► రుణాల సబ్సిడీ కోసం అదనపు నిధులు
► సర్కారుకు ఎస్సీకార్పొరేషన్ ప్రతిపాదనలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు అదనంగా నిధులు కేటాయించాలని కోరుతూ జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సబ్సిడీ కోసం జిల్లాకు కేటాయించిన నిధులు సరిపోవడం లేదని, అదనంగా రూ.30 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బ్యాంకు లింక్డ్ ఎకనామికల్ సపోర్టు స్కీం(ఎస్‌సీఏపీ) ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తున్న విషయం విదితమే. ఈ పథకం కింద స్వయం ఉపాధి పొందే దళితులకు రుణ సౌకర్యం కల్పించడంతోపాటు, భారీగా సబ్సిడీలు ఇస్తోంది. రూ.లక్ష యూనిట్‌కు రూ.80 వేలు సబ్సిడీ వస్తోంది. రూ.రెండు లక్షల యూనిట్‌కు రూ.70 వేలు, పెద్ద యూనిట్లు రూ.రెండు లక్షల నుంచి రూ.పది లక్షల వరకు 50 శాతం సబ్సిడీని ప్రభుత్వం భరిస్తోంది.
ఈ పథకం కింద జిల్లాలో 3,117 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.34.81 కోట్లు కేటాయించింది. భారీగా సబ్సిడీలు ఇస్తుండటంతో ఈ రుణాల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. జిల్లా వ్యాప్తంగా వేలల్లో దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 10,456 మంది అభ్యర్థులు ఈ రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో ఎంపీడీవోల ద్వారా వచ్చిన దరఖాస్తులు సుమారు ఆరు వేలకు పైగా ఉంటాయి. వీరందరికీ యూనిట్లను మంజూరు చేయాలంటే అదనంగా మరో రూ.84 కోట్ల వరకు నిధులు అవసరమని అధికారులు అంచనా వేశారు.
ఈ ఏడాది సాధ్యమైనంత ఎక్కువ మంది అభ్యర్థులకు యూనిట్లు మంజూరు చేయాలనే ఉద్దేశంతో అదనంగా నిధులు కేటాయించాలని కోరుతూ ప్రతిపాదనలు పంపారు. కలెక్టర్ ఎం.జగన్మోహన్ ఆదేశాల మేరకు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు ఈ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ నిధులు మంజూరైతే సాధ్యమైనంత ఎక్కువ మందికి యూనిట్లు మంజూరయ్యే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు.
పెద్ద యూనిట్లకు బ్రేక్..
ఈ పథకం కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు ఇప్పటివరకు 2,162 మంది లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు చేశారు. వీరి కోసం రూ.19.87 కోట్లు సబ్సిడీ రూపంలో మంజూరయ్యాయి. నిర్దేశిత లక్ష్యంలో సుమారు 69 శాతం మంజూరు ఇచ్చారు. మొదటగా రూ.లక్ష, రూ.రెండు లక్షల యూనిట్లను మంజూరు చేశారు. రూ.రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న పెద్ద యూనిట్ల మంజూరు ఇటీవల వరకు నిలిపివేశారు. తాజాగా ఈ యూనిట్లను కూడా మంజూరు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదనంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే ఎక్కువ మంది లబ్దిదారులకు ఈ రుణాలు అందించాలని భావిస్తున్నారు.
ప్రభుత్వానికి ప్రతిపాదనలు
జిల్లాలో దరఖాస్తు చేసుకున్న వారిలో ఆరువేల మందికి సబ్సిడీ యూనిట్లు మంజూరు చేయాలంటే అదనపు నిధులు అవసరం ఉంది. కలెక్టర్ ఆదేశాల మేరకు రూ.30 కోట్లు అదనపు నిధులు కేటాయించాలని కోరుతూ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ఈ నిధులు మంజూరైతే ఎక్కువ మందికి యూనిట్లు మంజూరు చేయడానికి వీలవుతుంది. - జేమ్స్ కల్వల, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ
కావాలి అ‘ధనం’
Published Sat, Mar 19 2016 3:00 AM | Last Updated on Sun, Sep 3 2017 8:04 PM
Advertisement