మురిపించారు...
► పట్టాలిచ్చి.. రద్దు చేశారు
► దళితులకు అందని భూమి
► అధికారుల నిర్లక్ష్యం
మూడెకరాల భూ పంపిణీ.. పేద దళితుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. ప్రభుత్వం అనుకున్నట్లే పలువురు లబ్ధిదారులను ఎంపిక చేసి పట్టాలూ అందించింది. కానీ, ఆ ‘అదృష్టవంతుల’ జాతకం మాత్రం మారలేదు. చేతిలో పట్టాలున్నా.. భూమి సాగు చేసుకోలేని దైన్య స్థితి. భూ యజమానులకు డబ్బులివ్వకపోవడంతో వారు మరొకరికి అమ్ముకున్నారు. దీంతో పలు చోట్ల భూపంపిణీ ఉత్తదేనని తేలింది. - హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలం గోవర్ధనగిరి, రేగొండ గ్రామాల్లో దళితులకు మూడెకరాల భూపంపిణీ పథకం కింద 14 మంది పేద కుటుంబాలను రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఇతర రైతుల వద్ద అందుబాటులో ఉన్న 18 ఎకరాల భూమిని ఎకరాకు రూ.5.7 లక్షలు ధర నిర్ణయించి సేకరించారు. మొదట నాలుగు కుటుంబాలకు 2014 ఆగస్టు 15న మంత్రి ఈటల రాజేందర్ చేతుల మీదుగా పట్టాలు అందించారు. భూమి యజమానులకు అధికారులు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో ఆరునెలల చూసి వారు అధిక ధరలకు మరో రైతుకు విక్రయించారు. దీంతో దళితుల పరిస్థితి అగమ్యగోచరంగా తయూరైంది. దీంతో వారే గ్రామంలో భూమి అమ్మే వారిని నలుగురిని గుర్తించి రెవెన్యూ అధికారుల దగ్గరకు తీసుకెళ్లారు. అగ్రిమెంట్ రాసిచ్చేలా చేశారు. ఇది జరిగి ఏడాదిన్నర గడిచినా భూ సేకరణ విషయమై రెవెన్యూ అధికారులు ఒక్క అడుగు ముందుకు వేయలేదు. దళితులు రెవెన్యూ కార్యాలయూల చుట్టూ తిరిగినా రేపు.. మాపు అంటూ మాటదాట వేస్తున్నారు.
భూమి లేదన్నారు
ఏ భూమి కావాలని చిట్టీలు తీస్తే మాకు అదృష్టం వచ్చిందనుకున్నం. కానీ, దురదృష్టం వదలిపెట్టదని తెలిసింది. కాయితం పట్టుకుని వీఆర్వో దగ్గరికి పోతే ఇచ్చంత్రంగా సూసుడు. ఆర్‌ఐ దగ్గరకు పోయి బాధలు చెప్పుకున్నం. ఎవరు పట్టించుకునేటోళ్లు లేరు. ఈ బాధలు పడలేక ఇంత మందుతాగుతం సార్ అంటే.. ‘నేను ఏం చేయ్యాలె. నేను మందు డబ్బాకొనిస్తా తాగుపో’ అని గద్దరియ్యవట్టె. ఇగ మా బాధలు ఎవరికి చెప్పుకోవాలె. - ఎల్కపెల్లి భాగ్యమ్మ, గోవర్ధనగిరి
తిరుగని ఆఫీస్ లేదు
మాకు భూమి పట్టా కాయితం ఇచ్చిండ్రు. భూమికాడికి పోయి హద్దులు చెప్పిండ్రు. నిజంగానే భూమి ఇత్తండ్రు అనుకున్నం. గిట్ల చేత్తరనుకోలె. భూమిచ్చిండ్రు కదా యాసింగి ఎవుసం చేయాలని మురిసిపోరుునం. తీరా యాసింగి వచ్చే సరికి మాకు డబ్బులు ఇయ్యలేదు.. మీకు భూమి ఇయ్య అని ఆసామి భూమి మీదికి రానియ్యలేదు. కలెక్టర్ వచ్చి బండరాళ్ల భూమి ఎట్ల కొన్నరు? ఇవి రద్దు చేసి వేరే కాడ ఇయ్యుమని చెప్పినా అధికారులు ఇత్తనేలేరు. భూములు అమ్మే రైతులను మేం తీసుకెళ్లినా అధికారులు పట్టించుకుంటలేరు - ఎల్కపెల్లి లక్ష్మి, మల్లయ్య