జగనన్న తోడు లబ్ధిదారులకు చెక్కును అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
పేదలకు మేలు చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన మహాయజ్ఞంలో ‘జగనన్న తోడు’ ఒక విప్లవం లాంటిది. అందరం కలసికట్టుగా ఒక్కటైతే పేదవాడికి మంచి జరిగే ఈ మహాయజ్ఞం సత్ఫలితాలనిస్తుంది. ఈ రోజు అదే జరుగుతోంది. చిరువ్యాపారులైన నా 15,87,000 మంది అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు ఇప్పటిదాకా మంచి జరిగింది.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఒకరిపై ఆధారపడకుండా స్వయం ఉపాధితో జీవించడమే కాకుండా మరో ఒకరిద్దరికి సైతం ఉపాధి కల్పిస్తున్న చిరువ్యాపారులు అధిక వడ్డీల బారిన పడకుండా వడ్డీ లేని రుణాలతో ఆదుకుంటున్నట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ‘జగనన్న తోడు’ పథకం ద్వారా తాజా లబ్ధిదారులతో కలిపితే ఇప్పటివరకు 15,87,000 మంది చిరు వ్యాపారులకు ప్రయోజనం చేకూరుస్తూ వడ్డీ లేని రుణం కింద రూ.2,955.79 కోట్లు ఇవ్వగలిగామన్నారు.
పథకం ద్వారా సున్నా వడ్డీ కింద మరో రూ.74.69 కోట్లు చెల్లించి వారికి మేలు చేసినట్లు చెప్పారు. వరుసగా నాలుగో ఏడాది జగనన్న తోడు పథకం అమలు సందర్భంగా వడ్డీలేని రుణాలు, వడ్డీ రీయింబర్స్‌మెంట్ నిధులను మంగళవారం బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడారు.
ఆ పరిస్థితులను మార్చాలనే ఆరాటంతో
నా సుదీర్ఘ పాదయాత్రలో చాలాచోట్ల ఫుట్‌పాత్‌లపై చిరు వ్యాపారులు, బండ్లపై టిఫిన్లు విక్రయిస్తూ పొట్ట పోసుకునే వారి కష్టాలను స్వయంగా చూశా. రోజువారీ పెట్టుబడికి కావాల్సిన రూ.1,000 కోసం అధిక వడ్డీలకు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. రూ.వెయ్యి తీసుకుంటే ముందుగానే రూ.100 కట్ చేసుకుని సాయంత్రానికి తిరిగి రూ.1,000 వెనక్కి ఇవ్వాలని ప్రైవేట్ వ్యాపారులు షరతు విధించేవారు.
చిరు వ్యాపారులకు గత్యంతరం లేక ఆ వడ్డీ వ్యాపారుల మీదే ఆధారపడాల్సిన దుస్థితిని నాడు చూశా. ఐదారు రూపాయల వడ్డీకి దొరికితే అదే అదృష్టంగా భావించే దారుణ పరిస్థితిని అప్పట్లో గమనించా. అవన్నీ చూశాక ఆ పరిస్థితులను మార్చాలన్న ఆరాటం నుంచి ‘జగనన్న తోడు’ పథకం పుట్టింది.
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
చిరు వ్యాపారులందరికీ మేలు..
పుట్‌పాత్‌ల మీద, వీధుల్లో తోపుడుబండ్ల మీద పండ్లు, కూరగాయలు, వస్తువులు, ఆహార పదార్థాలను అమ్ముకునేవారు, రోడ్ పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహిస్తున్నవారు, గంపలు, బుట్టలతో వస్తువులు అమ్మేవారు, ఆటోలు, సైకిళ్లపై వెళ్లి వ్యాపారం చేసేవారితో పాటు చేనేత కార్మికులు, సంప్రదాయ చేతివత్తుల కళాకారులు, ఇత్తడి పనిమీద బతికేవారు, బొబ్బిలి వీణలు తయారు చేసేవారు, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, కళంకారీ, తోలుబొమ్మల తయారుదారులు, లేసు వర్కర్స్.. అందరికీ ఈ పథకం ఉపయోగపడుతుంది.
ఒక్కొక్కరికి ఏటా రూ.10 వేలు అందిస్తూ సకాలంలో కిస్తీలను చెల్లించినవారికి అదనంగా ఏటా రూ.వెయ్యి చొప్పున జోడిస్తూ రూ.13,000 వరకు వడ్డీలేని రుణాలను అందజేస్తున్నాం. ఈ పథకం కింద ఇవాళ వరుసగా నాలుగో ఏడాది 5,10,412 మంది చిరు వ్యాపారులకు రూ.549.70 కోట్ల వడ్డీలేని రుణాలతో పాటు రుణాలపై కిస్తీలను సకాలంలో చెల్లించిన వారికి రూ.11.03 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్ డబ్బులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నాం.
దేశం మొత్తం కంటే ఏపీలోనే ఎక్కువ లబ్ధిదారులు..
దేశంలో ఎక్కడా ఇన్ని లక్షల మంది చిరువ్యాపారులకు మంచి చేసే కార్యక్రమం జరగడం లేదు. లబ్ధిదారుల సంఖ్యలో దేశం మొత్తం ఒకవైపు ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో అంతకంటే ఎక్కువ మంది ఉండటం అరుదైన ఘటన. ఈ స్థాయిలో సత్ఫలితాలు సాధించేలా పథకాన్ని నడిపిస్తున్న సచివాలయ వ్యవస్ధ, వలంటీర్లు, వివిధ ప్రభుత్వ శాఖలతో పాటు ప్రధానంగా ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందిస్తున్న బ్యాంకర్లకు ధన్యవాదాలు.
లబ్ధిదారుడికి మొదటి విడత రూ.10 వేలతో ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఇదొక రికరింగ్ అకౌంట్. సకాలంలో డబ్బులు చెల్లించిన వెంటనే బ్యాంకులు వారికి మళ్లీ రుణాలు మంజూరు చేసి తోడుగా నిలబడతాయి. ఈ క్రమంలో వారు కట్టిన వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి ఆయా ఖాతాల్లోకి చెల్లిస్తుంది.
అక్కచెల్లెమ్మలే అత్యధికం..
జగనన్న తోడు పథకం ద్వారా లబ్ధి పొందిన 15.87 లక్షల మందిలో 80 శాతం మంది అక్కచెల్లెమ్మలే ఉన్నారు. ఇది నిజంగా ఒక విప్లవం. ఇందులోనూ 80 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కావడం మరొక విప్లవం. సామాజికంగా అట్టడుగున ఉన్నవారందరికీ ఇది ఉపయోగపడుతుంది. అక్కచెల్లెమ్మలందరికీ మేలు చేసే గొప్ప కార్యక్రమమిది. దీనిద్వారా అందరూ బాగుపడాలని మనసారా కోరుకుంటున్నా.
అందరి మేలు కోసం తపించే ప్రభుత్వమిది..
చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారిలో ఎవరికైనా ఈ పథకం పొరపాటున రాని పరిస్థితి ఉంటే వెంటనే మీ సమీపంలోని సచివాలయంలో సంప్రదించండి. అక్కడ సిబ్బంది మీకు అందుబాటులో ఉంటూ తోడుగా నిలుస్తారు. వలంటీర్‌ని అడిగినా దగ్గరుండి దరఖాస్తు చేయించి వెరిఫై అనంతరం పథకం అందేలా చేస్తారు. లేదా 1902 నెంబర్‌కు ఫోన్ చేసినా మీకు ఈ పథకం అందించేలా సహాయపడతారు. అర్హత ఉన్నవారు ఏ ఒక్కరూ మిగిలిపోకూడదు.. ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని తాపత్రయ పడే ప్రభుత్వం మనది.
ప్రతి రెండు సచివాలయాలకు చెందిన సిబ్బంది, వలంటీర్లు ఒక బ్యాంకుతో అనుసంధానమై జగనన్న తోడు ద్వారా రుణాలు ఇప్పించడంతో పాటు లబ్ధిదారులతో తిరిగి కట్టించేలా అంతే ప్రాధాన్యతగా కార్యక్రమాన్ని చేపట్టాలి. బ్యాంకర్లకు నమ్మకం పెరిగే కొద్దీ సంఖ్య పెరుగుతుంది. లబ్ధిదారుల సంఖ్య పెరగాలంటే క్రమశిక్షణతో సకాలంలో రుణాలను తిరిగి చెల్లించాలి. దీన్ని ప్రోత్సహించేందుకే సున్నా వడ్డీ కింద ఆర్నెళ్లకు ఒకసారి ప్రయోజనం చేకూరుస్తూ పథకాన్ని అమలు చేస్తున్నాం.
ఈ రుణం తీర్చుకోలేనిది
ఇంటి వద్దే చీరల వ్యాపారం నిర్వహించే నాకు చేయూత, ఆసరా, జగనన్న తోడు పథకాలతో ప్రభుత్వం అండగా నిలిచింది. కుట్టు మిషన్‌కు మోటర్ అమర్చుకుని రోజుకు రూ.800 వరకు సంపాదిస్తున్నా. నా భర్తకు ప్రైవేట్ ఆస్పత్రిలో గుండె ఆపరేషన్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేశారు. జగనన్న తోడు పథకం కింద అందిన డబ్బులతో నా భర్త ఇంటి వద్దే టీ దుకాణం ఏర్పాటు చేశారు. ఉన్నతి, సీఐఎఫ్ రుణాల ద్వారా అందిన డబ్బులతో టీ దుకాణాన్ని కిరాణా షాపుగా మార్చుకుని నా కుటుంబం ఎంతో సంతోషంగా జీవిస్తోంది. మాకు ఇంత అండగా నిలిచిన జగనన్న రుణం తీర్చుకోలేనిది.
– జే లలితకుమారి, మద్దులూరు, సంతనూతలపాడు మండలం, ప్రకాశం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment