
ఏజెన్సీలో ఎలా..?
దళితులకు మూడెకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా చేపట్టేందుకు నిబంధనలు అంగీకరించడం లేదు.
‘దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేద’న్న చందంగా ఉంది ఏజెన్సీ ప్రాంత దళితుల పరిస్థితి. భూమి లేని పేద ఎస్సీ కుటుంబాల వారికి మూడెకరాల చొప్పున భూమి ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఇందుకు వచ్చే ఆగస్టు 15 ముహూర్తంగా నిర్ణయించింది. అయితే ఏజెన్సీలో భూ బదలాయింపునకు 1/70 చట్టం అడ్డంకిగా ఉండడం అక్కడి దళితులకు శాపంగా మారింది.
మైదాన ప్రాంత దళితులకే భూపంపిణీ
షెడ్యూల్డ్ ఏరియాలో అడ్డంకి కానున్న 1/70 చట్టం
‘మైదానం’లో మండలానికి ఒకటి చొప్పున 17 గ్రామాల ఎంపిక
40 శాతం ఎస్సీ జనాభా ప్రాతిపదిక...
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: దళితులకు మూడెకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా చేపట్టేందుకు నిబంధనలు అంగీకరించడం లేదు. జిల్లాలో ఉన్న 46 మండలాల్లో 29 మండలాలు ఏజెన్సీలో ఉండడం, అక్కడ భూమార్పిడి చట్టాలు పకడ్బందీగా ఉండడంతో దళితులకు భూపంపిణీ సాధ్యం కాదంటున్నారు అధికారులు.
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆగస్టు 15న నిర్వహించ తలపెట్టిన భూపంపిణీ కార్యక్రమాన్ని మైదాన ప్రాంతంలోని 17 మండలాల్లోనే చేపట్టాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి. 17 మండలాల్లో, మండలానికో గ్రామాన్ని ప్రాథమికంగా ఎంపిక చేసి అక్కడ దళితుల జీవన స్థితిగతులపై అధికారులు సర్వే జరపనున్నారు. మూడెకరాలు లేని ప్రతి దళిత కుటుంబానికి ఆ గ్రామంలో లభ్యమయ్యే సాగుకు యోగ్యమైన భూమిని బట్టి పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే, ఏజెన్సీ ప్రాంతంలో నివ సించే దళితులకు మాత్రం భూపంపిణీ సాధ్యం కాదని, దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని అధికారులు చెపుతున్నారు.
ఆ చట్టం ఏం చెపుతోంది?
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన భూ పంపిణీ కార్యక్రమాన్ని ఏజెన్సీలో జరిపేందుకు 1/70 చట్టం అడ్డంకిగా మారుతోంది. ఈ చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతమంతా షెడ్యూల్ 5లో ఉంటుంది కనుక అక్కడి భూమిపై సర్వహక్కులు గిరిజనులకే ఉంటాయి. 1/70 చట్టం అమల్లోకి రాకముందు.. అంటే ఏజెన్సీలో నివసిస్తున్న గిరిజనేతరులకు 1970కి ముందు ఉన్న భూమిపై మాత్రమే వారికి హక్కులు ఉంటాయి. మిగిలిన ఏ భూమయినా గిరిజనులకు చెందాల్సిందే. ఆ భూమిని ఎవరికైనా మార్పిడి చేయాలనుకున్నా (కొనుగోలు లేదా పంపిణీ లేదా మరే ఇతర లావాదేవీ అయినా) గిరిజనుల నుంచి గిరిజనులకు మాత్రమే జరగాలి.
గిరిజనేతరులు తమ భూమిని అమ్మాలనుకున్నా గిరిజనులకు మాత్రమే బదలాయించాల్సి ఉంటుంది. అంటే షెడ్యూల్ ఏరియాలోని భూమిపై గిరిజనులకు తప్ప మరెవరికీ అధికారాలుండవన్న మాట. మరోవైపు భూ మార్పిడి (ఎల్‌టీఆర్) చట్టం ప్రకారం ఏజెన్సీలో గిరిజనేతరులు ఎవరైనా భూమిని కొనుగోలు చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తారు. దీంతో ఈ ప్రాంతంలో నివసించే దళితులకు భూపంపిణీ చేయడం సాధ్యమయ్యే పనికాదని అధికారులు అంటున్నారు. ఈ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది కనుక మళ్లీ సవరణ చేయాలంటే అక్కడే జరగాలని, రాష్ట్రపతి ఆమోదం కావాల్సి ఉంటుందని చెపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏజెన్సీలో ఉన్న 29 మండలాల్లో దళితులకు భూమి పంపకం చేయలేమని అధికారులు చేతులెత్తేశారు.
40 శాతం కన్నా ఎక్కువ ఉన్న గ్రామాల్లోనే...
ఇక, మైదాన ప్రాంతాల్లో భూ పంపిణీకి 40 శాతం కన్నా ఎక్కువ ఎస్సీ జనాభా ఉన్న గ్రామాలను ఎంపిక చేస్తున్నారు. దీని ద్వారా ఎక్కువ మంది దళితులకు లబ్ధి చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని అధికారులు చెపుతున్నారు. అయితే, అధికారులు ఎంపిక చేస్తున్న గ్రామాల్లో ఉన్న భూమి లేని ఎస్సీ కుటుంబాలకు మూడెకరాల చొప్పున పంపిణీ చేసేందుకు అనువైన భూమి అందుబాటులో ఉందా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ లేకుంటే ప్రైవేటు పట్టాదారుల భూములు కొనుగోలు చేస్తామని అధికారులు చెపుతున్నా.. అమ్మేందుకు వారు ముందుకొస్తారా అనేది కూడా ప్రశ్నార్థకమే. ఈ పరిస్థితుల్లో దళితులకు భూపంపిణీ కార్యక్రమం జిల్లాలో ఎలా అమలవుతుందన్న దానిపై మరికొద్ది రోజులయితే కానీ స్పష్టత వచ్చే అవకాశం లేదు.
జిల్లాలో 2.50 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి...
ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో జిల్లా మొత్తం 2.50 లక్షల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నట్టు తేలింది. ఈ భూమిలో సాగుకు యోగ్యమైన భూమి ఎంత ఉందనేదానిపై అధికారులు లెక్కలు వేస్తున్నారు. మరోవైపు ఈ 2.50 లక్షల ఎకరాల్లో 15 వేల ఎకరాలు పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉందని సమాచారం.
ఈ భూమిని గుర్తించేందుకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) అధికారులు గత రెండు రోజులుగా జిల్లాలో పర్యటిస్తున్నారని, పరిశ్రమల స్థాపనకు అనువైన భూములను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఈ భూముల వివరాలు సేకరించడం ద్వారా జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు భూకేటాయింపులు సులభంగా జరుగుతాయని అధికారులు చెపుతున్నారు.