Self employed
-
‘విశ్మకర్మ యోజన’లో ఏపీకి రెండో స్థానం
సాక్షి, అమరావతి: సంప్రదాయ చేతివృత్తుల వారి కోసం కేంద్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద శిక్షణ, లబ్ధి పొందిన మహిళల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్‌కు రెండో స్థానం దక్కింది. మొదటి స్థానంలో కర్ణాటక ఉండగా.. మూడో స్థానంలో గుజరాత్, నాలుగో స్థానంలో జమ్మూకశ్మీర్, ఐదో స్థానంలో మహారాష్ట్ర ఉన్నాయి. ఈ వివరాలను కేంద్ర నైపుణ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 3,03,161 మందికి లబ్ధి గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జూలై వరకు 10 నెలల కాలంలో ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 3,03,161 మంది చేతివృత్తుల వారికి శిక్షణ, లబ్ధి చేకూరగా.. ఇందులో 50 శాతానికి పైగా (2,74,703 మంది) మహిళలు ఉన్నారని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పథకం కింద 2.41 లక్షల మంది మహిళలు టైలరింగ్‌లో శిక్షణ, లబ్ధి పొందినట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది.ఈ పథకం కింద వడ్రంగి, పడవల తయారీ, కమ్మరి, ఆయుధాల తయారీ, సుత్తి ఇతర పనిముట్లు తయారీ, తాళాల మరమ్మతులు, శిల్ప కళాకారులు, స్వర్ణకారులు, కుమ్మరి, చెప్పులు కుట్టేవారు, తాపీ పనివారు, బుట్ట, చాప, చీపర్ల తయారీ, బొమ్మలు తయారీ, క్షురకులు, పూలదండలు తయారు చేసేవారు, రజకులు, దర్జీలు, చేపల వలలు తయారు చేసేలాంటి 18 రకాల చేతివృత్తుల వారు నమోదయ్యే అవకాశం కేంద్రం కల్పించింది. ఈ పథకం కింద నమోదైన చేతి వృత్తుల వారికి సర్టిఫికెట్తో పాటు గుర్తింపు కార్డు ఇస్తారు. ఈ గుర్తింపు ద్వారా ఆయా చేతి వృత్తుల వారికి శిక్షణ ఇవ్వడంతోపాటు ఆ వృత్తికి సంబంధించి టూల్ కిట్స్ రాయితీపై అందించడం, స్వయం ఉపాధి పొందేందుకు తొలి విడతలో వ్యాపార వృద్ధికి రూ.1 లక్ష రుణం ఇస్తారు. ఈ రుణం తీర్చిన తరువాత రెండో విడతగా రూ.2 లక్షలు రుణం ఇస్తారు. -
Sagubadi: వేపతో స్వయం ఉపాధి..
వారంతా వ్యవసాయం చేసుకునే సాధారణ మహిళలు.. కానీ సేంద్రియ ఉత్పత్తులు తయారుచేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. వృథాగా భూమిలో కలిసి పోయే వేప గింజల నుంచి విలువైన వేప నూనె, వేప పిండిని తయారు చేసి విక్రయిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి విజయ గాథలోకి వెళదాం...సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అల్గ్ల్ గ్రామంలో సుమారు 15 మంది మహిళలు మూడు స్వయం సహాయక బృందాలుగా ఏర్పడ్డారు. ఐదుగురికి ఒక్కో యూనిట్ చొప్పున మూడు యూనిట్లు స్థాపించుకున్నారు. మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్ జిల్లాలోని వివిధప్రాంతాలకు వెళ్లి వేప గింజలను కొనుగోలు చేసుకుని తెచ్చుకుంటారు. ఇటు వ్యవసాయం చేసుకుంటూనే సమయం దొరికినప్పుడు వేప నూనె, వేప పిండిని తయారు చేస్తున్నారు.