అత్యధికంగా 85,480 మహిళా లబ్ధిదారులతో కర్ణాటకకు తొలిస్థానం
38,120 మంది మహిళా
లబ్ధిదారులతో ఏపీకి సెకండ్ ప్లేస్
కేంద్ర నైపుణ్య మంత్రిత్వ శాఖ వెల్లడి
సాక్షి, అమరావతి: సంప్రదాయ చేతివృత్తుల వారి కోసం కేంద్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద శిక్షణ, లబ్ధి పొందిన మహిళల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్‌కు రెండో స్థానం దక్కింది. మొదటి స్థానంలో కర్ణాటక ఉండగా.. మూడో స్థానంలో గుజరాత్, నాలుగో స్థానంలో జమ్మూకశ్మీర్, ఐదో స్థానంలో మహారాష్ట్ర ఉన్నాయి. ఈ వివరాలను కేంద్ర నైపుణ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా 3,03,161 మందికి లబ్ధి
గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జూలై వరకు 10 నెలల కాలంలో ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 3,03,161 మంది చేతివృత్తుల వారికి శిక్షణ, లబ్ధి చేకూరగా.. ఇందులో 50 శాతానికి పైగా (2,74,703 మంది) మహిళలు ఉన్నారని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పథకం కింద 2.41 లక్షల మంది మహిళలు టైలరింగ్‌లో శిక్షణ, లబ్ధి పొందినట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది.ఈ పథకం కింద వడ్రంగి, పడవల తయారీ, కమ్మరి, ఆయుధాల తయారీ, సుత్తి ఇతర పనిముట్లు తయారీ,
తాళాల మరమ్మతులు, శిల్ప కళాకారులు, స్వర్ణకారులు, కుమ్మరి, చెప్పులు కుట్టేవారు, తాపీ పనివారు, బుట్ట, చాప, చీపర్ల తయారీ, బొమ్మలు తయారీ, క్షురకులు, పూలదండలు తయారు చేసేవారు, రజకులు, దర్జీలు, చేపల వలలు తయారు చేసేలాంటి 18 రకాల చేతివృత్తుల వారు నమోదయ్యే అవకాశం కేంద్రం కల్పించింది. ఈ పథకం కింద నమోదైన చేతి వృత్తుల వారికి సర్టిఫికెట్‌తో పాటు గుర్తింపు కార్డు ఇస్తారు. ఈ గుర్తింపు ద్వారా ఆయా చేతి వృత్తుల వారికి శిక్షణ ఇవ్వడంతోపాటు ఆ వృత్తికి సంబంధించి టూల్ కిట్స్ రాయితీపై అందించడం, స్వయం ఉపాధి పొందేందుకు తొలి విడతలో వ్యాపార వృద్ధికి రూ.1 లక్ష రుణం ఇస్తారు. ఈ రుణం తీర్చిన తరువాత రెండో విడతగా రూ.2 లక్షలు రుణం ఇస్తారు.
Comments
Please login to add a commentAdd a comment