ఎస్సీ కార్పొరేషన్ వరుసగా మూడేళ్లుగా రుణాలు ఇవ్వడంలేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి చెప్పారు.
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ కార్పొరేషన్ వరుసగా మూడేళ్లుగా రుణాలు ఇవ్వడంలేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి చెప్పారు. గురువారం నాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ 2014లో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎస్సీ కార్పొరేషన్ ఎలాంటి రుణాలు ఇవ్వలేదని, ఎస్సీ నిరుద్యోగులను ఆదుకోవడానికి తీసుకున్న చర్యలేమీ లేవని అన్నారు. బడ్జెట్‌లో పెట్టినా, నిధులను ప్రభుత్వం మంజూరు చేయకపోవడం వల్ల బ్యాంకులు రుణాలను ఇవ్వడం లేదని, నిరుద్యోగ యువతపై ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని మల్లు రవి విమర్శించారు.
ఎస్సీ కార్పొరేషన్‌కు ప్రభుత్వం తక్షణమే నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి మోదీతో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడారో, సీఎం ఇచ్చిన హామీలేమిటో ప్రజలకు వెల్లడించాలని కోరారు. నియోజకవర్గాల పెంపు వంటి రాజకీయ ప్రయోజనాలపై ఉన్న శ్రద్ధ... ప్రజలకు ఉపయోగపడే రాష్ట్ర విభజన హామీలపై సీఎం కేసీఆర్‌కు ఎందుకు లేదని మల్లు రవి ప్రశ్నించారు.