ఏటా వేప చెట్లకు కాసే వేప కాయలు పండి రాలిపోతుంటాయి. ఇలా రాలిపోయిన గింజలను ఆయాప్రాంతాల్లోని మహిళలు, గిరిజనులు సేకరిస్తుంటారు. ఇలా సేకరించి తెచ్చిన గింజలకు అంటుకున్న మట్టిని తొలగించి, ఎండబెట్టి ్రపాసెస్ చేస్తుంటారు. క్వింటాలు గింజలకు ఐదు లీటర్ల వరకు వేప నూనె, 70 నుంచి 90 కిలోల వరకు నూనె తీసిన వేప పిండి (కేకు) తయారవుతుంది. గింజల నాణ్యత బాగుంటే నూనె కాస్త ఎక్కువ వస్తుంది. వేప నూనెను వ్యవసాయంలో పంటలపై చీడపీడల నివారణకు పిచికారీ చేస్తుంటారు. ఔషధాల తయారీకి, చర్మవ్యాధుల నివారణకూ వాడుతుంటారు. వేప పిండిని పంటల సాగులో సేంద్రియ ఎరువుగా వినియోగిస్తుంటారు. వివిధ జిల్లాల్లో సేంద్రియ సాగు చేసే రైతులు వచ్చి కొనుగోలు చేసుకొని తీసుకెళుతుంటారు. ఇప్పుడు ఫోన్లో ఆర్డర్ తీసుకొని ఆర్టీసీ కార్గో ద్వారా కూడా పంపుతున్నారు.దారి చూపిన డీడీఎస్..చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజ పంటలు సాగు చేసే సేంద్రియ రైతులను ప్రోత్సహించే స్వచ్చంద సంస్థ డక్కన్ డవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) వీరికి వేప కాయలతో సేంద్రియ ఉత్పత్తుల తయారీ పద్ధతిని నేర్పించింది. సుమారు రెండు దశాబ్దాల క్రితమే వేప గింజల నుంచి నూనె, వేప పిండి తీసే యంత్రాల కొనుగోలు చేసేందుకు రుణ సహాయం అందించింది. ఇప్పుడు ఆ యంత్రాలు పనిచేయడం లేదు. అప్పటి మహిళలకు వయస్సు మీద పడటంతో వారి కోడళ్లు, కూతుళ్లు ఈ యూనిట్లను నడుపుతున్నారు. పాతయంత్రాలు పనిచేయకపోవడంతో కొత్త యంత్రాలను కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇందుకోసం బ్యాంకుల ద్వారా కొంత మొత్తాన్ని రుణంగా పొందారు. ఈ రుణంపై వడ్డీలు పెరిగిపోతుండటం తమకు భారంగా మారిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ రుణాలను మాఫీ చేసిప్రోత్సహించాలని, లేదంటే కనీసం రుణంపై వడ్డీనైనా మాఫీ చేయాలని మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. – పాత బాలప్రసాద్, సాక్షి, మెదక్ జిల్లా ఫొటోలు: మాతంశెట్టి మల్లన్న, జహీరాబాద్ టౌన్అప్పు భారమైంది..ఇటు వ్యవసాయం పని చేసుకుంటూనే ఏడాదిలో 6నెలల పాటు వేప నూనె, వేప చెక్క (కేక్) తయారు చేస్తున్నాం. మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం సాయం చేయాలి. ఎక్కువ ధర వచ్చేలా చూడాలి. ప్రస్తుతం సరైన మార్కెట్ లేకపోవడంతో చేసిన కష్టమంతా వృథా అవుతోంది. బ్యాంకు రుణాలను వడ్డీతో కలిపి చెల్లిస్తే మాకు ఏమీ మిగలడం లేదు. బ్యాంకు రుణం రద్దు చేయాలి. కనీసం వడ్డీ అయినా రద్దు చేయాలి. – దవలమ్మ, స్వయం సహాయక బృందం సభ్యురాలుఆర్టీసీ కార్గో ద్వారా పంపుతాం..జడ్చర్ల, కోస్గి వంటిప్రాంతాలకు వెళ్లి వేపగింజలను కొనుగోలు చేసి తెచ్చుకొని వేప నూనె, వేప చెక్క తయారు చేస్తున్నాం. ఇప్పుడు గింజలు దొరకడం కష్టమవుతోంది. ఏడాదిలో ఆరు నెలలు ఈ పనే చేస్తున్నాం. వేప గింజల రేట్లు పెరిగినా వేప నూనె (కిలో రూ.400), వేప చెక్క/కేక్ (కిలో రూ. 35) రేటు పెంచలేదు. వివిధ జిల్లాల్లో సేంద్రియ సాగు చేసే రైతులు ఇక్కడి వచ్చి కొనుగోలు చేసుకొని తీసుకెళుతుంటారు. ఇప్పుడు ఫోన్లో ఆర్డర్ తీసుకొని ఆర్టీసీ కార్గో ద్వారా కూడా పంపుతున్నాం. – సువర్ణమ్మ (88979 04571), స్వయం సహాయక బృందం సభ్యురాలు -
స్వయం ఉపాధికి ‘తోడు’
పేదలకు మేలు చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన మహాయజ్ఞంలో ‘జగనన్న తోడు’ ఒక విప్లవం లాంటిది. అందరం కలసికట్టుగా ఒక్కటైతే పేదవాడికి మంచి జరిగే ఈ మహాయజ్ఞం సత్ఫలితాలనిస్తుంది. ఈ రోజు అదే జరుగుతోంది. చిరువ్యాపారులైన నా 15,87,000 మంది అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు ఇప్పటిదాకా మంచి జరిగింది. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఒకరిపై ఆధారపడకుండా స్వయం ఉపాధితో జీవించడమే కాకుండా మరో ఒకరిద్దరికి సైతం ఉపాధి కల్పిస్తున్న చిరువ్యాపారులు అధిక వడ్డీల బారిన పడకుండా వడ్డీ లేని రుణాలతో ఆదుకుంటున్నట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ‘జగనన్న తోడు’ పథకం ద్వారా తాజా లబ్ధిదారులతో కలిపితే ఇప్పటివరకు 15,87,000 మంది చిరు వ్యాపారులకు ప్రయోజనం చేకూరుస్తూ వడ్డీ లేని రుణం కింద రూ.2,955.79 కోట్లు ఇవ్వగలిగామన్నారు. పథకం ద్వారా సున్నా వడ్డీ కింద మరో రూ.74.69 కోట్లు చెల్లించి వారికి మేలు చేసినట్లు చెప్పారు. వరుసగా నాలుగో ఏడాది జగనన్న తోడు పథకం అమలు సందర్భంగా వడ్డీలేని రుణాలు, వడ్డీ రీయింబర్స్మెంట్ నిధులను మంగళవారం బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడారు. ఆ పరిస్థితులను మార్చాలనే ఆరాటంతో నా సుదీర్ఘ పాదయాత్రలో చాలాచోట్ల ఫుట్‌పాత్‌లపై చిరు వ్యాపారులు, బండ్లపై టిఫిన్లు విక్రయిస్తూ పొట్ట పోసుకునే వారి కష్టాలను స్వయంగా చూశా. రోజువారీ పెట్టుబడికి కావాల్సిన రూ.1,000 కోసం అధిక వడ్డీలకు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. రూ.వెయ్యి తీసుకుంటే ముందుగానే రూ.100 కట్ చేసుకుని సాయంత్రానికి తిరిగి రూ.1,000 వెనక్కి ఇవ్వాలని ప్రైవేట్ వ్యాపారులు షరతు విధించేవారు. చిరు వ్యాపారులకు గత్యంతరం లేక ఆ వడ్డీ వ్యాపారుల మీదే ఆధారపడాల్సిన దుస్థితిని నాడు చూశా. ఐదారు రూపాయల వడ్డీకి దొరికితే అదే అదృష్టంగా భావించే దారుణ పరిస్థితిని అప్పట్లో గమనించా. అవన్నీ చూశాక ఆ పరిస్థితులను మార్చాలన్న ఆరాటం నుంచి ‘జగనన్న తోడు’ పథకం పుట్టింది. వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిరు వ్యాపారులందరికీ మేలు.. పుట్‌పాత్‌ల మీద, వీధుల్లో తోపుడుబండ్ల మీద పండ్లు, కూరగాయలు, వస్తువులు, ఆహార పదార్థాలను అమ్ముకునేవారు, రోడ్ పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహిస్తున్నవారు, గంపలు, బుట్టలతో వస్తువులు అమ్మేవారు, ఆటోలు, సైకిళ్లపై వెళ్లి వ్యాపారం చేసేవారితో పాటు చేనేత కార్మికులు, సంప్రదాయ చేతివత్తుల కళాకారులు, ఇత్తడి పనిమీద బతికేవారు, బొబ్బిలి వీణలు తయారు చేసేవారు, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, కళంకారీ, తోలుబొమ్మల తయారుదారులు, లేసు వర్కర్స్.. అందరికీ ఈ పథకం ఉపయోగపడుతుంది. ఒక్కొక్కరికి ఏటా రూ.10 వేలు అందిస్తూ సకాలంలో కిస్తీలను చెల్లించినవారికి అదనంగా ఏటా రూ.వెయ్యి చొప్పున జోడిస్తూ రూ.13,000 వరకు వడ్డీలేని రుణాలను అందజేస్తున్నాం. ఈ పథకం కింద ఇవాళ వరుసగా నాలుగో ఏడాది 5,10,412 మంది చిరు వ్యాపారులకు రూ.549.70 కోట్ల వడ్డీలేని రుణాలతో పాటు రుణాలపై కిస్తీలను సకాలంలో చెల్లించిన వారికి రూ.11.03 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ డబ్బులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. దేశం మొత్తం కంటే ఏపీలోనే ఎక్కువ లబ్ధిదారులు.. దేశంలో ఎక్కడా ఇన్ని లక్షల మంది చిరువ్యాపారులకు మంచి చేసే కార్యక్రమం జరగడం లేదు. లబ్ధిదారుల సంఖ్యలో దేశం మొత్తం ఒకవైపు ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో అంతకంటే ఎక్కువ మంది ఉండటం అరుదైన ఘటన. ఈ స్థాయిలో సత్ఫలితాలు సాధించేలా పథకాన్ని నడిపిస్తున్న సచివాలయ వ్యవస్ధ, వలంటీర్లు, వివిధ ప్రభుత్వ శాఖలతో పాటు ప్రధానంగా ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందిస్తున్న బ్యాంకర్లకు ధన్యవాదాలు. లబ్ధిదారుడికి మొదటి విడత రూ.10 వేలతో ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఇదొక రికరింగ్ అకౌంట్. సకాలంలో డబ్బులు చెల్లించిన వెంటనే బ్యాంకులు వారికి మళ్లీ రుణాలు మంజూరు చేసి తోడుగా నిలబడతాయి. ఈ క్రమంలో వారు కట్టిన వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి ఆయా ఖాతాల్లోకి చెల్లిస్తుంది. అక్కచెల్లెమ్మలే అత్యధికం.. జగనన్న తోడు పథకం ద్వారా లబ్ధి పొందిన 15.87 లక్షల మందిలో 80 శాతం మంది అక్కచెల్లెమ్మలే ఉన్నారు. ఇది నిజంగా ఒక విప్లవం. ఇందులోనూ 80 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కావడం మరొక విప్లవం. సామాజికంగా అట్టడుగున ఉన్నవారందరికీ ఇది ఉపయోగపడుతుంది. అక్కచెల్లెమ్మలందరికీ మేలు చేసే గొప్ప కార్యక్రమమిది. దీనిద్వారా అందరూ బాగుపడాలని మనసారా కోరుకుంటున్నా. అందరి మేలు కోసం తపించే ప్రభుత్వమిది.. చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారిలో ఎవరికైనా ఈ పథకం పొరపాటున రాని పరిస్థితి ఉంటే వెంటనే మీ సమీపంలోని సచివాలయంలో సంప్రదించండి. అక్కడ సిబ్బంది మీకు అందుబాటులో ఉంటూ తోడుగా నిలుస్తారు. వలంటీర్‌ని అడిగినా దగ్గరుండి దరఖాస్తు చేయించి వెరిఫై అనంతరం పథకం అందేలా చేస్తారు. లేదా 1902 నెంబర్‌కు ఫోన్ చేసినా మీకు ఈ పథకం అందించేలా సహాయపడతారు. అర్హత ఉన్నవారు ఏ ఒక్కరూ మిగిలిపోకూడదు.. ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని తాపత్రయ పడే ప్రభుత్వం మనది. ప్రతి రెండు సచివాలయాలకు చెందిన సిబ్బంది, వలంటీర్లు ఒక బ్యాంకుతో అనుసంధానమై జగనన్న తోడు ద్వారా రుణాలు ఇప్పించడంతో పాటు లబ్ధిదారులతో తిరిగి కట్టించేలా అంతే ప్రాధాన్యతగా కార్యక్రమాన్ని చేపట్టాలి. బ్యాంకర్లకు నమ్మకం పెరిగే కొద్దీ సంఖ్య పెరుగుతుంది. లబ్ధిదారుల సంఖ్య పెరగాలంటే క్రమశిక్షణతో సకాలంలో రుణాలను తిరిగి చెల్లించాలి. దీన్ని ప్రోత్సహించేందుకే సున్నా వడ్డీ కింద ఆర్నెళ్లకు ఒకసారి ప్రయోజనం చేకూరుస్తూ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఈ రుణం తీర్చుకోలేనిది ఇంటి వద్దే చీరల వ్యాపారం నిర్వహించే నాకు చేయూత, ఆసరా, జగనన్న తోడు పథకాలతో ప్రభుత్వం అండగా నిలిచింది. కుట్టు మిషన్‌కు మోటర్ అమర్చుకుని రోజుకు రూ.800 వరకు సంపాదిస్తున్నా. నా భర్తకు ప్రైవేట్ ఆస్పత్రిలో గుండె ఆపరేషన్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేశారు. జగనన్న తోడు పథకం కింద అందిన డబ్బులతో నా భర్త ఇంటి వద్దే టీ దుకాణం ఏర్పాటు చేశారు. ఉన్నతి, సీఐఎఫ్ రుణాల ద్వారా అందిన డబ్బులతో టీ దుకాణాన్ని కిరాణా షాపుగా మార్చుకుని నా కుటుంబం ఎంతో సంతోషంగా జీవిస్తోంది. మాకు ఇంత అండగా నిలిచిన జగనన్న రుణం తీర్చుకోలేనిది. – జే లలితకుమారి, మద్దులూరు, సంతనూతలపాడు మండలం, ప్రకాశం జిల్లా -
