![Motkupalli Narasimhulu Expresses Confidence Over Implementation Of Dalit Bandhu Scheme - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/30/mla.jpg.webp?itok=cD_11dEk)
అమీర్‌పేట(హైదరాబాద్): దళితులపాలిట వరంగా మారనున్న దళితబంధు పథకాన్ని విపక్షాలు అడ్డుకుంటే యాదగిరిగుట్టలో ఆత్మహత్య చేసుకుంటానని మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు హెచ్చరించారు. దళితబంధుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపిస్తూ ఆదివారం హైదరాబాద్ లోని తన నివాసంలో ఒకరోజు నిరసనదీక్ష చేపట్టారు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి మోత్కుపల్లికి పూలమాల వేసి దీక్ష ప్రారంభించారు.
నర్సింహులు మాట్లాడుతూ అగ్రవర్ణాలకు దీటుగా దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే దృఢసంకల్పంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సాహసోపేత నిర్ణయం తీసుకుని దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని కొనియాడారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను పెట్టి అమలు చేస్తున్నారని, ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారనే అపార నమ్మకం తనకుందని తెలిపారు.
రేవంత్‌రెడ్డివి బ్లాక్‌మెయిల్ రాజకీయాలు
ఓటుకు కోట్లు కేసులో జైలుకు వెళ్లి వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. ‘రేవంత్‌రెడ్డిది ఐరన్ లెగ్, టీటీడీపీని పత్తాలేకుండా చేయించి కాంగ్రెస్ పార్టీలో దూకిన వ్యక్తికి టీపీసీసీ కట్టబెట్టడం సిగ్గుచేట’న్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రకు అర్థం లేదని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను కప్పిపుచ్చుకోవటానికే యాత్రను చేపట్టారని విమర్శించారు. దళితుల సంక్షేమం కోసం పాటుపడుతున్న కేసీఆర్‌కు దళితులందరూ మద్దతు ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment