poor dalits
-
తోలు పరిశ్రమల జాడేదీ?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: నిరుపేద దళితులకు ఉపాధి, స్థానికంగానే తోలు ఉత్పత్తులు తయారుచేసి ఎగుమతి చేయాలనే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో దళితులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలను ఎంపికచేసి మినీ లెదర్ పార్కులు స్థాపించాలని ప్రణాళికలు చేశారు. లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (లిడ్‌క్యాప్) నిరుద్యోగ యువతకు చెప్పుల తయారీలో శిక్షణ సైతం ఇచ్చింది. శిక్షణ తీసుకున్న వాళ్లు రాష్ట్రవ్యాప్తంగా వేలాదిగా ఉన్నారు. 2003 నుంచే లెదర్ పార్కుల ఏర్పాటుకు బీజం పడినా నేటికీ ఉత్పత్తి ప్రారంభం కాకపోవడంతో వేలాది మంది నిరుద్యోగ దళితులు ఎదురుచూస్తున్నారు. లెదర్ ఉత్పత్తులకు అవకాశం మేక, గొర్రె, గేదెల వంటి పశువుల తోళ్లతో స్థానికంగానే ప్రముఖ బ్రాండ్లకు చర్మంతో చెప్పులు, ఇతర ఉత్పత్తులు తయారుచేసే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఉమ్మడి రాష్ట్రం నుంచే లిడ్‌క్యాప్, రాష్ట్రం ఏర్పడ్డాక టీఎస్‌ఎల్‌ఐపీసీ (తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్) «ఆధ్వర్యంలో పనులు సాగాయి. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో మెగాపార్కు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో లెదర్ క్లస్టర్, మరో ఆరుచోట్ల 25 ఎకరాల చొప్పున స్థలాలు కేటాయించారు. ‘మలుపు’స్వచ్ఛంద సంస్థ నిరుద్యోగులకు శిక్షణనిచ్చింది. చెన్నైకి చెందిన లెదర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్తో ఒప్పందం చేసుకొని ప్రముఖ బ్రాండ్ల చెప్పులు, బూట్లు ఇతర ఉత్పత్తులు ఈ పార్కుల్లో తయారు చేయాలని భావించారు. ఆయా కంపెనీలతో ఒప్పందం చేసుకొనేలా టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు జరిగాయి. మౌలిక సదుపాయాలు, షెడ్డుల నిర్మాణాలు, శిక్షణ, యంత్రాలు వచ్చాయి. కొన్నిచోట్ల తయారీ మొదలైంది. ఆ తర్వాత నిధుల లేమితో ఆశయం నీరుగారింది. నిధులు విడుదలవక.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మరోమారు పార్కుల స్థాపనకు ప్రయత్నాలు జరిగాయి. కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంస్థ కింద రాష్ట్ర ప్రభుత్వ చొరవతో వీటిని అభివృద్ధి చేయాలనుకున్నారు. 2016లో జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో మెగాపార్కుకు రూ.270 కోట్లతో 2 వేల మందికి ఉపాధి కల్పించాలనే అంచనాతో రూ.105 కోట్ల కేంద్ర సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కానీ ఇప్పటికీ నిధులు విడుదలవలేదు. ఇటీవల ఆర్మూర్ పార్కులో స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకున్నా పూర్తిస్థాయిలో నిధులు విడుదలవక ఉత్పత్తి మొదలు కాలేదు. కబ్జాలకు గురవుతున్న భూములు పార్కుల కోసం కేటాయించిన భూములు ఏళ్లుగా ఖాళీగా ఉండటంతో కబ్జాకు గురవుతున్నాయి. మంచిర్యాల జిల్లా మందమర్రిలో అక్కడ ఇన్చార్జి అధికారే ఆ భూమిలోని మట్టిని అమ్ముకున్నారు. కరీంనగర్ జిల్లా రుక్మాపూర్‌లో భూములను ఓ సంస్థకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్మూర్‌లో పార్కు కోసం కేటాయించిన స్థలం చుట్టూ కబ్జాల నిరోధానికి ప్రహరీ నిర్మిస్తున్నారు. కొన్నిచోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు ఈ స్థలాలను పల్లె ప్రకృతి వనాలు, శ్మశానవాటికలు, క్రీడాప్రాంగణాలకు కేటాయిస్తుండటంతో దళితులు ఆందోళన చెందుతున్నారు. నాయకులకు చిత్తశుద్ధి లేదు ఏళ్లుగా ఉపాధి పేరుతో నిరుద్యోగులను మభ్యపెడుతున్నారు. ఇప్పటికైనా లెదర్ పార్కులు ఏర్పాటుచేసి నిరుపేదలకు పని కల్పించాలి. – కొలుగూరి విజయ్‌కుమార్, చర్మకార హక్కుల పరిరక్షణ కమిటీ, జిల్లా అధ్యక్షుడు, మంచిర్యాల -
భూమి ఏమాయె!
దళితులకు భూ పంపిణీపై ప్రభుత్వానికి కొరవడిన చిత్తశుద్ధి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో భూమిలేని నిరుపేదలు ఎక్కడా ఉండకూడదు. అర్హులైన దళితులకు వ్యవసాయ యోగ్యమైన భూమి అందించడమే లక్ష్యం. ఎన్ని కోట్లు ఖర్చరుునా సరే భూమి లేని నిరుపేద దళితుల అభివృద్ధి కోసం కృషి చేస్తాం. - ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు - శాఖల సమన్వయ లోపం.. లబ్ధిదారులకు శాపం - నిధులు కోట్లలో.. ఖర్చు లక్షల్లో.. - సరైన మార్గదర్శకాలు కరువు - ఏడాది దాటినా ఎదురుచూపులే ఖమ్మం సంక్షేమ విభాగం: భూమిలేని నిరుపేద దళితులకు మూడు ఎకరాలు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటన చేసి ఏడాదికి పైగా అవుతోంది. కానీ ఇప్పటికీ ఇది సరిగా ఆచరణకు నోచుకోవడం లేదు. శాఖల మధ్య సమన్వయలోపంతో కనీస లక్ష్యాన్ని కూడా చేరుకోలేకపోతోంది. భూములు విక్రయించేందుకు రైతులు ముందుకు వచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు, భూముల కొనుగోలుకు నిధులు కేటాయింపులో ఎస్సీ కార్పొరేషన్ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయి. 59 ఎకరాలు మాత్రమే పంపిణీ జిల్లాలో ఇప్పటివరకు కేవలం 22 మంది లబ్ధిదారులకు 59 ఎకరాలను మాత్రమే పంపిణీ చేశారు. ఖమ్మం రెవె న్యూ డివిజన్లో వందలాది ఎకరాల భూములను రైతు లు స్వచ్ఛందంగా విక్రయించేందుకు ముందుకు వస్తు న్నా విధివిధానాలు అస్పష్టంగా ఉండడంతో అధికారు లు పట్టించుకోవడం లేదు. భూమి కొనుగోలు ప్రాంతం, మార్కెట్ ధరలు, సాగు యోగ్యం, నీటివసతి ఆధారంగా రేటు నిర్ణయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దశాబ్దాల నుంచి సాగులో ఉన్న వ్యవసాయ భూములను సైతం కొన్ని శాఖల అధికారులు నివేదికల ఆధారంగా ఎంపిక చేయాలని సూచించడంతో ప్రారంభ దశలోనే ఆటంకాలు ఏర్పడ్డాయి. భూగర్భ జలవనరుల శాఖ నీటి లభ్యత నివేదిక ఇచ్చిన తరువాతనే మార్కెట్ ధరలు, ఇతరత్ర అంశాలను బట్టి ప్రభుత్వం రేట్లు నిర్ణరుుంచాలని జిల్లా స్థాయి కమిటీలో సూచించారు. వివిధ కారణాలతో భూములు అమ్ముకునేందుకు చాలామంది రైతులు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో దశాబ్దాల నుంచి నీటి వనరుల ఆధారంగా సాగు చేస్తున్న భూములకు భూగర్భ జలవనరుల శాఖ నివేదిక ఎందుకనే ప్రశ్న రైతుల నుంచి ఉత్పన్నమవుతోంది. ధరల్లో వ్యత్యాసం కూడా కారణమే.. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలకు, బహిరంగ మార్కెట్ ధరలకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రకటించిన ధరలకు అటుఇటుగా భూములు దొరికే పరిస్థితి ఉన్నా వివిధ శాఖల అధికారుల సమన్వయ లోపంతో అక్కడ కూడా సాధ్యం కావడం లేదు. ఉదాహరణకు సాగు యోగ్యమైన భూమి, నీటివసతి, మార్కెట్ ధర ఆధారంగా ఎకరానికి 7లక్షల వరకు వెచ్చించవచ్చని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. అయితే రిజిస్ట్రేషన్ ధరల ప్రకారం మారుమూల ప్రాంతాల్లో ఎకరం ధర లక్ష నుంచి మూడు లక్షల మధ్య లభిస్తుంది. బహిరంగ మార్కెట్లో కనిష్ట స్థాయి 5 లక్షల నుంచి 15 లక్షల మధ్య కొనసాగుతోంది. మార్కెట్ ధరల ప్రకారం రాళ్లు రప్పలతో కూడిన బీడుభూములు మినహా పూర్తి నీటివసతి ఉన్న సాగుభూములు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. భూమిలేని నిరుపేదలకు భూమి కొనుగోలు చేసి పంపిణీ చేసే పథకం ముందుకు సాగాలంటే అధికారులు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలు సడలించాల్సి ఉంది. రెవెన్యూ, ఎస్సీ కార్పొరేషన్ అధికారులతో కూడిన కమిటీకి జాయింట్ కలెక్టర్‌ను చైర్మన్‌గా నియమిస్తే భూపంపిణీ పథకం ఊపందుకునే అవకాశాలు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. ఆటంకాలెన్నో..! ఏజెన్సీలో 1/70 చట్టం అమలులో ఉండడంతో భూమి లభ్యత తక్కువగా ఉంది. మైదాన ప్రాంతాల్లో హైదరాబాద్‌ను తలదన్నేలా రియల్ఎస్టేట్ వ్యాపారం కొనసాగుతుండడంతో భూముల ధరల అమాంతం పెరిగాయి. ఇ క్కడ భూమిని విక్రయించే రైతుల సంఖ్య తక్కువగా ఉం డగా లబ్ధిదారుల సంఖ్య భారీగా ఉంది. కొన్ని మండలా ల్లో రెవెన్యూ అధికారులు భూమి కొనుగోలు పథకం పట్ల అయిష్టంగా ఉన్నారు. జిల్లా ఉన్నతాధికారుల నుంచి స్ప ష్టమైన ఆదేశాలు రాకపోవడం, శాఖాపరమైన పనులు కూడా పథకానికి ఆటంకంగా మారాయి. రాష్ట్రస్థాయిలో ఒకే ధర కాకుండా రెవెన్యూ డివిజన్ యూనిట్‌గా ధర నిర్ణయించాలి.. కమిటీలో అనవసర శాఖల ప్రమేయాన్ని తగ్గించాలి.. బహిరంగ మార్కెట్ ధరలను పరిగణలోకి తీసుకుని మధ్యేమార్గంగా ఓ ధరను నిర్ణయించాలని పలువురంటున్నారు. 2014 ఆగస్టులో భూమి పంపిణీ పథకాన్ని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ఏడాది దాటినా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి సరైన మార్గదర్శకాలు రాకపోవడం విమర్శలకు తావిస్తోంది. శాఖలన్నీ సీఎం చేతిలో ఉన్నా దళితులకు అన్యాయమే సంక్షేమ శాఖలన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన చేతిలో పెట్టుకున్నప్పటికీ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. సీఎంకు మిషన్ కాకతీయ, వీటర్గ్రిడ్ పథకాలపై ఉన్న శ్రద్ధ దళితుల అభివృద్ధిపై ఏమాత్రం లేదు. - వచ్చలకూర వెంకటేశ్వర్లు, ఎమ్మార్పీస్ రాష్ట్ర నాయకులు రైతులు ముందుకు వస్తేనే... రైతులు ముందుకు వస్తే భూ పంపిణీ పథకానికి వెంటనే భూమి కొనుగోలు చేసి ఆయా మండలాల్లో ఎంపిక చేసిన పేద దళితులకు రెవెన్యూ శాఖ సహకారంతో అందిస్తాం. - సీతామహాలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ హరితహారం పేరుతో భూములు లాక్కుంటున్నారు దళితులకు భూపంపిణీ పథకాన్ని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటివరకు తగిన మార్గదర్శకాలు రూపొందించలేదు. దళితుల అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం శ్రద్ధ ఉందో దీన్ని బట్టి తెలుస్తోంది. - మందుల ప్రభాకర్, ఎమ్మార్పీస్ జిల్లా ఇన్చార్జి వీటిని మినహారుుస్తే ఎలా? జిల్లాలో అత్యధిక మండలాలు ఏజెన్సీ పరిధిలో ఉన్నారుు. మైదాన ప్రాంతాల్లోని మండలాల్లో నీటి ఎద్దడి పేరుతో తిరుమలాయపాలెం, అధిక ధరల పేరుతో ఖమ్మం అర్బన్, రూరల్ మండలాలను మినహాయించారు. ఇలా అయితే పథకం లక్ష్యం నెరవేరేదెలా? - సీహెచ్ రాంబాబు, ఎమ్మార్పీస్ జిల్లా కార్యదర్శి -
నిరుపేద దళితులకు 3 ఎకరాలివ్వాలి: వైఎస్సార్సీపీ
కరీంనగర్ టౌన్: నిరుపేద దళితులకు తక్షణమే మూడు ఎకరాల పొలం ఇవ్వాలని తెలంగాణ వైఎస్సార్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ నాగేష్ ఆధ్వర్యంలో ఆదివారం ధర్నాకు దిగారు. నిరుపేద దళితులకు 3 ఎకరాలు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఎటువంటి నష్టం లేదని వైఎస్సాఆర్సీపీ నాయకులు అన్నారు. ఈ ధర్నాలో సుమారు 50 మంది దళితులు పాల్గొన్నారు. -
వర్గీకరణకు ప్రభుత్వం సానుకూలం: పిడమర్తి రవి
నల్లగొండ(ఆలేరు): ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలంతా ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఎస్సీ కార్పోరేషన్ చెర్మైన్ పిడమర్తి రవి అన్నారు. శుక్రవారం హైద్రాబాద్ నుండి వరంగల్ వెళ్తూ ఆలేరులో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందన్నారు. అలాగే రాష్ర్టంలో నిరుపేద దళితులకు భూములను అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. -
‘భూ పంపిణీ’ సాధ్యమేనా?
ఆదిలాబాద్ అర్బన్ : జిల్లాలోని భూమిలేని దళిత నిరుపేదలకు సాగుకు యోగ్యమైన మూడెకరాల భూమి పంపిణీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దళితబస్తీ పేరిట ఆగస్టు 15న పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఇంకా పదమూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటివరకు జిల్లాలో భూ పంపిణీ చేసేందుకు 170 మంది లబ్ధిదారులను అధికారులు గుర్తిం చారు. వీరికి 510 ఎకరాల భూమి అవసరం. కాగా 41 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మిగతా సాగుకు యోగ్యమైన ప్రభుత్వ భూ మి అందుబాటులో లేకపోవడంతో సమస్య వచ్చిపడింది. రూ. 16 కోట్లు అవసరం జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గానికి ఒక గ్రామం చొప్పున పది గ్రామాల్లో మొదటి దశలో 170 మందికి భూ పంపిణీ చేసేందుకు యంత్రాంగం ప్రాథమికంగా నిర్ధారించింది. వీరికి ప్రస్తుతం 41 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. మిగతా 469 ఎకరాల భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసి నిరుపేదలకు పంచాలి. ఇందుకు రూ.16 కోట్లు అవసరం. భూ పంపిణీకి ప్రభుత్వం నిర్దేశించిన గడువు దగ్గర పడుతుండడం.. భూమి లభ్యతపై యంత్రాంగానికి స్పష్టత లేకపోవడంతో అధికారులు అయోమయానికి గురవుతున్నారు. ఒకవైపు భూమి కొనుగోలు చేసైనా పంపిణీ చేస్తామంటున్న సర్కారు.. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయకపోవడం అధికారులను గందరగోళంలో పడేసింది. క్షేత్రస్థాయిలో జరగని లబ్ధిదారుల ఎంపిక మొదటి విడతలో భాగంగా 170 మంది కుటుంబాలకు లబ్ధిచేకూర్చేలా ప్రాథమికంగా ప్రణాళిక తయారు చేసినప్పటికీ.. లబ్ధిదారుల ఎంపికపై అధికారులకు స్పష్టత లేదు. దీంతో క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక జరగలేదనే ఆరోపణలు ఉన్నాయి. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి సర్వే నిర్వహించాలని ఇదివరకే అధికారులకు శిక్షణ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. కొన్ని గ్రామాల్లో సర్పంచ్‌లే ఆ ఊరి ప్రజల జాబితా తీసుకెళ్లి మండలాధికారులకు అందజేశారనే విమర్శలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి సమగ్ర నివేదిక తయారు చేస్తే తప్పా అర్హులకు మేలు జరిగే అవకాశం లేదని పలువురు పేర్కొంటున్నారు. మండలానికో గ్రామం చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం సూచించినప్పటికీ జిల్లాలో మాత్రం కొన్ని గ్రామాల ఎంపిక పెండింగ్‌లో ఉంది. మొదటి దశలో నియోజకవర్గానికో గ్రామం చొప్పున పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులకు సులువైంది. వీరికి పంపిణీ చేసేందుకు ప్రభుత్వ భూమి లేకపోవడంతో అధికారులకు తలనొప్పిగా మారింది. అయితే భూమి గుర్తించడానికైనా.. లేదా కొనుగోలు చేసేందుకైనా సమయం పడుతుంది. ఆగసుట 15లోగా ఇది సాధ్యం కాదని అధికారులే పేర్కొనడం గమనార్హం.