దళితులకు 10 వేల ఎకరాల భూపంపిణీ
♦ నవంబర్, డిసెంబర్‌లో అందజేస్తాం
♦ ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మంత్రి జగదీశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: దళితులకు భూ పంపిణీలో భాగంగా ఈ ఏడాది నవంబర్, డిసెంబర్‌లలో 10 వేల ఎకరాల భూమిని లబ్ధిదారులకు అందజేయనున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. ఇప్పటి వరకు 8 వేల ఎకరాల భూమిని పంపిణీ చేసినట్లు చెప్పారు. పంపిణీ చేసిన భూమిని పూర్తిస్థాయిలో సాగులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడతామన్నారు. గతంలో పంపిణీ చేసిన భూమికి త్వరలోనే రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తామని వివరించారు. తెలంగాణ ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సంక్షేమ రంగాల్లో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
దేశం చూపు తెలంగాణ వైపు
రెండేళ్లలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ఏకకాలంలో అమలు కావడం గొప్ప విషయం. ఇప్పుడు దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది. ఉద్యమ పార్టీకి పాలన అనుభవం లేదని, తెలంగాణ విడిపోతే రాష్ట్ర పరిస్థితి దారుణంగా తయారవుతుందని గతంలో కొందరు అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని సైతం ప్రభావితం చేసే ప్రయత్నాలు చేశారు. కానీ ఆ అనుమానాలు, అపోహలను సీఎం కేసీఆర్ పటాపంచలు చేశారు. రెండేళ్లలోనే దేశంలోనే ప్రభావవంతమైన సీఎంగా నిలిచారు.
ప్రభుత్వం ఇప్పటికే పంపిణీ చేసిన భూమిని లబ్ధిదారులైన ఎస్సీ మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేసే విషయంలో అధికారుల్లో కొంత కన్‌ఫ్యూజన్ ఉంది. గత రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితుల కారణంగా పంపిణీ చేసిన భూమి అభివృద్ధి విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. బోర్లు, ఇతరత్రా సౌకర్యాలు కల్పించినా పెద్దగా ఉపయోగం లేని పరిస్థితులున్నందున పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయలేకపోయాం. ఈ ఏడాది మంచి వర్షాలు కురుస్తాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
సంక్షేమంలో మేమే ముందు..
కేవలం దళితులకే కాకుండా ఎవరూ ఊహించని విధంగా అన్ని వర్గాలకు మా ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. దళితుల అభివృద్ధికి అనేక పథకాలు తెచ్చింది. మూడెకరాల భూపంపిణీతోపాటు కల్యాణలక్ష్మి వంటి పథకాలను తెచ్చాం. దళితులకు మూడెకరాల భూమి, బడుగు, బలహీన వర్గాలకు కల్యాణలక్ష్మి, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం, ప్రతి ఒక్కరికీ 6 కే జీల బియ్యం,అన్ని జిల్లాల్లో ఎస్సీ స్టడీ సర్కిళ్లు, 10 వేల మందికి స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.10 లక్షల వరకు రుణం, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఒకేసారి 250 గురుకుల పాఠశాలలు, అందులో ఎస్సీలకు 30 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు, ఎస్సీ గురుకులాల్లో కార్పొరేట్ స్థాయిని మించిన శిక్షణ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేలా శిక్షణ కార్యక్రమాలు, విద్యార్థులకు వినూత్నంగా గుర్రపు స్వారీ, స్టాక్ ఎక్స్ఛేంజ్ వంటి వాటిపై అవగాహన వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం.
ఒక్క రూపాయీ దుర్వినియోగం కాకూడదు..
గత ప్రభుత్వం రూ.2 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల ను అప్పగించింది. సీఎం ఇప్పటికే రెండేళ్ల బకాయిలన్నీ చెల్లించేందుకు రూ.3వేల కోట్లకు ప్రభుత్వం బడ్జెట్ విడుదల ఉత్తర్వులిచ్చింది. ఈ పథకం కింద ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకూడదనేది సీఎం ఉద్దేశం. దళితులకు, ఇతర అణగారిన వర్గాలకే ఈ మొత్తం చెందాలనేది ప్రభుత్వ ఆలోచన.