భూమి ఏమాయె!
దళితులకు భూ పంపిణీపై ప్రభుత్వానికి కొరవడిన చిత్తశుద్ధి
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో భూమిలేని నిరుపేదలు ఎక్కడా ఉండకూడదు. అర్హులైన దళితులకు వ్యవసాయ యోగ్యమైన భూమి అందించడమే లక్ష్యం. ఎన్ని కోట్లు ఖర్చరుునా సరే భూమి లేని నిరుపేద దళితుల అభివృద్ధి కోసం కృషి చేస్తాం.
- ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు
- శాఖల సమన్వయ లోపం.. లబ్ధిదారులకు శాపం
- నిధులు కోట్లలో.. ఖర్చు లక్షల్లో..
- సరైన మార్గదర్శకాలు కరువు
- ఏడాది దాటినా ఎదురుచూపులే
ఖమ్మం సంక్షేమ విభాగం: భూమిలేని నిరుపేద దళితులకు మూడు ఎకరాలు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటన చేసి ఏడాదికి పైగా అవుతోంది. కానీ ఇప్పటికీ ఇది సరిగా ఆచరణకు నోచుకోవడం లేదు. శాఖల మధ్య సమన్వయలోపంతో కనీస లక్ష్యాన్ని కూడా చేరుకోలేకపోతోంది. భూములు విక్రయించేందుకు రైతులు ముందుకు వచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు, భూముల కొనుగోలుకు నిధులు కేటాయింపులో ఎస్సీ కార్పొరేషన్ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయి.
59 ఎకరాలు మాత్రమే పంపిణీ
జిల్లాలో ఇప్పటివరకు కేవలం 22 మంది లబ్ధిదారులకు 59 ఎకరాలను మాత్రమే పంపిణీ చేశారు. ఖమ్మం రెవె న్యూ డివిజన్‌లో వందలాది ఎకరాల భూములను రైతు లు స్వచ్ఛందంగా విక్రయించేందుకు ముందుకు వస్తు న్నా విధివిధానాలు అస్పష్టంగా ఉండడంతో అధికారు లు పట్టించుకోవడం లేదు. భూమి కొనుగోలు ప్రాంతం, మార్కెట్ ధరలు, సాగు యోగ్యం, నీటివసతి ఆధారంగా రేటు నిర్ణయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దశాబ్దాల నుంచి సాగులో ఉన్న వ్యవసాయ భూములను సైతం కొన్ని శాఖల అధికారులు నివేదికల ఆధారంగా ఎంపిక చేయాలని సూచించడంతో ప్రారంభ దశలోనే ఆటంకాలు ఏర్పడ్డాయి.
భూగర్భ జలవనరుల శాఖ నీటి లభ్యత నివేదిక ఇచ్చిన తరువాతనే మార్కెట్ ధరలు, ఇతరత్ర అంశాలను బట్టి ప్రభుత్వం రేట్లు నిర్ణరుుంచాలని జిల్లా స్థాయి కమిటీలో సూచించారు. వివిధ కారణాలతో భూములు అమ్ముకునేందుకు చాలామంది రైతులు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో దశాబ్దాల నుంచి నీటి వనరుల ఆధారంగా సాగు చేస్తున్న భూములకు భూగర్భ జలవనరుల శాఖ నివేదిక ఎందుకనే ప్రశ్న రైతుల నుంచి ఉత్పన్నమవుతోంది.
ధరల్లో వ్యత్యాసం కూడా కారణమే..
ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలకు, బహిరంగ మార్కెట్ ధరలకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రకటించిన ధరలకు అటుఇటుగా భూములు దొరికే పరిస్థితి ఉన్నా వివిధ శాఖల అధికారుల సమన్వయ లోపంతో అక్కడ కూడా సాధ్యం కావడం లేదు. ఉదాహరణకు సాగు యోగ్యమైన భూమి, నీటివసతి, మార్కెట్ ధర ఆధారంగా ఎకరానికి 7లక్షల వరకు వెచ్చించవచ్చని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. అయితే రిజిస్ట్రేషన్ ధరల ప్రకారం మారుమూల ప్రాంతాల్లో ఎకరం ధర లక్ష నుంచి మూడు లక్షల మధ్య లభిస్తుంది.
బహిరంగ మార్కెట్లో కనిష్ట స్థాయి 5 లక్షల నుంచి 15 లక్షల మధ్య కొనసాగుతోంది. మార్కెట్ ధరల ప్రకారం రాళ్లు రప్పలతో కూడిన బీడుభూములు మినహా పూర్తి నీటివసతి ఉన్న సాగుభూములు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. భూమిలేని నిరుపేదలకు భూమి కొనుగోలు చేసి పంపిణీ చేసే పథకం ముందుకు సాగాలంటే అధికారులు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలు సడలించాల్సి ఉంది. రెవెన్యూ, ఎస్సీ కార్పొరేషన్ అధికారులతో కూడిన కమిటీకి జాయింట్ కలెక్టర్‌ను చైర్మన్‌గా నియమిస్తే భూపంపిణీ పథకం ఊపందుకునే అవకాశాలు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది.
ఆటంకాలెన్నో..!
ఏజెన్సీలో 1/70 చట్టం అమలులో ఉండడంతో భూమి లభ్యత తక్కువగా ఉంది. మైదాన ప్రాంతాల్లో హైదరాబాద్‌ను తలదన్నేలా రియల్‌ఎస్టేట్ వ్యాపారం కొనసాగుతుండడంతో భూముల ధరల అమాంతం పెరిగాయి. ఇ క్కడ భూమిని విక్రయించే రైతుల సంఖ్య తక్కువగా ఉం డగా లబ్ధిదారుల సంఖ్య భారీగా ఉంది. కొన్ని మండలా ల్లో రెవెన్యూ అధికారులు భూమి కొనుగోలు పథకం పట్ల అయిష్టంగా ఉన్నారు. జిల్లా ఉన్నతాధికారుల నుంచి స్ప ష్టమైన ఆదేశాలు రాకపోవడం, శాఖాపరమైన పనులు కూడా పథకానికి ఆటంకంగా మారాయి.
రాష్ట్రస్థాయిలో ఒకే ధర కాకుండా రెవెన్యూ డివిజన్ యూనిట్‌గా ధర నిర్ణయించాలి.. కమిటీలో అనవసర శాఖల ప్రమేయాన్ని తగ్గించాలి.. బహిరంగ మార్కెట్ ధరలను పరిగణలోకి తీసుకుని మధ్యేమార్గంగా ఓ ధరను నిర్ణయించాలని పలువురంటున్నారు. 2014 ఆగస్టులో భూమి పంపిణీ పథకాన్ని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ఏడాది దాటినా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి సరైన మార్గదర్శకాలు రాకపోవడం విమర్శలకు తావిస్తోంది.
శాఖలన్నీ సీఎం చేతిలో ఉన్నా దళితులకు అన్యాయమే
సంక్షేమ శాఖలన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన చేతిలో పెట్టుకున్నప్పటికీ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. సీఎంకు మిషన్ కాకతీయ, వీటర్‌గ్రిడ్ పథకాలపై ఉన్న శ్రద్ధ దళితుల అభివృద్ధిపై ఏమాత్రం లేదు.
- వచ్చలకూర వెంకటేశ్వర్లు, ఎమ్మార్పీస్ రాష్ట్ర నాయకులు
రైతులు ముందుకు వస్తేనే...
రైతులు ముందుకు వస్తే భూ పంపిణీ పథకానికి వెంటనే భూమి కొనుగోలు చేసి ఆయా మండలాల్లో ఎంపిక చేసిన పేద దళితులకు రెవెన్యూ శాఖ సహకారంతో అందిస్తాం.
- సీతామహాలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ
హరితహారం పేరుతో భూములు లాక్కుంటున్నారు
దళితులకు భూపంపిణీ పథకాన్ని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటివరకు తగిన మార్గదర్శకాలు రూపొందించలేదు. దళితుల అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం శ్రద్ధ ఉందో దీన్ని బట్టి తెలుస్తోంది.
- మందుల ప్రభాకర్, ఎమ్మార్పీస్ జిల్లా ఇన్‌చార్జి
వీటిని మినహారుుస్తే ఎలా?
జిల్లాలో అత్యధిక మండలాలు ఏజెన్సీ పరిధిలో ఉన్నారుు. మైదాన ప్రాంతాల్లోని మండలాల్లో నీటి ఎద్దడి పేరుతో తిరుమలాయపాలెం, అధిక ధరల పేరుతో ఖమ్మం అర్బన్, రూరల్ మండలాలను మినహాయించారు. ఇలా అయితే పథకం లక్ష్యం నెరవేరేదెలా?
- సీహెచ్ రాంబాబు, ఎమ్మార్పీస్ జిల్లా కార్యదర్శి