యువత స్వయం ఉపాధి పొందాలి
నల్లగొండ రూరల్ : నిరుద్యోగులు స్వయం ఉపాధితో మరొకరికి ఉపాధి కల్పించవచ్చని ఎస్బీహెచ్ రైసెట్ సంస్థ డైరెక్టర్ ఎన్.సి.శ్రీధర్ అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు బ్యూటీపార్లర్ మేనేజ్మెంట్, కంప్యూటర్ బేసిక్స్‌పై శిక్షణ పూర్తి చేసుకున్న వారికి మంగళవారం సంస్థ కార్యాలయంలో సర్టిఫికెట్లు అందజేసి మాట్లాడారు. నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు వివిధ అంశాలపైన శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. చిన్నచిన్న శిక్షణలతో స్వయం ఉపాధి లభిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వేణు, వాల్యానాయక్, జనార్దన్, స్వర్ణలత, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
దళితుల దరిచేరని పథకాలు
* ముందుకు కదలని భూపంపిణీ * లక్ష్యం చేరని స్వయం ఉపాధి * మొండికేస్తున్న బ్యాంకులు * నేడు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి రాక * సంక్షేమ పథకాలపై సమీక్ష కరీంనగర్ : దళితుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఆచరణకు నోచుకోవడం లేదు. లక్ష్యం ఘనంగా ఉన్నా క్షేత్రస్థాయిలో అమలుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఫలితంగా పథకాలు దళితుల దరికి చేరడం లేదు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూపంపిణీ ఒక అడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కు అన్న చందంగా తయారు కాగా, స్వయం ఉపాధి రుణాలదీ అదే బాట. దళితులకు ప్రభుత్వ పథకాలు ఆమడదూరంలో ఉంటున్నాయి. హడావుడి చేసి ప్రారంభించిన కుటుంబానికి మూడెకరాల భూ పంపిణీకి మళ్లీ మోక్షం కలగడం లేదు. పథకాన్ని ప్రారంభించి ఐదు నెలలవుతుండగా ప్రభుత్వ భూముల కొరతతో ఇప్పటివరకు 216 మందికి మాత్రమే పత్రాలు అందించారు. జిల్లాలో 1.77 లక్షల ఎస్సీ కుటుంబాలుండగా, ఇందులో అసలు భూమిలేని కుటుంబాలు 1.50 లక్షలు. పథకం ప్రారంభానికి ముందు మండలానికో గ్రామం ఎంపిక చేసి పంచాలని నిర్ణయించినా... భూముల కొరతతో నియోజకవర్గానికో గ్రామాన్ని ఎంపిక చేశారు. 12 నియోజకవర్గాల్లో 16 గ్రామాలను ఎంపిక చేసి మొదటా 122 మంది లబ్ధిదారులను గుర్తించి ఆగస్టు 15న 307.57 ఎకరాల భూపంపిణీ పత్రాలు అందించారు. అనంతరం మరో 94 మంది లబ్ధిదారులను గుర్తించారు. మొత్తంగా ఇప్పటివరకు 216 మందికి 558 ఎకరాల 29 గుంటలు పంచారు. ఇందులో ప్రభుత్వ భూములు 119 ఎకరాలు కాగా 53 మందికి, 129 ఎకరాల ప్రైవేట్ భూమిని 163 మందికి పంపిణీ చేశారు. రిజిస్ట్రేషన్ చేసింది కొంతే... భూపంపిణీ కింద జిల్లాకు రూ.24 కోట్లు విడుదల కాగా, భూముల కొనుగోలుకు రూ.12.75 కోట్లు వెచ్చించారు. ఈ మొత్తం ఆర్డీవో ఖాతాల్లో చేరాయి. ఆర్భాటంగా పత్రాలిచ్చిన్పటికీ పలు చోట్ల ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించిన భూమికి డబ్బులు ఇవ్వకపోగా... లబ్ధిదారులకు ఇంకా భూములు అప్పగించలేదు. హద్దులు నిర్ణయించలేదు. ఫలితంగా సాగుభూమి బీడుగా ఉంటోంది. మొత్తంగా జిల్లాలో 248 ఎకరాల భూమి 111 మంది లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేసినట్లు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. అంటే పంపిణీ చేసిన వారిలోనే ఇంకా 52 మందికి రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. జిల్లాలో మార్చి నెలాఖరులోగా ఆరు వేల ఎకరాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా పరిస్థితులు ఇలాగే ఉంటే కార్యరూపం దాల్చడం అనుమానమే. స్వయం ఉపాధిదీ అదే తీరు గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా గత జనవరిలో పెద్ద ఎత్తున స్వయం ఉపాధి రుణాల కోసం స్వీకరించిన దరఖాస్తులకు ఏడాది గడిచినా మోక్షం లేదు. అప్పటి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా నియామకమైన జిల్లా వాసి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ రెండు సార్లు అధికారులతో సమావేశమై రుణాలకు బ్యాంకు అనుమతి పత్రాలు కొర్రీలు పెట్టకుండా ఇవ్వాలని ఆదేశించారు. అంతలోనే గవర్నర్ పాలన వచ్చి... వరుస ఎన్నికలతో రుణాల ప్రక్రియ నిలిచిపోయింది. బ్యాంకు అనుమతి పత్రాలు పొందిన నిరుద్యోగులు రుణాల కోసం ఇప్పటికీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2380 యూనిట్లకు రూ.32.16 కోట్లు మంజూరు చేసింది. 3225 దరఖాస్తులు రాగా 2682 మందికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకారం తెలిపాయి. లక్ష్యానికి మించి 299 మందికి కూడా రుణాలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు అధికారులు ప్రకటించినా... ఇప్పటివరకు 35 శాతం యూనిట్లు కూడా గ్రౌండింగ్ కాలేదు. తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.15.6 కోట్లతో 1514 యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో రూ. 8.78 కోట్లు సబ్సిడీ ఉండా రూ.6.29 కోట్లు బ్యాంకులు రుణంగా ఇవ్వాల్సి ఉంది. ఎస్టీ కార్పొరేషన్‌కు రూ.310 కోట్లతో 316 మందికి లబ్ధి చేకూర్చాలని నిర్ణయించారు. 352 దరఖాస్తులు రాగా 45 శాతం గ్రౌండింగ్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. బ్యాంకులదీ అదేబాట నిరుద్యోగులకు రుణాల మంజూరుకు అనుమతి పత్రాలు ఇవ్వడంలో బ్యాంకులు పాత బాటనే పయనిస్తున్నాయి. స్వయం ఉపాధి కింద ఇచ్చిన రుణాలు తిరిగి చెల్లించడం లేదని, బకాయిలు పేరుకుపోయాయని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. రుణాల చెల్లింపుపై ప్రభుత్వం స్పష్టమైన విధానాలు రూపొందిస్తే రుణాలిచ్చేందుకు సిద్ధమేనని చెబుతున్నారు. ఓవైపు జిల్లా యంత్రాంగం జనవరి 26న యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని నిర్ణయించగా... లక్ష్యం నెరవేరుతుందో లేదో చూడాలి. నేడు జిల్లాకు చైర్మన్ ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పిడమర్తి రవి శుక్రవారం జిల్లాకు రానున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న పథకాలపై అధికారులతో ఆయన సమీక్షించనున్నారు. పథకాల వేగవంతంపై దళితులంతా ఆయనపైనే ఆశలు పెట్టుకున్నారు.