ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు సొంత ఇల్లు (Home) కావాలని కోరుకుంటారు. అయితే ఇల్లు కొనడం లేదా ఇల్లు కట్టుకోవడం అంత ఈజీ కాదు. ఇల్లు కొనాలంటే మధ్యతరగతి వాళ్లు దాచుకున్న డబ్బునంతా పెట్టాలి. అయినా కూడా సరిపోకుంటే గృహ రుణం (Home loan) తీసుకోవలసిన అవసరం ఉంటుంది. 90 శాతం మంది ఇలా హోమ్ లోన్ తీసుకునే ఇల్లు కట్టుకుంటున్నారు.
జాబ్ చేస్తూ జీతం తీసుకునే వ్యక్తులకు బ్యాంకులు హోమ్ లోన్ సులువుగా మంజూరు చేస్తాయి. ఇందుకోసం ఉద్యోగి జీతం, బ్యాంక్ స్టేట్‌మెంట్ వంటివి చెక్ చేశాయి. మరి స్వయం ఉపాధి పొందేవారికి ఇంటి రుణాలు ఎలా ఇస్తారో మీకు తెలుసా? బ్యాంకులు వారికి ఎంత మేర గృహ రుణం ఇవ్వవచ్చు.. వడ్డీ రేటు ఎంత ఉండాలి అన్నది నిర్ణయించడానికి బ్యాంకులు చూసే కీలక విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..
వయసు
గృహ రుణం ఇచ్చే సమయంలో ప్రతి బ్యాంకూ ఖచ్చితంగా రుణం తీసుకునే వ్యక్తి వయస్సును చూస్తుంది. ముఖ్యంగా స్వయం ఉపాధి పొందేవారికి రుణాలు ఇస్తున్నప్పుడు వయస్సుపై చాలా శ్రద్ధ వహిస్తారు. స్వయం ఉపాధి పొందే వ్యక్తి వయస్సు తక్కువగా ఉంటే ఎక్కువ గృహ రుణం పొందే అవకాశం ఉంటుంది. లోన్ కాల పరిమితి కూడా ఎక్కువగా పొందే ఆస్కారం ఉంటుంది. తద్వారా రుణాన్ని తిరిగి చెల్లించడంలో పెద్దగా కష్టం ఉండదు. ఎందుకంటే ఈఎంఐ (EMI) తక్కువగా ఉంటుంది.
డాక్యుమెంట్లు
హోమ్ లోన్ ఇవ్వడానికి ముందు, దరఖాస్తుదారు నుండి అనేక ముఖ్యమైన పత్రాలను తీసుకుంటారు. ఆదాయపు పన్ను రిటర్న్, లాభ-నష్ట స్టేట్‌మెంట్, బ్యాలెన్స్ షీట్, బ్యాంక్ స్టేట్‌మెంట్ వంటివి ఇందులో ఉంటాయి. వీటిని బట్టి ఆ వ్యక్తి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అంచనా వేస్తారు. దీంతో పాటు ఆ వ్యక్తి వ్యాపారం ఎలా సాగుతుందో కూడా తెలుస్తుంది.
ఆదాయం
గృహ రుణం ఇచ్చే బ్యాంకుకు స్వయం ఉపాధి పొందే వ్యక్తి నికర ఆదాయం చాలా ముఖ్యం. దీని ఆధారంగా ఆ వ్యక్తికి నెలకు ఎంత డబ్బు అందుతుందో బ్యాంకుకు తెలుస్తుంది. బ్యాంకు అనేక రకాల డాక్యుమెంట్ల నుండి ఈ విషయాన్ని గుర్తించి, దాని ఆధారంగా లోన్ ఇస్తుంది. రుణ గ్రహీత అన్ని ఈఎంఐలను సకాలంలో చెల్లించగలడా లేదా అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి నికర ఆదాయం బ్యాంకుకు సహాయపడుతుంది.
ఇక రుణ గ్రహీతకు ఇతర ఆదాయాలు ఏమైనా ఉన్నాయా.. లేదా వ్యాపారంపై మాత్రమే ఆధారపడి ఉన్నాడా అని కూడా బ్యాంక్ చూస్తుంది. ఇతర వనరుల నుండి వచ్చే ఈ ఆదాయం అంటే అద్దె ఆదాయం, ఎక్కడైనా పెట్టుబడి లేదా రియల్ ఎస్టేట్ నుండి వచ్చే ఆదాయం కావచ్చు. ఆ వ్యక్తి ఇతర వనరుల నుండి కూడా సంపాదిస్తున్నట్లయితే అది మంచి సంకేతం. ఇది సులభంగా గృహ రుణం పొందే అవకాశాలను పెంచుతుంది.
క్రెడిట్ స్కోర్
ఏదైనా వ్యక్తికి హోమ్ లోన్ ఇచ్చే ముందు బ్యాంకు ఆ వ్యక్తి క్రెడిట్ స్కోర్‌ను (Credit score) కూడా తనిఖీ చేస్తుంది. సదరు వ్యక్తి క్రెడిట్‌కి సంబంధించి ఎలా ఉన్నాడు.. అంటే సకాలంలో రుణం చెల్లించాడా లేదా అనేది ఇది చూపిస్తుంది. స్వయం ఉపాధి పొందే వ్యక్తి క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే సులభంగా గృహ రుణం పొందవచ్చు. కానీ క్రెడిట్ స్కోర్ బాగా లేకపోతే లోన్ పొందడం కష్టం కావచ్చు. సాధారణంగా ఈ క్రెడిట్ స్కోర్ అనేది 300-900 మధ్య ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment