* ముందుకు కదలని భూపంపిణీ
* లక్ష్యం చేరని స్వయం ఉపాధి
* మొండికేస్తున్న బ్యాంకులు
* నేడు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి రాక
* సంక్షేమ పథకాలపై సమీక్ష
కరీంనగర్ : దళితుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఆచరణకు నోచుకోవడం లేదు. లక్ష్యం ఘనంగా ఉన్నా క్షేత్రస్థాయిలో అమలుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఫలితంగా పథకాలు దళితుల దరికి చేరడం లేదు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూపంపిణీ ఒక అడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కు అన్న చందంగా తయారు కాగా, స్వయం ఉపాధి రుణాలదీ అదే బాట.
దళితులకు ప్రభుత్వ పథకాలు ఆమడదూరంలో ఉంటున్నాయి. హడావుడి చేసి ప్రారంభించిన కుటుంబానికి మూడెకరాల భూ పంపిణీకి మళ్లీ మోక్షం కలగడం లేదు. పథకాన్ని ప్రారంభించి ఐదు నెలలవుతుండగా ప్రభుత్వ భూముల కొరతతో ఇప్పటివరకు 216 మందికి మాత్రమే పత్రాలు అందించారు. జిల్లాలో 1.77 లక్షల ఎస్సీ కుటుంబాలుండగా, ఇందులో అసలు భూమిలేని కుటుంబాలు 1.50 లక్షలు. పథకం ప్రారంభానికి ముందు మండలానికో గ్రామం ఎంపిక చేసి పంచాలని నిర్ణయించినా...
భూముల కొరతతో నియోజకవర్గానికో గ్రామాన్ని ఎంపిక చేశారు. 12 నియోజకవర్గాల్లో 16 గ్రామాలను ఎంపిక చేసి మొదటా 122 మంది లబ్ధిదారులను గుర్తించి ఆగస్టు 15న 307.57 ఎకరాల భూపంపిణీ పత్రాలు అందించారు. అనంతరం మరో 94 మంది లబ్ధిదారులను గుర్తించారు. మొత్తంగా ఇప్పటివరకు 216 మందికి 558 ఎకరాల 29 గుంటలు పంచారు. ఇందులో ప్రభుత్వ భూములు 119 ఎకరాలు కాగా 53 మందికి, 129 ఎకరాల ప్రైవేట్ భూమిని 163 మందికి పంపిణీ చేశారు.
రిజిస్ట్రేషన్ చేసింది కొంతే...
భూపంపిణీ కింద జిల్లాకు రూ.24 కోట్లు విడుదల కాగా, భూముల కొనుగోలుకు రూ.12.75 కోట్లు వెచ్చించారు. ఈ మొత్తం ఆర్డీవో ఖాతాల్లో చేరాయి. ఆర్భాటంగా పత్రాలిచ్చిన్పటికీ పలు చోట్ల ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించిన భూమికి డబ్బులు ఇవ్వకపోగా... లబ్ధిదారులకు ఇంకా భూములు అప్పగించలేదు. హద్దులు నిర్ణయించలేదు. ఫలితంగా సాగుభూమి బీడుగా ఉంటోంది.
మొత్తంగా జిల్లాలో 248 ఎకరాల భూమి 111 మంది లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేసినట్లు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. అంటే పంపిణీ చేసిన వారిలోనే ఇంకా 52 మందికి రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. జిల్లాలో మార్చి నెలాఖరులోగా ఆరు వేల ఎకరాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా పరిస్థితులు ఇలాగే ఉంటే కార్యరూపం దాల్చడం అనుమానమే.
స్వయం ఉపాధిదీ అదే తీరు
గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా గత జనవరిలో పెద్ద ఎత్తున స్వయం ఉపాధి రుణాల కోసం స్వీకరించిన దరఖాస్తులకు ఏడాది గడిచినా మోక్షం లేదు. అప్పటి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా నియామకమైన జిల్లా వాసి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ రెండు సార్లు అధికారులతో సమావేశమై రుణాలకు బ్యాంకు అనుమతి పత్రాలు కొర్రీలు పెట్టకుండా ఇవ్వాలని ఆదేశించారు. అంతలోనే గవర్నర్ పాలన వచ్చి... వరుస ఎన్నికలతో రుణాల ప్రక్రియ నిలిచిపోయింది.
బ్యాంకు అనుమతి పత్రాలు పొందిన నిరుద్యోగులు రుణాల కోసం ఇప్పటికీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2380 యూనిట్లకు రూ.32.16 కోట్లు మంజూరు చేసింది. 3225 దరఖాస్తులు రాగా 2682 మందికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకారం తెలిపాయి. లక్ష్యానికి మించి 299 మందికి కూడా రుణాలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు అధికారులు ప్రకటించినా... ఇప్పటివరకు 35 శాతం యూనిట్లు కూడా గ్రౌండింగ్ కాలేదు.
తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.15.6 కోట్లతో 1514 యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో రూ. 8.78 కోట్లు సబ్సిడీ ఉండా రూ.6.29 కోట్లు బ్యాంకులు రుణంగా ఇవ్వాల్సి ఉంది. ఎస్టీ కార్పొరేషన్‌కు రూ.310 కోట్లతో 316 మందికి లబ్ధి చేకూర్చాలని నిర్ణయించారు. 352 దరఖాస్తులు రాగా 45 శాతం గ్రౌండింగ్ అయినట్లు అధికారులు చెబుతున్నారు.
బ్యాంకులదీ అదేబాట
నిరుద్యోగులకు రుణాల మంజూరుకు అనుమతి పత్రాలు ఇవ్వడంలో బ్యాంకులు పాత బాటనే పయనిస్తున్నాయి. స్వయం ఉపాధి కింద ఇచ్చిన రుణాలు తిరిగి చెల్లించడం లేదని, బకాయిలు పేరుకుపోయాయని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. రుణాల చెల్లింపుపై ప్రభుత్వం స్పష్టమైన విధానాలు రూపొందిస్తే రుణాలిచ్చేందుకు సిద్ధమేనని చెబుతున్నారు. ఓవైపు జిల్లా యంత్రాంగం జనవరి 26న యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని నిర్ణయించగా... లక్ష్యం నెరవేరుతుందో లేదో చూడాలి.
నేడు జిల్లాకు చైర్మన్
ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పిడమర్తి రవి శుక్రవారం జిల్లాకు రానున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న పథకాలపై అధికారులతో ఆయన సమీక్షించనున్నారు. పథకాల వేగవంతంపై దళితులంతా ఆయనపైనే ఆశలు పెట్టుకున్నారు.
దళితుల దరిచేరని పథకాలు
Published Fri, Jan 23 2015 12:38 AM | Last Updated on Tue, Jul 24 2018 2:17 PM
Advertisement