కోవిడ్‌ కష్టాల్లో ‘తోడు’ నీడగా | CM YS Jagan says above Rs 1 lakh crore given for Poor People | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ కష్టాల్లో ‘తోడు’ నీడగా

Published Tue, Mar 1 2022 4:06 AM | Last Updated on Wed, Jun 1 2022 3:25 PM

CM YS Jagan says above Rs 1 lakh crore given for Poor People - Sakshi

లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్న సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: కోవిడ్‌ అవస్థల నుంచి రాష్ట్రంలో ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆదుకుని ఆర్థికంగా నిలదొక్కుకునేలా రెండున్నరేళ్లలో దాదాపు రూ.1.29 లక్షల కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసినట్లు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. దేశంలో దాదాపు 82% మంది చిరు వ్యాపారులు కరోనాతో ఆదాయాన్ని కోల్పోయి కుటుంబాలను పోషించుకునేందుకు అవస్థలు ఎదుర్కొన్నట్లు పలు నివేదికల్లో వెల్లడైందన్నారు. ఇటీవల డన్‌ అండ్‌ బ్రాడ్‌ స్ట్రీట్‌ అనే సంస్థ చేసిన సర్వేలో కూడా ఇవే అంశాలను చూశామన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితిని అధిగమించి రాష్ట్రంలో ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆదుకునేందుకు పారదర్శకంగా నేరుగా నగదు జమ చేసినట్లు చెప్పారు. పేదలను దేశంలో మిగతా రాష్ట్రాల కంటే మన ప్రభుత్వమే అక్కున చేర్చుకుందని సగర్వంగా తెలియజేస్తున్నామన్నారు. జగనన్న తోడు పథకం మూడో విడత కింద పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున 5,10,462 మంది చిరు వ్యాపారులకు రూ.510.46 కోట్ల వడ్డీ లేని రుణాలు, రూ.16.16 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ కలిపి మొత్తం రూ.526.62 కోట్లను ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసి మాట్లాడారు.

మీ అన్నగా.. తమ్ముడిగా
దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ప్రతి చిరు వ్యాపారికీ వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ జగనన్న తోడు ద్వారా రూ.10 వేలు రుణం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. తాజా లబ్ధిదారులతో కలిపి ఇప్పటిదాకా 14,16,091 మందికి రూ.1,416 కోట్లు వడ్డీలేని రుణాలిచ్చి మంచి చేయగలిగామని మీ అన్నగా, తమ్ముడిగా, మీ కుటుంబ సభ్యుడిగా సంతోషంగా చెబుతున్నా. క్రమం తప్పకుండా వడ్డీ కట్టినవారందరికీ దాదాపు రూ.32.51 కోట్లు రీయింబర్స్‌మెంట్‌ కూడా చెల్లించాం.

అరకొర ఆదాయంతోనే స్వయం ఉపాధి
నిజానికి ఈ వ్యాపారాలతో పెద్దగా ఆదాయాలు వచ్చే పరిస్థితులు కూడా లేవు. అయినప్పటికీ తమకు తాము ఉపాధి కల్పించుకుంటూ నామమాత్రపు లాభాలతో సేవలందించే గొప్ప వర్గం చిరు వ్యాపారులు. నిజానికి అది వ్యాపారం అనేకంటే మనకు అందిస్తున్న గొప్ప సేవ అనడం సమంజసం. రకరకాల వస్తువులు, దుస్తులు, టీ, కాఫీ, టిఫిన్స్, కూరగాయలు, పండ్లు... తదితరాలను పుట్‌పాత్‌ మీద, తోపుడు బళ్ల మీద, రోడ్ల పక్కన, మోటార్‌ సైకిళ్ల మీద, ఇళ్ల వద్ద విక్రయించి పొట్ట పోసుకుంటున్నారు. అక్కచెల్లెమ్మలైతే ఆకుకూరలను నెత్తిమీద గంపల్లో పెట్టుకుని అమ్ముతున్నారు. మనం చేస్తున్న ఈ సహాయం లక్షల మంది చిరు వ్యాపారులు సొంత కాళ్లమీద నిలిచేందుకు ఎంతో ఉపయోగపడుతుంది.

