 1,66,613 మహిళలు న్నారు. వీరందరికీ ప్రయోజనం చేకూరనుంది. నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు.. 25 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ చేయాలని ఎమ్మార్పీస్ పోరాటం చేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నిబంధనలకు, రాజ్యాంగానికి విరుద్ధంగా ఎస్సీ వర్గీకరణ చేశారటూ ఎస్సీ మాలలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగానే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం రాష్ట్రంలో ఏ,బీ,సీ,డీ వర్గీకరణ చేసి అమలు చేశారు. అయితే ఆ వర్గీకరణ చెల్లదంటూ సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో మళ్లీ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పథకాలు అన్ని వర్గాలకు అమలు చేస్తున్నారు. అయినా ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందేనని ఎమ్మార్పీఎస్‌లో ఓ వర్గం నేటికీ పోరాటం చేస్తూనే ఉంది. దీంతో ఎస్సీల్లో ఉన్న మాల, మాదిగల మధ్య అంతరం పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో మాల, మాదిగల మధ్య సఖ్యత పెంపొందించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్సీ కార్పొరేషన్‌ను మూడుగా విభజిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. నాడు ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వంలో అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలను రద్దు చేసిన జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న కార్పొరేషన్ల ద్వారా ఎస్సీలకు సంక్షేమ ఫలాలను అందించేందుకు చర్యలు చేపడుతోంది. కార్పొరేషన్ విభజనపై హర్షం.. ఎస్సీల ఆర్థికాభివృద్ధికోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1974లో ఏర్పాటు చేసిన ఎస్సీ కార్పొరేషన్‌ను ఆయా ఉపకులాలను విభజించాలనే డిమాండ్ ఎన్నో ఏళ్లుగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు విస్మరించాయి. ప్రజా సంకల్పయాత్రలో జగన్మోహన్రెడ్డికి ఎస్సీ కార్పొరేషన్ విభజించాలని తామంతా విన్నవించాం. ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చారు. రాష్ట్రంలో 59 ఉపకులాలకు నేరుగా ఆర్థిక ఫలాలు అందే విధంగా ఎస్సీ కార్పొరేషన్‌ను విభజించడం గొప్పవిషయం. మాట తప్పకుండా ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ కార్పొరేషన్ మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేశారు. జిల్లాలో ఉన్న దళితులమంతా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. – బోని శివరామకృష్ణ. దళితనేత సీఎం జగనన్నకు రుణపడి ఉంటాం గతంలో ఎన్నో ప్రభుత్వాలు మాటివ్వడమే గాని హామీ నెరవేర్చిన పాపాన పోలేదు. కేవలం రాజకీయ లబ్ధికోసం మమ్మల్ని వాడుకున్నారే తప్పా ఎవరూ న్యాయం చేయలేదు. ప్రజాసంకల్పయాత్రలో విన్నవించుకున్నాం. జగనన్న ఇచ్చిన హామీ మేరకు మూడు కార్పొరేషన్లు గా విభజించి సాధ్యం కాదన్నది సుసాధ్యం చేశారు. దళితుల సంక్షేమం కోసం పాటుపడే ఏపీ సీఎం జగనన్నకి తామంతా రుణపడి ఉంటాం. – వీజే అజయ్‌కుమార్, దళితనేత విభజనతో సంక్షేమఫలాలు కార్పొరేషన్ విభజనతో సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతా యి. జిల్లాలో దళితులం ఎక్కువగా ఉన్నా మాకు ఏ ప్రభుత్వం న్యా యం చేయలేదు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే న్యాయం జరిగింది. మళ్లీ ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే మా అభివృద్ధి జరుగుతుంది. కార్పొరేషన్ విభజనతో ఎక్కువ మందికి ప్రభుత్వ పథకాలు అందుతాయి. – పాకా సత్యనారాయణ -
మింగారు.. దొరికారు...
ఖమ్మం క్రైం : సంచలనం సృష్టించిన ఎస్సీ కార్పొరేషన్ అవకతవకల కేసులో నిందితుడు వేముల సునీల్‌ను పోలీసులు ఎట్టకేలకు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. రూ.60 లక్షల మేరకు ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసినట్లు తమ దర్యాప్తులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన టూటౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఏసీపీ వెంకట్రావు వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరి 26న వి.కృష్ణవేణి, మరో 12 మంది తమకు అందాల్సిన ఎస్సీ కార్పొరేషన్ రుణాలను వేముల సునీల్ అనే వ్యక్తి తమకు తెలియకుండా తీసుకుని వాడుకున్నాడని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ స్పందించి అప్పటి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ప్రభాకర్‌ను పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రభాకర్‌రావు కార్పొరేషన్లో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల నుంచి సునీల్ అనే వ్యక్తి నగదును తన అకౌంట్‌కు బదిలీ చేయించుకుని రూ.60లక్షల నిధులను దుర్వినియోగం చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో సీపీ తఫ్సీర్ ఇక్బాల్ ఆధ్వర్యంలో అడిషనల్ డీసీపీ మురళీధర్, ఏసీపీ వెంకట్రావు, సీసీఎస్ సీఐ వసంత్‌కుమార్, టూటౌన్ సీఐ నరేందర్‌లు బృందంగా ఏర్పడి ఈ కేసు మిస్టరీని ఛేదించారు. 2015–16 ఏడాదికి గాను ఖమ్మం మున్సిపల్ కార్యాలయం నుంచి 264 దరఖాస్తులు ఎస్సీ కార్పొరేషన్‌కు పంపారు. అందులో 165 దరఖాస్తులు మాత్రమే మంజూరయ్యాయి. అదేవిధంగా 158 మందికి సంబంధించిన మరో లిస్టు ఎస్సీ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా వెళ్లగా అప్పటి కలెక్టర్ దానిని నిలిపివేశారు. 158 మంది లిస్టులో ఉన్న దరఖాస్తుదారుడు వేముల సునీల్ హైకోర్టుకు వెళ్లి ఆర్డర్ తీసుకొచ్చాడు. దీంతో 2015–16, 2016–17కు సంబంధించి మొత్తం 200 యూనిట్లకు మంజూరును ఇచ్చారు. మంజూరైన లిస్టును వేముల సునీల్ తెలివిగా సేకరించి అందులో 43మందికి ఫోన్ చేసి తానే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అని పరిచయం చేసుకున్నాడు. తనకు మెప్మా, ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించి రుణాలు ఇచ్చే బ్యాంకర్లు తెలుసునని.. మీకు వారికి మధ్య మధ్యవర్తిగా వ్యవహరించి ఎక్కువ మొత్తంలో డబ్బులు వచ్చేలా చేస్తానని చెప్పారు. అందులో భాగంగా 21మంది లబ్ధిదారుల నుంచి రూ.5,38,500లను తీసుకున్నాడు. అదేవిధంగా షాపు నిర్వాహకుడు భానుప్రసాద్‌కు డబ్బు ఆశ చూపించి నకిలీ కొటేషన్ లెటర్స్‌ను తీసుకుని రూ.2,92,55,000లకు సంబంధించిన కొటేషన్‌ను బ్యాంకర్లకు ఇచ్చాడు. దీనిలో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ వారు రూ.1,64,35,000లను సబ్సిడీ కింద లబ్ధిదారుల అకౌంట్లో వేశారు. అదేవిధంగా సునీల్ ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించిన నిధులను రూ.1,28,15,000లను దుర్వినియోగం చేస్తూ బ్యాంకుల్లో 43మంది లబ్ధిదారులకు సెక్యూరిటీ డిపాజిట్ చేసి 43 డీడీలను బ్యాంకుల నుంచి తీసుకుని ఇతనికి సహాయం చేస్తున్న భానుప్రసాద్ ద్వారా నకిలీ సంస్థల ఖాతాలో జమ చేశాడు. ఈ డబ్బులో తనకు 6శాతం ఇవ్వాలని భానుప్రసాద్ పేర్కొన్నాడు. అందుకు గాను సునీల్ రూ.17.40లక్షలతోపాటు రూ.4లక్షల కారుతో సహా భాను ప్రసాద్‌కు ఇచ్చాడు. ఏకంగా భానుప్రసాద్ ఇంట్లోనే ఈ నకిలీ కొటేషన్స్‌ను తయారు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అనంతరం తన కుమారులైన వేముల నితిన్, వేముల అఖిల్ బ్యాంకు ఖాతాలకు రూ.15లక్షలు, రూ.21.78లక్షలను బదలాయించాడు. హైదరాబాద్‌కు చెందిన గోవింద్‌కుమార్ అగర్వాల్ వద్ద రూ.18లక్షలకు పార్చునర్ కారును కొనుగోలు చేసి మిగితా డబ్బును తన సొంతానికి వాడుకున్నాడు. అదేవిధంగా వీరికి ఎస్సీ కార్పొరేషన్లో అవుట్ సోర్సింగ్‌పై పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సురేష్ అనే వ్యక్తికి కూడా కొంత మేరకు డబ్బు ఇచ్చాడు. పోలీసుల విచారణలో దీనికి సంబంధించి తీగలాగగా డొంక కదిలింది. 324 యూనిట్లకు సంబంధించి రూ.6 కోట్లపై కూడా పోలీసుల విచారణ.. ఈ కేసులో భాగంగా ఇంకా 324 యూనిట్లలో రూ.6 కోట్లకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్, మున్సిపల్, మెప్మా, బ్యాంకు అధికారుల ప్రమేయాన్ని విచారిస్తున్నామని, త్వరలోనే ఈ తీగనంతా కదిలిస్తామని ఏసీపీ తెలిపారు. వేముల సునీల్‌పై గతంలో కూడా కేసులు ఉన్నాయని, దర్జాగా కనిపించేందుకు పార్చునర్ కారును వాడటంతో పాటు మూడు ఎయిర్ గన్స్‌ను కూడా తనవద్ద ఉంచుకుని తిరుగుతుండేవాడని, ఎవరైనా లబ్ధిదారుడు వచ్చి తమ రుణం ఏమైందని అడిగితే తుపాకులను చూపించి భయభ్రాంతులకు గురి చేసేవాడని ఏసీపీ తెలిపారు. అందులో భాగంగా అతని వద్ద పార్చునర్ కారు, మూడు ఎయిర్‌గన్స్, భానుప్రసాద్ షాపు వద్ద నుంచి నకిలీ బ్యాంక్ కొటేషన్లు, ఇతర నకిలీ డాక్యుమెంట్లు స్వాధీనం చేసునున్నారు. సునీల్‌తో పాటు భాను ప్రసాద్‌ను, సునీల్ కుమారుడైన నితిన్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అయిన సుురేష్ను అరెస్ట్ చేశామని, ఈ కేసులో మరికొంతమందిని కూడా విచారించి చర్య తీసుకోవడం జరుగతుందని ఏసీపీ వెంకట్రావు, తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో టూటౌన్ సీఐ నరేందర్ పాల్గొన్నారు.