‘భూ పంపిణీ’ సాధ్యమేనా?
ఆదిలాబాద్ అర్బన్ : జిల్లాలోని భూమిలేని దళిత నిరుపేదలకు సాగుకు యోగ్యమైన మూడెకరాల భూమి పంపిణీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దళితబస్తీ పేరిట ఆగస్టు 15న పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఇంకా పదమూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటివరకు జిల్లాలో భూ పంపిణీ చేసేందుకు 170 మంది లబ్ధిదారులను అధికారులు గుర్తిం చారు. వీరికి 510 ఎకరాల భూమి అవసరం. కాగా 41 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మిగతా సాగుకు యోగ్యమైన ప్రభుత్వ భూ మి అందుబాటులో లేకపోవడంతో సమస్య వచ్చిపడింది.
రూ. 16 కోట్లు అవసరం
జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గానికి ఒక గ్రామం చొప్పున పది గ్రామాల్లో మొదటి దశలో 170 మందికి భూ పంపిణీ చేసేందుకు యంత్రాంగం ప్రాథమికంగా నిర్ధారించింది. వీరికి ప్రస్తుతం 41 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. మిగతా 469 ఎకరాల భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసి నిరుపేదలకు పంచాలి. ఇందుకు రూ.16 కోట్లు అవసరం. భూ పంపిణీకి ప్రభుత్వం నిర్దేశించిన గడువు దగ్గర పడుతుండడం.. భూమి లభ్యతపై యంత్రాంగానికి స్పష్టత లేకపోవడంతో అధికారులు అయోమయానికి గురవుతున్నారు. ఒకవైపు భూమి కొనుగోలు చేసైనా పంపిణీ చేస్తామంటున్న సర్కారు.. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయకపోవడం అధికారులను గందరగోళంలో పడేసింది.
క్షేత్రస్థాయిలో జరగని లబ్ధిదారుల ఎంపిక
మొదటి విడతలో భాగంగా 170 మంది కుటుంబాలకు లబ్ధిచేకూర్చేలా ప్రాథమికంగా ప్రణాళిక తయారు చేసినప్పటికీ.. లబ్ధిదారుల ఎంపికపై అధికారులకు స్పష్టత లేదు. దీంతో క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక జరగలేదనే ఆరోపణలు ఉన్నాయి. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి సర్వే నిర్వహించాలని ఇదివరకే అధికారులకు శిక్షణ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. కొన్ని గ్రామాల్లో సర్పంచ్‌లే ఆ ఊరి ప్రజల జాబితా తీసుకెళ్లి మండలాధికారులకు అందజేశారనే విమర్శలు ఉన్నాయి.
క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి సమగ్ర నివేదిక తయారు చేస్తే తప్పా అర్హులకు మేలు జరిగే అవకాశం లేదని పలువురు పేర్కొంటున్నారు. మండలానికో గ్రామం చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం సూచించినప్పటికీ జిల్లాలో మాత్రం కొన్ని గ్రామాల ఎంపిక పెండింగ్‌లో ఉంది. మొదటి దశలో నియోజకవర్గానికో గ్రామం చొప్పున పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులకు సులువైంది. వీరికి పంపిణీ చేసేందుకు ప్రభుత్వ భూమి లేకపోవడంతో అధికారులకు తలనొప్పిగా మారింది. అయితే భూమి గుర్తించడానికైనా.. లేదా కొనుగోలు చేసేందుకైనా సమయం పడుతుంది. ఆగసుట 15లోగా ఇది సాధ్యం కాదని అధికారులే పేర్కొనడం గమనార్హం.