ఆ కష్టాలను దగ్గరగా చూశా..
చిరు వ్యాపారులు తమ పొట్ట పోసుకుంటూనే అనేకమందికి మేలు చేస్తున్నారు. సరుకులు రవాణా చేసే ఆటోల వారికి, మూటలు ఎత్తే కూలీలకు, మిగతా వారికి కూడా ఉపాధి కలిగే గొప్ప వ్యవస్ధ ఇది. చిరు వ్యాపారుల జీవితాలను నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో దగ్గరగా చూశా. అసంఘటిత రంగం కావడంతో బ్యాంకు రుణాలు దక్కని పరిస్థితులను, కష్ట నష్టాలు, అవసరాలను చాలా దగ్గర నుంచి స్వయంగా చూశా. బ్యాంకు రుణాలిస్తే గ్యారంటీ ఎవరు ఇస్తారనేది పెద్ద మీమాంస.  

తోడుగా నిలబడాలనే జగనన్న తోడు...
ఇటువంటి పరిస్థితుల్లో ఈ చిరువ్యాపారులకు తోడుగా నిలబడాలి.. వారికి మంచి జరగాలి.. అండగా ఉండాలనే ఆలోచనల నుంచి జగనన్న తోడు పథకాన్ని తీసుకొచ్చాం. ప్రభుత్వమే పూచీకత్తు వహించి బ్యాంకులతో మాట్లాడి రుణాలు ఇప్పించాం. లబ్ధిదారులు క్రమం తప్పకుండా వడ్డీ చెల్లించి తిరిగి రుణం పొందేలా ప్రోత్సహిస్తున్నాం. వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరించి రీయింబర్స్‌ చేసి తోడుగా నిలుస్తోంది. 

నడ్డి విరిచే వడ్డీలకు చెల్లు
చిరు వ్యాపారులు రోజువారీ విక్రయాలు సాగించేందుకు ఇన్నాళ్లూ మరో మార్గం లేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించేవారు. వంద రూపాయలు తీసుకుంటే సాయంత్రానికి రూ.10 వడ్డీతో కలిపి తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి. రూ.10 వడ్డీతో వ్యాపారాలు నిర్వహించాల్సిన దారుణ పరిస్థితుల్లో ఈ రంగం ఉండేది. ఆ దుస్థితిని తొలగించి చిరు వ్యాపారులందరికీ మంచి చేయాలనే సంకల్పంతో ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 

ఇతర పథకాలతోనూ లబ్ధి
జగనన్న తోడు ద్వారా 14.16 లక్షల మందికిపైగా మంచి జరుగుతోంది. అంతేకాదు వారికి జగనన్న అమ్మఒడి, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న సంపూర్ణ పోషణం, వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక, ఇళ్ల పట్టాలు లాంటి వాటిలో ఒక్కొక్కరికి కనీసం మూడు, నాలుగు పథకాల ద్వారా మేలు జరిగే ఉంటుందని నా ప్రగాఢ నమ్మకం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే... వీటన్నింటి ద్వారా మార్పు రావాలి. వారి జీవితాలు మారాలి, మెరుగైన పరిస్థితుల్లో ఉండాలనే తపనతో చేస్తున్నాం.  

సంప్రదాయ చేతి వృత్తులవారికీ...
చిరు వ్యాపారులను మాత్రమే కాకుండా, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులైన ఇత్తడి పనిచేసేవారు, బొబ్బిలి వీణల తయారీదారులు, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు తయారీదారులు, కళంకారీ, తోలుబొమ్మలు, లేస్‌ వర్కర్లు, కుమ్మర్లు.. ఇలా చేతివృత్తుల మీద ఆధారపడి జీవించేవారందరినీ కూడా జగనన్న తోడు పథకం కింద తీసుకొచ్చాం. వారికి కూడా వడ్డీ లేకుండా రూ.10 వేలు రుణమిచ్చే పథకాన్ని తీసుకొచ్చాం. 

