సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా చిరువ్యాపారులకు చేయూతనందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ‘జగనన్న తోడు’ ఏడో విడత కార్యక్రమం మంగళవారం జరగనుంది. ఈ కార్యక్రమంలో 5,10,412 మందికి ప్రభుత్వం మరో విడత వడ్డీ లేని రూ. 549.70 కోట్ల రుణాలను అందజేయడంతో పాటు గతంలో ఈ పథకం ద్వారా రుణాలు పొంది, సకాలంలో చెల్లించిన వారికి రూ. 11.03 కోట్ల వడ్డీ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభిస్తారు.
రాష్ట్రంలో తోపుడు బండ్లు, రోడ్ల వెంబడి చిన్న దుకాణాల్లో పండ్లు, కూరగాయలు వంటివి అమ్ముకోవడం, టీ, టిఫిన్ సహా పలు రకాల వ్యాపారాలు చేసే చిరు వ్యాపారులు రోజువారీ పెట్టుబడికి అవసరమయ్యే రూ. 5000 కూడా స్థానిక వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకొనేవారు. ఇందుకోసం రోజుకు ప్రతి వంద రూపాయలకు రూ. 3 నుంచి రూ. 10 వరకు వడ్డీ చెల్లించేవారు. వారి సంపాదనలో అత్యధిక భాగం వడ్డీలకే సరిపోయేది. అధిక వడ్డీలతో కుదేలైపోతున్న చిరువ్యాపారుల దుస్థితిని చూసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. వారికి చేయూతనందించడానికి 2020 నవంబరు 25వ తేదీన ‘జగనన్న తోడు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమం కింద చిరు వ్యాపారులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా తొలిసారి రూ. 10,000 రుణం అందజేయడంతో పాటు తీసుకున్న రుణాన్ని ప్రతి నెలా కిస్తీ రూపంలో సకాలంలో చెల్లించే వారికి ఆ రుణంపై అయ్యే వడ్డీ మొత్తం ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది. వారికి మరింత రుణ సాయాన్ని కూడా అందిస్తుంది. కొత్త వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తోంది. ఈ పథకం ద్వారా లబ్ది పొందే వారిలో దాదాపు 85% మహిళలే కావడం గమనార్హం.
ఇప్పటివరకు మొత్తం రూ. 2,955.79 కోట్ల రుణ సాయం
► ఈ పథకం ద్వారా ఇప్పటికే ఆరు విడతలుగా చిరు వ్యాపారులకు ప్రభుత్వం రుణాలు అందజేసింది. ఇప్పుడు ఏడో విడతలో రుణ పంపిణీ చేయనుంది.
► ఒక విడత రుణం తీసుకొని తిరిగి చెల్లించిన వారికి వారి వడ్డీ మొత్తాన్ని ఎప్పటికప్పుడు ఆయా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోనే ప్రభుత్వం నేరుగా జమ చేస్తోంది. వారికి తిరిగి ఇచ్చే రుణాన్ని పెంచి మళ్లీ కొత్త రుణాలు ఇప్పిస్తోంది. మొదటి విడతలో రూ.10 వేలు రుణం తీసుకొని నిర్ణీత కాలంలో చెల్లించిన వారికి రెండో విడత ఓ వెయ్యి పెంచి రూ. 11 వేలు, రెండో విడత రుణం కూడా చెల్లించిన వారికి మూడో విడతలో రూ. 12 వేలు.. ఇలా ప్రతి ఏటా పెంచుతూ రుణాలు అందజేస్తోంది.
► ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 15,87,492 మంది ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందారు. వీరిలో 13,29,011 మంది పాత రుణం చెల్లించి రెండు మూడు సార్లు కొత్త రుణాలు పొందారు.
► గత ఆరు విడతల్లో చిరు వ్యాపారులకు 29,16,504 రుణ ఖాతాల ద్వారా రూ. 2406.09 కోట్ల రుణాలను అందజేయగా.. ఏడో విడతలో అందజేసే రుణ సహాయంతో కలిపి మొత్తం రూ. 2,955.79 కోట్లు రుణ సహాయం పొందినట్టు అవుతుంది.
► ఇప్పడు ఏడో విడతలో 5,10,412 మందికి ప్రభుత్వం రుణాలు అందజేస్తుండగా.. అందులో 4,54,267 మంది గతంలో ఒకటికంటే ఎక్కువ సార్లు రుణం పొంది తిరిగి చెల్లించిన వారు. ఈసారి కొత్తగా మరో 56,145 మందికి తొలిసారి ఈ పథకం ద్వారా ప్రభుత్వం రుణం అందజేస్తోంది.
ఇప్పటివరకు రూ. 74.69 కోట్లు వడ్డీ డబ్బు జమ
జగనన్న తోడు కార్యక్రమంలో రుణాలు తీసుకొని చెల్లించిన వారికి ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు వారి వడ్డీ మొత్తాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది.
► గత ఆరు నెలల్లో సకాలంలో పాత రుణాలు పూర్తిగా చెల్లించిన 5,03,729 మంది లబ్ధిదారులకు సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి రూ.11,03,32,202 డీబీటీ విధానంలో వారి బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు.
► మంగళవారం అందజేసే వడ్డీతో కలిపి ఇప్పటి దాకా రూ. 74.69 కోట్ల మొత్తం వడ్డీ డబ్బులు 15.31 లక్షల మంది చిరువ్యాపారుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసినట్టు అవుతుందని అధికారులు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment