land distribution
-
విచారణ చేపట్టండి
బెంగళూరు: మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) స్థలాల పంపిణీలో అక్రమాలు జరిగాయన్న ఉదంతంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు రంగం సిద్ధమైంది. సిద్ధరామయ్యను విచారించాలని లోకాయక్త పోలీసులకు బుధవారం బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశాలిచి్చంది. దీంతో సిద్ధూపై ఎఫ్ఐఆర్ నమోదుచేసి కేసు విచారణను లోకాయుక్త పోలీసులు మొదలుపెట్టనున్నారు. సిద్ధూ భార్యకు ప్రభుత్వ వెంచర్లలో 14 ప్లాట్లను అక్రమంగా కేటాయించారన్న ఫిర్యాదుల మేరకు సిద్ధూపై విచారణకు కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోత్ అనుమతి ఇవ్వడాన్ని సిద్ధూ కర్ణాటక హైకోర్టులో సవాల్ చేయడం, ఆయన పిటిషన్‌ను కోర్టు కొట్టేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలో బుధవారం బెంగళూరు ప్రత్యేక కోర్టు జడ్జి సంతోశ్ గజానన్ భట్ ఆదేశాలిచ్చారు. ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ ఇచి్చన ఫిర్యాదు మేరకు మాజీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు/ఎంపీల సంబంధిత కేసులను విచారించే ఈ కోర్టు తదుపరి చర్యలకు ఆదేశాలిచి్చంది. మూడు నెలల్లోగా అంటే డిసెంబర్ 24వ తేదీకల్లా సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికను సమరి్పంచాలని జడ్జి సూచించారు. ముఖ్యమంత్రిపై ఉన్న ఫిర్యాదులపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని స్పెషల్ కోర్టుకు ఆగస్ట్ 19న తాము ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు తాజాగా ఉపసంహరించుకోవడంతో స్పెషల్ కోర్టు బుధవారం ఆదేశాలు ఇవ్వడానికి వీలు కల్గింది. ఈ కేసులో సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతి, పార్వతి సోదరుడు మల్లికార్జున స్వామి, స్వామికి ఈ భూమిని అమ్మిన దేవరాజులను ప్రతివాదులుగా కోర్టు చేర్చింది. విచారణను ఎదుర్కోవడానికి సిద్ధం దర్యాప్తు మొదలుపెట్టాలని లోకాయుక్తకు ఆదేశాలు రావడంపై సిద్ధరామయ్య స్పందించారు. ‘‘ ఎలాంటి దర్యాప్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని గతంలోనే చెప్పా. ఎలాంటి దర్యాప్తునకు నేను భయపడను. చట్టప్రకారం పోరాటానికి నేను సిద్ధం. కోర్టు ఉత్తర్వుల కాపీలో ఏముందో చదివాక మళ్లీ మాట్లాడతా’’ అని సిద్ధరామయ్య అన్నారు. -
రేపు సీఎం జగన్ చేతుల మీదుగా భూ బదిలీ పత్రాలు పంపిణీ
అమరావతి: పేద అక్క చెల్లమ్మల సొంతింటి కలను సాకారం చేస్తూ.. రికార్డు స్థాయిలో 31 లక్షలకు పైగా ఇళ్లపట్టాలు అందించడమే గాక దేశంలోనే తొలిసారిగా లబ్ధిదారులకు ఆ స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తూ వారి పేరు మీదనే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ అందిస్తున్న జగనన్న ప్రభుత్వం. సర్వ హక్కులతో భూ బదిలీ పత్రం పంపిణీ ప్రకాశం జిల్లా ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో రేపు(శుక్రవారం) 20,840 మంది పేద అక్కచెల్లెమ్మలకు సర్వ హక్కులతో రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం భూ బదిలీ పత్రం, కట్టుకోడానికి ఇళ్లు కూడా మంజూరు చేసి, ఆ పత్రాలు పంపిణీ చేయనుంది సీఎం జగన్ ప్రభుత్వం దీంతోపాటు 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' క్రింద రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా పంపిణీ చేసిన 31.19 లక్షల ఇళ్ల స్థలాలను ఆ పేద అక్కచెల్లెమ్మల పేరు మీదుగానే సంపూర్ణ హక్కులు కల్పిస్తూ, రిజిస్ట్రేషన్ కూడా చేసి కన్వేయన్స్ డీడ్స్ అందించే కార్యక్రమాన్ని రేపు ఒంగోలులో లాంఛనంగా ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ ద్వారా కలిగే ప్రయోజనాలు పదేళ్ల తర్వాత ఇంటి స్థలంపై అన్ని హక్కులు ఉండేలా లబ్ధిదారుల పేరిట గ్రామ/వార్డు సచివాలయాల్లోనే, ఇప్పుడే ఉచితంగా స్థలాల రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ కూడా అందజేత రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. ఇప్పటికే దాదాపు 15 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తి.. శరవేగంగా మిగిలిన రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉన్న జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ (జెఎస్ఆర్వో) డేటాబేస్‌లో వివరాలన్నీ పదిలం.. ఎప్పుడైనా ఈ జెఎస్ఆర్వోలలో సర్టిఫైడ్ కాపీ పొందే అవకాశం.. ఫోర్జరీ గానీ, ట్యాంపర్ చేయడానికి గానీ ఆస్కారమే ఉండదు పదేళ్ల తర్వాత ఆటోమేటిక్ గా క్రయ, విక్రయ, దాన, వారసత్వ హక్కులతో సహా పూర్తి హక్కులు.. అత్యవసర సమయాల్లో ఇంటిని అమ్ముకునే వీలు.. అమ్ముకునే సమయంలో ఎన్వోసీ కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఎలాంటి లింకు డాక్యుమెంట్ల అవసరం లేకుండానే నేరుగా రిజిస్ట్రేషన్ ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. శుక్రవారం ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం కన్వేయన్స్ డీడ్లు, ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ చేయనున్నారు. అర్హులైన 20,840 మంది పేద అక్కచెల్లెమ్మలకు రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం కన్వేయన్స్ డీడ్, ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ చేయనున్నారు, మల్లేశ్వరపురం, అగ్రహారం, యరజర్ల, వెంగముక్కల పాలెం గ్రామాల్లో 536.11 ఎకరాల భూసేకరణ చేసి రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం కన్వేయన్స్ డీడ్స్‌ను అందజేయనున్నారు. భూమి కొనుగోలు, జగనన్న టౌన్ షిష్‌ల అభివృద్ధికి రూ.210 కోట్లు, లే అవుట్ల అభివృద్ధికి రూ. 21.33 కోట్లు సీఎం జగన్ ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే. -
భూ పంపిణీపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, అమరావతి: భూ పంపిణీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘దశాబ్దాలుగా తాము సాగు చేస్తున్న భూములకు అనుభవదారులుగా ఉన్న రైతన్నలకు నేడు మన ప్రభుత్వంలో పూర్తి హక్కులు కల్పించాం, అలాగే పలువురికి కొత్తగా డీకేటీ పట్టాలను కూడా అందజేశాం’’ అని సీఎం పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వంలో భూముల రీసర్వే కార్యక్రమం చేపట్టాం. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రతి పేదవాడిని గుండెల్లో పెట్టుకుని, ముందుకు నడిపించే కార్యక్రమం ఈ 53 నెలల పాలనలో జరిగింది. పేదవారిపై ప్రేమ చూపిస్తూ నేనెప్పుడు మాట్లాడినా ఆ మాటలు పెత్తందారులకు నచ్చవు. కానీ మన ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమవకుండా పేదల పట్ల ఎంత చిత్తశుద్ధితో.. బాధ్యతతో వ్యవహరిస్తోందో చెప్పేందుకు ఈ రోజు జరుగుతున్న కార్యక్రమమే నిదర్శనం’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. దశాబ్దాలుగా తాము సాగు చేస్తున్న భూములకు అనుభవదారులుగా ఉన్న రైతన్నలకు నేడు మన ప్రభుత్వంలో పూర్తి హక్కులు కల్పించాం. అలాగే పలువురికి కొత్తగా డీకేటీ పట్టాలను కూడా అందజేశాం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వంలో భూముల రీసర్వే కార్యక్రమం చేపట్టాం. గతంలో… pic.twitter.com/a6WijlZP4x — YS Jagan Mohan Reddy (@ysjagan) November 17, 2023 -
54 వేల ఎకరాల 'భూ పంపిణీ'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిరుపేదలు, అసైన్డ్, సర్వీస్ ఇనామ్, లంక భూముల రైతులకు భారీ మేలు చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. తద్వారా భూములకు సంబంధించి గతంలో ఏ ప్రభుత్వం చేయనంత మేలు రైతులకు చేకూరనుంది. ఈ నిర్ణయాలకు సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం తాత్కాలిక సచివాలయంలో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దివంగత సీఎం వైఎస్సార్ తర్వాత మళ్లీ భూ పంపిణీకి సీఎం జగన్ సర్కార్ సిద్ధమైంది. 54,129.45 ఎకరాలను భూమిలేని దళిత, బడుగు బలహీన వర్గాలకు చెందిన 46,935 మంది నిరుపేదలకు పంపిణీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసైన్డ్ భూముల రైతులకు యాజమాన్య హక్కులను కల్పించేందుకు ఆమోదం తెలిపింది. భూమిని ప్రభుత్వం కేటాయించి (అసైన్ చేసి) 20 ఏళ్లు పూర్తయిన అనంతరం ఆ భూమిపై సంబంధిత రైతులు, వారి వారసులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. దీంతో పట్టా భూముల రైతుల మాదిరిగానే అసైన్డ్ భూముల క్రయ, విక్రయాలకు అవకాశం ఏర్పడుతుంది. ప్రభుత్వం వాస్తవంగా ఎవరికైతే భూమిని కేటాయించిందో వారికి యాజమాన్య హక్కు దక్కుతుంది. వారు లేని పక్షంలో వారి వారసులకు హక్కులు రానున్నాయి. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలో దాదాపు 22 లక్షల మంది బడుగు, బలహీన వర్గాల వారికి ప్రయోజనం చేకూరనుంది. ఇంకా మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాల గురించి సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ఆ కుల వృత్తుల వారికి శుభవార్త మూడు కేటగిరీల్లోని 9,062 ఎకరాల లంక భూముల రైతులకు డీ పట్టాలు ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కొన్ని భూములను ఐదేళ్లు లీజు ఇవ్వడానికి అనుమతించారు. ఈ నిర్ణయంతో 19,176 మంది రైతులకు మేలు చేకూరునుంది. పేదలకు భూ పంపిణీ, లంక భూములకు డీ పట్టాలు ఇవ్వడం ద్వారా మొత్తంగా 63,191 ఎకరాలకు సంబంధించి 66,111 మందికి లబ్ధి చేకూరనుంది. గ్రామాల్లో కుల వృత్తులు చేసుకునే వారికి ఇచ్చిన సర్వీస్ ఈనామ్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కుమ్మరి, చాకలి, కమ్మరి, నాయీబ్రాహ్మణ (బార్బర్) తదితర కుల వృత్తులు చేసుకునే వారికి గతంలో ఈనామ్‌గా ఇచ్చిన భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. వీటిని ఇప్పుడు ఆ జాబితా నుంచి తొలగింపు ద్వారా వారికి సర్వ హక్కులు కల్పించనున్నారు. 1,68,603.71 ఎకరాల భూములు నిషేధిత జాబితా(22ఏ) నుంచి తొలగించడం ద్వారా 1,13,610 మందికి ప్రయోజనం కలుగనుంది. 2013కు ముందే వీరందరూ రైత్వారీ పట్టాలు పొందారు. ఆ తర్వాత ఈ భూములపై ఆంక్షలను విధించారు. ఇప్పుడీ ఆంక్షలన్నీ తొలగిపోనున్నాయి. రాష్ట్ర విభజనకు ముందు ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ కింద గతంలో 16,213 ఎకరాలు పొందిన దళితులకు సానుకూలంగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 14,223 మందికి సంబంధించి కట్టాల్సిన రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం.. రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా కూడా మాఫీ చేయడం ద్వారా దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన భూములపై వారికి పూర్తి హక్కులు లభించనున్నాయి. ఆగస్టు మొదటి వారంలో దళితులకు హక్కు పత్రాల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేపడుతోంది. అంతిమ సంస్కారానికి దిగులుండదు గ్రామాల్లో ఎస్సీలకు శ్మశాన వాటికల కోసం భూములు కేటాయిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 1,966 రెవిన్యూ గ్రామాల్లో ఎస్సీలకు శ్మశాన వాటికలు లేవని సర్వే ద్వారా గుర్తించిన ప్రభుత్వం.. ఇందులో 1,700 రెవిన్యూ గ్రామాల్లో అందుబాటులో ఉన్న 1,050.08 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎకరం వరకు భూ కేటాయింపు అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. మరో 266 రెవిన్యూ గ్రామాలకు భూ సేకరణ చేసి ఇవ్వనున్నారు. ఇందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెలలో అమలు చేసే కార్యక్రమాలకు ఆమోదం ► ఈ నెల 18వ తేదీన జగనన్న తోడు నాలుగో ఏడాది మొదటి విడత కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. 5.1 లక్షల మందికి రూ.510 కోట్ల రుణాలు ఇప్పిస్తూ, వడ్డీ మాఫీ కింద 4.58 లక్షల మందికి రూ.10.03 కోట్లు చెల్లించనున్నారు. ► ఈ నెల 21న నేతన్న నేస్తం పథకం కింద లబ్ధిదారులకు నిధులు జమ చేయనున్నారు. వరుసగా ఐదో ఏడాది ఈ పథకం అమలు ద్వారా 80,686 మందికి దాదాపు రూ.300 కోట్ల మేర ప్రభుత్వం లబ్ధి చేకూర్చనుంది. ► ఈ నెల 24న సీఆర్డీయే ప్రాంతంలో నిరుపేదల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని 50,793 మందికి ప్రభుత్వం 1,366.48 ఎకరాల్లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. కాగా, 47,017 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. పేదల ఇళ్లు నిర్మిస్తున్న వైఎస్సార్–జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.384.52 కోట్లు కేటాయింపునకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ► ఈ నెల 26న వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు సంఘాల మహిళలకు డబ్బు జమ చేయనుంది. వరుసగా నాలుగో ఏడాది పంపిణీ చేపట్టనున్నారు. 9.48 లక్షల గ్రూపుల్లోని మహిళలకు ఈ పథకం కింద రూ.1353.76 కోట్లు ఇవ్వనున్నారు. ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం సుమారు రూ.5 వేల కోట్లు అక్కాచెల్లెమ్మలకు ఇచ్చినట్లు అవుతుంది. ► ఈ నెల 28న విదేశీ విద్యా దీవెన కింద అర్హులైన లబ్ధిదారులకు రూ.50 కోట్ల మేర జమ చేయనున్నారు. ఇక ఓపికున్నంత వరకు అర్చకత్వం దేవాలయాల్లో పని చేస్తున్న అర్చకులు ఓపిక, శక్తి ఉన్నంత వరకు భగవంతుడి సేవలో కొనసాగేలా రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా చట్ట సవరణ చేసేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే దేవదాయ శాఖ ఉద్యోగులకు కూడా ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు నిర్ణయించింది. వైద్య రంగంలో పోస్టుల భర్తీ 2024–25 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో కొత్తగా ఐదు వైద్య కళాశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. పులివెందుల, పాడేరు, ఆదోని మెడికల్ కాలేజీలకు గత మంత్రివర్గ సమావేశంలో పోస్టులు మంజూరు చేశారు. మిగిలిన రెండు చోట్ల.. మదనపల్లి, మార్కాపురం వైద్య కళాశాలలు ప్రారంభించడానికి వీలుగా కళాశాలకు 222, బోధనాస్పత్రికి 484 చొప్పున 1,412 పోస్టుల సృష్టికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో ఇప్పటికే 5 వైద్య కళాశాలలను ఈ విద్యా సంవత్సరం(2023–24) నుంచి ప్రారంభించనున్నారు. క్యాన్సర్ వ్యాధి నియంత్రణ, చికిత్సలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో కర్నూలులో కేన్సర్ ఇన్స్టిట్యూట్కు 247 పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రభుత్వం ప్రజా వైద్యాన్ని బలోపేతం చేస్తోంది. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకూడదని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ప్రతి మూడు నెలలకోసారి నివేదిక ఇవ్వాలన్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్‌ను ప్రభుత్వ విభాగంలో కలిపేందుకు జారీ చేసిన ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖపట్నంలో విమ్స్.. మెడికల్ కాలేజీగా మార్పు, ప్రస్తుతం ఉన్న 11 మెడికల్ కాలేజీల్లో కార్డియాలజీ, కేథ్లా్బŠ, సీటీవీసీ విభాగాల్లో 94 పోస్టుల మంజూరు, పుంగనూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఏరియా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసేందుకు అనుమతించింది. పునరావాసానికి ప్రత్యేక చర్యలు వైఎస్సార్ జిల్లాలో 10,231 గండికోట ముంపు బాధిత కుటుంబాలకు పునరావాసం ప్యాకేజీ కింద రూ.454.6 కోట్లు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫేజ్ 2, 3లోని ముంపు బాధితుల తరహాలోనే ఫేజ్1 బాధితులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనుంది. పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు సహాయ పునరావాస పనుల కోసం ప్రత్యేక ఇంజినీరింగ్ విభాగం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సిబ్బంది పని చేస్తున్నారు. ఇందుకు గాను 73 పోస్టులను కేబినెట్ ఆమోదించింది. వీటికి అదనంగా 6 ఔట్ సోర్సింగ్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. పరిశ్రమల స్థాపన.. ఉద్యోగాల కల్పన ► వైఎస్సార్ జిల్లా వేంపల్లిలో జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ సంస్థ రూ.8,104 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న 1,500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం. దీని ద్వారా 1500 ఉద్యోగాల కల్పన జరగనుంది. ► హీరో ప్యూచర్స్‌కు చెందిన క్లీన్ ఎనర్జీ ప్రైయివేటు లిమిటెడ్ సోలార్, విండ్ ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పేందుకు ఆమోదం. ఈ సంస్థ 375 మెగావాట్ల సామర్థ్యంతో అనంతపురం, నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో రూ.2,450 కోట్ల పెట్టుబడితో పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా 375 మందికి ఉద్యోగాల అవకాశాలు దక్కుతాయి. ► రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఐఐసీ పరిధిలోని వివిధ పరిశ్రమలకు 352.79 ఎకరాల భూముల కేటాయింపులకు సంబంధించి 44 ప్రతిపాదనలకు ఆమోదం. ఇందులో రూ.4,204.07 కోట్ల పెట్టుబడుతో 4,705 మందికి ఉపాధి దక్కనుంది. వీటితో పాటు ఎస్ఐపీబీ నిర్ణయాలకు కూడా ఆమోదం లభించింది. ► శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణానికి అవరసరమైన వనరుల సమీకరణకు ఏపీ మారిటైం బోర్డు రూ.3,884.70 కోట్ల రుణం తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వ గ్యారంటీకి కేబినెట్ ఆమోదం. ► ఏపీ మారిటైం బోర్డులో రెండు ఇంజినీరింగ్ పోస్టులు, ఎస్ఐపీబీలో ఆమోదించిన టూరిజం ప్రాజెక్టులకు, చెన్నై– కడప, విజయవాడ–కడప, బెంగళూరు–కడప, విశాఖపట్నం– కడప మధ్య విమానాలు నడుపుతున్న ఇండిగో సంస్థకు మరో ఏడాది పాటు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కొనసాగింపునకు కేబినెట్ అంగీకారం. మరిన్ని అంశాలకు ఆమోదం ► నంద్యాల జిల్లా బేతంచర్ల, అనంతపురం జిల్లా గుంతకల్, వైఎస్సార్ జిల్లా మైదుకూరు పాలిటెక్నిక్ కళాశాలల్లో 128 టీచింగ్ పోస్టులు, 68 నాన్ టీచింగ్ పోస్ట్‌ల మంజూరుకు ఆమోదం. ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున 26, ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున 175 నైపుణ్యాభివృద్ధి సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వీటన్నింటికీ ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసి, దాని ద్వారా పాఠ్య ప్రణాళికను రూపొందించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ► జేఎన్టీయూ కాకినాడలో 27 నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకానికి ఆమోదం. యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది కొరతను తీర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాటు. రిటైర్ అవుతున్న బోధనా సిబ్బంది సేవలను కాంట్రాక్టు పద్ధతిలో వినియోగించుకోవాలని నిర్ణయం. కోర్టు కేసుల దృష్ట్యా పోస్టుల భర్తీలో భారీ జాప్యం ఉంటోంది. ఇందుకు ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా 62 ఏళ్లకు రిటైర్ అవుతున్న బోధనా సిబ్బంది సేవలను 65 ఏళ్ల వరకు కాంట్రాక్టు పద్ధతిలో వినియోగించుకోవడానికి కేబినెట్ ఆమోదం. ► టోఫెల్ పరీక్షల కోసం ప్రభుత్వ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం కోసం విఖ్యాత విద్యా సంస్థ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్(ఈటీఎస్)తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందానికి కేబినెట్ ఆమోదం. 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్న ఈటీఎస్. సన్నాహక పరీక్షలతోపాటు టోఫెల్ ప్రైమరీ, జూనియర్ స్థాయి పరీక్షలను ఈటీఎస్ నిర్వహించనుంది. అంతర్జాతీయ స్థాయిలో పోటీని తట్టుకునేలా ప్రాథమిక స్థాయి నుంచే మన విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం చేస్తోంది. ఈ శిక్షణను ప్లస్, ప్లస్ వన్ స్థాయికి విస్తరించనున్నారు. ఈ నెల 23 నుంచి ప్రభుత్వ విద్యా సంస్థల్లో టోఫెల్‌పై శిక్షణ ప్రారంభం కానుంది. ► స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్, ట్రైనింగ్ (ఎస్‌సీఈఆర్‌టి)ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎస్సీఈఆర్టీలో కాంట్రాక్ట్ పద్ధతిలో తొమ్మిది అకడమిక్ ఎక్స్పర్ట్ పోస్టుల నియామకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ► కొత్తగా ఏర్పాటు చేసిన తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్లో 19 పోస్టుల మంజూరు, కొత్తగా ఏర్పాటైన ఒంగోలు, అనంతపురం, నంద్యాల, చిత్తూరు, విజయనగరం, మచిలీపట్నం సౌత్ మండలాల్లో 70 పోస్టులు, కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో 13 స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం. ► మచిలీపట్నం, గుడివాడల్లో ఆరు కాలనీల్లో 1970–80 మధ్య కాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు, జర్నలిస్టులకు మార్కెట్/నామినల్ విలువపై భూములు కేటాయిస్తూ అప్పుడు పేర్కొన్న నిబంధనలను సవరించేందుకు ఆమోదం. ► రాష్ట్ర మానవ హక్కుల సంఘంలోని దర్యాప్తు విభాగానికి కేటాయించిన 9 పోస్టుల మంజూరుతో పాటు, మరో 21 పోస్టులకు కేబినెట్ ఆమోదం. ► విశాఖ భూముల అక్రమాలకు సంబంధించి ముగ్గురు సభ్యుల సిట్ కమిటీ ఇచ్చిన తొలి నివేదికలోని 69 సిఫార్సులను కేబినెట్ ఆమోదించింది. ఇందులో మరో 18 సిఫార్సులపై మరింత శోధన అవసరమన్న సిట్ నివేదికకు సమ్మతి వ్యక్తం చేసింది. -
అమరావతిలో ఆప్షన్ 3 ఆవాసాలే!
సాక్షి, అమరావతి: సీఆర్డీఏ పరిధిలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన నిరుపేదల సొంతింటి కల సాకారం దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సీఆర్డీఏ పరిధిలో 50,793 మంది అక్కచెల్లెమ్మలకు ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇంటి స్థలాలను ఇప్పటికే ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించేలా గృహ నిర్మాణ శాఖ చర్యలు చేపట్టింది. సీఆర్డీఏ పరిధిలో మొత్తం 25 లేఅవుట్లలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన 22,125 మంది లబ్దిదారులు, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 22,976 మంది ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇచ్చే ఆప్షన్–3ని ఎంపిక చేసుకున్నారు. మొత్తం లబ్దిదారుల్లో 88.79 శాతం మంది ఆప్షన్–3కి మొగ్గు చూపారు. వైఎస్సార్ జయంతి రోజు శంకుస్థాపన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా జూలై 8వ తేదీన సీఆర్డీఏ పరిధిలో పేదల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది మే 26వ తేదీన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా శంకుస్థాపన తేదీని కూడా సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణం జోరందుకోనుంది. ఉచితంగా ఇసుక.. రాయితీపై 14 రకాల సామగ్రి విలువైన ఇళ్ల స్థలాలను ఉచితంగా నిరుపేదలకు పంపిణీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి కూడా అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఒక్కో యూనిట్‌కు బిల్లుల రూపంలో రూ.1.80 లక్షలు, పావలా వడ్డీకి రూ.35 వేలు బ్యాంకు రుణంగా సమకూరుస్తూ రూ.2.15 లక్షలు చొప్పున అందిస్తోంది. దీనికి అదనంగా ఉచితంగా ఇసుకతోపాటు సబ్సిడీపై స్టీల్, సిమెంట్ లాంటి 14 రకాల నిర్మాణ సామగ్రిని ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. వీటి విలువ రూ.54,518 వరకు ఉంటుంది. ఇదే తరహాలో సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల లబ్ధిదారులకు కూడా ప్రభుత్వం అండగా నిలవనుంది. అక్కచెల్లెమ్మలకు విలువైన స్థిరాస్తి నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ 31 లక్షల మందికిపైగా పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. రెండు విడతల్లో 21.25 లక్షల ఇళ్ల (సాధారణ ఇళ్లు 18.63 లక్షలు + టిడ్కో ఇళ్లు 2.62 లక్షల ఇళ్లు) నిర్మాణాలకు అనుమతులు ఇవ్వగా నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. సాధారణ ఇళ్లలో సుమారు నాలుగు లక్షల ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఇళ్ల పథకం ద్వారా ఒక్కో పేదింటి మహిళకు సగటున రూ.15 లక్షల స్థిరాస్తిని సమకూర్చడం ద్వారా మొత్తం రూ. 3 వేల కోట్ల మేర సంపదను ప్రభుత్వం సృష్టిస్తోంది. కొనసాగుతున్న లబ్దిదారుల ట్యాగింగ్.. సీఆర్డీఏ పరిధిలో మెజారిటీ లబ్దిదారులు ఆప్షన్–3 ఎంచుకున్నారు. లబ్ధిదారులను గ్రూపులుగా చేసి ట్యాగ్ చేసే పనులు రెండు జిల్లాల్లో కొనసాగుతున్నాయి. 47 వేల ఇళ్లకు సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ (సీఎస్ఎంసీ) అనుమతులు వచ్చాయి. మిగిలిన ఇళ్లకు కూడా అనుమతులు వస్తాయి. గృహ నిర్మాణాలకు జూలై 8న శంకుస్థాపన నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. – అజయ్‌జైన్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి -
పవన్ కల్యాణ్ ఆరోపణలు అర్ధరహితం: సజ్జల
సాక్షి, గుంటూరు: అమరావతిలో పేదల భూముల ఆర్5 జోన్ వివాదంతో సుప్రీం కోర్టుకు వెళ్లడం దారుణమైన విషయమని, అయినా కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో పార్టీ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్5 జోన్‌పై వివాదం తేవటం దారుణం. టీడీపీ శక్తులు పాతకాలపు అభిప్రాయాలతో కోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు కోర్టుకు వెళ్లటం మరీ బరితెగించిన విషయం. ప్రభుత్వం చేతికి వచ్చిన భూమిని ఎలా వినియోగించాలో ప్రభుత్వనే నిర్ణయం తీసుకుంటుంది. అసలు కోట్లు ఖర్చు పెట్టి పెద్దపెద్ద లాయర్లను పెట్టుకుని కోర్టులకు వెళ్లటం ఏంటి?. నిజంగా వాళ్లంతా రైతులా?. రియల్ ఎస్టేట్ వ్యాపారులే అలా చేయగలరు అంటూ సజ్జల వ్యాఖ్యానించారు. మా స్వర్గంలో మేమే ఉండాలి అనే అభిప్రాయంలో టీడీపీ ఉంది. పేదలు కూడా సొంత ఇళ్లతో ఆత్మగౌరవం కల్పించటానికి మేము ప్రయత్నిస్తున్నాం. కానీ, రైతుల పొట్ట కొట్టి వేల కోట్లు దండుకోవాలని వారు చూస్తున్నారు. అసలు ఏ ముఖం పెట్టుకుని పేదల దగ్గర రేపు ఓట్లు అడుగుతారు వాళ్లు. టీడీపీ నేతల లక్షల కోట్ల బిజినెస్ మీద దెబ్బ తగిలింది. రాజకీయ నేతలుగా కాదు కదా.. కనీసం మనుషులుగా కూడా టీడీపీ వారికి అర్హతలేదు. వాళ్ల నిజ స్వరూపం ఇప్పుడు మళ్ళీ బట్టబయలు అయింది. పేదలను మేము పట్టించుకునేదిలేదనేలాగ ఉంది వాళ్ల వ్యవహారం. రాష్ట్రంలో తొలిసారిగా కొత్తగా గ్రామాలనే క్రియేట్ చేస్తున్నాం. అందరికీ ఒకచోట స్థలాలు ఇస్తే ఓర్చుకోలేక పోతున్నారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా వితండవాదం చేస్తున్నారు. టీవీలో చర్చకు మాత్రమే పనికొచ్చేలా వారు మాట్లాడుతున్నారని అన్నారాయన. పవన్ కల్యాణ్ ఆరోపణలు అర్ధరహితం సీఎం జగన్ తెచ్చిన పథకాలు ఎవరికి ఉపయోగ పడ్డాయో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తెలుసుకోవాలని సజ్జల హితవు పలికారు. పవన్ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని అన్నారాయన. కరోనా కష్టాలు వచ్చినా కూడా తాను చేయాలనుకున్న సంక్షేమాన్ని పేదల చెంతకు జగన్ తెచ్చారని గుర్తుచేశారాయన. మరోవైపు కమ్యూనిస్టులు కూడా వారి సిద్దాంతం ఏంటో తెలుసుకోవాలన్నారు సజ్జల. విద్యారంగం మీద ఎంత పెట్టుబడి పెడుతున్నామో తెలుసా?. ఇదంతా పేదలకు ఎంతగా ఉపయోగమో తెలుసుకోవాలి. జీవో నెంబర్ 01 అనేది ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే.. చంద్రబాబు తల ఎక్కడో పెట్టుకోవాలి. కందుకూరు, గుంటూరులో ప్రజల్ని చంపారు. జీవో కాదు.. దీనిమీద ఈసారి చట్టం తెస్తాం. ప్రజలను పరిరక్షించడమే ప్రభుత్వ లక్ష్యం అని సజ్జల ఉద్ఘాటించారు. చంద్రబాబును ప్రజలు ఏనాడో రాజకీయంగా చెత్తబుట్టలో పడేశారన్న సజ్జల.. రానున్న రోజుల్లో చంద్రబాబు ఇంకా దారుణాలకు పాల్పడతారని, కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
భూ పంపిణీయే పరిష్కార మార్గం!
స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్ళు గడిచినా దేశంలో అసమానతల్లో పెద్దగా మార్పేమీ కనిపించడంలేదు. పేదల కోసం పోరాడే వారంతా ఒక గొడుగు కిందకు వచ్చి ఆర్థిక పోరాటాలు చేస్తే తప్ప పరిస్థితుల్లో మార్పు ఉండదు. ఇప్పుడు పీడిత వర్గాలకు దళితులు నాయకత్వం వహించాల్సిన సమయం వచ్చింది. వేలాది జిగ్నేష్ మేవానీలు, కన్హయ్య కుమార్‌లు, ఉమర్ ఖాలీద్‌లు పుట్టుకు రావాలి. అప్పుడే ఈ బహుజనుల మౌలిక సమస్యలు పరిష్కారమవుతాయి. నిజానికి ఈ ప్రజల మౌలిక సమస్య – భూమి సమస్య. అంబేడ్కర్ మేధావి, మానవతావాది, ఆర్థికవేత్త, తత్త్వవేత్త. ఆయన ఆర్థిక సంబంధాల ప్రాముఖ్యాన్ని గుర్తించారు. ఈ వర్గాల ప్రజల ఉన్నతికి రాజ్యాంగ రక్షణ కల్పించటం కోసం ఆయన ఎంతో తపన పడ్డారు. ప్రజలకు అన్నంపెట్టే కీలక రంగమైన వ్యవ సాయాన్ని పూర్తిగా ప్రభుత్వానికి చెందిన పరిశ్రమగా ప్రకటించాలని సూచించారు. భూమిని ఒక స్థిర ప్రమాణంలో విభజించి వ్యావసాయిక పరిశ్రమలను వ్యవస్థీకరించాలని అన్నారు. ఆ వ్యావసాయిక క్షేత్రాలను సమష్టి సహకార క్షేత్రాలుగా చేసి కుల, మత భేదాలు లేకుండా ఏర్పడిన గ్రామ సమూహాలు సాగు చేయాలనీ, ఉత్పత్తిని సమష్టిగా పంచుకోవాలనీ అన్నారు. భూస్వాములు, కౌలుదారులు, భూమిలేని కూలీలు ఉండరాదనీ, సమష్టి వ్యవసాయ క్షేత్రాలకు సంబంధించి పెట్టుబడి, ఇతర సౌకర్యాలు ప్రభుత్వమే సమకూర్చాలనీ; తద్వారా ఉత్పాదకతను పెంచాలనీ పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వ సోషలిజం తప్పనిసరి అని సూచించారు. లేకుంటే ఆర్థిక అసమానతలు పుడతాయని చెప్పారు. ఈయన సూచనలు సహజంగానే ఆనాటి జాతీయోద్యమానికి నాయకత్వం వహించిన బడా భూస్వామ్య వర్గాలు పక్కనపెట్టాయి. ఎప్పటికో, రాజ్యాంగం అమలులోకి వచ్చిన 26 ఏళ్ల తరువాత 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘సోషలిస్టు’ అనే పదం రాజ్యాంగ ప్రవేశికలో చేర్చి చేతులు దులుపుకొన్నారు. దారిద్య్ర నిర్మూలనకు అవసరమైన మౌలికమైన వ్యవసాయ సంస్కరణలు అమలు కాలేదు. గ్రామ సీమల్లో అణచివేతకు, వివక్షకు గురవుతున్న నిమ్న జాతుల ప్రజలకు దక్కాల్సిన భూమి వారికి దక్కలేదు. భూ సంస్కరణలు అమలు కాలేదు. ‘నేను ఏర్పరచిన రిజర్వేషన్లతో ఆర్థిక, సామాజిక సమానత్వం వస్తుందనుకున్నా, అయితే వాటివల్ల గుప్పెడుమంది గుమస్తాలు మాత్రమే తయారయ్యారు. కానీ మెజారిటీ ప్రజానీకం నేటికీ గ్రామాల్లో భూమి లేకుండా భూస్వాములకు దాస్యం చేస్తు న్నారు. వారి కోసం నేను ఏమీ చేయలేక పోయాను’ అంటూ ఆవేదన చెందారు అంబేడ్కర్. (క్లిక్: ఇవాళ మనకు కావాల్సింది ఇదీ!) అంటే భూ పంపిణీ జరగకుండా ఈ దేశంలో ఆర్థిక సామాజిక సమానత్వం జరగదు. వ్యవసాయా ధారిత దేశంలో భూమికీ, సామాజిక న్యాయానికీ ఉన్న సంబంధం ఇదే. ప్రజలకు దక్కాల్సిన భూములు గుంజుకొని దేశ, విదేశీ బహుళజాతి కంపెనీలకు, బడా బాబులకు కట్టబెడుతున్నాయి కార్పొరేట్ అనుకూల ప్రభుత్వాలు. వీరు భూమి సంబంధాలన్నింటినీ మార్కెట్ సంబంధాలుగా మార్చారు. మార్కెట్ ఎప్పుడూ లాభం కోసమే వెంపర్లాడుతుంది కానీ ప్రజా సంక్షేమం దానికి పట్టదు. అందుకే వ్యవసాయాన్ని దండగమారి వృత్తిగా చిత్రించి, రైతు వ్యతిరేక విధానాలతో దాన్ని కుప్ప కూల్చారు. దీంతో కార్పొరేట్లకు భూములను అమ్ము కొని రైతులు పట్టణాల్లో కార్మికులుగా, సెక్యూరిటీ గార్డులుగా మారిపోయారు. వ్యవసాయం మీదే ఆధారపడి కూలీలుగా బతికే బహుజనులదీ అదే దారయింది! (క్లిక్: ఇప్పటికీ నేర్వని ఆహార పాఠాలు) - షేక్ కరిముల్లా వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు -
తండ్రి జ్ఞాపకార్థం 12 ఎకరాల్లో పేదల కోసం పట్టాల పంపిణీ
తుగ్గలి: కర్నూలు జిల్లా తుగ్గలిలో కుమ్మరి నాగేంద్ర తన తండ్రి సుంకన్న జ్ఞాపకార్థం బుధవారం 12 ఎకరాల తన సొంత పొలంలో 670 మంది పేదలకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఈ స్థలాల్లో ప్రభుత్వమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టివ్వాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాస్తానని చెప్పారు. కార్యక్రమంలో అనంతపురం జిల్లా గుత్తి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి రామచంద్రయ్య, గుంతకల్లు మున్సిపల్ వైస్ చైర్మన్ నైరుతిరెడ్డి, మంత్రి జయరాం తనయుడు అశోక్, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తనయుడు ప్రదీప్‌రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి తనయుడు రా మ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొని నాగేంద్ర, వరలక్ష్మి దంపతులను అభినందించారు. -
సీఎంపై సభాహక్కుల నోటీస్ పరిశీలిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తామని ప్రకటించి ఇప్పుడు వెనక్కు తగ్గిన సీఎం కేసీఆర్‌పై సభాహక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు తెలిపారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పలేదని సీఎం అవాస్తవాలు మాట్లాడారని, భగ వద్గీత, ఖురాన్, బైబిల్‌పై సీఎం ప్రమాణం చేయగలరా అని ఆయన ప్రశ్నించారు. ఆ విధంగా చేయ లేని పక్షంలో టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ హామీ తప్పుగా ప్రచురితమైందని, దళితులకు మూడెకరాలు ఇవ్వడానికి సిద్ధంగా లేమని చెప్తారా అని నిలదీశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలో అప్పటి మంత్రి కోనేరు రంగారావు అధ్యక్షతన సభాసంఘం సమ ర్పించిన నివేదికను శాసనసభ ఎదుట ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. దాదాపు ఏడేళ్ల క్రితమే రాష్ట్రంలో కులాల వారీగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే నివేదికను ఎందుకు బయట పెట్టడంలేదో చెప్పాలన్నారు. -
జగనన్న ‘స్మార్ట్ టౌన్’కు వేగంగా అడుగులు
మండపేట: పట్టణాల్లోని మధ్యతరగతి వర్గాల సొంతింటి కల సాకారానికి అడుగులు పడుతున్నాయి. తక్కువ ధరకే స్థలం అందించేందుకు ‘జగనన్న స్మార్ట్ టౌన్’కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి తూర్పు గోదావరి జిల్లాలో 41,504 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ లెక్కన వారికి స్థలాల పంపిణీకి 3,215 ఎకరాల భూమి అవసరమని అంచనా. కాకినాడలో 1,284 ఎకరాలు పరిశీలిస్తున్నారు. మిగిలిన పట్టణాల్లో 1,931 ఎకరాల సేకరణకు రూ.2,128 కోట్ల వరకూ వ్యయమవుతుందని అంచనా. పట్టణాల్లో సెంటు భూమి కొనాలన్నా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ పలుకుతోంది. ఈ పరిస్థితుల్లో సొంతింటిపై ఆశలు వదులుకున్న మధ్య తరగతి వర్గాల వారికి ‘జగనన్న స్మార్ట్ టౌన్’ పథకం కొత్త ఉత్సాహం కలిగించింది. మధ్యతరగతి వర్గాలపై భారం పడకుండా సొంతిల్లు సమకూరేలా ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. పట్టణం సమీపంలో భూములు సేకరించి మార్కెట్ ధర కంటే తక్కువకు స్థలాలు అందజేయాలని నిర్ణయించింది. ఈ స్థలాల్లో మౌలిక వసతులు కల్పించనుంది. రూ.3 లక్షల నుంచి రూ.18 లక్షల వరకూ ఆదాయం కలిగిన వారందరూ ఈ పథకానికి అర్హులు. ప్రభుత్వ ఉద్యోగులకూ అవకాశం కలి్పంచింది. లబి్ధదారుల వార్షికాదాయం మేరకు మూడు, నాలుగు, ఐదు సెంట్ల చొప్పున కేటగిరీలుగా స్థలాలు పొందేందుకు రెండు నెలల క్రితం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. జిల్లాలోని రెండు నగరపాలక సంస్థలు, ఏడు మున్సిపాలీ్టలు, మూడు నగర పంచాయతీల పరిధిలో 41,504 మంది దరఖాస్తు చేసుకున్నారు. సిద్ధమైన ప్రతిపాదనలు ఆయా కేటగిరీల్లో వచ్చిన దరఖాస్తుల ప్రకారం ఈ పథకానికి జిల్లాలో 3,215 ఎకరాల భూమి అవసరమవుతుందని అధికారులు గుర్తించారు. కాకినాడ కార్పొరేషన్ పరిధిలో 1,284 ఎకరాలు అవసరమవుతుండగా స్థల పరిశీలన బాధ్యతలను రెవెన్యూ అధికారులకు అప్పగించారు. మిగిలిన పట్టణాల్లో ఇప్పటికే పలు స్థలాలను పరిశీలించిన అధికారులు అక్కడి ధరల వివరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మున్సిపాలిటీలో ఎకరం భూ సేకరణకు రూ.కోటి నుంచి రూ.1.5 కోట్ల వరకూ అవుతుందని అంచనా. స్థల సేకరణ జరగాలి ఎంఐజీ స్కీంకు జిల్లాలో మూడు కేటగిరీల్లో 41,504 దరఖాస్తులు వచ్చాయి. స్థల పంపిణీకి దాదాపు 3,215 ఎకరాల వరకూ అవసరమవుతుందని ఇప్పటికే టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించారు. స్థల సేకరణ ప్రక్రియ జరగాల్సి ఉంది. - రంగనాయకులు, మున్సిపల్ ఆర్డి, రాజమహేంద్రవరం -
తెరపైకి వెదిరె రామచంద్రా రెడ్డి జీవితం
తెలంగాణ రాష్ట్రంలోని పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి జీవితాన్ని ప్రముఖ దర్శకుడు నీలకంఠ తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రామచంద్రారెడ్డి మనవడు అరవింద్ రెడ్డి సమర్పణలో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి (హీరో అల్లు అర్జున్ మామ) నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘గాంధీజీ ప్రియశిష్యుడైన ఆచార్య వినోబా భావే పేదలకు భూ పంపిణీ కోసం అడగ్గానే ప్రథమ భూదాతగా వంద ఎకరాల భూమిని వెదిరె రామచంద్రారెడ్డి దానంగా ఇచ్చారు. భూ పంపిణీకి స్ఫూర్తినిచ్చిన ఆయన జీవిత కథతో సినిమా తెరకెక్కించనున్నాం. ఇంతటి చరిత్ర కలిగిన పోచంపల్లి భూదాన్ గురించి నేటి తరానికి తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో ఈ సినిమా తీయాలనుకున్నాం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే నటీనటులను ఎంపిక చేసి, షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: తోలుపునూరి కృష్ణగౌడ్, గడ్డం రవికుమార్. -
‘సర్కారు భూమిల మన్నుబొయ్య..’
సాక్షి, మహబూబాబాద్: దళితులకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న మూడెకరాల భూమి ఓ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దళితుల మధ్య చిచ్చు రేపింది. ఈ ఘటన బొమ్మకల్ గ్రామంలో జరిగింది. గతంలో ఈ గ్రామంలోని 20 మంది దళితులకు 3 ఎకరాల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. 20 మందికి పంపిణీ చేసిన మూడు ఎకరాల భూమిని గ్రామ సర్పంచ్ ఒప్పందంతో అర్హులైన ఒక్కో దళిత కుటుంబానికి ఎకరం చొప్పున పంచుకోవాలని గతంలో దళితులంతా ఒప్పందం చేసుకున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మూడు ఎకరాల భూమిని 20 మందికి మాత్రమే వర్తిస్తుందని లబ్ధిదారులు అనడంతో దళితులంతా ఆగ్రహించారు. మహిళలని కూడా చూడకుండా లబ్దిదారులపై విచక్షణరహితంగా దాడికి దిగారు. తీవ్ర గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పెద్దవంగర ఎస్ఐ జితేందర్ పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. దళితులంతా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు సమర్పించారని ఎస్ఐ తెలిపారు. ఇక గ్రామంలోని కొంతమంది దళితులకే ప్రభుత్వం భూములు ఇవ్వడంతోనే ఈ గొడవలకు కారణమైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘సర్కారు భూమిల మన్నుబొయ్య మా పానాలు తీస్తరా’ అని బాధితులు ఆక్రోశం వెళ్లగక్కారు. -
పేదలకు నాణ్యమైన ఇళ్లు
సాక్షి, అమరావతి: పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్ట నున్న గృహ నిర్మాణాల్లో ఎక్కడా లోపాలు ఉండరా దని, నాణ్యంగా ఉండాలని ఇంజనీరింగ్ సిబ్బందిని గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల్లో కీలకంగా వ్యవహరించే ఇంజనీరింగ్ సిబ్బందితో మంగళవారం తాడేపల్లిలోని గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో సెమినార్ నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జి.యస్.నవీన్ కుమార్, చీఫ్ ఇంజనీర్ మల్లికార్జునరావు పలు సూచనలు చేశారు. నాణ్యతపై ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లకు ఈ నెల 26న సెమినార్ నిర్వహించనున్నట్లు తెలిపారు. నవరత్నాల అమలులో భాగంగా ప్రభుత్వం ఈ పథకాన్ని డిసెంబర్ 25న లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు మరోసారి స్పష్టం చేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన రోజే గృహ నిర్మాణాలు ప్రారంభించేలా యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. డ్యాష్‌బోర్డులో పురోగతి వివరాలు.. ఇళ్ల నిర్మాణ పథకం ప్రారంభించే సమయానికి లబ్ధిదారునికి గృహం మంజూరు పత్రంతోపాటు సీఎం సందేశం, పూర్తి వివరాలు అందించాలని ఉన్నతాధికారులు సెమినార్లో సూచించారు. డిసెంబర్ 25న సీఎం జగన్ పథకాన్ని ప్రారంభించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారని తెలిపారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన సిమెంట్, ఐరన్, మెటల్, ఇసుక తదితరాలను లేఅవుట్ల సమీపంలోని గోడౌన్లలో భద్రపరిచేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్య మంత్రి ఆదేశాల ప్రకారం పూర్తి పారదర్శకంగా నిర్మాణాలు చేపట్టాలని, ఎక్కడా అవినీతికి ఆస్కారం ఇవ్వరాదని, ఎప్పటికప్పుడు డ్యాష్ బోర్డులో పొందు పరచాలని పేర్కొన్నారు. -
కలల గృహాలకు కదలిక
సాక్షి, అమరావతి : పేదల కలల గృహాలకు కదలిక వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రానున్న మూడున్నరేళ్లలో 30 లక్షల మంది పేదలకు ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో 15 లక్షల ఇళ్లు నిర్మించేందుకు గృహ నిర్మాణ సంస్థ అవసరమైన కసరత్తు ప్రారంభించింది. పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నందున సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ద్వారా వస్తువులు కొనుగోలు చేయనున్నారు. 67.50 లక్షల టన్నుల సిమెంట్, 7.20 లక్షల టన్నుల ఇనుముతో పాటు పెద్ద ఎత్తున మెటల్, రంగులు (పెయింట్) అవసరం కావడంతో రివర్స్ టెండరింగ్ ద్వారా వాటిని సేకరించేందుకు అధికారులు విధి విధానాలు తయారు చేస్తున్నారు. డిసెంబర్ 25వ తేదీన ఇంటి పట్టాలు పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడంతో అదే రోజు ఇంటి మంజూరు పత్రాన్ని కూడా లబ్ధిదారులకు ఇవ్వనున్నారు. నిర్మాణాలకు ఉచితంగా ఇసుక సరఫరా చేయనున్నారు. పట్టాలు మంజూరైన పేదలందరికీ గృహాలు నిర్మిస్తారు. నాణ్యమైన నిర్మాణ సామగ్రి, మార్కెట్ ధర కంటే తక్కువకు ఉత్పత్తిదారుల నుంచి లబ్ధిదారులకు అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. లే అవుట్ కాలనీల్లో మౌలిక సదుపాయాలైన రోడ్లు, మంచి నీరు, విద్యుదీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. గ్రామ, వార్డు సచివాలయాలు కీలక పాత్ర ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లించనున్నారు. లబ్ధిదారులకు బ్యాంకు ఖాతా ప్రారంభం మొదలు వారి ఖాతాలకు బిల్లులు జమ అయ్యే వరకు గ్రామ, వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషించనున్నాయి. అందులో పని చేస్తున్న డిజిటల్, వెల్ఫేర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో పాటు వలంటీర్లు క్షేత్ర స్థాయిలో పని చేస్తారు. నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వనుంది. నిర్మాణాలను పర్యవేక్షించే ఇంజినీర్లు, తాపీ పని చేసే వారికి ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. అందుకు గృహ నిర్మాణ సంస్థ ఇంజినీర్లకు ఎప్పటికప్పుడు శిక్షణ ఇచ్చేలా తిరుపతి ఐఐటీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు లేకుండా మేస్త్రీలు, ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్ల వివరాలను ఇప్పటికే గ్రామ, పట్టణాల వారీగా సేకరించారు. ఇళ్ల నాణ్యతను ఎప్పటికప్పుడు టెక్నికల్ కమిటీ పర్యవేక్షిస్తుంది. సొంతంగా ఇల్లు నిర్మించుకుంటే పరికరాలు ఇస్తాం లబ్ధిదారులు సొంతంగా ఇల్లు నిర్మించుకునేందుకు ముందుకు వస్తే వారి ఐరన్, సిమెంట్, బ్రిక్స్, తలుపులు, కిటికీలు తదితర పరికరాలు ఇస్తాం. నిర్మాణానికి అవసరమైన ఇసుక కూడా ఉచితమే. డిసెంబర్ 25న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్టాలు పంపిణీ చేసే రోజే 10 వేల మందికి ఇళ్ల మంజూరు పత్రాలు ఇవ్వడమే కాకుండా వాటికి మ్యాపింగ్ చేస్తాం. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలందరికీ నిర్మిస్తాం. - చెరుకువాడ శ్రీరంగనాథరాజు, గృహ నిర్మాణ శాఖ మంత్రి మొదటి విడత ఇళ్లు మంజూరు ఇలా జిల్లా ఇళ్ల సంఖ్య తూర్పు గోదావరి 2,40,100 కృష్ణా 1,75,939 విశాఖపట్నం 1,70,912 గుంటూరు 1,58,710 పశ్చిమ గోదావరి 1,54,855 చిత్తూరు 1,41,087 అనంతపురం 1,01,310 వైఎస్సార్ కడప 76,445 ప్రకాశం 70,990 కర్నూలు 58,738 శ్రీకాకుళం 56,608 విజయనగరం 51,767 నెల్లూరు 42,539 -
ఒక్క రూపాయికే టిడ్కో ఇల్లు
సాక్షి, అమరావతి: ఒకే ఒక్క రూపాయి చెల్లింపుతో ఏపీ టిడ్కో (ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) ఇంటిని లబ్ధిదారులకు అప్పగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ ఏర్పాట్లు, ఇళ్ల నిర్మాణాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో స్పందన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. టిడ్కో ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2,62,200 ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. ఇందులో ఇప్పటికే 300 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఇళ్లు 1,43,600 నిర్మాణంలో ఉన్నాయని, 365 చదరపు అడుగుల్లో 44,300 ఇళ్లు, 430 చదరపు అడుగుల్లో 74,300 ఇళ్ల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. టిడ్కోకు సంబంధించి గత ప్రభుత్వం రూ.3,200 కోట్లు బకాయి పెట్టి పోయిందన్నారు. ఒక వైపు ఆ బకాయిలు తీరుస్తూనే, మన ప్రభుత్వం వచ్చాక ప్రజల కోసం ఇప్పటికే రూ.1,200 కోట్లు ఇచ్చామని, ఈ వారంలో మరో రూ.400 కోట్లు, 15 రోజుల్లో ఇంకో రూ.600 కోట్లు ఇస్తామని వివరించారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. మూడేళ్ల పాటు ప్రాజెక్టు ► రూ.2,500 కోట్లు టిడ్కో ఇళ్ల మౌలిక వసతుల కోసం ఖర్చు పెట్టనున్నాం. ఆ మేరకు టెండర్లు పిలవబోతున్నాం. డిసెంబర్ 15 నాటికి ఆ టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలి. ► ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం ప్రభుత్వం రూ.9,550 కోట్లు వ్యయం చేస్తుంది. ఈ ఏడాది, వచ్చే ఏడాది, ఆ తర్వాత ఏడాది కూడా పనులు చేపట్టి పూర్తి చేస్తాం. ► పేదలకు హక్కుగా ఇచ్చిన ఇళ్లను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం ఎందుకు? చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడో ప్రజలకు కూడా అర్థం కావడం లేదు. జగన్ స్కీమ్ కావాలనుకున్న వారికి డిసెంబర్ 25న కేవలం ఒక్క రూపాయితో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అవుతుంది. ఎవరి స్కీమ్ కావాలి? ► వచ్చే సోమవారం (23వ తేదీ) నుంచి ఈ నెల 30వ తేదీ వరకు టిడ్కో కింద 300 చదరపు అడుగుల ఇల్లు పొందనున్న లబ్ధిదారుల దగ్గరకు వలంటీర్లు ప్రభుత్వ లెటర్ తీసుకువెళతారు. మీకు చంద్రబాబు స్కీమ్ కావాలా? జగన్ స్కీమ్ కావాలా? అని అడుగుతారు. ఏది కావాలో తేల్చుకోమని చెబుతారు. ఇదీ బాబు స్కీమ్.. ► లబ్ధిదారుడు రూ.3 లక్షల అప్పును నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్ల పాటు వడ్డీతో సహా మొత్తం రూ.7 లక్షలు కట్టాలి. ఆ తర్వాతే ఇంటిపై హక్కులు చేతికి వస్తాయి. అప్పుడే ఆ ఇంటి పట్టా లబ్ధిదారులకు అందుతుంది. ఇది జగన్ స్కీమ్.. ► డిసెంబర్ 25న 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేవలం ఒక్క రూపాయితో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేస్తారు. ఏ అప్పు లేకుండా వెంటనే సర్వ హక్కులతో ఇల్లు సొంతమవుతుంది. ఆ తర్వాత పక్కాగా ఫ్రీ రిజిస్ట్రేషన్ చేస్తారు. -
ఏపీ: డిసెంబర్ 25న ఇళ్ల స్థలాల పంపిణీ
-
ఏపీ: ఇళ్ల స్థలాల పంపిణీకి ముహూర్తం ఖరారు
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం డిసెంబర్ 25న ప్రారంభం కానుంది. కోర్టు స్టే ఉన్న ప్రాంతాల్లో మినహా మిగతా అన్ని చోట్ల ఈ కార్యక్రమం ప్రారంభంకానుంది. డిసెంబర్ 25న అర్హులకు డి-ఫామ్ పట్టా ఇచ్చి ఇంటి స్థలం కేటాయించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 30,68,281మంది లబ్ధిదారులను గుర్తించింది. వీరందరికి పట్టాలు అందించడంతో పాటు అదే రోజు ఇళ్ల నిర్మాణాలు మెదలుకానున్నాయి. తొలి దశలో దాదాపు 15 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. వాస్తవానికి జూలై 8నే ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కొందరు స్వార్ధపరులు కోర్టుకు వెళ్లడంతో పలుమార్లు వాయిదా పడింది. ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సంబంధించిన కాలనీలను ప్రభుత్వం ఎప్పుడో రూపొందించింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇవ్వబోయే స్థలాలు గతంలోలా బలహీన వర్గాల గృహ సముదాయంలా ఉండదు. ఎలాంటి వసతుల్లేని అగ్గిపెట్టెల్లాంటి.. డబ్బాల్లాంటి ఇళ్లు కాదు. విశాలమైన రోడ్లు, పార్కులు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర సామాజిక అవసరాల కోసం స్థలాలు కేటాయించారు. ఇల్లు లేదనే వారు ఉండకుండా సంతృప్త స్థాయిలో అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందజేయనున్నారు. -
గిరిజన సంక్షేమానికి పెద్దపీట
-
గ్రామ స్వరాజ్యం సాకారం చేశాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాంధీ జయంతి రోజున పట్టాల పంపిణీతో పాటు మరిన్ని గిరిజన సంక్షేమ కార్యక్రమాలకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. పాడేరులో మెడికల్ కాలేజీ, కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, గిరిజన ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ఆన్లైన్ ద్వారా సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇంటింటికి ప్రభుత్వ పథకాలు, గ్రామగ్రామానికి ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు.లక్షా 53వేల మంది గిరిజనులకు 3.12లక్షల ఎకరాల భూమి పంపిణీ , రైతు భరోసా సాయం అందిస్తున్నామని తెలిపారు. (చదవండి: గిరిజనుల దశాబ్దాల కల సాకారం..) ‘‘మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తా. భూ వివాదాలకు ఎక్కడా తావు లేకుండా డిజిటల్ సర్వే ద్వారా పంపిణీ చేశాం. గిరిజనులకు భూమితో పాటు రైతు భరోసా కింద సాయం అందిస్తాం. పట్టాలు పొందిన గిరిజనులకు ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటాం.పంటలు పండించుకునేందుకు గిరిజనులకు ఆర్ధిక సాయం అందిస్తామన్నారు. గిరిజనులకు ఫారెస్ట్ అధికారులతో పాటు కలెక్టర్లు దిశానిర్దేశం చేస్తారని’’ సీఎం పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వాలన్న ఆలోచన రాలేదని, గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా రాలేదన్నారు. ‘‘పాదయాత్రలో గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులను చూశా.గిరిజనుల ఆదాయం, పచ్చదనం పెరగాలి.గిరిజనుల ఆదాయం, పచ్చదనం పెరగాలి. నాడు-నేడులో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. పాడేరులో రూ.500 కోట్లతో వైద్య కళాశాలకు, కురుపాంలో రూ.153 కోట్లతో గిరిజన ఇంజినీరింగ్ కాలేజీకి శంకుస్థాపనకు శ్రీకారం చుట్టాం. సీతంపేట, పార్వతీపురం, దోర్నాల, బుట్టాయిగూడెం, రంపచోడవరంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ ప్లస్ పథకం కింద గర్భిణీలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చదువులను తీసుకొచ్చామని’ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. చప్పట్లతో అభినందించాలి.. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థకు ఏడాది పూర్తయిన సందర్భంగా గ్రామ స్వరాజ్యాన్ని సాధ్యం చేస్తున్న వారికి సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. సీఎం జగన్ ఏమన్నారంటే... ‘‘అక్టోబరు 2న గాంధీ జయంతి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తిచేస్తున్నాను. మన గ్రామాల్లో మన ఇంటి వద్దకే వచ్చి మన తలుపు తట్టి మనకు ఏ సహాయం కావాలన్నాకూడా వివక్ష లేకుండా, లంచాలకు తావులేకుండా మనకు మంచి చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలు స్థాపించి దాదాపు ఏడాది పూర్తవుతోంది. ఏడాది పూర్తవుతున్న సందర్భంగా గ్రామ స్వరాజ్యం మన అందరికీ కూడా కళ్ల ఎదుటే కనిపించే విధంగా వీళ్లందరూ కూడా మనకు సేవలు అందిస్తున్నారు. లాభాపేక్ష లేకుండా మనకు సేవలు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు మనకు మంచి సేవలు అందిస్తున్న వీరందరినీ అభినందిస్తూ ఇళ్లనుంచి బయటకు వచ్చి చప్పట్టు కొట్టి అభినందించాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, వాలంటీర్లను ప్రోత్సహించేలా, వారికి తోడుగా ఉండేలా నిలిచేందుకు వారిని చప్పట్లతో అభినందించాలని కోరుతున్నా. నేనుకూడా సాయంత్రం 7 గంటలకు బయటకు వచ్చి నా ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొడతాను. మన వంతు ఆదరణ వారికి చూపించాలని’’ సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. -
గిరిజనుల దశాబ్దాల కల సాకారం..
సాక్షి, అమరావతి: పోడు వ్యవసాయాన్ని నమ్ముకున్న దాదాపు లక్షన్నర మంది గిరిజన రైతుల స్వప్నం గాంధీ జయంతి రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాకారం చేశారు. వారికి అటవీ భూములపై హక్కులు కల్పిస్తూ ఆయన శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాంధీ జయంతి రోజున పట్టాల పంపిణీతో పాటు మరిన్ని గిరిజన సంక్షేమ కార్యక్రమాలకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. పాడేరులో మెడికల్ కాలేజీ, కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, గిరిజన ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. 5 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు ప్రభుత్వం 246.30 కోట్లు మంజూరు చేసింది. (చదవండి: గాంధీ అడుగు నీడలో పాలన : సీఎం జగన్) తొలిసారిగా గిరిజన రైతులు సాగు చేసుకునే అటవీ భూములపై దివంగత వైఎస్సార్ హక్కు పత్రాలను అందచేశారు. 1,30,679 ఎకరాలకు సంబంధించి 55,513 ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను ఆయన పంపిణీ చేశారు. తరువాత ప్రభుత్వాలు గిరిజన సంక్షేమాన్ని విస్మరించాయి. ఇప్పుడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మరోసారి అదే స్థాయిలో పంపిణీకి శ్రీకారం చుట్టింది. -
సాకారం కానున్న గిరిజన రైతుల స్వప్నం
సాక్షి, అమరావతి: పోడు వ్యవసాయాన్ని నమ్ముకున్న దాదాపు లక్షన్నర మంది గిరిజన రైతుల స్వప్నం గాంధీ జయంతి రోజు సాకారం కానుంది. గిరిజన రైతులకు వారు సాగు చేసుకుంటున్న అటవీ భూములపై హక్కులు కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం పత్రాలను పంపిణీ చేయనున్నారు. ►తొలిసారిగా గిరిజన రైతులు సాగు చేసుకునే అటవీ భూములపై దివంగత వైఎస్సార్ హక్కు పత్రాలను అందచేశారు. 1,30,679 ఎకరాలకు సంబంధించి 55,513 ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను ఆయన పంపిణీ చేశారు. తరువాత ప్రభుత్వాలు గిరిజన సంక్షేమాన్ని విస్మరించాయి. ఇప్పుడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మరోసారి అదే స్థాయిలో పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసింది. ►సరిహద్దులను గుర్తించడం, రాళ్లు పాతడం, వెబ్‌ల్యాండ్, ఆర్వోఎఫ్ఆర్ డేటా బేస్‌లో వివరాల నమోదు ఇప్పటికే పూర్తయింది. ►ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దాదాపు 1.53 లక్షల మంది గిరిజన రైతులకు సుమారు మూడు లక్షల ఎకరాలకు సంబంధించి ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. (దర్యాప్తు ప్రారంభానికి ముందే స్టే ఎలా ఇస్తారు?) ►ఏజెన్సీలో మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రులకు నేడు శ్రీకారం ►పాడేరు మెడికల్ కాలేజీతోపాటు ఐటీడీఏ ప్రాంతాల్లో మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణ పనులను సీఎం జగన్ శుక్రవారం ప్రారంభిస్తారు. సీతంపేట (శ్రీకాకుళం), పార్వతీపురం (విజయనగరం), రంపచోడవరం (తూర్పుగోదావరి), బుట్టాయగూడెం (పశి్చమగోదావరి), దోర్నాల (ప్రకాశం)లో ఆస్పత్రుల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.246 కోట్లు విడుదల చేసింది. ►నవరత్నాల్లో భాగంగా గిరిజన సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఏజెన్సీలో అక్షరాస్యత పెంచడంతో పాటు ఆరోగ్య సంరక్షణకు పలు కార్యక్రమాలను చేపట్టారు. అధికారం చేపట్టగానే గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్టీ ఉప ప్రణాళిక కింద రూ.5177.54 కోట్లు కేటాయించగా సెపె్టంబర్ నెలాఖరు వరకు 184 పథకాల కింద గిరిజనుల కోసం రూ.2,560.33 కోట్లను వ్యయం చేశారు. ►విజయనగరం జిల్లా కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.153.85 కోట్లను విడుదల చేసింది. -
ఇళ్ల స్థలాలు కావాలన్న కుటుంబాలు వెలి
మనుబోలు: మండలంలోని వెంకన్నపాళెం ఎస్సీ కాలనీలో ప్రభుత్వం అందజేసే ఇళ్ల స్థలాలు కావాలన్నందుకు కొన్ని కుటుంబాలను తోటి సామాజిక వర్గం పెద్దలే వెలివేశారు. గత మూడ్రోజులుగా వారితో కాలనీ వాసులు ఎవరూ మాట్లాడకుండా నియమం విధించారు. దుకాణాల్లో సరుకులు సైతం ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ గ్రామ సచివాలయం వద్ద శుక్రవారం ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ కోసం వెంకన్నపాళెంలో ఎస్సీ కాలనీని ఆనుకుని సర్వే నంబర్ 131లో ఉన్న రెండెకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించారు. లేఅవుట్‌ను సైతం సిద్ధం చేశారు. అయితే ఓ ప్రతిపక్ష నాయకుడి అండతో స్థానిక ఎస్సీలు తమకు అక్కడ స్థలాలు వద్దని వ్యతిరేకించడంతో లేఅవుట్పై వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక టీడీపీ నాయకుల ప్రోద్బలంతో కొందరు ఇటీవల దౌర్జన్యంగా లేఅవుట్లో గుడిసెలు వేశారు. ఈ క్రమంలో మూడ్రోజుల క్రితం తహసీల్దార్ నాగరాజు లేఅవుట్ విషయమై ఎస్సీలతో చర్చించారు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఇళ్ల స్థలాలు ఇస్తుంటే రాజకీయ కారణాలతో వ్యతిరేకించడం మంచిది కాదని నచ్చజెప్పడంతో కొందరు స్థలాలు తీసుకునేందుకు సిద్ధపడ్డారు. దీంతో మిగిలిన వారు స్థలాలు తీసుకునేందుకు సిద్ధపడిన 14 ఎస్సీ కుటుంబాలను ద్వేషంతో వెలివేశారు. బాధితుల్లో నలుగురు గ్రామ వలంటీర్లు కూడా ఉండడం విశేషం. ఎస్సీల వెలి, ఆందోళన విషయం తెలుసుకున్న తహసీల్దార్ నాగరాజు పోలీసులతో కలిసి సచివాలయం వద్దకు చేరుకుని బాధితులతో మాట్లాడారు. ఇళ్ల స్థలాలు కావాలన్నందుకు తోటి కులస్తులే తమను కుల బహిష్కరణ చేశారని బాధితులు తహసీల్దార్ వద్ద వాపోయారు. తమతో ఎవరు మాట్లాడినా రూ.10 వేలు జరిమానా వేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వెలేసిన ఎస్సీ సామాజిక వర్గ పెద్దలను తహసీల్దార్ పిలిపించి హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయని, ఇతరులను వెలివేసే హక్కు ఎవరికీ లేదన్నారు. మరోసారి ఇలాంటివి పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
పేదలకు ఇళ్ల స్థలాలు రెడీ
అర్హులైన పేదలందరికీ ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ప్రభుత్వ ఆలోచన త్వరలో కార్యరూపం దాల్చనుంది. వాస్తవంగా ఈ నెల 8నే ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కొందరు స్వార్ధపరులు కోర్టుకు వెళ్లడంతో చివరి నిముషంలో ఈ కార్యక్రమాన్ని వచ్చే నెల 15కు వాయిదా వేశారు. సాక్షి, విజయవాడ: నగరంలో ఇళ్ల స్థలాల కోసం 1.13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1.05 లక్షల మంది అర్హులని నగర పాలక సంస్థ గుర్తించింది. వీరందరికీ ఇళ్ల స్థలాలు నగర పరిసర గ్రామాల్లోనూ, రాజధాని గ్రామాల్లోనూ కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం ఇవ్వాలనే లక్ష్యంతో గడువు దాటిన తరువాత వచ్చిన దరఖాస్తులను కూడా తీసుకుని వారికీ ఇళ్లు కేటాయించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నగర పరిసర గ్రామాల్లో 1,333.59 ఎకరాల్లో 70,680 ప్లాట్లు సిద్ధం పేదల ఇళ్ల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ భూములను జిల్లా రెవెన్యూ అధికారులు సేకరించారు. సెంటు ప్లాటు చొప్పున విడగొట్టి సిద్ధం చేశారు. మొత్తం 1,333.59 ఎకరాల్లో 18 లేఅవుట్లలో 70,680 ప్లాటు సిద్ధంగా ఉన్నాయి. విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో 85.56 ఎకరాల్లో 4,535 ప్లాట్లు, ఇబ్రహీంపట్నం కొండపల్లిలో 40.72 ఎకరాల్లో 2,158 ప్లాట్లు, పెనమలూరు మండలం వణుకూరులో 155.07 ఎకరాల్లో 8,219 ప్లాట్లు, గన్నవరం మండలం సూరంపల్లి, కొండపావులూరుల్లో 396.66 ఎకరాల్లో 21,023 ప్లాట్లు, జి కొండూరు మండలం మునగపాడు, సున్నంపాడు గ్రామాలలో 521.22 ఎకరాల్లో 27,625 ప్లాట్లు, కంకిపాడు మండలం గొడవర్రులో 134.36 ఎకరాల్లో 7,121 ప్లాట్లు సిద్ధంచేశారు. ఆయా ప్లాట్ల మధ్యలో విశాలమైన రోడ్లు వేశారు. ఏ బిట్‌కు ఆ బిట్ విడగొట్టి సర్వే రాళ్లు పాతి లబ్ధిదారులు చూసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. టీడీపీ నేతలకు కంటగింపు మిగిలిన వారికి రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఒకేసారి నగరంలో లక్ష కుటుంబాలకు ఇళ్ల స్థలాలు వస్తే టీడీపీ పార్టీ ముఖం చూసేవారే కరువవుతారనే కంటగింపు ఆ పార్టీ నేతల్లో ఏర్పడింది. దీంతో ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. రాజధాని గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదంటూ అక్కడ రైతులతో కోర్టులో కేసులు వేయించారు. ఇక రైతుల నుంచి సేకరించిన భూమిని పేదలకు దక్కకుండా కోర్టులలో కేసులు దాఖలు చేయిస్తున్నారు. వీరి ప్రయత్నాలన్నీ తాత్కాలికమే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలు త్వరలోనే కార్యరూపం దాల్చనున్నాయి. పేదల ఎదురు చూపులు ఇప్పటికే రెండు సార్లు టీడీపీ నాయకులు అడ్డుపడటాన్ని పేదలు గమనిస్తున్నారు. వారి వ్యవహారంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇళ్ల స్థలాలు ఎప్పుడు వస్తాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. -
పేదల ఇళ్ల స్థలాల కోసం 30,875 ఎకరాలు గుర్తింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హులైన పేదలందరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం మేరకు అధికార యంత్రాంగం ఆ దిశగా కార్యాచరణకు దిగింది. ఒకవైపు ఇళ్ల స్థలాలకు అవసరమైన భూములను గుర్తించడంతోపాటు మరోవైపు లబ్ధిదారుల గుర్తింపును కూడా సమాంతరంగా చేపట్టింది. వచ్చే ఉగాది నాటికి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరాలని ముఖ్యమంత్రి గట్టి పట్టుదలతో ఉండటంతో అధికార యంత్రాంగం పేదల ఇళ్ల స్థలాల కోసం అనువైన భూములను గుర్తించే పనిలో తలమునకలైంది. ఇప్పటివరకు 10,674 గ్రామాల్లో 26,527.73 ఎకరాలు.. 72 పట్టణ ప్రాంతాల్లో 4,348.23 ఎకరాలు కలిపి 30,875.96 ఎకరాల భూములను అధికారులు గుర్తించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు పంపిణీ చేయడానికి అధికారులు లక్షల సంఖ్యలో వ్యవసాయ భూములను గుర్తించారు. ఇప్పుడు అదే తరహాలో వైఎస్ జగన్ ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసం భూములను గుర్తిస్తోంది. గత ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసం భూములను గుర్తించకపోగా బడా పారిశ్రామికవేత్తల కోసం ఏకంగా పది లక్షల ఎకరాలతో భూ బ్యాంకును ఏర్పాటు చేసింది. పేదల విషయంలో గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి స్పష్టమైన తేడా కనిపిస్తోందని అధికార యంత్రాంగమే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. 17.34 లక్షల మంది అర్హులు రాష్ట్రంలో ఈ ఏడాది ఆగస్టు 26 నుంచి ఇంటింటికీ వెళ్లి గ్రామ, వార్డు వలంటీర్లు సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఇళ్ల స్థలాలు లేని, ఇళ్లు లేని పేదలందరినీ గుర్తించారు. గత నెలాఖరుకు రాష్ట్రంలో మొత్తం కుటుంబాల సర్వేను వలంటీర్లు పూర్తి చేశారు. లబ్ధిదారుల వివరాలను ఆధార్ అనుసంధానం ద్వారా డూప్లికేట్ లేకుండా రియల్‌టైమ్ గవర్నెన్స్ చర్యలు చేపట్టింది. తద్వారా 24.83 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించింది. ఈ లబ్ధిదారుల అర్హతలు, తనిఖీల ప్రక్రియను తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు ఏకకాలంలో కొనసాగిస్తున్నారు. తనిఖీల అనంతరం ఇప్పటివరకు 12,84,611 మంది లబ్ధిదారులు ఇళ్ల స్థలాలకు అర్హులని తేల్చారు. వీరు కాకుండా 4,50,206 మందికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి గుర్తించారు. ఇలా ఇప్పటివరకు 17,34,817 మంది లబ్ధిదారులను ఇళ్ల స్థలాలకు అర్హులుగా తేల్చారు. ఇంకా తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్ల తనిఖీల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 7లోగా ఇంకా ఎంత భూమి అవసరమనేది అధికారులు నిర్ధారించనున్నారు. అవసరమైన భూమిని వచ్చే ఏడాది జనవరి 25లోగా కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే లబ్ధిదారులందరికీ ఇళ్ల స్థలాలు ఎక్కడ ఉన్నాయో మార్కింగ్ చేసి చూపిస్తారు. అంతేకాకుండా ఆ కుటుంబాల మహిళల పేరిట ఉగాది నాడు ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తారు. -
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం
సాక్షి, అమరావతి : అర్హత గల ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం కేటాయించాలన్నదే సర్కారు ధ్యేయమని, ఇందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉగాది పర్వదినం సందర్భంగా అర్హతగల ప్రతి కుటుంబానికి నివాస స్థల పట్టా అందించాలని సూచించారు. బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని ఎన్ని కుటుంబాలకు ఇల్లు, ఇంటి జాగా లేదో పరిశీలించి అర్హులను ఖరారు చేయాలన్నారు. వారందరికీ నివాస స్థలాలు ఇవ్వడానికి ఎంత భూమి అవసరం అవుతుందో.. ప్రభుత్వ భూమి ఎంత అందుబాటులో ఉందో అంచనా వేయాలని ఆదేశించారు. ఎలాంటి లోపాలు లేకుండా అత్యంత కచ్చితత్వంతో సమగ్ర భూ సర్వేకు ఆధునిక పరికరాలు వినియోగించాలని చెప్పారు. భూ వివాదాల కట్టడి, భూ రికార్డుల మ్యుటేషన్, భూ యజమానులకు శాశ్వత భూ హక్కుల కల్పన కోసం అత్యంత కచ్చితత్వంతో భూములు రీసర్వే చేయాలని ఆదేశించారు. ఉగాదికి నెల రోజుల ముందే భూమిని సిద్ధం చేస్తామని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. గ్రామాల్లో 20,800 ఎకరాలు, పట్టణ ప్రాంతాల్లో 2,580 ఎకరాలు అందుబాటులో ఉందని, ఇందులో ఎంత భూమి ఇళ్ల స్థలాలకు అనువైనదో నిర్ధారించే కార్యక్రమం చేపట్టామని వివరించారు. గ్రామాల్లో దాదాపు 14.06 లక్షల మంది, పట్టణాల్లో 12.69 లక్షల మంది ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇందులో 15.75 లక్షల మందికి భూమిని సమకూర్చాల్సి ఉందన్నారు. లోపరహితంగా భూ రీసర్వే ఇప్పటి వరకు అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే వినియోగిస్తున్న కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్ (సీఓఆర్ఎస్.. కార్స్) టెక్నాలజీని దేశంలోనే మొదటిసారిగా మన రాష్ట్రం భూముల రీసర్వేకి వినియోగించనున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రతి చదరపు కిలోమీటర్‌కు రూ.1.10 లక్షలు ఖర్చవుతుందని, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, గ్రీస్ దేశాల్లో కార్స్ ద్వారా రోవర్స్‌తో ఉపగ్రహ సేవలను వినియోగించుకుని సర్వే చేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు దేశంలో మొదటిసారి మనం ఖర్చుకు వెనకాడకుండా ఈ విధానంతో సర్వేకు సన్నద్ధమవుతున్నామన్నారు. రూ.300 కోట్లతో పరికరాల కొనుగోలు రాష్ట్రంలో 670 మండలాల పరిధిలోని 17,460 రెవెన్యూ గ్రామాల్లో 2.36 లక్షల మందికి చెందిన 1.22 లక్షల చదరపు కిలోమీటర్లలో భూములను రీసర్వే చేయడానికి రూ.1,688 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని అధికారులు చెప్పారు. రూ.300 కోట్లతో పరికరాలు కొనుగోలు చేస్తున్నామన్నారు. ‘1880 – 1930 మధ్య తొలిసారి రైత్వారీ గ్రామాలపై రికార్డులు రూపొందించారు. 1960 – 80 మధ్య మరోసారి సెటిల్మెంట్ గ్రామాలపై రికార్డులు రూపొందించారు. ప్రస్తుతం అన్ని భూ సమస్యల పరిష్కారానికి రీసర్వేనే మార్గం. అందుకే 75 బేస్ స్టేషన్లు, 3,440 రోవర్స్, ఒక కంట్రోల్ సెంటర్, 1,850 లాప్టాప్స్, 700 డెస్క్ టాప్స్ వినియోగించి ఒకేసారి మూడు వేల గ్రామాల్లో రీసర్వే చేపడతాం. అన్ని శాఖలకు ఉపయోగపడేలా డేటా పక్కాగా ఉంటుంది. మూడు విడతల్లో రెండున్నరేళ్లలో సర్వే పూర్తి చేస్తాం’ అని అధికారులు సీఎంకి వివరించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్సింగ్, సర్వే సెటిల్మెంట్ డైరెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.