పొరపాటున ఎవరైనా మిగిలిపోతే
ఇంకా ఎవరికైనా పొరపాటున రాకపోతే కంగారు పడొద్దు. గతంలోనే చెప్పినట్లు.. ప్రతి ఒక్కరికీ మంచి చేయాలి, అర్హులెవరూ మిస్‌ కాకూడదని ఆరాటపడే ప్రభుత్వం మనది. ఏ ఒక్కరికైనా పొరపాటున రాకపోతే వలంటీర్‌ని సంప్రదించండి. సచివాలయంలో మళ్లీ దరఖాస్తు చేసుకోండి. జగనన్న తోడు పథకాన్ని సెర్ఫ్, మెప్మాల ద్వారా అమలు చేస్తున్నాం. నిరంతర పర్యవేక్షణ కోసం www.gramasachivalayam.ap.gov.in పోర్టల్‌ కూడా ఏర్పాటు చేశాం. బ్యాంకర్లతో సమన్వయం కోసం చిరువ్యాపారులకు స్మార్ట్‌ కార్డులు కూడా ఇచ్చాం. బ్యాంకు ఖాతాలు తెరవడం నుంచి రుణాలు ఇప్పించడం వరకు వలంటీర్లు పూర్తిగా అన్ని రకాలుగా చేయి పట్టుకుని నడిపిస్తారు. లబ్ధిదారులకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే 0891 2890525 నంబరుకు ఫోన్‌ చేస్తే అధికారులు మీ సమస్యను పరిష్కరిస్తారు. 

ఒక్క విషయం మరువద్దు..
ఈ సందర్భంగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ  కార్యక్రమం ద్వారా ఒక  గొప్ప వ్యవస్ధను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ వ్యవస్ధను నీరుగారనివ్వొద్దు. ఇది కనుక నీరుగారిపోతే... మనం తీసుకున్న రుణాలను మళ్లీ బ్యాంకులకు తిరిగి కట్టకపోతే వ్యవస్ధే కుప్పకూలిపోతుంది. కట్టిన ప్రతి ఒక్కరికీ బ్యాంకులు మళ్లీ కచ్చితంగా రుణాలిస్తాయి. ఎందుకంటే ప్రభుత్వం ఆ మేరకు గ్యారంటీ ఇస్తుంది. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం కూడా ఉంది. ఇదొక రివాల్వింగ్‌ ఫండ్‌ మాదిరిగా అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు డబ్బులు తీసుకోండి.. ఆ తర్వాత టైం ప్రకారం కట్టండి. అలా చేస్తే ప్రభుత్వమే మీరు కట్టిన వడ్డీ మొత్తాన్ని మీకు వెనక్కి తిరిగి ఇస్తుంది. వడ్డీ లేకుండా రుణం పొందే గొప్ప సౌకర్యం మీ చేతుల్లోనే ఉంటుంది. కానీ మనం తిరిగి కట్టకపోతే బ్యాంకులు వెనుకడుగు వేస్తాయి. ఇంకా ఇతర లబ్ధిదారులకు మంచి జరిగే అవకాశాన్ని కూడా మనం అడ్డుకున్నట్లవుతుందని అందరూ గుర్తెరిగి మనసులో పెట్టుకోవాలని మీ కుటుంబ సభ్యుడిగా కోరుతున్నా.  

నిశ్చింతగా వ్యాపారాలు 
వడ్డీలు, చక్రవడ్డీలు కట్టలేక అవస్థలు ఎదుర్కొంటున్న కుటుంబాలను గుర్తించి జగనన్న తోడు అమలు చేస్తుండటంతో 14 లక్షల మందికి పైగా లబ్ధి చేకూరింది. సెర్ప్, మెప్మా అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ సకాలంలో రుణాలు చెల్లించేలా ప్రోత్సహిస్తున్నారు. చిరు వ్యాపారులు ఇప్పుడు హాయిగా తమ వ్యాపారాలను నిర్వహించుకుంటున్న పరిస్ధితి రాష్ట్రంలో నెలకొంది. ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుంటున్నాయి. కేంద్రం కూడా ఈ పథకాన్ని మోడల్‌గా తీసుకుని పట్టణ ప్రాంతాల్లో ప్రవేశపెట్టింది. మన ప్రభుత్వం గ్రామాలు, పట్టణాలు రెండు చోట్లా అమలు చేస్తోంది. ప్రభుత్వ తోడ్పాటుతో చిరు వ్యాపారులు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు.
– మంత్రి బొత్స సత్యనారాయణ

తోడుతోపాటు ఇతర పథకాలు కూడా..
మా ఆయన ఫ్యాక్టరీలో కూలీ పనులకు వెళ్తుండగా నేను ఇంటిదగ్గర టిఫిన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నా. గతంలో రూ.ఐదు, రూ.పది చొప్పున అప్పు చేసి తెచ్చిన డబ్బంతా వడ్డీలకే సరిపోగా ఏమీ మిగిలేది కాదు. ఇక కరోనాతో అంత వడ్డీకి కూడా డబ్బులు దొరకలేదు. పెట్టుబడికి డబ్బుల్లేక వ్యాపారం నిలిపివేసిన సమయంలో జగనన్న తోడు గురించి వలంటీర్‌ చెప్పాడు. ఇప్పుడు మళ్లీ వ్యాపారం చేసుకుంటూ నెలకు రూ. ఆరు వేలు సంపాదిస్తున్నా. నాకు ఆసరా సాయం అందింది. సున్నా వడ్డీ వచ్చింది. గతంలో మాకు రేషన్‌ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు లేవు. ఇప్పుడు వలంటీర్లు అన్నీ తెచ్చి ఇచ్చారు. జగనన్న ఇంటి పట్టా కూడా వచ్చింది. మా నాన్నకు ఆరోగ్యశ్రీ ద్వారా రూపాయి ఖర్చు లేకుండా మంచి చికిత్స అందింది.  
 – సయ్యద్‌ రుబియా బేగం, లబ్ధిదారు, శింగరాయకొండ, ప్రకాశం జిల్లా

ఆ పేరు ఎవరు పెట్టారో కానీ..
మీరు ఇచ్చిన మాట ప్రకారం వడ్డీ చెల్లించారు. నా భర్త తాపీ మేస్త్రి. పనులు లేక కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. ఇంట్లోనే ఉంటూ ఏదైనా వ్యాపారం చేద్దామనుకుంటే పెట్టుబడికి డబ్బులు లేవు. ప్రైవేట్‌ వ్యాపారుల వద్దకు వెళ్తే రూ.10 వేలు తీసుకుంటే రూ.వెయ్యి వడ్డీ కింద ముందే మినహాయించుకుని రూ.తొమ్మిది వేలు ఇస్తానన్నాడు. ఆ సమయంలో జగనన్న తోడు గురించి వలంటీర్‌ చెప్పాడు. బ్యూటీ పార్లర్‌ నిర్వహిస్తూ నెలకు రూ.5 వేల నుంచి పది వేలు సంపాదిస్తున్నా. మీరు మాకు ష్యూరిటీ లేకుండా డబ్బులు ఇప్పించారు. ఈ పథకానికి జగనన్న తోడు అని ఎవరు పేరు పెట్టారో కానీ మాకు మాత్రం ఎంతో తోడుగా ఉంది. ఆసరాతోపాటు వివిధ పథకాల ద్వారా కూడా మా కుటుంబం లబ్ధి పొందింది.
– కె.కళ్యాణి, లబ్ధిదారు, రేఖవానిపాలెం, విశాఖ జిల్లా

నాలుగు రెట్లు ఆదాయం
మేం పండ్ల వ్యాపారం చేస్తాం. బయట అధిక వడ్డీలకు డబ్బులు తీసుకుంటే రోజూ రూ.200 – రూ.300 మాత్రమే మిగిలేవి. జగనన్న తోడు చిరు వ్యాపారులకు ఎంతో అండగా నిలుస్తోంది. బ్యాంకు ద్వారా ఎలాంటి ష్యూరిటీ లేకుండా రుణం అందుతోంది. మీ ఆలోచనకు పాదాభివందనం. ఇప్పుడు రోజూ రూ.700 నుంచి రూ.800 సంపాదిస్తున్నాం. డిగ్రీ చదివినా పట్టుదలతో వ్యాపారం చేసుకుంటున్నాం. మాకు సున్నా వడ్డీ అందింది. మా కుటుంబానికి చాలా పథకాలు అందాయి.
– శారద, లబ్ధిదారు, రుద్రంపేట, అనంతపురం జిల్లా  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement