సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అమలు వేగం పుంజుకుంది. నిధుల విడుదలలో జాప్యంతో గత కొంత కాలంగా నెమ్మదించిన ఈ పథకానికి ప్రభుత్వం తాజాగా రూ.600 కోట్లు విడుదల చేసింది. దీంతో చర్యలకు ఉపక్రమించిన ఎస్సీ కార్పొరేషన్.. ఈ పథకం కింద ఇప్పటివరకు ఎంపికైన లబ్ధిదారులందరికీ ఆర్థిక సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో ఇప్పటివరకు 38,476 మంది లబ్ధిదారులు ఈ పథకం కింద ఎంపికయ్యారు. ప్రస్తుతం ఎంపికైన లబ్ధిదారుల ఖాతాల్లో రూ.3,847.6 కోట్లు ప్రభుత్వం జమ చేసింది.
హుజూరాబాద్‌తో షురూ
దళితబంధు పథకం ఇప్పటివరకు నాలుగు కేటగిరీల్లో అమలైంది. తొలుత కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళిత కుటుంబాలకు పూర్తిస్థాయిలో పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ మేరకు లబ్ధిదారుల ఎంపిక మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆ నియోజకవర్గంలో మొత్తం 18,211 కుటుంబాలను గుర్తించిన యంత్రాంగం.. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున అర్హులందరి ఖాతాల్లో నిధులను జమ చేసింది.
ఆ తర్వాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామంలో ఉన్న 75 దళిత కుటుంబాలను ఎంపిక చేసి వారి బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేశారు. ఆ తర్వాత చింతకాని, తిరుమలగిరి, చారగొండ, నిజాంసాగర్ మండలాలను ఎంపిక చేసిన ప్రభుత్వం ఆయా మండలాల్లోని దళిత కుటుంబాలన్నింటికీ సాయం అందించాలని నిర్ణయించి ఆ మేరకు అర్హులను ఎంపిక చేశారు.
అనంతరం దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే క్రమంలో నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి వంద యూనిట్లు మంజూరు చేశారు. ఆ మేరకు స్థానిక ఎమ్మెల్యేలు లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాను ఎస్సీ కార్పొరేషన్‌కు సమర్పించగా.. ప్రస్తుతం అందరి ఖాతాల్లో అధికారులు నిధులను జమ చేశారు.
యూనిట్ల ఏర్పాటుకు ప్రత్యేక కార్యాచరణ
ఇప్పటివరకు పథకం కింద ఎంపికైన లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేసిన ప్రభుత్వం.. ఇక యూనిట్ల ప్రారంభంపై దృష్టి పెట్టాలని ఎస్సీ కార్పొరేషన్‌ను ఆదేశించింది. జిల్లాల వారీగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా లబ్ధిదారులతో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించి.. వారికి ఆసక్తి ఉన్న యూనిట్ల ఏర్పాటు, వాటి నిర్వహణపై ఎస్సీ కార్పొరేషన్ శిక్షణ ఇవ్వనుంది. యూనిట్లు గ్రౌండింగ్ అయ్యే విధంగా నియోజకవర్గ స్థాయిలో అధికారులకు లక్ష్యాలను నిర్దేశించి, నూరుశాతం పురోగతి వచ్చేలా చర్యలు చేపడుతోంది.
కొత్తగా నియోజకవర్గానికి 500 యూనిట్లు..
2022–23 వార్షిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 1,500 యూనిట్ల చొప్పున ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. అయితే తొలి విడత కింద ప్రతి సెగ్మెంట్‌కు 500 చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఎమ్మెల్యేలకు సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment